ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్!
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక్కడ బాక్సైట్ తవ్వకాలపై ప్రత్యేక పాలసీ ఒకటి తీసుకొస్తామన్నారు. ఈ ప్రాంతంలో బాక్సైట్ తవ్వేందుకు ఐటీడీఏకు అనుమతులు ఇస్తామన్నారు. ఏడాదిలోగా ఏజెన్సీలోని అన్ని ప్రాంతాలకు మినరల్ వాటర్ సరఫరా చేస్తామని తెలిపారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉద్యానవన పంటలు, కాఫీ తోటల పెంపునకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
అయితే.. ఇంతకుముందు ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు వద్దంటూ భారీ స్థాయిలో ఉద్యమాలు కూడా చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రాంతంలో జిందాల్ సంస్థ అల్యూమినా ఫ్యాక్టరీ పెడతామంటే టీడీపీ, సీపీఎం నాయకులు కలిసి సంయుక్తంగా భారీ ఉద్యమమే నిర్వహించారు. చంద్రబాబు కూడా దానికి పూర్తి మద్దతు తెలిపారు. అప్పుడు అంతలా వ్యతిరేకించి, ఇప్పుడు అధికారంలోకి వచ్చీ రాగానే డబ్బు కోసం ఇలా చేయడమేంటన్న వ్యతిరేకత వ్యక్తమవుతోంది.