Success in life
-
బాధ కాదు బాట చూడాలి..
బెంగళూరుకు చెందిన వీణా అంబరీష బస్సు ప్రమాదంలో కుడి కాలిని కోల్పోయింది. ఆ తరువాత డిప్రెషన్ బారిన పడింది. ఆ చీకటి నుంచి అతి కష్టం మీద బయటపడి అర్ధంతరంగా ఆగిపోయిన చదువును కొనసాగించింది. ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘కరీ దోశ’ పేరుతో ఫుడ్ స్టాల్ ప్రారంభించి తన కాళ్ల మీద తాను నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది వీణా అంబరీష. కొన్ని సంవత్సరాల క్రితం.. భరతనాట్యం డ్యాన్సర్ అయిన వీణ తన ఆరంగేట్రం కోసం సన్నాహాలు చేసుకుంటోంది. కాలేజీకి వెళ్లడానికి రోడ్దు దాటుతున్నప్పుడు బస్సు ఢీకొట్టడంతో ప్రమాదానికి గురై కుడికాలు కోల్పోయింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన తరువాత వాకింగ్ స్టిక్‌తో నడవడం మొదలు పెట్టింది. చాలా కష్టంగా అనిపించేది. భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్న వీణ తనకు జరిగిన ప్రమాదాన్ని జీర్ణించుకోలేపోయింది. కలల రెక్కలు విరిగిన బాధ ఆమె కళ్లలో కన్నీరై కనిపించేది. ‘నాకు ఇలా జరిగిందేమిటి!’ అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల వీణ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్లిందంటే.. ‘ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదు’ అని బలంగా అనుకునేంతగా. అయితే వీణ తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక దృశ్యం కారణం అయింది. ఆ దృశ్యం తనకు వేకప్–కాల్‌గా పనిచేసింది. ఫిజికల్ డిజేబిలిటీ సర్టిఫికెట్ తీసుకోవడానికి విక్టోరియా హాస్పిటల్‌కు వెళ్లిన వీణ అక్కడ ఒక మహిళను చూసింది. ఆమెకు రెండు కాళ్లు లేవు. ఆమె తన బిడ్డను లాలిస్తూ బువ్వ తినిపిస్తోంది. ఒక క్షణం ఆమె ముఖం వైపు చూసింది వీణ. రవ్వంత బాధ కూడా ఆమె ముఖంలో కనిపించలేదు. జీవనోత్సాహంతో ఆ ముఖం వెలిగిపోతోంది. తాను ఏవైతే పెద్ద సమస్యలు అనుకుంటుందో అవి గాలిలో దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఈ ఒక్క దృశ్యం వీణ ఆలోచనలో పూర్తిగా మార్పు తీసుకువచ్చింది. ‘ఏదో సాధించాలి’ అనే ఉత్సాహం మనసులోకి వచ్చింది. ఆగిపోయిన చదువును కొనసాగించింది. మంచి మార్కులతో పరీక్షలు పాసైంది. ఆ తరువాత ఎంబీఏ పూర్తి చేసింది. బ్యాంకులలో సేల్స్ ఆఫీసర్‌గా, ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ టెస్టర్‌గా పనిచేసింది. ఒకవైపు గంటల కొద్దీ చేసే ఉద్యోగం.. మరోవైపు పిల్లల ఆలనా పాలనా కష్టమనిపించింది. ఒక సౌత్ అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎడతెగకుండా జరిగే మీటింగ్‌లు, పనిభారం వల్ల కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో పదిహేను రోజులు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది వీణ. దానికి ఫిట్నెస్ ట్రెయినర్ అయిన ఆమె భర్త ప్రోత్సాహం తోడైంది. గత సంవత్సరం బెంగళూరులో ‘కరీ దోశ’ పేరుతో దోశ స్టాల్ మొదలు పెట్టినప్పుడు ‘ఎంబీఏ చదివి ఇదేమిటీ’ అన్నట్లుగా మాట్లాడారు కొద్దిమంది. వారి మాటలేవీ పట్టించుకోలేదు వీణ. ప్రత్యేకత ఉంటేనే ఫుడ్ స్టాల్ అయినా పెద్ద వ్యాపారమైనా విజయం సాధిస్తుంది. మరి ‘కరీ దోశ’ స్పెషల్ ఏమిటి? కరీ దోశే! తమిళనాడులోని మధురై ప్రాంతంలో ‘కరీ దోశ’గా పిలిచే వేడి వేడి దోశ దానిపై ఆమ్లెట్, మటన్ కీమా చాలా ఫేమస్. కరీ దోశ బెంగళూరులో కూడా హిట్ అయింది. ఈ దోశ కోసం కస్టమర్లు పొద్దున్నే లైన్ కడతారు. స్టాల్ ప్రారంభించడానికి ముందు ‘కరీ దోశ’ రుచులలో ప్రావీణ్యం సంపాదించడానికి రెండు నెలల పాటు ఇంట్లోనే ఉంది వీణ. వంటగది తన పాఠశాలగా, ప్రయోగశాలగా మారింది. ‘కరీ దోశ’ స్టాల్ పొద్దున ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అందుబాటులో ఉంటుంది. ఇక మిగిలిన సమయమంతా ఇంట్లోనే పిల్లలతో గడుపుతుంది వీణ. చిరునవ్వే సందేశం.. బాధ లేనిది ఎవరికి? బాధ పడుతూ కూర్చోవడం కంటే దాని నుంచి బయటపడడానికి కొత్తబాట వెదకాలి. మనకంటే ఎక్కువ బాధలు పడుతున్న వారు, పెద్ద పెద్ద సమస్యల్లో ఉన్న వారు ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉన్నారు. అంత కష్టంలోనూ వారి పెదవి మీద కనిపించే చిరునవ్వు మనకు సందేశాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. – వీణా అంబరీష ఇవి చదవండి: World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్‌తో జాగ్రత్త! -
సగం జీతానికి పనిచేసిన 'నారాయణ మూర్తి' బిలీనియర్ ఎలా అయ్యాడంటే?
Infosys Narayana Murthy Success Story: భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పారిశ్రామిక వేత్తల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి.. జీవితాన్ని విజయ పథంలో తీసుకెళ్లి ఎంతో మందికి ఆదర్శప్రాయమైన వ్యక్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 'ఎన్ఆర్ నారాయణ మూర్తి' (NR Narayana Murthy). చదువుకునే రోజుల్లోనే అనేక ఉద్యోగ ఆఫర్లను వదులుకుని సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాడు. నిజానికి నారాయణ మూర్తి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ నుంచి మాస్టర్స్ పూర్తి చేసారు. ఆ సమయంలోనే ఆయనకు ఎయిర్ ఇండియా, టెల్కో (Telco), టిస్కో (Tisco) వంటి పెద్ద పెద్ద సంస్థల నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయి. కానీ వచ్చిన అన్ని ఉద్యోగాలను వదిలేసి.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) అహ్మదాబాద్‌లో చీఫ్ సిస్టమ్ ప్రోగ్రామర్‌గా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. (ఇదీ చదవండి: ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఒక బోగీ నిర్మాణానికి అన్ని కోట్లా?) సగం జీతానికే పని చేసారు.. వచ్చిన మంచి ఉద్యోగాలను వదిలిపెట్టి నారాయణ మూర్తి మాదిరిగా నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదు. కానీ భారతదేశంలో మొదటి సారి షేరింగ్ సిస్టం ఇన్స్టాల్ చేయాలనే ఆలోచన ఉన్న మూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 16 మంది విద్యార్థులున్న బ్యాచ్‌లో సిస్టం గురించి, తెలివైన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లభించింది. కంప్యూటర్ ఉపయోగించి చాలా ఇంటరాక్టివ్ పాఠాలను రూపొందించే అవకాశం గురించి తెలుసుకోవాలనే తపనతో సగం జీతం తీసుకున్న ఏకైక వ్యక్తి నేనే అని నారాయణ మూర్తి ఒక సందర్భంలో అన్నారు. అప్పట్లో తాను తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని కూడా వెల్లడించారు. (ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!) 1981లో నారాయణ మూర్తి ఆరుగురు సాఫ్ట్వేర్ నిపుణులతో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. అప్పట్లో ఈ కంపెనీ స్థాపించడానికి పెట్టిన పెట్టుబడి కేవలం రూ. 10,000 మాత్రమే. ఈ రోజు కంపెనీ విలువ ఏకంగా రూ. 5,25,000 కోట్లు . నారాయణ మూర్తి నికర ఆస్తుల విలువ సుమారు రూ. 33,800 కోట్లు అని తెలుస్తోంది. వచ్చిన ఉద్యోగంతో సరిపెట్టుకుని ఉండి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద సామ్రాజ్యం స్థాపించి ఉండేవాడు కాదు. కావున అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నెన్నో సాహసాలు చేయాల్సి ఉంటుందని నారాయణ మూర్తి జీవితమనే మనకు చెబుతుంది. -
గంగ.. మన్యంలో మెరవంగ
ఆ అమ్మాయికి ‘జీవనది’ గంగమ్మ పేరు పెట్టారా తల్లిదండ్రులు. పేరుకు తగ్గట్లే.. కష్టాలు కూడా.. ఆ చిన్నారిని వెంటాడాయి. మన్యంలో పుట్టినా.. చదువంటే ప్రాణంగా భావించింది. కష్టాలు రోజురోజుకీ పెరిగాయి. తండ్రి మరణంతో చదువును వదిలేయాలనుకుంది. కూతురి ఆశయాన్ని బతికించేందుకు తల్లి ముందుకొచ్చింది. కూలీ పని చేసుకుంటూ గంగను బడికి పంపింది. గంగ ప్రస్థానాన్ని తెలుసుకున్న ‘నన్హీకలీ’ అనే స్వచ్ఛంద సంస్థ వెన్నుతట్టింది. అంతే చదువులో గంగా ప్రవాహం పరుగులెత్తింది. పీఈటీగా ఉద్యోగం సాధించింది. మన్యంలోనే సేవలందిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ మారుమూల మండలమైన హుకుంపేట మండలం తాడిపుట్టులో బొజ్జయ్య, భీమలమ్మ దంపతులకు పుట్టింది గంగమ్మ. పేదరికం ఆ కుటుంబంపై పగబట్టింది. అభివృద్ధికి దూరంగా విసిరేసినట్లుండే ఆ గ్రామంలో పుట్టి పెరిగిన గంగమ్మకు చదువుకోవాలనే ఆకాంక్ష కలిగింది. తల్లిదండ్రులు ప్రభుత్వ బడికి పంపించారు. గ్రామంలోని పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన గంగకు.. పాఠాల్లో నేర్చుకున్న జీవిత గాధలు విని.. భవిష్యత్తు గురించి ఆలోచించే భావనలు మొదలయ్యాయి. పెద్ద చదువులు చదువుతానని.. ప్రభుత్వ కొలువు సాధిస్తానంటూ తల్లిదండ్రులతో చెప్పేది. కానీ.. ఆరో తరగతి చదవాలంటే.. ఆమడ దూరం వెళ్లాల్సిందే. ఇంట్లో వద్దని చెప్పినా.. గంగ పట్టుబట్టడంతో హుకుంపేటలోని హైస్కూల్లో చేర్పించారు. రెండు గంటల పాటు నడిచి వెళ్తేనే హైస్కూల్‌కి చేరుకోగలరు. అయినా పట్టు విడవక రోజూ నడిచి వెళ్లి క్లాస్ ఫస్ట్ వచ్చేది. తండ్రి మరణంతో.... గంగమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి బొజ్జయ్య మరణించాడు. దీంతో కుటుంబ పోషణ భారమైపోయింది. ఆశలు, లక్ష్యాలు పక్కనపెట్టి.. కుటుంబ పెద్ద భారం మోయాలని నిర్ణయించుకుంది. తల్లి మాత్రం ..తాను కష్టపడతాను.. చదువుకో అని చెప్పడంతో.. నెల రోజుల విరామం తర్వాత.. పాఠశాల మెట్లు ఎక్కింది గంగ. రోజు కూలీగా చేరిన తల్లి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. నన్హీకలీ ఫౌండేషన్ చేయూతతో... అదే సమయంలో మన్యంలో పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఆ ప్రాంతానికి వచ్చిన నన్హీకలీ ఫౌండేషన్ ప్రతినిధులు.. చదువులోనూ, ఆటపాటల్లోనూ గంగమ్మ చురుకుదనం చూసి ముగ్ధులయ్యారు. ఆమె కుటుంబ పరిస్థితులు చూసి చలించిపోయారు. వెంటనే గంగమ్మ విద్యా బాధ్యతను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రి అందించి ప్రోత్సహించారు. పదోతరగతి ఏ గ్రేడ్‌లో పాసయిన గంగమ్మకు.. ఆత్మ విశ్వాసం రెట్టింపైంది. నన్హీకలీ కమ్యూనిటీ అసోసియేట్ ట్యూటర్ల సహాయంతో ఇంటర్మీడియట్‌ను ఏపీ గిరిజన సంక్షేమ ప్రాంతీయ జూనియర్ కాలేజీలో చేరి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైంది. తాడిపుట్టు గ్రామంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తిగా గంగమ్మ చరిత్రకెక్కింది. డిగ్రీ వద్దనుకొని.... ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత తొలుత డిగ్రీ పూర్తి చెయ్యాలని నిర్ణయించుకుంది గంగమ్మ. అయితే.. డిగ్రీ పూర్తి చేసేందుకు మూడేళ్ల సమయం పడుతుందనీ.. ఆ తర్వాత ఉద్యోగం కోసం మరికొన్ని సంవత్సరాలు శ్రమించాల్సి వస్తుందని భావించింది. డిగ్రీ విద్యని మొదటి సంవత్సరంలోనే స్వస్తి చెప్పింది. హైదరాబాద్‌లోని దోమల్‌గూడలోని గవర్న్మెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో చేరి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ పొందింది. తన జీవితంలో ఎదురైన ప్రతికూలతలను అనుకూలతలుగా మలచుకుని..పీఈటీగా ఉద్యోగం సాధించింది గంగమ్మ. అరకులోని పెదగరువు పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వర్తిస్తోంది. జీవితంలో ఎదురైన ప్రతి పాఠాన్నీ నేర్చుకొని.. లక్ష్యం వైపు దూసుకుపోయిన గంగను గ్రామస్తులు అభినందనల్లో ముంచెత్తారు. అమ్మ మాటలే స్ఫూర్తి... పదమూడేళ్ల వయసులో నాన్న చనిపోయినప్పుడు.. చదువు మానేసి అమ్మతో పాటు పనిలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అయితే అమ్మ దీనికి ఇష్టపడలేదు. చదువుతోనే ఏదైనా సాధ్యమవుతుందనీ, ఊరికి మంచి పేరు తీసుకురావాలని అమ్మ చెప్పింది. అప్పుడే మన కష్టాలన్నీ తీరిపోతాయని అమ్మ చెప్పింది. అప్పటి నుంచి వెనుదిరగలేదు. కష్టపడి చదువుతున్న సమయంలో నన్హీకలీ ఫౌండేషన్ నన్ను అక్కున చేర్చుకుంది. వారి ప్రోత్సాహంతోనే ఇంత వరకు రాగలిగాను. ఏ కష్టం వచ్చినా నన్ను ఆదుకున్నారు. – గంగమ్మ, పీఈటీ, పెదగరువు పాఠశాల -
టెన్త్ ఫెయిలైనా... డాక్టర్‌నయ్యా!: ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాలలో ఆయనో ప్రముఖ వైద్యుడు. కంటి డాక్టర్‌గా మారుమూల గ్రామాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించారు. వైద్య శిబిరంలో మందులు ఇచ్చి పంపించడమే గాక.. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసిన సేవా గుణం ఆయనది. 2014లో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. వెనుదిరిగి చూడలేదు. వైద్యుడిగా సేవలు అందిస్తూనే... ప్రజల్లో గుర్తింపు పొందారు. 6వేల ఓట్లతో ఓడిపోయిన చోటే 60వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనే జగిత్యాల ఎమ్మెల్యే ముకునూరు సంజయ్‌కుమార్. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రోత్సాహం, తాత చొక్కారావు ఆదర్శాలు తనను రాజకీయంగా నిలబెట్టాయని చెబుతున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో ‘సాక్షి’ పర్సనల్ టైం ఇది. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయం అంటే ఇష్టం జగిత్యాల మండలం అంతర్గాం సొంతూరు. నాన్న హన్మంతరావు, అమ్మ వత్సల. నాన్న వ్యవసాయం పైనే ఆధారపడ్డారు. కుటుంబంలోని ఇతరులు రాజకీయంగా ఉన్నతస్థాయిలో ఉన్నా, నాన్న మాత్రం వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. 90 ఎకరాల భూమిని కౌలుకు ఇవ్వకుండా సాగు చేసేవారు. నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టమే. చిన్నప్పుడు, డాక్టర్ వృత్తిలోకి రాకముందు నాన్నకు వ్యవసాయంలో సాయపడేవాడిని. పట్టుబట్టి చదివా! నాకు చదువు అంటే ఇష్టమే. అయినా 1977లో పదో తరగతిలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యా. అప్పట్లో 10వ తరగతి పాస్ పర్సంటేజీ 10 శాతం ఉండేది. అయినప్పటికీ పట్టుబట్టి సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అయి, ఇంటర్లో బైపీసీలో జాయిన్ అయ్యా. ఇంటర్మీడియట్లో 80 శాతం మార్కులతో పాస్ అయ్యా. ఇంటర్ పూర్తి కాగానే మా నాన్న హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీలో చేర్చారు. 1980–81లో ఏడాది మాత్రమే డిగ్రీ చేశా. అప్పుడే విజయవాడలో ప్రైవేటు రంగంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల వచ్చింది. నాకున్న మార్కులతో నేరుగా ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందాను. నాకు లా చేయాలని ఉన్నా, మా నాన్న కోరిక మేరకే ఎంబీబీఎస్ చదివి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పేరున్న నేత్ర వైద్య నిపుణుడిగా కొనసాగాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవి ఫెయిలైన విద్యార్థుల మానసిక స్థితిని చూస్తే బాధేస్తుంది. ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. అది గెలుపునకు మరో మెట్టుగా మార్చుకోవాలి. టెన్త్‌లో ఫెయిల్ అయినా బాధ పడలేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఓడిపోయినా నేను బాధ పడలేదు. రెండోసారి విజయం సాధించానుగా. ఎదుగుదలలో సహధర్మచారిణి రాధిక 1989లో వివాహం జరిగింది. బంధువుల అమ్మాయి అయిన రాధికను పెళ్లి చేసుకున్నాను. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మా ఆవిడ రాధిక సైతం రాజకీయ కుటుంబం నుంచే వచ్చింది. రాధిక తండ్రి కమలాకర్‌రావు బోయినిపల్లి సర్పంచ్‌గా సేవలు అందించారు. రాధిక అమ్మ వాళ్ల నాన్న దివంగత మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్ధండుడు. అయినా రాధిక నా భార్యగా నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. గృహిణిగా సేవలందించింది. నా వృత్తి విజయంలో, రాజకీయంగా ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ఆమె ప్రధానం. సేవ చేసేందుకే వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి.. నాకు చిన్నప్పటి నుంచే సామాజిక సేవలో పాల్గొనడం ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన. డాక్టర్‌గా ఉంటూనే ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టడం, గ్రామాల్లో వైద్య సేవలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేసేవాడిని. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు అందించాను. వేలాది మెడికల్ క్యాంపులు పెట్టడమే కాక, 10వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగాను. ఎమ్మెల్యేగా పూర్తి సమయం ప్రజాసేవకే నాకు ఒక్కతే కూతురు హార్తిక, అల్లుడు రాజీవ్. హైదరాబాద్‌లో బిజినెస్ చేస్తుంటారు. నేను, నా భార్య ఇక్కడ ఉంటాం. వాళ్లు తరచూ వస్తూ వెళ్తుంటారు. ఎన్నికల సమయంలో నాకే సమయం కేటాయించారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రజా జీవితంలో మమేకం కావలసిందే. గ్రామాల్లో పేరుకుపోయిన అనేక సమస్యలు, ప్రజల బాధలను తెలుసుకుంటున్నా. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నా. జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. మా కుటుంబానిది రాజకీయ నేపథ్యమే మా సొంత చిన్నాన్న శ్రీరంగారావు కరీంనగర్ ఎంపీగా సేవలందించారు. నా భార్య తాత చొక్కారావు రాజకీయ దిగ్గజం. కరీంనగర్ చరిత్రలో వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి వంటి నేతనే ఓడించిన రాజకీయ దిగ్గజం ఆయన. నా జీన్స్‌లోనే రాజకీయ నేపథ్యం ఉంది. అదే నా రాజకీయ ప్రవేశానికి ప్రధాన కారణమై ఉంటుంది. గతంలో టికెట్ ఆఫర్ వచ్చినా... పోటీ చేయలేదు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, ప్రజారాజ్యం తరఫున జగిత్యాల నుం చి పోటీచేసే అవకాశం వచ్చింది. ప్రత్యేక కారణమేమీ లేకపోయినా... ఎందుకో పోటీ చేయలేదు. తెలంగాణ వచ్చాక ముఖ్య మంత్రి కేసీఆర్, ఎంపీ కవిత సహకారంతో టీఆర్ఎస్లో చేరాను. తొలిసారి 2014లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాను. రెండోసారి మొన్నటి ఎన్నికల్లో ప్రజా ఆశీస్సులు, కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో ఏకంగా 60వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. డాక్టర్‌గా, ఎమ్మెల్యేగా ప్రజాసేవలో సంతృప్తి పొందుతున్నా! డాక్టర్‌గా ఉన్నప్పుడు వైద్య పరంగా ప్రజలకు సేవ చేసేవాడిని. ఫ్రీ క్యాంపులు ఏర్పాటు చేసి, ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసేవాడిని. ఎందరికో కంటి వెలుగునయ్యా. కానీ పూర్తిస్థాయిలో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పటికీ సంతృప్తిగా ఉంది. జగిత్యాల ఎమ్మెల్యేగా ఏం చేయాలనుకుంటున్నారు? జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి చెరువులో నీరు నింపే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నీరందేలా చూ స్తున్నాం. ముఖ్యంగా జగిత్యాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందింది. పట్టణ ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉం ది. ముఖ్యంగా యావర్‌రోడ్డును వెడల్పు చేసేలా చర్యలు తీసుకుంటా. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి నన్ను అత్యధిక మెజారిటితో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను. -
మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్.. ‘మోడల్’ సారయ్యారు..!
హుజూరాబాద్: పదో తరగతిలో మంచి మార్కులు వచ్చినా స్నేహితుల ప్రభావమో.. లేక అక్కడి పరిస్థితుల వల్లనో ఇంటర్మీడియెట్‌లో ఫెయిలయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు సబ్జెక్టులు తప్పడంతో నిరాశ చెందాడు. ఇక చదువు అబ్బదు.. ఊరిలో వ్యవసాయం చేసుకుందామని ఇంటికి పయనమయ్యే సమయంలో తల్లిదండ్రులు వెన్నుతట్టారు. జీవితంలో ఒడిదొడుకులు సహజం.. నిర్భయంగా మరోసారి పరీక్షలు రాయి తప్పక విజయం సాధిస్తావు అని ప్రోత్సహించడంతో క్రమశిక్షణ, పట్టుదలతో మరోసారి ప్రయత్నించాడు. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూక్తిని మదిలో నింపుకొని 86శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి సత్తాచాటాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరగలేదు. 2013లో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఎంపికై, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకునే స్థాయికి ఎదిగాడు. హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ అనుమాండ్ల వేణుగోపాల్‌రెడ్డి. ప్రస్తుతం వీణవంక మండలం ఘన్ముక్కుల మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వరుసగా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ రాషర్ట స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటర్ ఫైయిలైనా.. సడలని పట్టుదలతో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన వేణుగోపాల్‌రెడ్డి ‘సక్సెస్’ స్టోరీ ఆయన మాటల్లోనే.. కుటుంబ నేపథ్యం.. మా తల్లిదండ్రులు అనుమాండ్ల తిరుపతిరెడ్డి, విజయలక్ష్మి. నేనొక్కడినే కొడుకు. చెల్లెలు ఉంది. నాన్న గుడివాడలో రైల్వే డిపార్ట్మెంట్లో(1983) ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగ రీత్యా కుటుంబం అక్కడే ఉండాల్సి వచ్చింది. కోస్తా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివాను. ‘పది’లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించడంతో మా నాన్న విజయవాడలోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంటర్లో చేర్చాడు. కళాశాలలో ఉన్న పరిస్థితుల ప్రభావామో లేక స్నేహితుల వల్లనో చదువు మీద కాకుండా ఇతరత్రా విషయాల వైపు దృష్టి మళ్లింది. చదువులు అటకెక్కాయి. ఇంటర్లో మూడు సబ్జెక్టులు ఫెయిలయ్యాను. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చదువుకు పుల్‌స్టాప్ పెట్టి వ్యవసాయం చేసుకొందామనుకున్నా.. కానీ మా నాన్న దిగాలుగా ఉన్న నన్ను చూసి జీవితంలో ఒడిదొడుకులు సహజం.. ప్రయత్నిస్తే పోయేదేం లేదు. మరోసారి ట్రై చెయ్యి అని వెన్నుతట్టాడు. అప్పుడు కొండంత బలం వచ్చింది. ఇంటర్ మళ్లీ పరీక్షలు రాయగా 83శాతం మార్కులు వచ్చాయి. ఇక చదువుతాననే ధైర్యం వచ్చింది. అక్కడే లయోల కళాశాలలో బీఎస్సీలో చేరాను. 91శాతం మార్కులు వచ్చాయి. ఆ తర్వాత ఎంఎస్సీ పూర్తి చేసి 2013 కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశాను. 15ఏళ్లుగా విద్యాబోధన ఇంటర్ ఫెయిలయ్యానని ఇంట్లో కూర్చుండి ఉంటే ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగేవాణ్ని కాదు. 1999 నుంచి 2013 వరకు హన్మకొండలోని న్యూసైన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా పని చేశాను. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దగలిగాను. వందల మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పీహెచ్డీ పూర్తి కాగా నే 2013లో మోడల్ స్కూల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపాల్‌గా వీణవంక మండలంలో ఎంపికయ్యాను. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు.. 2017లో తెలంగాణ రాష్ట్ర ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డుతోపాటు రూ.10,116 నగదు అందుకోవడం జీవితంలో మరిచిపోలేని సంఘటన. అవార్డు తీసుకునేటప్పుడు నా చేతులు వణికిపోయాయి. ఇంటర్లో ఫెయిలై ఇంటి వద్ద ఉంటే ఇలా ఉత్తమ అవార్డును అందుకునే వాడిని కాదు అని ఒక్కసారి నాటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. నా శ్రీమతి ఇంటర్ వరకే చదివింది. నా ప్రోద్బలంతో ఎంబీఏ, బీఎడ్, ఎల్ఎల్బీ చదివించాను. ప్రస్తుతం ఆమె వరంగల్‌లోని కోర్టులో టైపిస్టుగా విధులు నిర్వర్తిస్తోంది. మార్కులు శాశ్వతం కాదు.. ప్రతీ విద్యార్థి లక్ష్యం నిర్ధేశించుకుని లక్ష్య సా«ధనకు ఏకాగ్రతతో ముందుకెళ్లాలి. విఫలమైతే కుంగిపోవద్దు. మార్కులు శాశ్వతం కాదు.. జీవితం చాలా విలువైనది. ప్రతీ పాఠశాలలో కౌన్సెలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చర్చించాలి. విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించాలి. మా పాఠశాలలో ఏడో తరగతి నుంచే నెలకోసారి కౌన్సెలింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లలకు ఉండాలి. ఫెయిలయ్యానని మా తల్లిదండ్రులు ప్రోత్సహించకుంటే ఇప్పడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదిగేవాడిని కాదు. -
సప్లమెంటరీలో పాస్.. మూడు ఉద్యోగాలు సాధించాడు
పాలకుర్తి: కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని నిరూపించారు పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీష్. ఇంటర్మీడియట్, డిగ్రీలో ఫెయిల్ అయినా ధైర్యం కోల్పోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగారు.. ప్రభుత్వ ఉద్యోగంలోనైతే ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్ణయించుకుని కష్టపడి చదివారు.. తద్వారా ఒకటి కాదు రెండు కాదు మూడు ఉద్యోగాలకు ఎంపికైన ఆయన చివరకు ఎస్సై పోస్టును ఎంచుకుని కొనసాగుతున్నారు. మధ్య తరగతి రైతు కుటుంబం ప్రస్తుత భద్రాద్రి జిల్లా పినపాక మండలంలోని ఏడూర్ల బయ్యారం గ్రామానికి చెందిన మధ్య తరగతి రైతు కుటుంబంలో సతీష్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులైన గండ్రాతి వెంకటరమణ – సమ్మయ్యకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమారులు వ్యవసాయం చేస్తుండగా.. చిన్న కుమారుడైన సతీష్‌ను చదివించి ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక. అయితే, 10వ తరగతిలో సాధారణ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఆయన ఇంటర్లో చేరాడు. ఇంటర్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలయ్యాడు. అయినా తల్లిదండ్రులు చదువు కొనసాగించాలని ప్రోత్సహించడంతో సప్లమెంటరీ పరీక్షలు రాసి పాసయ్యాక డిగ్రీలో చేరాడు. అయితే, డిగ్రీలో కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలయ్యాడు. చివరకు మూడో సంవత్సరంలో అన్ని పరీక్షలు రాసి సాధారణ మార్కులతో గట్టెక్కాడు. ప్రభుత్వ ఉద్యోగం దొరికితే... ఒకసారి ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ కోసం సతీష్ వీఆర్వో వద్దకు వెళ్లాడు. అయితే, ఆ పని చేయకపోవడమే కాకుండా జులుం ప్రదర్శించడంతో సతీష్ ఆవేదన చెందాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తనకు ఎదురుపడిన వీఆర్వో మాదిరిగా కాకుండా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఊరికి దూరంగా హైదరాబాద్ వెళ్లాడు. ఒకసారి ఎస్ఐ ఉద్యోగానికి పరీక్ష రాస్తే అవకాశం దక్కలేదు. అయినా నిరుత్సాహానికి గురికాకుండా పోటీ పరీక్షలకు అవసరమైన సబ్జెక్టులపై పట్టు సాధించేలా చదివాడు. అలా రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంతో పాటు డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఇందులో డిప్యూటీ జైలర్ ఉద్యోగాన్ని ఎంచుకోగా ఖమ్మంలో పోస్టింగ్ లభించింది. అయితే, ఆరు నెలల పాటు ఉద్యోగం చేశాక ప్రజలకు సేవల చేయాలంటే ఇది సరైన ఉద్యోగం కాదనుకున్న సతీష్ మళ్లీ ఎస్సై రాతపరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆయన పాలకుర్తి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, లక్ష్యాన్ని ఎంచుకోవడమే కీలకం ఇంటర్లో ఫెయిలైనప్పుడు నన్ను తల్లిదండ్రులు తిడతారనుకున్నాను. కానీ ధైర్యం చెప్పి చదువు కొనసాగించేలా ప్రోత్సహించారు. ఉద్యోగం సంపాదించాలనే తల్లిదండ్రుల కోరికతో పాటు నా లక్ష్యం సాధించాను. చదువుపై ఆసక్తిని పెంచుకుని ఆత్మవిశ్వాసంతో చదివితే ఉన్నత ఉద్యోగాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే సమయంలో లక్ష్యాన్ని ఎంచుకోవడం, దాని చేరుకునేందుకు కష్టపడడం కూడా ముఖ్యమే. – గండ్రాతి సతీష్, ఎస్ఐ, పాలకుర్తి -
‘పది’, ఇంటర్ ఫెయిల్.. రూ.3 లక్షల జీతం
పెద్దపల్లి: అతడు ఓ సామాన్య కుటుంబంలో పుట్టాడు.. అందరిలాగే సర్కార్ బడిలో చదువు కొనసాగించాడు. ఇంగ్లిష్, మ్యాథ్స్ సరిగా రాక ‘పది’, ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు. పదే పదే అవే సబ్జెక్టులు తప్పాడు.. ఫెయిల్ అయ్యానని ఏనాడూ కుంగిపోలేదు. జీవితంలో ఎదగాలనే లక్ష్యాన్నీ మరువలేదు. తనకు నచ్చని సబ్జెక్టులోనే పట్టు సాధించాలనుకున్నాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ ట్యూషన్‌కు వెళ్లాడు.. ఫెయిలైన సబ్జెక్టులనే తనకు ఇష్టమైనవిగా మార్చుకుని సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా నెలకు రూ.3 లక్షల వేతనంతో పనిచేస్తూ జీవితంలో డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం లొంకకేసారం గ్రామానికి చెందిన రొడ్డ వైకుంఠం. నిన్నటితరం యువకులతోపాటు రేపటితరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన వైకుంఠం సక్సెస్‌పై ఆయన మాటల్లో.. ‘మాది కమాన్‌పూర్ మండలం లొంకకేసారం. అమ్మ మార్తమ్మ, నాన్న పేరు నారాయణ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేనే ఇంట్లో చిన్నవాడిని నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పెంచాడు. పెద్దన్న భద్రయ్య సింగరేణి ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నన్న హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. నేను 5వ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్నా. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు కమాన్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న. 1986 వార్షిక పరీక్షల్లో మ్యాథ్స్‌లో ఫెయిల్ అయ్యాను. తర్వాత రెండుసార్లు సప్లిమెంటరీ రాసి టెన్త్ పాస్ అయ్యాను. ఫెయిలైన తర్వాత పెద్దన్న కొన్న ఆటో నడిపించాను. నాకు జీవితంలో బాగా ఎదగాలని, ఉన్నత స్థానంలో ఉండాలనే ఆకాంక్ష ఉండేది. అందుకే ఫెయిల్ అయినా చదువు ఆపాలనుకోలేదు. ఆటో నడుపుతూనే గోదావరిఖని జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాను. 1989 పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాను. నా లక్ష్యం అన్నయ్యలకు చెప్పడంతో ఆటో నడపడం మానేసి చదువుకోమని సూచించారు. చదువుకుంటేనే బాగుపడుతావని వారు ప్రోత్సహించారు. అయినా.. ఆటో నడుపుతూ నేను వీక్‌గా ఉన్న సబ్జెక్టులు ఇంగ్లిష్, మ్యాథ్స్ ట్యూషన్‌కు వెళ్లాను. అలా రెండు సబ్జెక్టుల్లో పట్టుసాధించి ఇంటర్ పాస్ అయ్యాను. 1989లో ఎంసెట్ కోచింగ్ తీసుకుని ర్యాంక్ సాధించాను. 1990లో వరంగల్ కిట్స్ కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరాను. ఇంగ్లిష్ మాట్లాడడానికి ఇబ్బంది.. ఇంజినీరింగ్‌లో చేరినా.. ఇంగ్లిష్ సబ్జెక్టులో ట్యూషన్‌కు వెళ్లినా మాట్లాడడం మాత్రం రాలేదు. కాలేజీలో ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే ఇబ్బంది పడేవాడిని. ఎలాగైనా తోటి విద్యార్థుల్లా నేనూ ఇంగ్లిష్ మాట్లాడాలని పట్టుసాధించేందుకు స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ తీసుకున్న. అందరితో మాట్లాడడం ప్రారంభించి సక్సెస్ అయ్యాను. 