వాన జల్లు... వరద పొంగు
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
సాక్షి, విజయవాడ బ్యూరో/విశాఖపట్నం: /హైదరాబాద్: రాష్ట్రాన్ని మొన్నటి వరకు ఎండలు ముచ్చెమటలు పట్టిస్తే.. ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా కోస్తా తీరంలోని జిల్లాలో మూడు రోజులుగా పడుతున్న వానల కారణంగా నారుమళ్లు నీట మునిగాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. పుష్కర పనులకు, పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరిపై నిర్మిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పనులకు విఘాతం ఏర్పడింది.
శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో నారుమళ్లు నీట మునిగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి ఈ నెల 16వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 50 మంది మత్స్యకారుల ఆచూకీ ఇంకా దొరకలేదు. రెండు ఆర్మీ హెలికాప్టర్, రిలయన్స్‌కు చెందిన హెలికాప్టర్‌లతో గాలింపు చర్యలు చేపట్టారు.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శనగపాడు వద్ద పశువుల కాపరి ఏసునాథ్ మున్నేరువాగులో చిక్కుకోవడంతో గజ ఈతగాళ్లు అతన్ని రక్షించారు.
* తూర్పుగోదావరి జిల్లా చింతూరు-మారేడుపల్లి ఘాట్ రోడ్డులో దుర్గగుడి, టైగర్ క్యాంపుల నడుమ కొండచరియలతోపాటు భారీ వృక్షాలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విశాఖ ఏజెన్సీలోని దాదాపు 96 గ్రామాల ప్రజల జలబంధనంలో చిక్కుకున్నారు.
వర్షాలపై సీఎం సమీక్ష
వర్షాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో సమస్య ఏర్పడే పరిస్థితి ఉత్పన్నమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కోస్తాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు.