Central intelligence agencies
-
విశాఖలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’
సాక్షి, వైజాగ్: విశాఖ కేంద్రంగా తీరప్రాంతానికి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్న ఏడుగురు నేవీ అధికారులను సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘా వర్గాలు, ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ నిర్వహించారు. ఓ హవాలా బ్రోకర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరందరినీ వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి విజయవాడ ఎన్ఐఏ కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయస్థానం జనవరి 3వ తేదీవరకూ రిమాండ్ విధించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్నెల్ల క్రితమే హెచ్చరిక.. అయినా!
సాక్షి, విశాఖపట్నం: ‘రామ్‌గుడా ఎన్కౌంటర్ తర్వాత ఏవోబీలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ధీమాగా ఉండడానికి వీల్లేదు. దండకారణ్యంలో కొంత సడలిన పట్టును మళ్లీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఊపందుకుంటున్నాయి. ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఏ క్షణమైనా మెరుపు దాడులకు తెగబడే అవకాశం లేకపోలేదు’ – ఆర్నెళ్ల కిత్రం రాష్ట్రానికి కేంద్ర నిఘా సంస్థల హెచ్చరిక.. దాడులపై ముందే అప్రమత్తం చేసినా.. తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు మళ్లీ బలపడుతున్నారని కేంద్ర నిఘా వర్గాలు కొద్ది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దాదాపు 200 మందికి పైగా మావోయిస్టులు ఏవోబీలో క్రియాశీలంగా ఉన్నారని రాష్ట్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కూడలిలో కార్యకలాపాలను విస్తరించుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న మావోయిస్టులు ఆయుధాలు, సామగ్రిని సమకూర్చుకుంటున్నారని, ఏ క్షణాన్నైనా మెరుపు దాడులకు తెగబడే అవకాశం ఉందని అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ‘పొరుగు’ సేవల వ్యూహం! స్థానికంగా బలం తగ్గడంతో చత్తీస్గడ్, ఒడిశా నుంచి మావోయిస్టులను రప్పించి క్యాడర్ పెంచుకునేందుకు అగ్ర నాయకత్వం వ్యూహ రచన చేస్తోందని నిఘావర్గాలు పేర్కొన్నాయి. గతంలో మాదిరిగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కలిసి జాయింట్ ఆపరేషన్లకు వ్యూహ రచన చేయాలని నిఘా సూచించింది. ఏవోబీని షెల్టర్ జోన్‌గా ఎంచుకుంటున్నారని హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని నిఘావర్గాలు అంటున్నాయి. బీఎస్ఎఫ్ బెటాలియన్ తెచ్చుకోలేని దుస్థితి మావోయిస్టుల అణచివేతకు అదనంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ బెటాలియన్ కావాలని విశాఖలో జరిగిన సమీక్షలో హోం మంత్రి చినరాజప్ప కోరగానే మంజూరు చేస్తున్నట్టు రాజ్‌నాధ్‌సింగ్ ప్రకటించారు. దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్రంలో భాగస్వామిగా కొనసాగిన టీడీపీ సర్కారు ఈ బెటాలియన్ ఏపీకి తెచ్చుకోలేకపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పట్టని సర్కార్ రెండున్నరేళ్ల క్రితం విశాఖలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, డీఐజీలు ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి రాజ్నా«థ్‌సింగ్ నిర్వహించిన సమీక్షలో ఏవోబీలో మావోయిస్టు కార్యకలాపాలపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ఉమ్మడి ఆపరేషన్‌తో సత్ఫలితాలు సాధించవచ్చని, నిరంతర కూంబింగ్‌తో కదలికలను కనిపెట్టాలని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సూచించింది. మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు కమ్యూనికేషన్ల వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించినా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. -
హవాలా, ఉగ్రవాదంపై నోట్లదెబ్బ
• సగం తగ్గిన హవాలా వ్యాపారం • కశ్మీర్లో 60% తగ్గిన ఉగ్ర హింస న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం హవాలా వ్యాపారాన్ని పెద్ద దెబ్బతీసిందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్లో ఉగ్రవాదులకు నిధులు ఆగిపోవడంతో హింస 60 శాతం తగ్గినట్లు అంచనా వేసింది. నోట్ల రద్దు తర్వాత చట్టవ్యతిరేక, తీవ్రవాద కార్యకలాపాల్ని విశ్లేషించి నిఘా వర్గాలు ఈ నివేదిక విడుదల చేశాయి.. హవాలా మధ్యవర్తుల మధ్య ఫోను సంభాషణలు సగానికి సగం తగ్గాయని విశ్లేషణలో వెల్లడైంది. ఈ లెక్కల ప్రకారం హవాలా వ్యాపారం సగం తగ్గిందని అంచనా. కశ్మీర్లో అల్లర్లను రెచ్చగొడుతూ హింసను ప్రేరేపిస్తున్న ఉగ్రవాదులకు కూడా నిధులు నిలిచిపోయాయి. ఉగ్రవాద సానుభూతిపరులకు కూడా చెల్లింపులు ఆగిపోయాయి. ఉగ్రవాదులకు నిధుల అందించేందుకు రద్దైన నోట్లనే వాడేవారు. అలాగే పాకిస్తాన్‌లోని క్వెట్టా, కరాచీ ప్రింటింగ్ ప్రెస్‌ల్లో ముద్రించిన నకిలీ నోట్లు కూడా చలామణి చేసేవారు. నోట్ల రద్దు నిర్ణయంతో అవన్నీ చెల్లకుండా పోవడంతో నగదు లేక ఉగ్రవాదులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌లోని ఉగ్రవాదులు తక్షణ నగదు చెల్లింపులపైనే ఆధారపడ్డారు. నోట్ల రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద సంబంధ హింస 60 శాతం తగ్గిందని నిఘా అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలు కూడా గత కొద్ది వారాలుగా పెరిగాయని విశ్లేషిస్తున్నారు. మావోలకూ దెబ్బే.. మావోయిస్టులకు నిధుల సేకరణ కష్టంగా మారింది. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్, జార్ఖండ్‌లో రద్దైన నోట్లను మార్చాలంటూ మావోయిస్టులు స్థానికుల్ని సంప్రదించినట్లు ఆరోపణలు ఉన్నాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబర్ 9 అనంతరం మావోయిస్టులతో పాటు వారి మద్దతుదారుల నుంచి రూ. 90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయేందుకు నోట్ల రద్దు నిర్ణయం సాయపడిందని, ఈశాన్య భారతంలోని చొరబాటు గ్రూపులు కూడా భారీగా నష్టపోయాయనేది నివేదిక సారాంశం. -
ఇక గగనతలం!
*దాడులకు ముష్కరుల కొత్త మార్గం *నిఘా వర్గాల హెచ్చరికలు అనధికారిక డ్రోన్లు, పారాగ్లైడర్లు నిషేధించాలని స్పష్టీకరణ *నగరంలో వినియోగంపై నిషేధం పొడిగింపు గోవాలో శిక్షణ పొందిన ‘జంట పేలుళ్ల’ నిందితుడు ముష్కర మూకలు అకృత్యాలకు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఉగ్రవాదులు, తీవ్రవాదులు గగనతల దాడులకు కుట్రలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పారాగ్లైడర్లు, డ్రోన్లతో పాటు అనధికారికంగా వినియోగించే అన్ని రకాలైన ఎగిరే వస్తువులపై నిషేధం విధించాల్సిందిగా కేంద్ర నిఘా వర్గాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటికే జంట కమిషనరేట్ల అధికారులు హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో వీటిపై నిషేధం విధించారు. నగరంలో అమలులో ఉన్న నిషేధాన్ని పొడిగిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిటీబ్యూరో: కేంద్ర నిఘా వర్గాలు గగనతల దాడులపై పదే పదే హెచ్చరించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాదుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాల ఆధారాలనూ నిఘా వర్గాలు సేకరించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబాకు చెందిన ఉగ్రవాది సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబు జుందాల్, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ, ఖలిస్థాన్ మిలిటెంట్ నాయకుడు జక్తార్ సింగ్ తారాలను నిఘా వర్గాలు విచారించడంతోముష్కర సంస్థల వ్యూహం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రత్యేకంగా ఎంపిక చేసిన క్యాడర్‌కు గగనతల దాడుల్లో శిక్షణ ఇస్తున్నట్లు వీరు బయటపెట్టారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు చెందిన ఓ వింగ్ ఉగ్రవాదులకు పారాచూట్ జంపింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. పాక్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని ఉగ్రవాద సంస్థలు చైనా, యూఏఈ కంపెనీల నుంచి పారాగ్లైడర్ల తయారీకి ఉపకరించే ఉపకరణాలు, పాకిస్థాన్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి డ్రోన్లు ఖరీదు చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీటికి తోడు గత ఏడాది స్పెయిన్‌లో జరిగిన గగనతల కొనుగోళ్లకు సంబంధించి నిఘా వర్గాలు సేకరించిన ఆధారాలు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. శిక్షణ పొందిన అఫాఖీ... దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద 2013 ఫిబ్రవరి 21న చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, కర్ణాటకలోని భత్కల్ వాసి సయ్యద్ ఇస్మాయిల్ ఆఫాఖీ అలియాస్ డాక్టర్ సాబ్ సైతం పారాగ్లైడింగ్‌లో శిక్షణ పొందినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జంట పేలుళ్లకు అవసరమైన పదార్థాలను సరఫరా చేశాడన్నది ఇతడిపై ఉన్న ప్రధాన ఆరోపణ. భత్కల్, బెంగళూరుల్లో నివసించిన ఇతడు అరెస్టు కావడానికి ముందు గోవాలోని ఖేరీ ప్రాంతంలో పారాగ్లైడింగ్‌లో శిక్షణ పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బెంగళూరుకు చెందిన రామన్ పర్యవేక్షణలో 2013 నవంబర్‌లో కొన్ని వారాల పాటు శిక్షణ పొందినట్లు బయటపెట్టాడు. వృత్తిరీత్యా పారాగ్లైడింగ్ శిక్షకుడైన రామన్‌కు అసలు విషయం చెప్పకుండా సరదా కోసమంటూ అఫాఖీ నేర్చుకున్నాడు. ఐఎం గగనతల దాడుల కుట్రలో భాగంగానే ఈ శిక్షణ తీసుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మినీ హెలీకాఫ్టర్లపై మావోల కన్ను.... మావోయిస్టుల దృష్టి ఇప్పుడు మినీ హెలీకాఫ్టర్ల తయారీపై పడినట్టు వెలుగులోకి వచ్చింది. బీహార్, కేరళల్లో జరిగిన ఆపరేషన్ల సందర్భంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తక్కువ బరువు, సామర్థ్యం కలిగినవి రూపొందించి వినియోగించడానికి మావోయిస్టులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడైంది. వీటికి సంబంధించిన ఓ డిజైన్ బీహార్‌లోని గయ ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీసుఫోర్స్ (సీఆర్పీఎఫ్) అధికారులకు లభించింది. ఇప్పటి వరకు విధ్వంసాల కోసం మావోయిస్టులు ఎక్కువగా మందుపాతరలనే ప్రయోగిస్తున్నారు. వీటికి భిన్నంగా రిమోట్ కంట్రోల్ బాంబుల తయారీకీ ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. వీటినీ గగనతలం ద్వారా వినియోగించే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ 7 వరకు నిషేధం పొడిగింపు... నగరంలో అనధికారిక డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా పని చేసే ఎగిరే వస్తువులు, చిన్నపాటి మానవ రహిత విమానాల వినియోగంపై నిషేధాన్ని నవంబర్ 7 వరకు పొడిగిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గగనతల దాడులపై నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వీటిని ఎవరైనా వినియోగించాలన్నా కచ్చితంగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
శివార్లలో ‘టై’ అలర్ట్
⇒అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు ⇒ఐటీ కేంద్రాలు, విమానాశ్రయంపై నిఘా ⇒వాహన తనిఖీలు ముమ్మరం సాక్షి, హైదరాబాద్: ‘నగర శివార్లలో ఉగ్రవాదులు విరుచుకుపడొచ్చు’ అని కేంద్ర నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఉన్న మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మేడిపల్లి, ఆదిబట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రత పెంచడంతో పాటు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అక్టోపస్ కమాండోలను మోహరించారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో వాహన తనిఖీలు, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్ని ఠాణాల ఇన్స్పెక్టర్లకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, కాలనీల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మైత్రీ కమిటీ సభ్యులకు ఇన్స్పెక్టర్లు సూచించారు. జంట పోలీసు కమిషనరేట్లలో ఇటీవల ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) కార్యకలాపాలు తెరపైకి రావడంతోనే కేంద్ర నగర పోలీసులను అప్రమత్తం చేసిందని తెలుస్తోంది. ఇక దేశంలోని విమానాశ్రయాల్లో ఏదో ఒక విమానాన్ని హైజాక్ చేయాలని ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని హెచ్చరికలు రావడంతో కూడా పోలీసులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై రాత్రి వేళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో సైబరాబాద్‌లో ఉగ్రవాదులు పట్టుబడిన ఉదంతాల నేపథ్యంలో శివార్లలో నిఘాను కట్టుదిట్టం చేశారు. శివార్లలో పట్టుబడ్డ ఉగ్రవాదులు వీరే... ⇒బేగంపేట్‌లోని నగర పోలీసు కమిషనర్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై ఐఎస్ఐ ఉగ్రవాదులు అక్టోబర్ 12, 2005న మానవబాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడిన వారిలో కలీం అనే ఉగ్రవాది ఎల్బీనగర్లో పట్టుబడ్డాడు. ఇక్కడే ఇతను మకాం వేసి, మానవబాంబు కుట్రను అమలు చేశాడు. ⇒ముంబై లోకల్ రైళ్లలో ఉగ్రవాదులు జులై 2006లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో పాలుపంచుకున్న నవీద్ అనే ఉగ్రవాది నేరేడ్మెట్, న్యూవిద్యానగర్లోని లేక్‌షోర్ అపార్ట్మెంట్లో తలదాచుకున్నాడు. ⇒లుంబినీపార్క్, గోకుల్‌ఛాట్ భండార్లలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డ ఉగ్రవాదులు అనీఖ్ షఫీ, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్‌లు హబ్సిగూడలో మకాం వేసి తమ కుట్రను అమలు చేశారు. ⇒అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో అరెస్టయిన అబూ బషీర్ పహాడీషరీఫ్‌లోని ఓ మదర్సాలో తల దాచుకున్నాడు. ⇒ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న కేరళకు చెందిన అబ్దుల్ జబ్బర్ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని చింతల్మెట్ బస్తీలో ఐదేళ్ల పాటు తల దాచుకున్నాడు. ⇒దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల నిందితులు హయత్న గర్‌లో ఓ ఇంటిని విద్యార్థుల ముసుగులో అద్దెకు తీసుకని ఇక్కడే బాంబులు తయారు చేశారు. శివార్లలో పట్టుబడ్డ ఉగ్రవాదులు వీరే.. ⇒ శివార్లలో ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచి, కౌంట ర్ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘా తక్కువ ఉండటం. ⇒ ఆయా పోలీసు స్టేషన్ల విస్తీర్ణం ఎక్కువ కావడంతో పోలీసు పెట్రోలింగ్ సరిగా ఉండకపోవడం. ⇒శివార్లలో ఉండే వారు చాలా మంది కొత్తవారు కావడంతో ఉగ్రవాదులను పసిగట్టలేకపోవడం ⇒జాతీయ రహదారులు శివారు ప్రాంతాలను ఆనుకొని ఉండటంతో రాకపోకలు సులభం ⇒ఆకస్మిక వాహన తనిఖీలు ఉండవు ⇒బాంబులు సరఫరా చేయడం సులువు