ముంచంగిపుట్టు మండలంలో రాగుల పంటకోత ప్రయోగంలో పాల్గొన్న ఐటీడీఏ పీవో డీకే బాలాజీ
సాక్షి, విశాఖపట్నం: మన్యంలో దాదాపు గిరిజన రైతులంతా ఖర్చులేని ప్రకృతి సేద్య విధానం (జడ్‌బీఎన్‌ఎఫ్)లో రాగులు సాగుచేసి సిరులు కురిపిస్తున్నారు. ఎలాంటి ఎరువులు, రసాయనిక మందులను కూడా వాడకుండా పూర్తిగా గుల్లిరాగి పద్ధతిని అనుసరిస్తున్నారు. ఫలితంగా తక్కువ విత్తనాలతో అదీ దేశవాళీ రకాలతో రికార్డు స్థాయిలో దిగుబడి సాధిస్తున్నారు. ఈ తరహాలో మంచి దిగుబడులు సాధించిన సుమారు 250 మంది గిరిజన రైతులను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ అభినందించారు. సోమవారం ముంచంగిపుట్టు మండలంలోని వణుగుపుట్టులో రైతుసాధికార సంస్థ, ఐటీడీఏ, వ్యవసాయ శాఖ, జడ్‌బీఎన్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మన్యంలోని 21 క్లస్టర్లలోనూ వంద శాతం జడ్‌బీఎన్‌ఎఫ్ అమలు చేయడానికి ఐటీడీఏ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హైబ్రిడ్ విత్తనాలతో కాకుండా పూర్తిగా దేశవాళీ విత్తనాలతోనే రాగుల సాగులో రికార్డు స్థాయి దిగుబడి సాధించడం విశేషమని జడ్‌బీఎన్‌ఎఫ్ జిల్లా మేనేజరు డి.దాసు హర్షం వ్యక్తం చేశారు.
రాగులదే ప్రథమ స్థానం..
చిరుధాన్యాల్లో రాగులది ప్రథమ స్థానం. జిల్లాలో వరి, చెరుకు పంటల తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట ఇదే. మొత్తం 17,626 హెక్టార్లలో ఈ ఖరీఫ్‌లో సాగు చేశారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. 2017 ఖరీఫ్‌లో 16,731 హెక్టార్లు, 2018 ఖరీఫ్‌లో 16,731 హెక్టార్లకే పరిమితమైంది. ఈసారి సాగు పెరిగింది. దీనిలో ఎక్కువగా మన్యంలోని 21 వ్యవసాయ క్లస్టర్లలోనే సాగు అయ్యింది. ఇప్పటికే దసరా బూడులు, మింతచోడి, మిలట్రీ చోడి రకాల పంట కోతలు పూర్తయ్యాయి. ఇప్పుడు పెద్దరకం చోడి పంట కోతలు మొదలయ్యాయి. ఇది దాదాపు గుల్లిరాగి సాగు విధానంలోనే సాగింది. గిరిజన రైతులు అద్భుతమైన దిగుబడులు సాధించారు. వ్యవసాయ శాఖ, రైతుసాధికారిక సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు (జడ్‌బీఎన్‌ఎఫ్) అధికారులు, సంజీవని, వాసన్, సీసీఎన్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన పంటకోత ప్రయోగాల్లో గిరిజన రైతుల ప్రతిభ వెల్లడైంది. తనకు రెండెకరాల్లో రాగులు పంట సాగుచేసిన గిరిజన రైతు పాంగి గోవిందు ఎకరాకు 18.20 క్వింటాళ్ల చొప్పున రికార్డు స్థాయిలో దిగుబడి సాధించి అభినందనలు పొందారు. మన్యంలోని 11 మండలాల్లోనున్న 21 క్లస్టర్లలో 1,260 మంది గిరిజన రైతులు గుల్లిరాగు విధానాన్నే అనుసరించడం విశేషం. సుమారు 824 ఎకరాల్లో ఈ విధానంలో సత్ఫలితాలు సాధించారు.
ప్రభుత్వ ప్రోత్సాహం...
చిరుధాన్యాల సాగులో ముందంజలోనున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా నిలబడుతున్నాయి. ముఖ్యంగా రాగులకు కనీస మద్దతు ధర బాగా పెరిగింది. 2018–19 సంవత్సరంలో క్వింటాలుకు రూ.2,897లు ఉంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో రూ.3,150కి పెరిగింది. ఈ ప్రకారం రాగులకు మద్దతు ధర గత ఏడాది కన్నా ఈసారి రూ.253 పెరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే చిరుధాన్యాల సాగును పెంచడానికి మరింత ప్రోత్సాహం, ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా త్వరలోనే మిల్లెట్ బోర్డునూ ఏర్పాటు చేయనున్నారు. ఈ బోర్డు ద్వారా చిరుధాన్యాలు పండించే రైతులకు అవసరమైన సాయం, ప్రోత్సాహం అందనున్నాయి.
మద్దతు ధరకన్నా తక్కువకు అమ్మవద్దు
జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ విధానం విశాఖ మన్యంతో పాటు నాలుగు జిల్లాల్లో అమలు చేస్తున్నాం. రాగుల సాగులో విశాఖ మన్యం రైతులు అద్భుత ప్రగతి చూపిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఎకరాకు 18 క్వింటాళ్లు దిగుబడి సాధించడం గొప్ప విషయం. రాగులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా తక్కువ ధర ఎవ్వరు ఇచ్చినా విక్రయించవద్దని గిరిజన రైతులకు చెబుతున్నాం. గిరిజన సహకార సమాఖ్య (జీసీసీ), పాడేరు ఐటీడీఏ యంత్రాంగం రాగుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
– పి.దేవుళ్లు, రాష్ట్ర రిసోర్స్‌పర్సన్, జడ్‌బీఎన్‌ఎఫ్
Comments
Please login to add a commentAdd a comment