1994లో బీటెక్ పూర్తిచేశాను. అప్పటికే రాదనుకున్న ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడడం వచ్చింది. ఇంజినీరింగ్ అయిన ఏడాదికే ఉద్యోగం.. కిట్స్ కాలేజీ రాష్ట్రంలోని టాప్ కాలేజీల్లో ఒకటి. దీంతో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఏడాదికే 1995లో మలేషియా కంపెనీ నుంచి ఇంటర్వ్యూకు లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూ సక్సెస్ కావడంతో ఉద్యోగం వచ్చింది. అందులో పనిచేస్తూనే 2008లో ఎరెన్కో గ్రూప్ తలపెట్టిన ఇంటర్వ్యూకు వెళ్లి సెలక్ట్ కావడంతో దుబాయికి వెళ్లాను. దుబాయిలోనూ యూనియన్ రేబర్ కంపెనీ ఇచ్చిన ఆఫర్‌తో అందులో చేరి ప్రస్తుతం క్వాలిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నా. నా జీవితంలో ఎన్నోసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా. జీవితంపై విరక్తి చెందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొద్దిగా శ్రమిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే అన్నయ్యల మాటలతో స్ఫూర్తి పొంది నేడు ఈ స్థాయికి చేరుకున్నా. టెన్త్ ఫెయిల్ అయినప్పుడే చదువుపై ఆసక్తి చంపుకుంటే ఇంటర్లో చేరేవాణ్ని కాదు.. ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు ఆటోడ్రైవర్‌గా స్థిరపడితే ఇంజినీరింగ్ చేసేవాన్ని కాదు. అబుదాబి అవకాశం దక్కేది కాదు.. వీటన్నింటికి సమాధానం పట్టుదల.. ఓడినా కుంగిపోకుండా కష్టపడడం. -
ఫెయిల్ అయినా.. టాపర్ నేనే
భూపాలపల్లి అర్బన్: ఓటమి తర్వాత వచ్చే విజయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. జీవితంలో ఫెయిల్ అయ్యామని మనోవేదనకు గురైతే మనలో ఉన్న టాలెంట్ మరుగునపడిపోతుంది. నిరుత్సాహానికి లోనుకాకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే కొండలనైనా పిండి చేయవచ్చు. లక్ష్యాన్ని ఎంచుకు ని ముందుకు పయనించాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఓటమి చిన్నబోయి గెలుపు భుజం తట్టుతుందని జయశంకర్ భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారి విద్యార్థులకు సూచించారు. తాను పదో తరగతిలో ఫెయిల్ అయ్యాయని.. కృంగిపోకుం డా మనోనిబ్బరంతో ముందుకు సాగి ఉద్యోగం సాధించానని ‘సాక్షి’కి తెలిపారు. వివరాలు ఆయన మాటల్లో.. మాది నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం కేంద్రం మాది. స్వగ్రామంలోనే పదో తరగతి వరకు చదువున్నాను. 10వ తరగతి వార్షిక పరీక్షలో గణితం సబ్జెక్టులో 28 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాను. ప్రశ్నపత్రం చాలా హార్డ్‌గా వచ్చింది. కానీ 1వ తరగతి నుంచి 10 తరగతి వరకు క్లాస్‌లో ఫస్ట్ ర్యాంకు నాదే. ఇంకో విషయమేమిటంటే పదో తరగతి వార్షిక పరీక్షలో సైతం ఫెయిల్ అయినా పాఠశాలలో మొదటి ర్యాంకు సాధించాను. నేను ఫెయిల్ అయిన విషయం మా నాన్నకు చెబితే నమ్మలేదు. ఆ తర్వాత గట్టిగా చెప్పడంతో అప్పుడు నమ్మి ఏమన లేదు. ప్రశ్నపత్రంలో కొన్ని ప్రశ్నలు తప్పులుగా రావడం అప్పటి విద్యాశాఖ ప్రతి విద్యార్థికి గణితంలో పది మార్కులు కలపడంతో ఉత్తీర్ణత సాధించాను. ట్యూషన్లు చెప్పా.. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని లక్ష్యంతో చదివాను. గణితం అంటే భయం ఉండేది. అందుకే పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. అయినా మనోవేదనకు గురికాలేదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో చదువుకున్నాను. ఇంటర్లో బైపీసీలో చేరి 57 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించాను. డిగ్రీలో బీజెడ్సీ గ్రూప్‌లో చేరాలనుకున్నాను. నాన్న వడ్రంగి పని చేసేవారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో చదువు మానేసి తనతో పాటు పనికి రమ్మన్నారు. ఆయన మాట వినలేదు. నల్లగొండలో పొద్దంతా ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అక్కడే సాంయంత్రం నడిచే కళాశాలలో బీఏలో ప్రవేశం పొందాను. ఇలా మూడు సంవత్సరాల పాటు నెలకు రూ. 250 వేతనంతో పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేయడంతో ఖాళీ సమయాల్లో ట్యూషన్ చెబుతూ డిగ్రీ పూర్తి చేశాను. ఉత్తమ మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాను. అనంతరం సివిల్స్ గ్రూప్–1 సర్వీసెస్ పరీక్ష రాసినప్పటికీ ఉద్యోగం రాలేదు. గ్రూప్–2 పరీక్ష రాసి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాను. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి ఆలిండియా 14వ ర్యాంక్ సాధించాను. ప్రేరణ కలిగించిన బోర్డు నల్లగొండలో డిగ్రీ కళాశాలకు వెళ్లే దారిలో ఆర్డీఓ కార్యాలయానికి(రాజస్య మండల అధికారి) కార్యాలయం అని బోర్డు ఉండేది. ఆ బోర్డు చూసిన ప్రతి సారి రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాలనే తపన నాలో పెరిగింది. ఇంటర్ తర్వాత గ్రూప్ మారడం ద్వారా డాక్టర్ కాలేకపోయాను. ఎలాగైనా గ్రూప్–1 ఆఫీసర్‌గా అర్హత సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్లాను. సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. జీవితంలో ఓటమి తర్వాత గెలుపుతో వచ్చే కిక్కు వేరు. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఎవరైనా విద్యార్థులు ఫెయిల్ అయిన, మార్కులు తక్కువ వచ్చిన ఏ మాత్రం దిగాలు చెందకుండా కంటి ముందు ఉన్న లక్ష్యాన్ని ఎలా అధిగమించాలో ప్రణాళికలు తయారు చేసుకోవాలి. మా నాన్న నాకు పదో తరగతిలో మార్కులు తక్కువ వచ్చినప్పటికీ ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా అన్నింట్లో ప్రోత్సహించారు. నేను కూడా నా పిల్లల్ని అదే విధంగా ప్రోత్సహిస్తున్నాను. మార్కులనేవి శాశ్వతం కాదు. కుటుంబ సభ్యుల సహకారంతో.. వివాహమైన తర్వాతే నాకు ఉద్యోగం వచ్చింది. అమ్మనాన్నలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ నన్ను చదువులో ప్రోత్సహించే వారు. పెళ్లైన తర్వాత భార్య కూడా అదే విధంగా సహకరించేది. ఉద్యోగం సాధించాలని తపన నాకు ఉన్నప్పటికీ వారి సహకారం, ప్రోత్సాహం లేకపోతే ఉద్యోగం సాధించలేకపోయేవాడిని కావచ్చు. మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దు. విద్యార్థులను మానసికంగా వేధింపులకు గురి చేయడం వల్ల వారు ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రానా జీవితం ముగిసిందనుకోవడం పొరపాటు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే అన్ని విజయాలే అవుతాయి. -
రావూరి.. పాటలు తేనెలూరి
శ్రీనివాసుడి చెంత బుల్లెమ్మ స్వర ధార ఆమె గానం ‘శ్రీవారి’కి స్వరనీరాజనం స్వరం.. మృదు మాధుర్యం తెనాలి: తిరుమల ఏడుకొండలవాడిని దర్శించుకొనే లక్షలాది భక్తులు లిప్తపాటు కలిగే దర్శన భాగ్యానికి భక్తి పారవశ్యంతో పొంగిపోతారు. మరికొన్ని క్షణాలు అక్కడే ఉండాలని ఆరాటపడతారు. అలాంటి అదృష్టమే కాదు.. శాశ్వతంగా స్వామికి సేవ చేసుకునే భాగ్యం ఓ సాధారణ గాయనికి దక్కింది. పెళ్లి ఊరేగింపులు, వేడుకల్లో సంగీత బృందాల్లో పాటలు పాడిన యువతి ఇప్పుడు తిరుమల వాసుని పాదాల చెంతకు చేరిన తీరు ఆద్యంతం హృద్యం. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన గాయనిగా ఎదిగి.. ఒదిగిన గాయని రావూరి బుల్లెమ్మ విజయప్రస్థానం ఆమె మాటల్లోనే... నా పేరు రావూరి బుల్లెమ్మ. తెనాలి సమీపంలోని కొలకలూరు. తండ్రి రావూరి ముసలయ్య మాజీ సైనికుడు. తల్లి సామ్రాజ్యం. మేం తొమ్మిది మంది సంతానం. ఆడపిల్లల్లో నేనే చివరిదాన్ని. నాన్న పౌరాణిక నాటకాల్లో నటించేవారు. ఆయన వారసత్వమేమో తెలియదు కానీ.. మా అందరికీ ఏదొక కళలో ప్రవేశం ఉండేది. నాకు పాటలు పాడటమంటే పిచ్చి. ఇంటర్మీడియట్లో రోజూ తెనాలి వెళ్లి సంగీతం నేర్చుకునేదాన్ని. గాయని మాధవపెద్ది మీనాక్షి తొలి గురువు. చదువు ఇంటర్మీఇయట్తోనే ఆపేయాల్సి వచ్చినా సంగీతంతో మాత్రం నా అనుబంధాన్ని కొనసాగించాను. నాలాగే పాటలు పాడే సోదరుడు బుజ్జి ఓ పాటల పోటీకి నన్ను వెంటబెట్టుకు వెళ్లాడు. మ్యూజికల్ పార్టీ నిర్వాహకులు నా పాట విని తమ ట్రూపులోకి ఆహ్వానించారు. మాధుర్యంతో మెప్పు.. జీవనానికీ తోడ్పడుతుందనే భావనతో గుంటూరులో సంగీత కళాశాలలో సర్టిఫికెట్ కోర్సు చేశా. గాన కళాకారిణి సుమశ్రీగా సంగీత ప్రపంచానికి మరింత చేరువయ్యా. గొంతులోని మాధుర్యం.. ఎంతటి కఠినమైన పాటనైనా భావం చెడకుండా చూసేది. పాడిన పాట అచ్చు సినిమాలో గాయకులు పాడిన విధంగానే ఉండేది. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, చిత్ర, ఆనంద్ సంగీత కచేరీల్లో పాడటం మరచిపోలేని అనుభవం. హిందోళం.. మాల్కోస్ రాగమని చెప్పా.. పాటతో అల్లుకున్న జీవితం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పత్రిక ప్రకటనతో అద్భుతమైన మలుపు తీసుకుంది. అన్నమయ్య ప్రాజెక్టులో టీటీడీ ఆస్థాన గాయని పోస్టుకు దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూలో ‘కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు’ పాడి వినిపించా..‘కర్ణాటక సంగీతంలో ఏ రాగం?’ అన్న ప్రశ్నకు, ‘హిందోళం’ అనీ హిందూస్థానీలో ‘మాల్కోస్ రాగం’ అంటారని చెప్పా. నెలరోజుల తర్వాత వచ్చిన అపాయింట్మెంట్ లెటరు వచ్చింది. 2001 జూన్ 14 నుంచి ఇక స్వామి సేవకు అంకితమయ్యాను. టీటీడీ ఆస్థాన వయొలిన్ కళాకారుడు కె.శంకర్‌తో నా భావాలు కలిసి వివాహానికి దారి తీసింది. ఇద్దరమూ శ్రీవారి సేవలో గడుపుతున్నాం. మాకో కుమారుడు హరిచరణ్. దేశవిదేశాల్లో కచేరీలు.. టీటీడీ అన్నామాచార్య ప్రాజెక్టులో అన్నమాచార్యుడి సంకీర్తనలు గానం చేయటం నా ఉద్యోగం. ‘శ్రీవారి ఊంజల సేవ (సహస్ర దీపాలంకరణసేవ)లో గానం చేస్తుంటాం.. ‘ఉయ్యాలా.. బాలు నూచెదరూ’, ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’ వంటి లాలి పాటలు పాడతాం. అలివేలు మంగాపురంలో అమ్మవారి ఊంజలసేవలోనూ పాల్గొంటాం. గోవిందరాజుల ఆలయం, కాణిపాకం వినాయకుడు, బైరాగిపట్టెడలో ఆంజనేయస్వామి ఆలయం, కపిలతీర్థంలో గానం చేస్తుంటాం. ఒడిశా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, దక్షిణాఫ్రికాలోని కెన్యాలో జరిగిన స్వామివారి కల్యాణోత్సవాలకూ టీటీడీ నన్ను పంపింది. 500 కీర్తనలు పాడగలను.. డజను అన్నమాచార్య పాటలతో ఉద్యోగంలో చేరిన నేను ఇప్పుడు తేలిగ్గా 500 కీర్తనలు గానం చేయగలుగుతున్నా. ప్రముఖ విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌తో కలిసి ‘అన్నమయ్య సంకీర్తన కుసుమాంజలి’ ఆడియో క్యాసెట్ తీసుకొచ్చా. సొంతంగా ‘అన్నమయ్య సంకీర్తన మహాహారం’ వెలువరించా. టీటీడీ చేసిన ‘అలిమేల్మంగ నామావళి’లో 108 నామాలు నేను పాడాను. నా గానంతో ‘అన్నమయ్య సంకీర్తన శిఖామణి’, ‘అన్నమయ్య సంకీర్తన వైభోగం’, ‘వెంగమాంబ కీర్తనలు’ ఆడియో క్యాసెట్లు వచ్చాయి. టీటీడీ గతేడాది ఆగస్టులో ‘ఉత్తమ గాయని’గా నన్ను గౌరవించింది. ఇటీవల కరీంనగర్లో సామవేదం షణ్ముఖశర్మ చేతుల మీదుగా ‘సంకీర్తన సుమశ్రీ’ బిరుదు పొందా. -
జీవిత ధీమా!
జీవితంలో సక్సెస్ అంటే ఏమిటి? ఇంగ్లిష్ మీడియంలతో గట్టెక్కడమా? ఇంజనీరింగ్ పట్టాలతో ఒడ్డెక్కడమా? సెక్యూర్ జాబ్‌ని దక్కించుకోవడమా? కానీ సక్సెస్ అంటే ఇవి మాత్రమే కాదంటున్నారు వెంకటేశ్వరరావు. పుట్టిపెరిగింది పల్లెటూరైనా... చదువులు చెట్టెక్కిపోయినా... తాను ఉట్టికెగరలేనేమోనని నిరాశపడని నిత్య ఆశావాదంతో ఏకంగా భూతల స్వర్గం అనుకునే అమెరికాకు ఎగిరారు. అక్కడి క్లయింట్లను కూడా అవలీలగా ఆకట్టుకున్నారు. లక్ష క్లయింట్లను లక్ష్యంగా పెట్టుకున్న ఈయన కోట్ల కమీషన్‌తో ఫోర్బ్స్ మ్యాగజీన్లో స్థానం పొందారు. కోటీశ్వరుల సరసన తానూ ధీమాగా నిలబడ్డారు. ఆ పాలసీ బీముడి వాస్తవ కథ... ఆ జీవితభీముడి విజయగాథ... నేటి ప్రజాంశంలో... రెండు వేల మంది క్లయింట్స్... 40 దేశాల్లో కార్యకలాపాలు... ఏటా కోట్లరూపాయల ఆదాయం... రాష్ట్ర రాజధానిలోని నాలుగు ప్రాంతాల్లో ఇళ్లు... 1.89 కోట్లు ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్... ఇవన్నీ ఉన్నాయంటే అతనొక బిజినెస్ టైకూనో, బడాబడా సంస్థ సీఈఓనో అనుకుంటున్నారా! కానే కాదు... ఆయన ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. యథాలాపంగా ఎల్ఐసీ ఏజెన్సీ తీసుకుని... ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. గడిచిన ఏడాది 2 కోట్ల రూపాయలకు పైగా కమీషన్ పొందారు. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫోర్బ్స్ మ్యాగజీన్లో గతనెల (నవంబర్) స్థానం సంపాదించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివసిస్తున్న ఎల్ఐసీ ఏజెంట్ వాకలపూడి వెంకటేశ్వరరావును ఈ సందర్భంగా కలిసినప్పుడు తన విజయప్రస్థానాన్ని ఇలా వివరించారు. అది ఆయన మాటల్లోనే... ఇంగ్లిష్ మీడియంలో చదవలేక... ఇంజినీరింగ్‌లో ఫెయిలై... మాది పశ్చిమ గోదావరిజిల్లా తణుకు సమీపంలోని కాల్దరి గ్రామం. ఇంటర్మీడియట్ తరవాత ఇంజనీరింగ్ కోసం 1986లో హైదరాబాద్ వచ్చాను. అప్పటివరకు తెలుగు మాధ్యమంలో కొనసాగిన చదువు ఒకేసారి ఆంగ్లమాధ్యమంలోకి మారడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. వరుసగా మూడేళ్లు ఫెయిలయ్యాను. దాంతో మా నాన్నగారు ఫీజు కోసం డబ్బు పంపడం మానేశారు. ఇంటికి వచ్చేసి, వ్యవసాయం చేయమన్నారు. అప్పుడు నా వయస్సు 19 ఏళ్లు. తిరిగి వెళ్లడం ఇష్టం లేక రూ.50 వేల రుణంతో సికింద్రాబాద్‌లో నోట్‌బుక్ తయారీ యూనిట్ ఒకటి ప్రారంభించాను. దాంట్లో నష్టాలు రావడంతో మూడేళ్ల తర్వాత ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి మారాను. 1997లో నాన్నగారు మరణించడంతో వైజాగ్ వెళ్లి పౌల్ట్రీ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి 2005 వరకు ఇదే వ్యాపారం చేస్తూ దూరవిద్య ద్వారా ఎం.ఏ. పూర్తి చేశాను. ఈ వ్యాపారం రెండుమూడేళ్లు బాగున్నా... ఆ తరవాత అందులో కూడా నష్టాలే వచ్చాయి. ఏజెంట్‌గా మారతానని ఊహించలేదు నెలకు 50 వేల రూపాయల జీతంతో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు స్నేహితులు, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కోసం ఎల్ఐసీ పాలసీ గురించి నన్ను సంప్రదించారు. వారి కోసమని, నా చేత పాలసీలు చేయించిన ఏజెంట్‌ను రమ్మన్నాను. అయితే అతను రెండు నెలలైనా రాలేదు. ఒకవైపు స్నేహితుల నుంచి తీవ్రమైన ఒత్తిడి. అప్పటి కొవ్వూరు ఎమ్మెల్యే కృష్ణబాబు గారి ప్రోద్బలంతో నేనే ఏజెంట్‌గా చేరాను. ప్రోద్బలం అనడం కన్నా... ఓ రకంగా ఒత్తిడి చేశారనవచ్చు. నిజానికి ఆయన మాట కాదనలేక ఏజెన్సీ తీసుకున్నాను. నా మిత్రులు ఆరుగురికి పాలసీ చేసిన తరవాత, నేను ఏజెంట్‌గా తగనని భావించి, కొద్దో గొప్పో తెలిసిన పౌల్ట్రీ వ్యాపారంలోకి మళ్లీ వెళ్లాను. మలుపుతిప్పిన జీవన్‌శ్రీ ఎల్ఐసిలో బాగా పాపులరైన జీవన్‌శ్రీ పాలసీ 2001లో క్లోజ్ అవుతున్న సమయంలో... మా డెవలప్మెంట్ ఆఫీసర్ రఘు పట్టుబట్టి, పాలసీలు చేయమని నన్ను ప్రోత్సహించారు. అప్పట్లో ఆ పాలసీ చేయడానికి జనం ఎగబడుతుండటంతో... ఆఖరి 15 రోజుల్లో 4.5 కోట్ల రూపాయల వ్యాపారం చేశాను. ఇది నన్ను అమెరికా బాట పట్టించింది. అక్కడి ఎండీఆర్టీఏ సభ్యుడిగా 2002లో మొదటిసారిగా అమెరికా వెళ్లాను. లాస్‌వెగాస్‌లో సెవెన్ స్టార్ హోటల్లో బస ఏర్పాటుచేశారు. (ఎండీఆర్టీఏ అంటే మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ అసోసియేషన్. ప్రపంచ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏజెంట్స్/అడ్వయిజర్స్‌ను ఆయా ఇన్సూరెన్స్ సంస్థలు ఎండీఆర్టీఏకి నామినేట్ చేస్తాయి. ఆయా రంగాలలో అభివృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణలను అది ఇస్తుంది). అప్పటివరకు ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే నా దృష్టిలో పంచెకట్టుకుని, డొక్కువాహనంపై, ఫైలు పట్టుకుని తిరుగుతూ ఉండేవారే. జీవన్‌శ్రీ పుణ్యమాని రూ.4.5 కోట్ల వ్యాపారం చేసినా, నా దృష్టి మారలేదు. అయితే లాస్‌వెగాస్ పర్యటన నా ఈ దృక్పథాన్ని మార్చేసింది. అక్కడ నుంచి తిరిగి వచ్చాక, ఎల్ఐసీ ఏజెన్సీతో పాటు పౌల్ట్రీ వ్యాపారం కూడా కొనసాగించాను. 2005లో మా అమ్మ మరణించారు. పౌల్ట్రీ వ్యాపారంలో నష్టాలు పెరిగాయి. దాంతో పూర్తిస్థాయి ఎల్ఐసీ ఏజెంట్‌గా మారాను. ఇక వెనుతిరిగి చూడలేదు. స్వచ్ఛందసంస్థ ఏర్పాటుచేసి... ఆర్థికంగా వెనుకబడి ఉన్న పల్లె ప్రజలను ఆదుకోవాలనుకున్నాను. దీనికోసం నా స్నేహితులు, క్లయింట్ల సాయంతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశాను. ఐఎస్బీలో నేర్చుకున్న విషయాలతో పాటు ప్రొఫెసర్ల సాయంతో ఆ ఐఎస్బీకే కోర్సు రూపొందించి, అక్కడ ఎన్నో అంశాలను బోధిస్తున్నాను. ఏజెంట్లకు గర్వకారణం అనేదే సంతృప్తి నన్ను, నా స్థాయిని చూసి ఎన్నో రంగాలకు చెందిన వారు ఎల్ఐసీ ఏజెంట్స్‌గా మారారు. ఇది అన్నింటికంటే తృప్తినిస్తోంది. నా దగ్గర ఒకసారి పాలసీ చేసినవాళ్లు నా కుటుంబంగా మారిపోతారు. వారివల్లే నేను ఈ స్థాయికి వచ్చాను... అంటూ సంతృప్తిగా ముగించారు వెంకట్. ఆంగ్లమాధ్యమంలో చదవలేక చదువుకే దూరమైన వ్యక్తి దాదాపు 40 దేశాలు తిరిగి, ఎల్ఐసి వంటి అతిపెద్ద సంస్థ తరపున బిజినెస్ స్కూల్‌కు కోర్సు డిజైన్ చేసే స్థాయికి ఎదిగిన వైనాన్ని విశ్లేషిస్తే... తన బలాన్ని గుర్తించిన మనిషికి అదే బలంగానూ, ఆ నిత్యవిజయ కాంక్షే అతిపెద్ద బలహీనతగా మారుతుందనే వాస్తవం మనకు అవగతమవుతుంది. - శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ విక్టోరియాస్ విన్నర్స్సీక్రెట్నే ఫాలో అయ్యాను విక్టోరియా యుద్ధవీరులు పడవలపై యుద్ధానికి వెళ్లినప్పుడు రాత్రి వేళ తీరాన్ని చేరుకుంటారు. ఆ వెంటనే వారు వచ్చిన పడవల్ని కాల్చేస్తారు. దీంతో యుద్ధరంగం నుంచి మడమతిప్పే అవకాశం ఉండదు. కేవలం డూ ఆర్ డై ఆప్షన్ మాత్రమే మిగులుతుంది. ఆ స్థితి వారిలోని పోరాట పటిమను పెంచుతుంది. దీన్నే విక్టోరియాస్ విన్నర్స్ సీక్రెట్ అంటారని అమెరికాలోని ఎండీ ఆర్టీఏ (మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ అసోసియేషన్)లో బోధించారు. ప్రతి ఏడాదీ ఇలాంటి గోల్‌నే ఏర్పాటు చేసుకుంటాను. 2020 నాటికి ప్రతి వ్యక్తికీ ఓ పాలసీ ఉండాలన్నది ఎల్ఐసీ లక్ష్యమైతే, ఈ లోపే లక్ష పాలసీలు పూర్తి చేసి మరో రికార్డ్ సృష్టించాలనేదే నా గోల్!