లంబసింగిలో కనువిందు చేస్తున్న పొగమంచు అందాలు
చింతపల్లి: విశాఖ మన్యం వాతావరణం మరో కశ్మీరును తలపిస్తోంది. కొద్ది రోజులుగా ఇక్కడ చలి గజగజలాడిస్తోంది. జనవరి వరకు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని, రానున్న రోజుల్లో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని పరిశోధన స్థానం శాస్త్రవేత్త దేశగిరి శేఖర్ తెలిపారు.
సముద్ర మట్టానికి మూడువేల మీటర్ల ఎత్తులో ఉన్న లంబసింగిలో రోజూ ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకునే ఉంటుంది. బుధవారం లంబసింగిలో 7 డిగ్రీలు, చింతపల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రా కశ్మీరుగా గుర్తింపు పొందుతున్న లంబసింగి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తెల్లవారుజామునే ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. పొగమంచులో లైట్లు వేసుకుని వాహనాల్లో ప్రయాణించడం వీరికి వింత అనుభూతి కలిగిస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మళ్లీ చలిగాలులు వీస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటలైతే ఈ ప్రాంతంలో చలిమంటలు వేసుకుని సేదదీరాల్సిన పరిస్థితి నెలకొంది.