మహిళా స్మగ్లర్‌ అరెస్ట్‌.. | woman smuggler arrest in Marijuana transport | Sakshi
Sakshi News home page

గంజాయి మహిళా స్మగ్లర్‌ అరెస్ట్‌

Published Wed, Dec 27 2017 9:09 AM | Last Updated on Mon, Oct 22 2018 2:02 PM

woman smuggler arrest in Marijuana transport - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: విశాఖ ఏజెన్సీలో గంజాయి ఖరీదు చేసి, సిటీకి అక్రమ రవాణా చేసి విక్రయించడానికి ప్రయత్నించిన ఓ మహిళా స్మగ్లర్‌ను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈమెపై గతంలోనూ ఈ తరహా కేసులు ఉన్నాయని, తాజాగా 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ మంగళవారం తెలిపారు. విశాఖపట్నం జిల్లా జీకే వీధి గూడానికి చెందిన కె.పార్వతమ్మ చింతపల్లికి చెందిన అప్పారావు నుంచి గంజాయి ఖరీదు చేసి, వివిధ ప్రాంతాలకు అక్రమ రవాణా చేసి విక్రయించడం ప్రారంభించింది.  కొన్ని రోజుల క్రితం 14 కేజీల గంజాయిని అక్కడి ఏజెన్సీ ఏరియాలో ఖరీదు చేసి సోమవారం హైదరాబాద్‌కు బయలుదేరింది.

మంగళవారం అఫ్జల్‌గంజ్‌లోని సీబీఎస్‌లో బస్సు దిగిన ఈమె ట్రాలీ బ్యాగ్స్‌లో ఉన్న గంజాయిని ధూల్‌పేట ప్రాంతానికి తరలించి అక్కడ తనకు పరిచయస్తులైన హోల్‌సేల్‌ గంజాయి వ్యాపారులకు కేజీ రూ.5 వేల చొప్పున అమ్మాలని భావించింది. అయితే పార్వతమ్మ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.మోహన్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం సీబీఎస్‌ వద్ద వలపన్ని నిందితురాలిని అరెస్టు చేసింది. కేసును తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు అప్పగించింది.  

గోవాలో చిక్కిన హైదరబాదీలు...
విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీల నుంచి గంజాయిని తరలిస్తూ, సిటీలో విక్రయిస్తున్న నిందితుల్ని ఇక్కడి పోలీసులు పట్టుకుంటున్నారు. ఇలానే హైదరాబాద్‌ నుంచి గంజాయిని గోవాకు తీసుకువెళ్ళి అక్కడ అమ్మడానికి ప్రయత్నించిన ఇద్దరు సిటీ వాసుల్ని గోవా యాంటీ నార్కోటిక్‌ సెల్‌ (ఏఎన్‌సీ) అధికారులు పట్టుకున్నారు. నగరానికి చెందిన అరుణ్, మహేష్‌ రెండు కేజీల గంజాయి తీసుకుని గోవాకు చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి గోవా ఏఎన్‌సీ అధికారులు వలపన్ని అరుణ్, మహేష్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement