
చలించని జీవనం
ఎటు చూసినా మంచు తెరలు..రివ్వున వీచే చలిగాలి..మునుపెన్నడూ లేనంతగా తెల్లవారుజామున పరిస్థితి మరింత దారుణం..బయట నిలబడితే శరీరం కొయ్యబారుతుందేమో అనిపించే భావన.. గజగజ వణికించే చలికి చేతులూ కాళ్లూ సహకరించని వైనం..ఉదయం 9గంటలకు భానుడి కిరణాలు కూడా ఈ మంచు తెరల్ని చీల్చుకొని రావడానికి కాసేపు పోరాటమే..సూరీడు వెలుగులు గిరుల్ని తాకగానే ఆదివాసీలకు తెల్లారుతోంది. అప్పుడే కొద్దికొద్దిగా జనం గడప నుంచి కాలు బయటకు పెడుతున్నారు. బతుకుపోరాటానికి సిద్ధమవుతున్నారు.
గత కొద్దిరోజులుగా చలిగాలులు విశాఖ ఏజెన్సీని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోతున్నాయి. సాధారణంగా జనవరి ఒకటో తేదీ నాటికి లంబసింగిలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యేది. ఈసారి పదిరోజులు ముందుగానే సున్నా డిగ్రీలకు పడిపోయింది. పాడేరు..చింతపల్లి ప్రాంతాల్లో కూడా ఐదు లోపు డిగ్రీలు నమోదవుతున్నాయి. చలికౌగిట్లో గిరులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇంత చలిలోనూ మన్యం వాసులు తమ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఏటా అలవాటే అయినా ఈ ఏడాది మరింత దారుణంగా చలి చంపేస్తోందని ఏజెన్సీవాసులంటున్నారు.