మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్‌.. ‘మోడల్‌’ సారయ్యారు..! | Principle Of Success Life Story Karimnagar | Sakshi
Sakshi News home page

మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్‌.. ‘మోడల్‌’ సారయ్యారు..!

Published Sat, May 11 2019 8:17 AM | Last Updated on Sat, May 11 2019 8:17 AM

Principle Of Success Life Story Karimnagar - Sakshi

డాక్టర్‌ అనుమాండ్ల వేణుగోపాల్‌రెడ్డి.

హుజూరాబాద్‌: పదో తరగతిలో మంచి మార్కులు వచ్చినా స్నేహితుల ప్రభావమో.. లేక అక్కడి పరిస్థితుల వల్లనో ఇంటర్మీడియెట్‌లో ఫెయిలయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు సబ్జెక్టులు తప్పడంతో నిరాశ చెందాడు. ఇక చదువు అబ్బదు.. ఊరిలో వ్యవసాయం చేసుకుందామని ఇంటికి పయనమయ్యే సమయంలో తల్లిదండ్రులు వెన్నుతట్టారు. జీవితంలో ఒడిదొడుకులు సహజం.. నిర్భయంగా మరోసారి పరీక్షలు రాయి తప్పక విజయం సాధిస్తావు అని ప్రోత్సహించడంతో క్రమశిక్షణ,  పట్టుదలతో మరోసారి ప్రయత్నించాడు. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సూక్తిని మదిలో నింపుకొని 86శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి సత్తాచాటాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరగలేదు.

2013లో మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా ఎంపికై, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకునే స్థాయికి ఎదిగాడు. హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన డాక్టర్‌ అనుమాండ్ల వేణుగోపాల్‌రెడ్డి. ప్రస్తుతం వీణవంక మండలం ఘన్ముక్కుల మోడల్‌ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వరుసగా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ రాషర్ట స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటర్‌ ఫైయిలైనా.. సడలని పట్టుదలతో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన వేణుగోపాల్‌రెడ్డి ‘సక్సెస్‌’ స్టోరీ ఆయన మాటల్లోనే..

కుటుంబ నేపథ్యం..
మా తల్లిదండ్రులు అనుమాండ్ల తిరుపతిరెడ్డి, విజయలక్ష్మి. నేనొక్కడినే కొడుకు. చెల్లెలు ఉంది. నాన్న గుడివాడలో రైల్వే డిపార్ట్‌మెంట్‌లో(1983) ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగ రీత్యా కుటుంబం అక్కడే ఉండాల్సి వచ్చింది. కోస్తా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివాను. ‘పది’లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించడంతో మా నాన్న విజయవాడలోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంటర్‌లో చేర్చాడు. కళాశాలలో ఉన్న పరిస్థితుల ప్రభావామో లేక స్నేహితుల వల్లనో చదువు మీద కాకుండా ఇతరత్రా విషయాల వైపు దృష్టి మళ్లింది. చదువులు అటకెక్కాయి.

ఇంటర్‌లో మూడు సబ్జెక్టులు ఫెయిలయ్యాను. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చదువుకు పుల్‌స్టాప్‌ పెట్టి వ్యవసాయం చేసుకొందామనుకున్నా.. కానీ మా నాన్న దిగాలుగా ఉన్న నన్ను చూసి జీవితంలో ఒడిదొడుకులు సహజం.. ప్రయత్నిస్తే పోయేదేం లేదు. మరోసారి ట్రై చెయ్యి అని వెన్నుతట్టాడు. అప్పుడు కొండంత బలం వచ్చింది. ఇంటర్‌ మళ్లీ పరీక్షలు రాయగా 83శాతం మార్కులు వచ్చాయి. ఇక చదువుతాననే ధైర్యం వచ్చింది. అక్కడే లయోల కళాశాలలో బీఎస్సీలో చేరాను. 91శాతం మార్కులు వచ్చాయి. ఆ తర్వాత ఎంఎస్సీ పూర్తి చేసి 2013 కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశాను.

15ఏళ్లుగా విద్యాబోధన 
ఇంటర్‌ ఫెయిలయ్యానని ఇంట్లో కూర్చుండి ఉంటే ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగేవాణ్ని కాదు. 1999 నుంచి 2013 వరకు హన్మకొండలోని న్యూసైన్స్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా పని చేశాను. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దగలిగాను. వందల మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పీహెచ్‌డీ పూర్తి కాగా నే 2013లో మోడల్‌ స్కూల్‌లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రిన్సిపాల్‌గా వీణవంక మండలంలో ఎంపికయ్యాను.

ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు..
2017లో తెలంగాణ రాష్ట్ర ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా అవార్డుతోపాటు రూ.10,116 నగదు అందుకోవడం జీవితంలో మరిచిపోలేని సంఘటన. అవార్డు తీసుకునేటప్పుడు నా చేతులు వణికిపోయాయి. ఇంటర్‌లో ఫెయిలై ఇంటి వద్ద ఉంటే ఇలా ఉత్తమ అవార్డును అందుకునే వాడిని కాదు అని ఒక్కసారి నాటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. నా శ్రీమతి ఇంటర్‌ వరకే చదివింది. నా ప్రోద్బలంతో ఎంబీఏ, బీఎడ్, ఎల్‌ఎల్‌బీ చదివించాను. ప్రస్తుతం ఆమె వరంగల్‌లోని కోర్టులో టైపిస్టుగా విధులు నిర్వర్తిస్తోంది.

మార్కులు శాశ్వతం కాదు..     
ప్రతీ విద్యార్థి లక్ష్యం నిర్ధేశించుకుని లక్ష్య సా«ధనకు ఏకాగ్రతతో ముందుకెళ్లాలి. విఫలమైతే కుంగిపోవద్దు. మార్కులు శాశ్వతం కాదు.. జీవితం చాలా విలువైనది. ప్రతీ పాఠశాలలో కౌన్సెలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చర్చించాలి. విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించాలి. మా పాఠశాలలో ఏడో తరగతి నుంచే నెలకోసారి కౌన్సెలింగ్‌ క్లాసులు ఏర్పాటు చేస్తాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లలకు ఉండాలి. ఫెయిలయ్యానని మా తల్లిదండ్రులు ప్రోత్సహించకుంటే ఇప్పడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదిగేవాడిని కాదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement