- రాష్ట్ర విభజన తరువాత పెరిగిన గంజాయి రవాణా
- పీడీ చట్టంతో సాగుదారుల గుండెల్లో రైళ్లు
సీలేరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం విశాఖ ఏజెన్సీ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి రవాణా జోరందుకుంది. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో ఎక్కడా పండనంత గంజాయి జీకేవీధి మండలం దారకొండ, గుమ్మిరేవులు, గాలికొండ, ఎ.దారకొండ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు పాతుకోట, గుత్తేరు వంటి పంచాయతీలలో సుమారు 200 గ్రామాల్లో, వేలాది ఎకరాల్లో గంజాయి పంట సాగవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం గంజాయి రవాణా ఈ ప్రాంతం నుంచే పెద్దఎత్తున సాగుతోందని తెలిసింది.
ప్రస్తుతం తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లాలతోపాటు విశాఖ జిల్లాలో దొరుకుతున్న గంజాయి ఈ ప్రాంతం నుంచే కాలిబాటన మైదాన ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో గంజాయితో పాటు స్మగ్లర్ల వద్ద తుపాకులు కూడా దొరికిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లర్లపై మళ్లీ పీడీ యాక్టు తేవాలని నిర్ణయించుకున్న తరుణంలో ఈ ప్రాంత గంజాయి స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నాలుగేళ్ల క్రితం సీలేరులో భారీ ఎత్తున గంజాయి రవాణా చేసిన 14 మందిని గుర్తించి పోలీసులు విచారణ చేపట్టి వదిలేశారు. మళ్లీ ఇప్పుడు పీడీయాక్టు తెరపైకి పోలీసు శాఖ తీసుకురావడం, గంజాయి స్మగ్లర్ల ఆస్తులు, భూములు ఎక్కడెక్కడున్నాయని దానిపై ఆరా తీస్తున్నారు.
వెంకటేశ్వరరావు గంజాయి ప్రస్తావన సీలేరు నుంచే 2 రోజుల క్రితం నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో 5 బస్తాల గంజాయి, 2 పిస్తోళ్లు, 28 బుల్లెట్లతో దొరికి జిల్లా పోలీసు వర్గాల్లో కలకలం రేపిన గంజాయి స్మగ్లర్లలో ఒకరైన వెంకటేశ్వరరావు గంజాయి ప్రస్తానం తొలుత సీలేరు నుంచే ప్రారంభమైంది. పదేళ్ల క్రితం సీలేరులో ఓ కాంట్రాక్టరు దగ్గర రాళ్ల కొట్టుకుంటూ జీవనం సాగించి తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేశాక సీలేరు ఫారెస్ట్ ఆఫీసులో పనిచేసేవాడు. అనంతరం సారా వ్యాపారం చేసి గంజాయిపై మోజుపడి అక్కడ నుంచి తన గంజాయి వ్యాపారాన్ని రూ.కోట్లలో టర్నోవర్ చేసేవాడు. కొంత మంది బడావ్యాపారులతో ఈ గంజాయి రవాణా చేస్తు రూ.లక్షలు ఇక్కడే సంపాదించి అనంతరం కొన్ని కేసుల్లో చిక్కుకోవడంతో సీలేరు వదిలి నర్సీపట్నంలో ఉండేవాడు. అతను గంజాయితో పట్టుబడినట్లు పత్రికల్లో తెలుసుకున్న స్థానికులు అవాక్కయ్యారు.
సరిహద్దులో గంజాయి జోరు
Published Wed, May 6 2015 3:57 AM | Last Updated on Tue, Oct 9 2018 2:23 PM
Advertisement