ఆర్నెల్ల క్రితమే హెచ్చరిక.. అయినా! | Central Intelligence Agency Warns Before six months itself on Mao Attack? | Sakshi
Sakshi News home page

ఆర్నెల్ల క్రితమే కేంద్ర నిఘా సంస్థల హెచ్చరిక!

Published Thu, Sep 27 2018 4:33 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

Central Intelligence Agency Warns Before six months itself on Mao Attack? - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ‘రామ్‌గుడా ఎన్‌కౌంటర్‌ తర్వాత ఏవోబీలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ధీమాగా ఉండడానికి వీల్లేదు. దండకారణ్యంలో కొంత సడలిన పట్టును మళ్లీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఊపందుకుంటున్నాయి.  ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఏ క్షణమైనా మెరుపు దాడులకు తెగబడే అవకాశం లేకపోలేదు’ 
– ఆర్నెళ్ల కిత్రం రాష్ట్రానికి కేంద్ర నిఘా సంస్థల హెచ్చరిక..

దాడులపై ముందే అప్రమత్తం చేసినా..
తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు మళ్లీ బలపడుతున్నారని కేంద్ర నిఘా వర్గాలు కొద్ది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దాదాపు 200 మందికి పైగా మావోయిస్టులు ఏవోబీలో క్రియాశీలంగా ఉన్నారని రాష్ట్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ  జిల్లాల కూడలిలో కార్యకలాపాలను విస్తరించుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న మావోయిస్టులు ఆయుధాలు, సామగ్రిని సమకూర్చుకుంటున్నారని, ఏ క్షణాన్నైనా మెరుపు దాడులకు తెగబడే అవకాశం ఉందని అప్రమత్తం చేసినట్లు తెలిసింది. 

‘పొరుగు’ సేవల వ్యూహం!
స్థానికంగా బలం తగ్గడంతో చత్తీస్‌గడ్, ఒడిశా నుంచి మావోయిస్టులను రప్పించి క్యాడర్‌ పెంచుకునేందుకు అగ్ర నాయకత్వం వ్యూహ రచన చేస్తోందని నిఘావర్గాలు పేర్కొన్నాయి. గతంలో మాదిరిగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కలిసి జాయింట్‌ ఆపరేషన్లకు వ్యూహ రచన చేయాలని నిఘా సూచించింది. ఏవోబీని షెల్టర్‌ జోన్‌గా ఎంచుకుంటున్నారని హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని నిఘావర్గాలు అంటున్నాయి.

బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌ తెచ్చుకోలేని దుస్థితి
మావోయిస్టుల అణచివేతకు అదనంగా బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ బెటాలియన్‌ కావాలని విశాఖలో జరిగిన సమీక్షలో హోం మంత్రి చినరాజప్ప కోరగానే మంజూరు చేస్తున్నట్టు రాజ్‌నాధ్‌సింగ్‌ ప్రకటించారు. దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్రంలో భాగస్వామిగా కొనసాగిన టీడీపీ సర్కారు ఈ బెటాలియన్‌ ఏపీకి తెచ్చుకోలేకపోయింది.

సాంకేతిక పరిజ్ఞానం పట్టని సర్కార్‌
రెండున్నరేళ్ల క్రితం విశాఖలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, డీఐజీలు ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నా«థ్‌సింగ్‌ నిర్వహించిన సమీక్షలో ఏవోబీలో మావోయిస్టు కార్యకలాపాలపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ఉమ్మడి ఆపరేషన్‌తో సత్ఫలితాలు సాధించవచ్చని, నిరంతర కూంబింగ్‌తో కదలికలను కనిపెట్టాలని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సూచించింది. మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు కమ్యూనికేషన్ల వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించినా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement