ఏవోబీ ఉద్రిక్తం | Situation was tense in AOB | Sakshi
Sakshi News home page

ఏవోబీ ఉద్రిక్తం

Published Mon, Jul 14 2014 4:25 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

ఏవోబీ ఉద్రిక్తం - Sakshi

ఏవోబీ ఉద్రిక్తం

విశాఖ ఏజెన్సీలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మేలో ఆకు రాల్చిన అడవి చిగురించింది. దీంతో రెండు నెలలు మౌనంగా ఉన్న దళసభ్యులు కదలికలను పెంచారు. ఏవోబీలో తిరుగుతూ రిక్రూట్‌మెంట్‌కు ప్రయత్నిస్తున్నారు. ఈనెల  28 నుంచి ఆగస్టు మూడు వరకు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో కొత్త ప్రాంతాల్లో స్తూపాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సమాచారం మేరకు పోలీసులు ఆయా నిర్మాణాలను అడ్డుకుంటున్నారు. ఎవరైనా స్తూపాలు నిర్మించినా...దళసభ్యులకు సహకరించినా అరెస్టు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. వెరసి మన్యం నెల రోజుల పాటు భయం గుప్పెట్లోకి వెళ్లింది.
 
అంతటా హైఅలె ర్ట్
పాడేరు: వారోత్సవాల భగ్నానికి అప్రమత్తంగా ఉన్నామని నర్సీపట్నం ఓఎస్‌డి ఎఆర్ దామోదర్ తెలిపారు. ఏజెన్సీలోని అన్ని పోలీసు స్టేషన్‌ల పరిధిలో హైఅలెర్ట్ ప్రకటించామన్నారు. గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, స్పెషల్‌పార్టీ పోలీసు బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామన్నారు. పోలీసు స్టేషన్ ల పరిధిలోనూ బలగాలు తనిఖీలు చేపడుతున్నాయన్నారు.
 
కొయ్యూరు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది మావోయిస్టులే. ఇక్కడి ఈస్టు,మల్కన్‌గిరి, కొరాపుట్,శ్రీకాకుళం డివిజన్లలో కొండలు, గుట్టలు, దట్టమైన అటవీప్రాంతం, కనీస సదుపాయాలకు నోచుకోని గిరిజన గూడేలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈనెల  28 నుంచి ఆగస్టు మూడు వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని దళసభ్యులు విధ్వంసాలకు తెగబడే అవకాశం ఉందని పోలీసులు, నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఇటీవల ఎంపీపీ,జెడ్పీటీసీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన వారంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు,పెదబయలు,కొయ్యూరు మండలాల నేతలు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి.
 
ఏవోబీలోని మావోయిస్టుల మూడు కేంద్రీయ రిజర్వ్ కమాండ్(సీఆర్‌సీ)లు బలహీన పడ్డాయని పోలీసులు అంచనా వేస్తున్నప్పటికీ,అదును చూసి మెరుపుదాడులకు దిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చెట్లు చిగురించి అంతటా దట్టంగా పచ్చదనం సంతరించుకుంది. పోలీసులకు మావోయిస్టులు లేదా వారికి వీరు దూరం ప్రాంతాల నుంచి కనిపించే అవకాశం  లేదు.

దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడుగడుగునా తనిఖీ, గాలింపు ముమ్మరం చేశారు. అనుమానితులను విచారించి విడిచిపెడుతున్నారు. ఇటీవల కొయ్యూరు మండలం పుట్టకోట ప్రాంతంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ బృందాన్ని అడ్డుకొని వారి సామగ్రిని లాక్కొని వెళ్లడంతో మావోయిస్టుల కదలికలపై నిఘాను పెంచారు. మండలంలోని అన్ని ప్రాంతాల్లోకి బ లగాలను దింపుతున్నారు. దీంతో విశాఖ ఏజెన్సీలో మళ్లీ భయానక వాతావరణం చోటు చేసుకుంది.

గుత్తికోయలు వచ్చే అవకాశం?
వారోత్సవాల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి మావోయిస్టులు ఏవోబీకి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తికోయలు వస్తుంటారు. వారి వద్ద అత్యాధునిక ఆయుధాలున్నట్టు చెప్పుకుంటున్నారు. గతేడాది పంచాయతీ ఎన్నికల్లో చిత్రకొండలోని కలి మెల బ్లాక్‌కు చెందిన అసిస్టెంట్ కమాండర్ రం బోతు అలియాస్ లక్ష్మి కిండంగికి సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించింది. దీని ఆధారంగా అనేక సందర్భాలలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన మావోయిస్టులు ఇక్కడకు వ స్తున్నారని నిర్ధారణ అవుతోంది.

ఎలాగైనా వారోత్సవాలను నిర్వహించాలని మావోయిస్టులు చూస్తుంటే.. వా టిని అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. జీకేవీధి మండలంలో ఇటీవల మావోయిస్టులు చే పట్టిన స్తూపం నిర్మాణాన్ని పోలీసు లు అడ్డుకున్నట్టు తెలిసింది. దశాబ్దం కిందట వారోత్సవాలకు మావోయిస్టు అగ్రనాయకులు హాజరయ్యేవారు. పాత్రికేయులను కూడా పిలిచేవారు. అయితే రెండు మూడేళ్లుగా మావోయిస్టులే పాత్రికేయులకు నేరుగా సీడీలను పంపుతున్నారు.
 
గూడెంకొత్తవీధి: పోలీసులు అడుగడుగునా తనిఖీ, గాలింపు ముమ్మరం చేశారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను తిప్పికొట్టేందుకు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు స్తూపాల నిర్మాణాలను ప్రోత్సహించే వారిపై హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. ప్రధాన రహదారుల్లో వాహనాల తనిఖీ, అడవిలో గాలింపు ముమ్మరం చేశారు. ఆదివారం స్థానిక ఎస్‌ఐ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు.

అనుమానితులను విచారించి విడిచిపెడుతున్నారు. మావోయిస్టులకోసం గాలింపు ముమ్మరం చేయడంతోపాటు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించాయి. ఇటీవల కొయ్యూరు మండలం పుట్టకోట ప్రాంతంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ బృందాన్ని అడ్డుకొని వారి సామగ్రిని లాక్కొని వెళ్లడంతో మావోయిస్టుల కదలికలపై నిఘాకు మండలంలోని అన్ని ప్రాంతాల్లోకి బ లగాలను దింపుతున్నారు. దీంతో విశాఖ ఏజెన్సీలో మళ్లీ భయానక వాతావరణం చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement