⇒అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు
⇒ఐటీ కేంద్రాలు, విమానాశ్రయంపై నిఘా
⇒వాహన తనిఖీలు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: ‘నగర శివార్లలో ఉగ్రవాదులు విరుచుకుపడొచ్చు’ అని కేంద్ర నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఉన్న మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మేడిపల్లి, ఆదిబట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇక శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రత పెంచడంతో పాటు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అక్టోపస్ కమాండోలను మోహరించారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో వాహన తనిఖీలు, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్ని ఠాణాల ఇన్‌స్పెక్టర్లకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, కాలనీల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మైత్రీ కమిటీ సభ్యులకు ఇన్‌స్పెక్టర్లు సూచించారు.
జంట పోలీసు కమిషనరేట్లలో ఇటీవల ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) కార్యకలాపాలు తెరపైకి రావడంతోనే కేంద్ర నగర పోలీసులను అప్రమత్తం చేసిందని తెలుస్తోంది. ఇక దేశంలోని విమానాశ్రయాల్లో ఏదో ఒక విమానాన్ని హైజాక్ చేయాలని ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని హెచ్చరికలు రావడంతో కూడా పోలీసులను అప్రమత్తం చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై రాత్రి వేళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో సైబరాబాద్‌లో ఉగ్రవాదులు పట్టుబడిన ఉదంతాల నేపథ్యంలో శివార్లలో నిఘాను కట్టుదిట్టం చేశారు.
శివార్లలో పట్టుబడ్డ ఉగ్రవాదులు వీరే...
⇒బేగంపేట్‌లోని నగర పోలీసు కమిషనర్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై ఐఎస్‌ఐ ఉగ్రవాదులు అక్టోబర్ 12, 2005న మానవబాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడిన వారిలో కలీం అనే ఉగ్రవాది ఎల్‌బీనగర్‌లో పట్టుబడ్డాడు. ఇక్కడే ఇతను మకాం వేసి, మానవబాంబు కుట్రను అమలు చేశాడు.
⇒ముంబై లోకల్ రైళ్లలో ఉగ్రవాదులు జులై 2006లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో పాలుపంచుకున్న నవీద్ అనే ఉగ్రవాది నేరేడ్‌మెట్, న్యూవిద్యానగర్‌లోని లేక్‌షోర్ అపార్ట్‌మెంట్‌లో తలదాచుకున్నాడు.
⇒లుంబినీపార్క్, గోకుల్‌ఛాట్ భండార్‌లలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డ ఉగ్రవాదులు అనీఖ్ షఫీ, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్‌లు హబ్సిగూడలో మకాం వేసి తమ కుట్రను అమలు చేశారు.
⇒అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో అరెస్టయిన అబూ బషీర్ పహాడీషరీఫ్‌లోని ఓ మదర్సాలో తల దాచుకున్నాడు.
⇒ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న కేరళకు చెందిన అబ్దుల్ జబ్బర్ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని చింతల్‌మెట్ బస్తీలో ఐదేళ్ల పాటు తల దాచుకున్నాడు.
⇒దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల నిందితులు హయత్‌న గర్‌లో ఓ ఇంటిని విద్యార్థుల ముసుగులో అద్దెకు తీసుకని ఇక్కడే బాంబులు తయారు చేశారు.
శివార్లలో పట్టుబడ్డ ఉగ్రవాదులు వీరే..
⇒ శివార్లలో ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచి, కౌంట ర్ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘా తక్కువ ఉండటం.
⇒ ఆయా పోలీసు స్టేషన్‌ల విస్తీర్ణం ఎక్కువ కావడంతో పోలీసు పెట్రోలింగ్ సరిగా ఉండకపోవడం.
⇒శివార్లలో ఉండే వారు చాలా మంది కొత్తవారు కావడంతో ఉగ్రవాదులను పసిగట్టలేకపోవడం
⇒జాతీయ రహదారులు శివారు ప్రాంతాలను ఆనుకొని ఉండటంతో రాకపోకలు సులభం
⇒ఆకస్మిక వాహన తనిఖీలు ఉండవు
⇒బాంబులు సరఫరా చేయడం సులువు
శివార్లలో ‘టై’ అలర్ట్
Published Sat, Feb 28 2015 12:06 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement