సప్లమెంటరీలో పాస్‌.. మూడు ఉద్యోగాలు సాధించాడు | Sakshi
Sakshi News home page

సప్లమెంటరీలో పాస్‌.. మూడు ఉద్యోగాలు సాధించాడు

Published Fri, May 10 2019 10:12 AM

Sub Inspector Successful Life Story - Sakshi

పాలకుర్తి: కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని నిరూపించారు పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీష్‌. ఇంటర్‌మీడియట్, డిగ్రీలో ఫెయిల్‌ అయినా ధైర్యం కోల్పోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగారు.. ప్రభుత్వ ఉద్యోగంలోనైతే ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్ణయించుకుని కష్టపడి చదివారు.. తద్వారా ఒకటి కాదు రెండు కాదు మూడు ఉద్యోగాలకు ఎంపికైన ఆయన చివరకు ఎస్సై పోస్టును ఎంచుకుని కొనసాగుతున్నారు.

మధ్య తరగతి రైతు కుటుంబం
ప్రస్తుత భద్రాద్రి జిల్లా పినపాక మండలంలోని ఏడూర్ల బయ్యారం గ్రామానికి చెందిన మధ్య తరగతి రైతు కుటుంబంలో సతీష్‌ జన్మించారు. ఆయన తల్లిదండ్రులైన గండ్రాతి వెంకటరమణ – సమ్మయ్యకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమారులు వ్యవసాయం చేస్తుండగా.. చిన్న కుమారుడైన సతీష్‌ను చదివించి ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక. అయితే, 10వ తరగతిలో సాధారణ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఆయన ఇంటర్‌లో చేరాడు. ఇంటర్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలయ్యాడు. అయినా తల్లిదండ్రులు చదువు కొనసాగించాలని ప్రోత్సహించడంతో సప్లమెంటరీ పరీక్షలు రాసి పాసయ్యాక డిగ్రీలో చేరాడు. అయితే, డిగ్రీలో కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలయ్యాడు. చివరకు మూడో సంవత్సరంలో అన్ని పరీక్షలు రాసి సాధారణ మార్కులతో గట్టెక్కాడు.

ప్రభుత్వ ఉద్యోగం దొరికితే...
ఒకసారి ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్‌ కోసం సతీష్‌ వీఆర్వో వద్దకు వెళ్లాడు. అయితే, ఆ పని చేయకపోవడమే కాకుండా జులుం ప్రదర్శించడంతో సతీష్‌ ఆవేదన చెందాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తనకు ఎదురుపడిన వీఆర్వో మాదిరిగా కాకుండా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఊరికి దూరంగా హైదరాబాద్‌ వెళ్లాడు. ఒకసారి ఎస్‌ఐ ఉద్యోగానికి పరీక్ష రాస్తే అవకాశం దక్కలేదు. అయినా నిరుత్సాహానికి గురికాకుండా పోటీ పరీక్షలకు అవసరమైన సబ్జెక్టులపై పట్టు సాధించేలా చదివాడు. అలా రెవెన్యూలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగంతో పాటు డిప్యూటీ జైలర్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఇందులో డిప్యూటీ జైలర్‌ ఉద్యోగాన్ని ఎంచుకోగా ఖమ్మంలో పోస్టింగ్‌ లభించింది. అయితే, ఆరు నెలల పాటు ఉద్యోగం చేశాక ప్రజలకు సేవల చేయాలంటే ఇది సరైన ఉద్యోగం కాదనుకున్న సతీష్‌ మళ్లీ ఎస్సై రాతపరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆయన పాలకుర్తి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు.
 

ఆత్మవిశ్వాసం, లక్ష్యాన్ని ఎంచుకోవడమే కీలకం
ఇంటర్‌లో ఫెయిలైనప్పుడు నన్ను తల్లిదండ్రులు తిడతారనుకున్నాను. కానీ ధైర్యం చెప్పి చదువు కొనసాగించేలా ప్రోత్సహించారు. ఉద్యోగం సంపాదించాలనే తల్లిదండ్రుల కోరికతో పాటు నా లక్ష్యం సాధించాను. చదువుపై ఆసక్తిని పెంచుకుని ఆత్మవిశ్వాసంతో చదివితే ఉన్నత ఉద్యోగాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే సమయంలో లక్ష్యాన్ని ఎంచుకోవడం, దాని చేరుకునేందుకు కష్టపడడం కూడా ముఖ్యమే. – గండ్రాతి సతీష్, ఎస్‌ఐ, పాలకుర్తి 

1/1

గండ్రాతి సతీష్, ఎస్‌ఐ పాలకుర్తి 

Advertisement
 
Advertisement
 
Advertisement