గంగ.. మన్యంలో మెరవంగ | Tribal Woman Success Story In Thadiputtu Visakha Agency | Sakshi
Sakshi News home page

గంగ.. మన్యంలో మెరవంగ

Published Fri, Aug 23 2019 7:00 AM | Last Updated on Fri, Aug 23 2019 7:02 AM

Tribal Woman Success Story In Thadiputtu Visakha Agency - Sakshi

విద్యార్థులతో డ్రిల్‌ చేయిస్తున్న గంగమ్మ

ఆ అమ్మాయికి ‘జీవనది’ గంగమ్మ పేరు పెట్టారా తల్లిదండ్రులు.  పేరుకు తగ్గట్లే.. కష్టాలు కూడా.. ఆ చిన్నారిని వెంటాడాయి. మన్యంలో పుట్టినా.. చదువంటే ప్రాణంగా భావించింది. కష్టాలు రోజురోజుకీ పెరిగాయి. తండ్రి మరణంతో చదువును వదిలేయాలనుకుంది. కూతురి ఆశయాన్ని బతికించేందుకు తల్లి ముందుకొచ్చింది. కూలీ పని చేసుకుంటూ గంగను బడికి పంపింది. గంగ ప్రస్థానాన్ని తెలుసుకున్న ‘నన్హీకలీ’ అనే స్వచ్ఛంద సంస్థ వెన్నుతట్టింది. అంతే చదువులో గంగా ప్రవాహం పరుగులెత్తింది.  పీఈటీగా ఉద్యోగం సాధించింది. మన్యంలోనే సేవలందిస్తోంది.  

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ మారుమూల మండలమైన హుకుంపేట మండలం తాడిపుట్టులో బొజ్జయ్య, భీమలమ్మ దంపతులకు పుట్టింది గంగమ్మ. పేదరికం ఆ కుటుంబంపై పగబట్టింది. అభివృద్ధికి దూరంగా విసిరేసినట్లుండే ఆ గ్రామంలో పుట్టి పెరిగిన గంగమ్మకు చదువుకోవాలనే ఆకాంక్ష కలిగింది. తల్లిదండ్రులు ప్రభుత్వ బడికి పంపించారు. గ్రామంలోని పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన గంగకు.. పాఠాల్లో నేర్చుకున్న జీవిత గాధలు విని.. భవిష్యత్తు గురించి ఆలోచించే భావనలు మొదలయ్యాయి. పెద్ద చదువులు చదువుతానని.. ప్రభుత్వ కొలువు సాధిస్తానంటూ తల్లిదండ్రులతో చెప్పేది. కానీ.. ఆరో తరగతి చదవాలంటే.. ఆమడ దూరం వెళ్లాల్సిందే. ఇంట్లో వద్దని చెప్పినా.. గంగ పట్టుబట్టడంతో హుకుంపేటలోని హైస్కూల్‌లో చేర్పించారు. రెండు గంటల పాటు నడిచి వెళ్తేనే హైస్కూల్‌కి చేరుకోగలరు. అయినా పట్టు విడవక రోజూ నడిచి వెళ్లి క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేది.

తండ్రి మరణంతో....
గంగమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి బొజ్జయ్య మరణించాడు. దీంతో కుటుంబ పోషణ భారమైపోయింది. ఆశలు, లక్ష్యాలు పక్కనపెట్టి.. కుటుంబ పెద్ద భారం మోయాలని నిర్ణయించుకుంది. తల్లి మాత్రం ..తాను కష్టపడతాను.. చదువుకో అని చెప్పడంతో.. నెల రోజుల విరామం తర్వాత.. పాఠశాల మెట్లు ఎక్కింది గంగ. రోజు కూలీగా చేరిన తల్లి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది.

నన్హీకలీ ఫౌండేషన్‌ చేయూతతో...
అదే సమయంలో మన్యంలో పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఆ ప్రాంతానికి వచ్చిన నన్హీకలీ ఫౌండేషన్‌ ప్రతినిధులు.. చదువులోనూ, ఆటపాటల్లోనూ గంగమ్మ చురుకుదనం చూసి ముగ్ధులయ్యారు. ఆమె కుటుంబ పరిస్థితులు చూసి చలించిపోయారు. వెంటనే గంగమ్మ విద్యా బాధ్యతను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. స్కూల్‌ బ్యాగులు, పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రి అందించి ప్రోత్సహించారు. పదోతరగతి ఏ గ్రేడ్‌లో పాసయిన గంగమ్మకు.. ఆత్మ విశ్వాసం రెట్టింపైంది. నన్హీకలీ కమ్యూనిటీ అసోసియేట్‌ ట్యూటర్ల సహాయంతో ఇంటర్మీడియట్‌ను ఏపీ గిరిజన సంక్షేమ ప్రాంతీయ జూనియర్‌ కాలేజీలో చేరి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైంది. తాడిపుట్టు గ్రామంలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తిగా గంగమ్మ చరిత్రకెక్కింది.

డిగ్రీ వద్దనుకొని....
ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న తర్వాత తొలుత డిగ్రీ పూర్తి చెయ్యాలని  నిర్ణయించుకుంది గంగమ్మ. అయితే.. డిగ్రీ పూర్తి చేసేందుకు మూడేళ్ల సమయం పడుతుందనీ.. ఆ తర్వాత ఉద్యోగం కోసం మరికొన్ని సంవత్సరాలు శ్రమించాల్సి వస్తుందని భావించింది. డిగ్రీ విద్యని మొదటి సంవత్సరంలోనే స్వస్తి చెప్పింది. హైదరాబాద్‌లోని దోమల్‌గూడలోని గవర్న్‌మెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో చేరి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిగ్రీ పొందింది. తన జీవితంలో ఎదురైన ప్రతికూలతలను అనుకూలతలుగా మలచుకుని..పీఈటీగా ఉద్యోగం సాధించింది గంగమ్మ. అరకులోని పెదగరువు పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వర్తిస్తోంది. జీవితంలో ఎదురైన ప్రతి పాఠాన్నీ నేర్చుకొని.. లక్ష్యం వైపు దూసుకుపోయిన గంగను గ్రామస్తులు అభినందనల్లో ముంచెత్తారు.

అమ్మ మాటలే స్ఫూర్తి...
పదమూడేళ్ల వయసులో నాన్న చనిపోయినప్పుడు.. చదువు మానేసి అమ్మతో పాటు పనిలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అయితే అమ్మ దీనికి ఇష్టపడలేదు. చదువుతోనే ఏదైనా సాధ్యమవుతుందనీ, ఊరికి మంచి పేరు తీసుకురావాలని అమ్మ చెప్పింది. అప్పుడే మన కష్టాలన్నీ తీరిపోతాయని అమ్మ చెప్పింది. అప్పటి నుంచి వెనుదిరగలేదు. కష్టపడి చదువుతున్న సమయంలో నన్హీకలీ ఫౌండేషన్‌ నన్ను అక్కున చేర్చుకుంది. వారి ప్రోత్సాహంతోనే ఇంత వరకు రాగలిగాను. ఏ కష్టం వచ్చినా నన్ను ఆదుకున్నారు.
– గంగమ్మ, పీఈటీ,  పెదగరువు పాఠశాల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement