Life success
-
శభాష్.. షబానా
పదో తరగతిలో ఫెయిల్ కావడంతో చదువుకు ఫుల్స్టాప్ పడింది. కొంతకాలానికి వివాహం. కుటుంబ పోషణ కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు మకాం మారింది. ఖాళీగా ఉండకుండా తనవంతుగా కుటుంబానికి చేయూతనివ్వాలనుకుంది. ఏం చేయాలా అని ఆలోచించింది. చిన్ననాటి నుంచి దుస్తులపై డిజైన్లు చేయాలంటే ఇష్టం. దీంతో ఆలోచనలు అటు వైపు మళ్లాయి. అంతే జాకెట్లు, చీరలు, డ్రెస్‌లపై డిజైన్లు చేయడం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఈ రంగంలో నిలదొక్కుకుంది. ప్రస్తుతం మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. ఆమే నర్సాపూర్‌కు చెందిన షబానా. చదువు లేకపోయినా సాధించాలన్న పట్టుదల ఉంటే చాలంటున్న ఆమె విజయగాథ ఆమె మాటల్లోనే.. నర్సాపూర్: మాది హైదరాబాద్‌లోని కవాడిగూడ. పదో తరగతి వరకు చదివాను. ఫెయిల్ కావడం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడితో చదువుకు స్వస్తి పలికాను. ఆ తర్వాత కొంత కాలానికి వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటకు చెందిన అక్బర్‌తో వివాహం జరిగింది. అత్తారింట్లో అడుగుపెట్టాను. కుటుంబ పోషణ కోసం 13 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు మకాం మార్చాం. ఐడీపీఎల్‌లో అద్దె ఇంట్లో దిగాం. అక్బర్ కారు నిడిపి కుటుంబాన్ని పోషించేవారు. నా వంతుగా కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాను. మేం ఉంటున్న ఇంటికి దగ్గరలో మాధవి అనే ఆవిడ జాకెట్లు, చీరలు, డ్రెస్‌లపై డిజైన్లు వేసే పని చేస్తుండేది. నాకు అందులో ప్రవేశం ఉండడంతో ఆమె నుంచి చీరలు, జాకెట్లు ఇంటికి తెచ్చుకుని పీస్ వర్క్ కింద వాటిపై డిజైన్లు వేసి ఇచ్చేదాన్ని. అలా నెలనెలా కొంత సొమ్ము సంపాదించడం ప్రారంభమైంది. కొన్నాళ్లకు నర్సాపూర్‌కు మకాం నర్సాపూర్‌లో దగ్గరి బంధువులు ఉండడంతో మా మకాం ఇక్కడికి చేరింది. బంధువులతో పాటు స్వ యం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరా. అందులో వచ్చిన రుణంతో డిజైన్లు వేసేందుకు అవసరమైన సామగ్రిని హైదరాబాద్ నుంచి తెచ్చుకొని ఇంట్లోనే డిజైన్లు వేసే పని మొదలుపెట్టా. చీరలు, జాకెట్లు, డ్రెస్సులపై టచ్ వర్క్, మిర్రర్ వర్క్, త్రేడింగ్ వర్క్, కాసుల వర్క్ అందరికీ నచ్చేలా వేయడం ప్రారంభించా. ముందుగా నా వద్దకు వచ్చే వారికి పేపర్లపై డిజైన్లు గీసి చూపిస్తాను. వారికి నచ్చిన డిజైన్ వేసిస్తాను. నేను వేసిన డిజైన్లు నచ్చడంతో చాలామంది వస్తున్నారు. క్రమంగా గిరాకీ పెరిగింది పలువురికి శిక్షణ, ఉపాధి ఈ రంగంలో నెమ్మదిగా నిలదొక్కుకున్నాం. ప్రస్తుతం ఆసక్తి ఉన్న మహిళలకు డిజైన్లు వేయడంలో శిక్షణ సైతం ఇస్తున్నాను. అనంతరం పీస్ వర్క్ అప్పగిస్తూ వారికి కూడా సం పాదించుకునే మార్గం చూపిస్తున్నాను. ఇప్పటి వరకు సుమారు 300 మంది నా దగ్గర శిక్షణ తీసుకున్నారు. చాలామంది పీస్‌వర్క్ చేస్తూ రోజుకు పనిని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు సంపాదించగలుగుతున్నారు. ఇది ఆనందాన్నిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ మంచి డిమాండ్ పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ఇక ఫుల్ బిజీ. డిజైన్ పనుల గిరాకీ రెట్టింపవుతుంది. పీస్ వర్క్ చేసే మహిళలకు ఇస్తుంటాను. మామూలు సీజన్లో నెలకు రూ.15 వల వరకు ఆదాయం వస్తుంది. పెళ్లిళ్ల సీజన్ అయితే సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది. తోటి మహిళల్లో చైతన్యం 2016లో ఢిల్లీలో జరిగిన హ్యాండిక్రాఫ్టŠస్ మేళాకు వెళ్లా. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గత ఫిబ్రవరిలో కౌంటర్ ఏర్పాటు చేశా. చీరలు, జాకెట్లు, డ్రెస్ మెటీరియల్‌పై డిజైన్లు వేసి విక్రయానికి పెట్టా. అగ్ని ప్రమాదంలో తగలబడడంతో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగే పలు సమావేశాలకు వెళ్తుంటాను. నా అనుభవాలను తోటి మహిళలకు వివరించడంతోపాటు ఉపాధి అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో చైతన్య పరుస్తుంటాను. పిల్లల భవిష్యత్తు కోసం నాతో పాటు నా భర్త అక్బర్ చాలా కష్టపడ్డాం. మాకు ముగ్గురు పిల్లలు. మాలాంటి కష్టం వారికి రావద్దని కష్టపడుతున్నాం. వారికి మంచి భవిష్యత్తు అందించాలన్నదే మా తపన. మగ్గం ఉంటే మరింత సులువుగా డిజైన్ వేసే వీలుంటుంది. మగ్గంతో పాటు మెటీరియల్ కొనుగోలుకు, దుకాణం పెట్టుకునేందుకు రుణం అందిస్తే నాతో పాటు మరింత మందికి పని కల్పించాలన్నది ఆశయం. – షబానా -
నాన్నే స్ఫూర్తి
నాకు బచ్చల కూర పప్పు అంటే భలే ఇష్టం. వంట కూడా బాగా వండుతా. చదువుకునేటప్పుడు నేర్చుకున్నా. సెల్ఫ్ కుకింగ్‌తో రిలాక్స్ కావొచ్చు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇంటి దగ్గర నేనే వండుతా. మా ఇంట్లో వాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. మమ్మీ కంటే డాడీనే బాగా వంట చేస్తారని మా పిల్లలు అంటుంటారు. మా నాన్న.. మా టీచర్.. ఆయనే బెస్ట్ ఫ్రెండ్ అని అంటున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్. మా నాన్నే నాకు స్ఫూర్తి అని.. ఆయన అండ, సూచనలతోనే ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. బుక్స్ రీడింగ్ అంటే ఇష్టమని, సమయం దొరికితే కవితలు రాస్తుంటానని, కామెడీ, కుటుంబకథా చిత్రాలు నచ్చుతాయని చెబుతున్నారు. వరుస ఎన్నికలు, నిత్య విధుల్లో తలమునకలైన ఆయన శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. చిన్ననాటి తీపిగుర్తులు, మరుపురాని సంఘటనలు, ఇష్టమైన వంటకాలు, సినిమాలు, ఆటలు, స్నేహబంధంపై నగేష్ పర్సనల్ టైం ఆయన మాటల్లోనే.. సాక్షి, మెదక్ : మా నాన్న రాంరెడ్డి రిటైర్డ్ టీచర్.. అమ్మ పద్మ హౌస్ వైఫ్. నాకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని తొర్లికొండకు చెందిన మమతతో వివాహమైంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. మాకు ఇద్దరు సంతానం. అబ్బాయి ధీరజ్ బీటెక్ తృతీయ సంవత్సరం.. అమ్మాయి లాస్య బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. విద్యాభ్యాసం.. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్‌లో నాలుగో తరగతి వరకు చదివాను. హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రభుత్వ పాఠశాలలో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు.. నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని చందూర్‌లో తొమ్మిది, పదో తరగతి విద్యనభ్యసించాను. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శంకర్‌నగర్‌లో ఉన్న మధుమలంచ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్.. నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో బీఎల్ఐసీ, ఎంఏ–తెలుగు విద్యనభ్యసించాను. అది నాకు చేదు, తీపి జ్ఞాపకం వెల్కటూర్‌లో నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఒక సంఘటన నన్ను మార్చేసింది. మా నాన్న ఆ ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడు. 30 ఏళ్లు అక్కడే టీచర్‌గా పనిచేశారు. సిన్సియర్ టీచర్‌గా పేరు సంపాదించారు. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఒక రోజు తెలుగు నెలల పేర్లు చెప్పమంటే.. చెప్పాను. వరుస క్రమంలో చెప్పకపోవడంతో అందరి ముందు బెత్తంతో బాదారు. ఆ తర్వాతే నేను చదువు మీద దృష్టిసారించాను. ఇది నాకు చేదు, తీపి జ్ఞాపకంగా మిగిలింది. గాంధీ ఆటోబయోగ్రఫీ మరువలేను నేను హైదరాబాద్‌లో ఏడో తరగతి చదువుతున్నా. స్కూల్లో ఆగస్టు 15 సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో నేనే ఫస్ట్ వచ్చా. నాకు జాతిపిత మహాత్మాగాంధీ ఆటో బయోగ్రఫీ ఉన్న పుస్తకం, ఒక డిక్షనరీ ప్రజెంట్ చేశారు. ఇది నేను ఎప్పటికీ మరిచిపోలేను. హ్యాపీ మూమెంట్.. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న సమయంలో నాకు గ్రూప్–3 ఉద్యోగం వచ్చింది. 1994లో నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్గా నా తొలి పోస్టింగ్. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన రోజు యూనివర్సిటీ ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న పార్టీ చేసుకున్నాం. ఓ హోటల్లో అందరం భోజనం చేసి.. స్వీట్లు తిన్నాం. అది నాకు హ్యాపీ మూమెంట్. మూడు సంఘటనలు మరిచిపోలేనివి కామారెడ్డిలో ఆర్డీఓగా పనిచేస్తున్న సమయంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించాను. ఓ సంధులోని పాత ఇంట్లో ఆ స్కూల్ ఉంది. గాలి, వెలుతురు రాకపోవడంతోపాటు వసతులు సరిగా లేవు. పిల్లలు ఇక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకుంటే చాలా బాధేసింది. వెంటనే మార్చాలని నిర్ణయానికి వచ్చా. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఏఎస్‌డబ్ల్యూ ఆఫీస్‌లోకి మార్చా. ఈ ఆఫీస్‌ను అంతకు మునుపే కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ భవనంలోకి తరలించారు. దీంతో కేజీబీవీని అక్కడికి తరలించేలా దగ్గరుండి పర్యవేక్షించా. ఏడు, ఎనిమిది గదులను అప్పటికప్పుడు శుభ్రం చేసి బాలికల విద్యాలయాన్ని అక్కడికి మార్చాం. ఒక్క రోజులోనే ఇదంతా చేశాం. ఈ ప్రాంతం జనావాసాలకు కొంత దూరంగా ఉండడంతో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించేలా పోలీసులకు సూచించా. ఇందుకోసం పోలీసులు ప్రతి రాత్రి సంతకం చేసేలా బుక్ పెట్టాం. ఈ నేపథ్యంలో విద్యార్థినులు చాలా హ్యాపీగా ఫీల్ కావడం.. నాకు సంతోషాన్నిచ్చింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది. 2015–16 అనుకుంటా. ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణ అనే అమ్మాయి అప్పుడు అక్కడే చదువుతోంది. ఈ పాఠశాల గుట్టమీద ఉండడంతో తాగునీటికి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు కాళేశ్వరం పనులు జరుగుతున్నాయి. విద్యార్థులు స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవు. వెంటనే గుట్ట కింద ఉన్న బావి వారితో మాట్లాడి పూడిక తీయాలని సంకల్పించా. వెంటనే జేసీబీతో బావి పూడిక తీయడంతోపాటు గుట్టపైకి పైపులైన్ వేసి విద్యార్థుల నీటి కష్టాలు తీర్చాను. విద్యార్థులు వచ్చి థ్యాంక్స్ సర్ అని చెప్పడంతో ఆనందమేసింది. కామారెడ్డిలో ఆర్డీఓగా ఉన్న సమయంలో 2016లో సుమారు పది వేల మందికి పౌతి చేసి రికార్డ్ సృష్టించాం. చనిపోయిన వారి వారసులకు సంబంధించిన భూములను గ్రామ సభలు నిర్వహించి గుర్తించాం. సుమారు పదేళ్లుగా వారు పట్టాపాస్ బుక్కుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారి వారి గ్రామాల్లో చెట్ల కింద పౌతి ప్రక్రియ పూర్తి చేసి వారి ఇంటి వద్దకు వెళ్లి పాస్‌బుక్కులు అందజేశాం. దీనికి సంబంధించి ఆయా గ్రామస్తులు అభినందించడాన్ని ఇప్పటికీ మరచిపోలేను. బుక్స్ రీడింగ్ ఇష్టం నాకు బుక్స్ చదవడమంటే ఇష్టం. ఇప్పటివరకు సుమారు 1000 నుంచి 1,200 వరకు బుక్స్ కలెక్ట్ చేశాను. దీంతోపాటు సాహిత్యం, కవితలపై ఇంట్రస్ట్ ఎక్కువ, అప్పడప్పుడు కవితలు రాస్తుంటా. సినిమాలు చాలా తక్కువగా చూస్తా. హిట్ టాక్వచ్చి.. ఫ్యామిలీ సినిమా అయితేనే వెళతాం. రెండు, మూడు నెలలకోసారి ఫ్యామిలీతో సహా సినిమా చూస్తాం. మా ఇంట్లో కామెడీ సినిమాలే ఇష్టపడతారు. నేను చూసిన వాటిలో ‘కిక్’ సినిమా చాలా బాగుంది. స్నేహబంధంలో ప్రత్యేక అనుభూతి.. స్నేహ బంధంలో మరపురాని అనుభూతి ఉంటుంది. చిన్న నాటి స్నేహితులతోపాటు యూనివర్సిటీ ఫ్రెండ్స్‌తో ఇప్పటికీ మాట్లాడుతుంటారు. ఇటీవల ఎస్సెస్సీ బ్యాచ్ వాళ్లు గెట్ టుగెదర్ పెట్టారు. నేను బిజీగా ఉండడంతో వెళ్లలేకపోయా. దసరా వంటి పండుగలకు ఊరెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్‌ను తప్పనిసరిగా కలుసుకుంటా. విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి ప్రస్తుతం విద్యార్థులు స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించి.. పుస్తకాలు చదివించడం నేర్పించాలి. క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించేలా వారిలో తల్లిదండ్రులు స్ఫూర్తి నింపాలి. విధులు ఇలా.. నా తొలి పోస్టింగ్ నిజామాబాద్ జిల్లా కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్‌గా.. నిజామాబాద్‌లో ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్‌గా, భువనగిరిలో ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించాను. అనంతరం కామారెడ్డి ఆర్డీఓగా, నిర్మల్ డీఆర్వోగా, ప్రస్తుతం మెదక్ జాయింట్ కలెక్టర్‌గా 2017 నవంబర్ నుంచి పని చేస్తున్నాను. -
‘తల్లి’ విగ్రహం ప్లాన్ సార్‌దే...: ఎంపీ దయాకర్
‘నేను వృత్తిరీత్యా చిత్రకారుడిని.. తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్తగాఎంతో పేరొచ్చింది.. అంతకంటే తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ మెచ్చిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. టీఆర్ఎస్లో అంచెలంచెలుగా ఎదిగిన నాకు 2014లో వర్దన్నపేట టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారింది.. అయినప్పటికీ రాజకీయంగా నేను ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది, అంతా సార్(కేసీఆర్) చూసుకుంటారు అని సరిపుచ్చుకున్నా. అంతే 2015 పార్లమెంట్ వరంగల్ ఉప ఎన్నికలో ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. తెలంగాణలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచా. రెండోసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ అసాధారణ మెజారిటీతో వరంగల్ ఎంపీగా మళ్లీ గెలిచాను’– సాక్షి పర్సనల్ టైం’లో వరంగల్ లోక్‌సభ సభ్యుడు పసునూరి దయాకర్ తెలంగాణ ఉద్యమ కాలంలో చురుగ్గా పాల్గొనే ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత ఇష్టుడిగా మారారు. అయినా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా అవకాశం దక్కలేదు. దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా టీఆర్ఎస్లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగారు. ఆ విధేయతే వరంగల్ ఎంపీ టికెట్‌ను తెచ్చిపెట్టింది. 2015 ఉప ఎన్నికలతో పాటు తాజా సాధారణ ఎన్నికల్లో ఎంపీగా అద్భుతమైన మెజార్టీతో గెలుపొందారు పసునూరి దయాకర్. ఈ సందర్భంగా తన చదువు, వివాహం.. ఉద్యమంలో తీరుతెన్నులు.. కేసులు ఎదుర్కొన్న వైనమే కాకుండా వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ‘సాక్షి పర్సనల్ టైమ్’లో పంచుకున్నారు. ఆ వివరాలు దయాకర్ మాటల్లోనే... సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి రాష్ట్రంలోని 25 మందిలో నేనొక్కడిని.. ఉమ్మడి వరంగల్ జిల్లా సంగెం మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన పసునూరి కమలమ్మ – ప్రకాశం మా అమ్మానాన్నలు. 1967 ఆగస్టు 2న జన్మించాను. హైదరాబాద్ జేఎన్టీయూలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 25 సీట్లు మాత్రమే ఉండేవి. అందులో ఒక సీటు రావడంతో బీఏ ఫైన్ ఆర్ట్స్ చదివా. హైదరాబాద్‌లో చదువు పూర్తి చేసుకుని వరంగల్‌కు చేరి ఫొటో స్టూడియో ఏర్పాటు చేసి చిత్రకారుడిగా వృత్తి ప్రారంభించాను. 2001 టీ ఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో కీలకంగా పని చేశా. స్విమ్మింగ్ అంటే ఇష్టం పదో తరగతి వరకు మా ఊరు బొల్లికుంటలోనే చదువుకున్నా. ఆ రోజుల్లో చదువుతో పాటు స్నేహితులతో కలిసి ఊరిలో అన్ని ఆటలు ఆడా. స్విమ్మింగ్‌తో పాటు అన్ని ఆటలు ఇష్టమే. చిన్నప్పుడు కొద్దిగా రఫ్‌గానే ఉండేవాన్ని. కోతి కొమ్మచ్చి, తాటిముంజల కోసం చెట్లు ఎక్కడం ఇప్పటికీ మరిచిపోలేను. ఇంటర్మీడియట్ స్టేషన్‌ఘన్‌పూర్‌లో మా చిన్నాన్న దగ్గర చదుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్ జేఎన్టీయులో బీఏ ఫైన్ ఆర్ట్స్ సీటు రావడంతో అక్కడి వెళ్లా. లాస్ట్‌బెంచ్ స్టూడెంట్ను.. హైస్కూల్, కాలేజీ, యూనివర్సిటీలలో లాస్ట్‌బెంచ్‌లో కూర్చునేవాన్ని. చదువు, మార్కుల విషయంలో మాత్రం పర్ఫెక్ట్. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇంటర్మీడియట్ పూర్తయ్యాక హైదరాబాద్‌లో చదవాలనుకున్నా. జేఎన్టీయూలో బీఏ ఫైన్ ఆర్ట్స్ సీట్లు ఉమ్మడిరాష్ట్రంలో 25 సీట్లు మాత్రమే ఉం డేవి. అయినా అందులో సీటు కోసం ఎంట్రన్స్ రాస్తే 25 మం దిలో ఒకడిగా నాకు సీటు దక్కడం సంతోషాన్ని కలిగించింది. ‘సత్య’ సినిమా బాగా నచ్చింది చదువుకునే రోజుల్లో అన్ని ఆటలు ఆడేవాన్ని. స్విమ్మింగ్‌తో పాటు జిమ్‌కు కూడా వెళ్లేవాణ్ని. వాలీబాల్, అథ్లెటిక్స్ అంటే కూడా చాలా ఇష్టం. వాలీబాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ పోటీల్లో పాల్గొన్నా. అథ్లెట్స్‌లో షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో కూడా ఇష్టంగా ఆడే వాళ్లం.రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా బాగా నచ్చింది. ప్రేమ, గీమల జోలికి వెళ్లలే... చదువుకునే రోజుల్లో ప్రేమ, గీమల జోలికి వెళ్లలేదు. ఆ రోజుల్లో కనీసం ఆ ఆలోచన కూడా రాలేదు. కాలేజీకి వెళ్లిన సందర్భాల్లో ఎవరైనా తోటి విద్యార్థినులు పరిచయమైనా.. మరుసటి కనిపిస్తే కనీసం ‘హాయ్’ అని కూడా అనలేదు. ఎందుకంటే చదువుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మిగతా వాటికి ప్రాధాన్యత అవసరం లేదని భావించేవాడిని. సేమ్ టైమ్ కేవలం పరిచయం చేసుకున్నంత మాత్రాన దానిని అవకాశంగా కూడా తీసుకోవడం సరికాదనే అనిపించేది. అందుకే వాటికి జోలికి వెళ్లలే. నాటుకోడి కూర బాగా ఇష్టం. పెద్దలు కుదిర్చిన పెళ్లి హైదరాబాద్‌లో బీఏ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసి వరంగల్‌కు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నా. గౌరవంగా ఉంటుందని పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఓకే అన్నా. అయితే, జయవాణి (భార్య) నాకు సీనియర్‌గా ఉన్న విద్యాదర్ చెల్లెలు అని ఆ తర్వాతే తెలిసింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కనక వెంటనే జరిగిపోయింది. 1995 డిసెంబర్ 4 మా పెళ్లిరోజు. ఉద్యమ సమయంలో అన్నీ ఆమే తెలంగాణ ఉద్యమ సమయంలో నా భార్య జయవాణి కుటుంబాన్ని అంతా తానై చూసుకునేది. అటు ఉద్యమం.. ఇటు రాజకీయాల్లో నేను ముందుకు నడవడంలో ఆమె సహకారం మరవలేనిది. పిల్లలను చూసుకోవడం, ఇంటికి వచ్చే నాయకులు, కార్యకర్తలను ఆదరించి మాట్లాడటం వల్ల నాకు కొంత వెసలుబాటు లభించేది. అసలు అర్ధరాత్రి దాటంది ఇంటికి చేరుకున్న రోజులు తక్కువ. మాదిగవారి కుంట మా ముత్తాత నాటిదే... దళిత కుటుంబంలో పుట్టినా బాగానే ఉన్నాం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు కలిపి మొత్తం ఆరుగురం. అందరం కూడా కారుల్లోనే తిరిగే పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే మా ముత్తాత షేర్ మల్లయ్య 90 – 100 ఎకరాల ఆసామి. ఆయన సంపాదించిన ఆస్తి మా తాతలు, తండ్రులు, మా వరకు వస్తోంది. ఇప్పటికీ ఆశాలపల్లి శివారులో ఉన్న మాదిగవారి కుంట మా ముత్తాత నుంచి వచ్చిందే. ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. ఆస్తుల పంపకాలు లేవు. కలిసే ఉంటున్నాం. టీఆర్ఎస్, కేసీఆర్ చలవే.. షెడ్యూల్ కులంలో పుట్టినా మా కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందులు లేవు. ఇదే సమయంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం కూడా లేదు. కనీసం సర్పంచ్ కూడా గెలవని నేను రెండు సార్లు ఎంపీగా ఎన్నిక కావడం అనేది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చలవ, ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వల్ల నాకు ఈ స్థాయి వచ్చింది. ఇది జీవితంలో గొప్ప అనుభూతి, అవకాశం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, కేసీఆర్ సార్ దృష్టిలో నాకు స్థానం దక్కడం నా అదృష్టం. నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ కేసు నమోదైనా ఏ–1గా నా పేరే ఉండేది. అంతలా ఉద్యమంలో పాల్గొనేవాన్ని. ‘తల్లి’ విగ్రహం ప్లాన్ సార్‌దే... దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం ప్లాన్ మా అధినేత కేసీఆర్ సార్‌దే. ఆయన ప్లాన్, సూచనలకు అనుగుణంగా విగ్రహాన్ని రూపొందించా. తెలంగాణ ఉద్యమం, ప్రజల ఆశలు, ఆశయాలకు ఆనుగుణంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం సృష్టికర్తగా కేసీఆర్ దగ్గర దక్కిన గుర్తింపు, పేరు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది. అమ్మానాన్న, అన్న కొడుకు మరణం బాధించాయి... ఉమ్మడి కుటుంబంలో జీవితం హాయిగా సాగుతున్న సమయంలో అమ్మ కమలమ్మ, నాన్న ప్రకాశం మరణం విషాదాన్ని నింపింది. ఆరుగురి సంతానంలో ఆఖరి వాడినైన నాకు ఆ సమయంలో అమ్మనాన్నల మృతి తీవ్రంగా బాధించింది. సోషల్ మూమెంట్లో తిరిగే మా అన్న కొడుకు టిల్లు(21) చనిపోవడం కూడా తీవ్రంగా కలచివేసింది. మా అన్న బాగా సెన్సిటివ్. టిల్లు కొందరు యువకులతో గొడవ పడ్డారని వాళ్ల తల్లిదండ్రులు మా అన్నకు ఫిర్యాదు చేశారు. దీంతో అన్న టిల్లును మందలించగా ఆత్మహత్య చేసుకున్నాడు. అన్న కుమారుడు టిల్లు చనిపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. మా ఆయన బంగారం.. వర్ధన్నపేట టికెట్ మిస్సయితే బాధ పడ్డా...పసునూరి దయాకర్ సతీమణి జయవాణి ఉద్యమం, టీఆర్ఎస్లో 2014 వరకు కీలకంగా పని చేస్తున్న దయాకర్‌కు వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్ వస్తుం దని ఆశించాం. కేసీఆర్ సార్ కూడా దాదాపుగా దయాకర్‌కే ఇస్తామన్నారు. ఇదే సమయంలో పార్టీలో సమీకరణ కోణంలో అరూరి రమేష్‌కు కేటాయించారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. అయితే, ‘జయా.. సార్‌కు అన్నీ తెలుసు, ఎప్పుడు ఎవరికీ టికెట్ ఇవ్వాలన్నది కేసీఆర్ సార్‌కు బాగా తెలుసు.. సరైన సమయంలో న్యాయం చేస్తానన్నారు.. సార్ దృష్టిలో మనం ఉన్నాం.. టికెట్‌తో సంబంధం లేదు’ అని ఆయన(దయాకర్) నన్ను అనునయించారు. ఆ తర్వాత వెంటనే వచ్చిన 2015 వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా దయాకర్ పేరును కేసీఆర్ సార్ ప్రకటించడంతో మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మళ్లీ ఇప్పుడు టికెట్ ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా ఎంపీగా గెలిపించారు. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేసినందుకు గొప్ప గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ఇక మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఉమ్మడి కుటుంబంలో ఈ ఇంటికోడలుగా రావడం ఆనందంగా ఉంది. రాజకీయంగా ఎక్కడికి వెళ్లినా.. ఏ సమయంలో వచ్చినా ఇంట్లోకి చేరగానే అవన్నీ మరచిపోయి చికాకు లేకుండా నాతో పాటు పిల్లలు రోని భరత్, ప్రీతమ్‌తో గడుపుతారు. అందుకే మా ఆయన బంగారం. పార్లమెంట్ సభ్యుడిగా కేసీఆర్ బాటలో సాగుతూ ఆయన ప్రజాజీవితంలో ఉండటం నిజంగా మా అదృష్టం. -
సేవలోనూ ‘సగం’
‘ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడం.. వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపడంలోనే తృప్తి ఉంటుంది. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నదాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. రాజకీయ కార్యకలాపాలు నడిపేందుకు వెచ్చిస్తున్నా. విద్యా సంస్థలు ఉన్నా.. వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రజా సేవకే వినియోగిస్తున్నా. చిన్న వయసులోనే 2002లో ఇంటర్ పూర్తయి.. ఎంసెట్ పరీక్ష రాసిన వెంటనే పెళ్లి కావడం.. రాజకీయ నేపథ్యం లేకున్నా రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చాను. పార్టీపరంగా.. పదవులపరంగా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నా. నా భర్త హరిసింగ్ సహకారంతోనే నిత్యం ప్రజల మధ్య ఉంటూ రాజకీయంగా రాణించగలుగుతున్నా. ఉన్నత విద్యను అభ్యసించడం.. చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడంతో బాధ్యతలు మరింతగా పెరిగాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ.. కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం కేటాయిస్తూ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నా. నా భర్త బానోతు హరిసింగ్‌నాయక్ బండికి ఇరుసులా మారి రాజకీయంగా నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. రాజకీయ సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు’. ‘సాక్షి’ పర్సనల్ టైమ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియనాయక్ ఇల్లెందు: మాది కొత్తగూడెంలోని బాబు క్యాంప్ ప్రాంతం. నాన్న బాదావత్ సీతారాంనాయక్ సింగరేణిలో ఉద్యోగం చేసేవారు. అమ్మ దర్జన్ గృహిణి. 2002లో ఇంటర్ పూర్తయి, ఎంసెట్ రాసిన వెంటనే టేకులపల్లికి చెందిన హరిసింగ్ నాయక్‌తో వివాహం అయింది. పెళ్లయ్యాకే భర్త హరిసింగ్ ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశాను. 2006లో టేకులపల్లిలో హరిసింగ్ విద్యాసంస్థలను ప్రారంభించారు. క్రమంగా హైదరాబాద్‌లోనూ ప్రైవేటు స్కూల్ పెట్టాం. నాతోపాటు మా బంధువుల పిల్లలం అందరం కలిసి హైదరాబాద్‌లో ఉండేవాళ్లం. స్కూల్లో బోధించడంతోపాటు చదువు కోసం కాలేజీకి వెళ్లడం, అందరికీ వంట చేయడం.. ఇలా రోజంతా కష్టపడేదాన్ని. టేకులపల్లి, హైదరాబాద్‌లో కలిపి ఇప్పుడు నాలుగు ప్రైవేటు స్కూళ్లు, నాలుగు జూనియర్ కాలేజీలు ఎనిమిది బ్రాంచీలు ఉన్నాయి. మొత్తం 3,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో అనేక మంది పేద పిల్లలకు ఉచితంగానే విద్యా బోధన చేస్తున్నాం. ఉన్నత విద్యతోనే రాజకీయాల్లోకి.. 2004లో ఇల్లెందు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి కల్పనాబాయి పోటీ చేశారు. ఆమె సోదరుడు నా భర్త హరిసింగ్‌నాయక్‌కు మిత్రుడు కావడంతో ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రభావంతోనే హరిసింగ్‌కు రాజకీయాలపై దృష్టి మళ్లింది. 2008లో టీడీపీలో చేరారు. అనతి కాలంలోనే తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ టీడీపీ నుంచి ఊకె అబ్బయ్యకు అవకాశం రావడంతో.. హరిసింగ్ రెబెల్‌గా నామినేషన్ వేశారు. అప్పుడు ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబునాయుడు ఇల్లెందుకు వచ్చినప్పుడు హరిసింగ్‌తో మాట్లాడి.. ‘నీకు మంచి భవిష్యత్ ఉంటుంది.. పోటీనుంచి తప్పుకో’ అని సూచించారు. అప్పటికే నామినేషన్ విత్‌డ్రాకు సమయం అయిపోవడంతో బరిలో ఉంటూనే అబ్బయ్య గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు మళ్లీ విద్యాసంస్థలపై దృష్టి పెట్టాం. వాటినే పటిష్టం చేసి, అందులోనే నిలదొక్కుకోవాలనుకున్నాం. ఇంతలోనే 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇల్లెందు అభ్యర్థిని మార్చాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఉన్నత విద్యావంతురాలైన నన్ను బరిలోకి దింపితే బాగుంటుందని, గెలిచే అవకాశం ఉంటుందని నాటి బయ్యారం మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. తుమ్మల ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పడంతో ఇల్లెందు టికెట్ నాకు ఇవ్వాలని నిర్ణయించారు. టికెట్ ఇవ్వడానికి ఐదు గంటల ముందు మమ్మల్ని హైదరాబాద్‌కు రమ్మని ఫోన్ వచ్చింది. దీంతో హడావిడిగా వెళ్లి నాటి సీఎం చంద్రబాబును కలిశాము. ఆయనతో మాట్లాడిన తర్వాత టికెట్ నాకే ఇస్తున్నారనే సంకేతం వచ్చింది. మరుసటి రోజు పేపర్లో వార్త చూసి వచ్చి నామినేషన్ వేశాం. అయితే తొలిసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఐదేళ్ల పాటు టీడీపీ సమన్వయకర్తగా పని చేసి, అనేక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాం. 2017లో కాంగ్రెస్‌లోకి.. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ బలహీనపడడంతో 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరాం. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీచేసి, ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మళ్లీ పార్టీ మారాల్సి వచ్చింది. అయితే మేము రాజకీయాల్లోకి వచ్చి సంపాదించింది ఏమీ లేదు. ప్రస్తుతం మా విద్యాసంస్థలను మా బంధువుల పిల్లలే నిర్వహిస్తున్నారు. వాటిపై వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. ఎమ్మెల్యేగా నాకు ప్రతి నెలా వచ్చే జీతంతో పాటు విద్యాసంస్థల డబ్బు కూడా రాజకీయాలు నడిపేందుకే వెచ్చిస్తున్నాం. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో ఎంతో ఆనందం ఉంది. రాజకీయాలతో పాటు కుటుంబ సమస్యలను కూడా మేమిద్దరం సమానంగా పంచుకుంటూ ముందుకు సాగుతున్నాం. నాకు రాజకీయాలపై అవగాహన లేకున్నా హరిసింగ్ సహకారంతోనే రాణించగలుగుతున్నా. ఉన్నత విద్యావంతురాలిని కావడం, చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడంతో అందరూ ఎంతో అభిమానం చూపుతున్నారు. నేను సభలు, సమావేశాలకు వెళ్లినా.. అక్కడ ఏ మాట్లాడాలనేది ఇద్దరం చర్చించుకుంటాం. రాజకీయాలు, కుటుంబ విషయాల్లోనూ ఇద్దరిది ఒకే మాట–ఒకే బాట కావడం వల్లే దిగ్విజయంగా ముందుకు సాగుతున్నా. రాజకీయ జీవితానికి అలవాటు పడి విహారయాత్రలు కూడా మరిచిపోయాం. అయితే రాజకీయాల్లో ఉండాలనే బలమైన కోరికతో వచ్చిన భర్త హరిసింగ్ తన కుర్చీని నాకు త్యాగం చేశారు. -
ఇంటర్లో ఫెయిలైనా.. జీవితంలో పాస్
ఆదిలాబాద్‌టౌన్: ‘ఎక్కడ పొగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి’ అంటుంటారు. ఓ వ్యక్తి అచ్చం అలాగే చేశాడు. ఏ సబ్జెక్టులో అయితే ఫెయిలయ్యాడో.. అదే సబ్జెక్టుపై కసి, పట్టుదలతో నైపుణ్యం పెంపొందించుకొని ఇప్పుడు విద్యార్థులకు అదే సబ్జెక్టు బోధిస్తున్నాడు. ఆత్మస్థైర్యం.. పట్టుదల ఉంటే జీవితంలో సాధించలేనిది ఏమిలేదని నిరూపించారు..వకులాభరణం ఆదినాథ్. ఇంటర్లో ఫెయిలైనా మనోధైర్యంతో ముందుకు సాగారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన నేడు ఓ పాఠశాలను స్థాపించి వంద మందికి ఉపాధి కల్పిస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ జీవితంలో పాసైన ఆదినాథ్ సక్సెస్‌పై ‘సాక్షి’ కథనం. మనోధైర్యంతో ముందుకు.. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వి.ఆదినాథ్ 1 నుంచి 10వ తరగతి వరకు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల నం.2లో చదివారు. ఇంటర్మీడియెట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984 నుంచి 1986 వరకు విద్యను అభ్యసించారు. ఫస్టియర్, సెకండియర్ గణితంలో ఫెయిలయ్యారు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇంటర్ చదువుకుంటూ తాపీమేస్త్రి వద్ద కూలి పనిచేసేవారు. అదేవిధంగా హౌస్వైరింగ్, వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేవాడు. తన ఇంట్లోని ఐదు గదులను రూ.500లకు అద్దెకు ఇస్తూ కుటుంబాన్ని పోషించారు. తండ్రి నర్సింహయోగి, తల్లి లక్ష్మీమాత. వీరికి తొమ్మిది మంది కూతుళ్లు, ముగ్గురు కుమారులు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో ఇంటర్ చదివే సమయంలోనే కుటుంబ బాధ్యతలు భుజాన ఎత్తుకున్నారు. రూ.150కు ఉద్యోగంలో చేరి.. మా ఇంట్లోని ఐదు గదులను పాఠశాల నడిపేందుకు లింబాద్రి అనే వ్యక్తికి రూ.500లకు అద్దెకు ఇచ్చాం. ఆ పాఠశాలలోనే నేను రూ.150కు ఉద్యోగంలో చేరాను. మూడునాలుగు నెలల పాటు ప్రగతి పాఠశాలను నడిపిన యాజమాన్యం టీచర్లకు వేతనాలు, ఇతర ఖర్చులను భరించలేక పాఠశాలను వదిలి వెళ్లిపోయారు. దీంతో అక్కడ పనిచేసే నేను, సాంబయ్య, సునంద పాఠశాలను నడిపించాం. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని చదువును కొనసాగించాం. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాను. పాఠశాలలో అటెండర్, వాచ్‌మెన్‌తోపాటు అన్ని నేనే అయి ముందుకు తీసుకెళ్లాను. ఇప్పటివరకు 25 బ్యాచ్‌ల వరకు పదో తరగతి విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్నారు. ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు, ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు. నేడు వంద మందికి ఉపాధి.. పట్టణంలోని ప్రగతి పాఠశాలను నడిపిస్తూ దాదాపు వంద మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు ఆదినాథ్. అదేవిధంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. పాఠశాలలో పనిచేస్తూనే ఇంటర్ పాసయ్యారు. ఆ తర్వాత డిగ్రీ, తెలుగు పండిత్ పూర్తి చేశారు. ఏ సబ్జెక్టులోనైతే ఫెయిల్ అయ్యారో అదే సబ్జెక్టుపై నైపుణ్యం పెంపొందించుకొని విద్యార్థులకు గణితం బోధిస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పలుసార్లు ఎన్నికవుతూనే ఉన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని వివిధ పాఠశాలల యాజమాన్యాలు ముందుకు సాగుతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రానా జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ఆయన చెబుతున్నారు. -
అది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన..
‘మా అమ్మ నాతో అన్ని వేళలా ఫ్రెండ్‌లా ఉంటుంది. నాకు ఎల్లప్పుడూ కొండంత ధైర్యం ఆమే’ అని అంటున్నారు మెదక్ ఎస్పీ చందనా దీప్తి. ప్రజలే ఫ్యామిలీ.. వారికి సేవలందించడంలోనే నాకు సంతృప్తి అని చెబుతున్నారు. వరుస ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న ఆమె శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. సంగీతం, కవిత్వంతోపాటు పెయింటింగ్స్ వేయడం చాలా ఇష్టమని.. లాంగ్ టెన్నిస్, స్విమ్మింగ్‌లో ఎన్నో మెడల్స్ వచ్చాయని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదిరించి జీవితంలో రాణించిన ప్రతి ఒక్కరూ తనకు స్ఫూర్తి అంటూ ఐపీఎస్ ఆఫీసర్లలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న చందనా దీప్తితో పర్సనల్ టైం ఆమె మాటల్లోనే.. సాక్షి, మెదక్ : సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మల్కాపూర్‌కు వచ్చిన సందర్భంలో మహిళలు, విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఈ అమ్మాయిని చూడండి.. యంగ్ డైనమిక్ ఎస్పీ.. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ రాణించాలి.’ అని పిలుపునిచ్చారు. ఇది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. ప్రతి రోజూ ఏదో ఒక సమస్యతో పలువురు మా దగ్గరకు వస్తుంటారు. పిల్లల మిస్సింగ్, ఇతరత్రా ఫిర్యాదులు అంటూ మా గడప తొక్కుతారు. వారి బాధలు విన్నా.. చూసినా.. మా కడుపు తరుక్కుపోతుంటుంది. వారి సమస్యలు పరిష్కారానికి నోచుకున్నప్పుడు బాధితుల కంటే మాకే ఎక్కువ సంతోషం ఉంటుంది. మనసుకు హాయిగా అనిపిస్తుంది. మా అమ్మానాన్నది లవ్ మ్యారేజీ. అమ్మ విజయలక్ష్మి ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశారు. నాన్న జకర్యా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజిస్ట్. ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో చిత్తూరు, కాకినాడ, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. అమ్మానాన్నది కష్టపడే మనస్తత్వం. తమ్ముడు ధీరజ్ ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. నేను వరంగల్‌లోని చందా కాంతయ్య మెమోరియల్ (సీకేఎం) ఆస్పత్రిలో జన్మించా. తమ్ముడు ధీరజ్ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటాడు. విద్యాభ్యాసం రాజమండ్రి, చిత్తూరు, నెల్లూరు, ఢిల్లీలో విద్యనభ్యసించా. రాజమండ్రిలో ఎల్కేజీ నుంచి రెండో తరగతి, నెల్లూరులో మూడు, నాలుగో తరగతి.. ఆ తర్వాత చిత్తూరులోని గుడ్ షెపర్డ్ హైస్కూల్లో ఐదు నుంచి 12వ తరగతి (సీబీఎస్ఈ) వరకు చదివాను. నెల్లూరులో ఇంటర్ విద్యనభ్యసించా. ఢిల్లీ ఐఐటీ కంప్యూటర్ సైన్స్ చదివా. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా. రెండో పర్యాయంలో ఐపీఎస్ ర్యాంక్ సాధించా. యాసిడ్ దాడి ఘటన ప్రభావం చూపించింది నేను చదువుకునే రోజుల్లో వరంగల్‌లో యాసిడ్ దాడి ఘటన జరిగింది. అప్పుడు నేను సివిల్స్‌కు ప్రిపేర్ కావాలనే ఆలోచనలో ఉన్నా. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ప్రభావం చూపించింది కూడా. నన్నే కాదు ఎంతో మంది అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సంఘటన మొదట్లో ఆడపిల్లలను బయటికి పంపాలంటేనే కుటుంబ సభ్యులు బెంబేలెత్తారు. ఆనాటి పోలీసుల చర్య రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో కొండంత విశ్వాసం నింపింది. మెల్లమెల్లగా ఈ ఘటన నుంచి కోలుకున్నా. ఐఐటీ నా కల ఎలాగైనా ఐఐటీ సాధించాలనే పట్టుదల నాలో ఉండేది. హైదరాబాద్‌లోని రామయ్య ఐఐటీ కోచింగ్ సెంటర్లో చేరాలనుకున్నా. అప్పటికే సీట్లు అయిపోవడంతో కుదరలేదు. అప్పుడు మేము చిత్తూరులో ఉన్నాం. పక్కనే ఉన్న నెల్లూరు పట్టణంలోని పేరున్న ఓ కోచింగ్ సెంటర్లో చేరేందుకు వెళ్లా. అక్కడ ఓ ఫ్యాకల్టీ నన్ను నిరుత్సాహానికి గురి చేశారు. ‘అబ్బాయిలకు మాత్రమే ఐఐటీలు సూటవుతాయి.. ఇంజినీరింగ్, సైన్స్ సబ్జెక్టుల్లో వాళ్లు మాత్రమే రాణిస్తారు. అమ్మాయిలు ఐఐటీలో సెట్ కాలేరు. వెళ్లి చక్కగా డిగ్రీ చదువుకో.’ అని ఆ లెక్చరర్ అనడంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నా. నేను ఎదుర్కొన్న మొదటి వివక్ష అదే. ఎలాగైనా ఆ లెక్చరర్ అభిప్రాయం తప్పని నిరూపించాలనే కసితో కోచింగ్ తీసుకున్నా. కుటుంబ సభ్యులు కొండంత ధైర్యాన్ని ఇవ్వడంతో పట్టుదలతో ఐఐటీ సీటు సాధించా. ఆ తర్వాత ఆ లెక్చరర్ ఒకసారి కలిస్తే బాగుండేదనిపించింది. నాన్న సూచనలతో సివిల్స్ వైపు.. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరా. ఆ తర్వాత సైంటిస్ట్ కావాలనుకున్నా. నాన్న సూచనలతో సివిల్స్ వైపు మళ్లా. ఐఐటీ పూర్తి కాగానే హైదరాబాద్‌లోని ఆర్సీరెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేరా. మొదటి ప్రయత్నంలో సక్సెస్ సాధించలేకపోయా. వెరవకుండా పట్టుదలతో రెండో ప్రయత్నంలో ఐపీఎస్ ర్యాంక్ సాధించా. ఓ జ్ఞాపకం నేను చిత్తూరులో ఐదో తరగతి చదువుతున్నప్పుడనుకుంటా.. అప్పుడు జరిగిన సంఘటన జ్ఞాపకంగా మిగిలింది. మా టీచర్ హోంవర్క్ ఇచ్చారు. నాతోపాటు చాలామంది విద్యార్థులు చేయలేదు. టీచర్ నాకు తప్ప అందరికీ పనిష్మెంట్ ఇచ్చారు. ఓ విద్యార్థి లేచి ఆమెకు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించాడు. అప్పుడు టీచర్ ఆమెలా ఒకసారి నువ్వు క్లాస్ ఫస్ట్ రా.. ఇంక నీకెప్పుడు పనిష్మెంట్ ఇవ్వను అన్నారు. అది నాకు ఇప్పటికీ గుర్తుండి పోయింది. లాంగ్ టెన్నిస్.. స్విమ్మింగ్ నాకు లాంగ్ టెన్నిస్, స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. విద్యార్థి రోజులతోపాటు ఐపీఎస్ ట్రైనింగ్‌లో చాలా మెడల్స్ సాధించా. వాటితోపాటు కవితలు, కర్ణాటక సంగీతమంటే ప్రాణం. వీణ కూడా నేర్చుకున్నా. ఐఐటీ చదివే రోజుల్లో కల్చరల్ ఈవెంట్లలో ఉత్సాహంగా పాల్గొనేదాణ్ని. చిన్నప్పుడే మ్యాథ్స్ఒలింపియాడ్ వంటి ప్రతిభా పాటవ పోటీల్లో పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించా. వెజ్‌కే ప్రాధాన్యం నాకు వెజిటబుల్ ఆహారమంటేనే ఇష్టం. రైస్ ఇష్టముండదు.. కూరగాయలే తింటా. మొక్కజొన్న కంకి అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్లినప్పుడు రోడ్డ పక్కన కాలుçస్తుంటే.. ఆగి మరి కొంటా. సీజనల్‌గా వచ్చే పండ్లు తింటా. సహజ పద్ధతుల్లో పండించే పండ్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కొనుగోలు చేస్తా. హిల్ స్టేషన్లు సరదా నాకు కాలుష్యం లేని యూకే, లండన్, స్కాట్లాండ్ అంటే ఇష్టం. దేశంలో హిల్ స్టేషన్లంటే కూడా. డార్జిలింగ్, ఉత్తరాఖండ్, కశ్మీర్, గుర్గావ్ వంటి పలు ప్రాంతాల్లో తరచూ పర్యటించా. ప్రతి వేసవిలో ఎటైనా టూర్ వేసేవాళ్లం. వరుస ఎన్నికల నేపథ్యంలో ఈసారి కుదరలేదు. ‘ఫ్రెండ్లీ’ చాట్.. నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో నిత్యం చాట్ చేస్తారు. ఐఐటీ ఫ్రెండ్స్ అందరూ స్థిరపడ్డారు. చాలా మంది విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఒక చోట కలవడం కుదరని పరిస్థితి. త్వరలో యూకేలో గెట్ టుగెదర్ పెట్టాలనే యోచనలో ఉన్నాం. సెట్ అవుతుందో చూడాలి మరి. ఓ ప్రాణాన్ని బతికించడం సంతృప్తినిచ్చింది అప్పుడు నేను రంగారెడ్డి జిల్లాలో ఏఎస్పీగా ఉన్నా. సీఎం బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తుండగా వికారాబాద్ రూట్లో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ఓ వాహనం ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న వ్యక్తి చనిపోయాడని అక్కడున్న వారు భావించి 108 వాహనానికి కాల్ చేస్తున్నారు. నేను పోలీస్ వాహనం దిగి అక్కడికి వెళ్లా. ఆ వ్యక్తి ఛాతి పైకి, కిందికి వస్తున్నట్లు గమనించా. నా వాహనంలోనే వికారాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాం. అతడు బతకడంతో నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. జాబ్ డిటెయిల్స్ ఐపీఎస్ అయ్యాక మొదటగా ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నల్లగొండలో పనిచేశా. ఆ తర్వాత తాండూరు ఏఎస్పీగా విధులు నిర్వర్తించా. అనంతరం నిజామాబాద్ ఓఎస్డీగా నియామకమయ్యా. ప్రస్తుతం మెదక్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. -
నాకు వ్యవసాయమంటే.. ప్రాణం
‘అందరితో కలిసిమెలిసి.. అందరిలో ఒక్కడిగా ఉండటమంటేనే నాకు ఇష్టం. నేను గొప్ప అనే భావన నాలో లేదు. కిందిస్థాయి నుంచి వచ్చాను కాబట్టి నాకు ప్రజలతో అనుబంధం ఎక్కువ’ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చెప్పారు. వ్యవసాయం అంటే ప్రాణమని, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా సమయం దొరికినప్పుడు పొలం వద్దకు వెళ్లి పనులు చేస్తానని వెల్లడించారు. తన కుటుంబానికి సగం బలం తన భార్య జయమ్మ అని, ఆమెనే కుటుంబాన్ని చూసుకుంటుందన్నారు. యాదయ్య శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. చేవెళ్ల: వికారాబాద్ జిల్లా నవాబుపే మండలం చించల్‌పేట గ్రామం మాది. అమ్మ లక్ష్మమ్మ, నాన్న మల్లయ్య. నాన్న రైల్వే ఉద్యోగి. మేము ఇద్దరం సోదరులం. తమ్ముడు సాయన్న ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ చనిపోయాడు. నేను 7వ తరగతి వరకు చించల్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాను. 8నుంచి 10వ తరగతి వరకు వికారాబాద్‌లో చదివి ఆ తర్వాత ఐటీఐ చేశాను. ఇంటర్ హైదరాబాద్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ కళాశాలలో చదివాను. డిగ్రీ డిస్కంటున్యూ చేశాను. ఐటీఐ చేయటంతో ఏపీఎస్ఆర్టీసీలో మోటర్ మోకానిక్‌గా అప్రెంటీస్‌గా పనిచేశాను. చదవుకునే సమయంలోనే 1980లో నాకు వివాహమైంది. పెద్దలు కుదిర్చిన వివాహమే. మేనత్త కూతురునే చేసుకున్నా. అప్పటి వరకు చదువుకున్న చదువుతో ఏదైనా ఉద్యోగం చేయాలనే ఆలోచనతో ఉండేవాడిని. కానీ, 1990లో మా తమ్ముడు సాయన్న మరణించిన తరువాత గ్రామంలోనే ఉంటూ డీలర్‌గా పనిచేశాను. అప్పటి నుంచే రాజకీయంలోకి ప్రవేశించాను. అప్పట్లో వికారాబాద్ నియోజకవర్గంలో నవాబుపేట మండలం ఉండేది. ఆ నియోజకవర్గానికి ఎక్కువగా వలస నేతలే ఉండేవారు. దీంతో మన నియోజకర్గానికి మనమే నాయకులం కావాలనే ఆలోచన మొదలైంది. అప్పుడే రాజకీయాల్లోకి రావాలనే బీజం పడింది. పీఏసీఎస్ డైరెక్టర్‌గా, చైర్మన్‌గా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా గెలిచి ఎమ్మెల్యే అయ్యాను. వికారాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావాలని 20 ఏళ్లు పోరాడాను. కానీ, 2009లో చేవెళ్ల నియోజకవర్గానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అవకాశం ఇచ్చారు. అప్పుడు ఓడిపోయినా.. తరువాత రెండుసార్లు గెలిచాను. చదువుకునే రోజుల్లో కబడ్డీ, వాలీబాల్ బాగా ఆడేవాడిని. ప్రజాసేవలోనే నా జీవితం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో సేవ చేయాలనేదే నా ఆలోచన. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవలోనే ఉన్నా. ఇక ముందు కూడా ఉంటా. కిందిస్థాయి నుంచి నాయకుడిగా ఎదిగా. అందుకే ప్రజల సమస్యలు ఏమిటో బాగా తెలుసు. యాదన్న అని పిలిస్తే పలుకుతా. నేను ఎమ్మెల్యేను.. నేను పెద్ద అని ఏనాడూ ఫీలవ్వలేదు. ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నా. కుటుంబ బాధ్యత నా భర్యే చూసుకుంటుంది నా భార్య జయమ్మ ఇంటర్ వరకు చదువుకుంది. ఇంటి బాధ్యతలన్నీ ఆమే చూసుకుంటుంది. పిల్లల చదువు అన్నీ ఆమే చూసుకునేది. నాకు ముగ్గురు కుమారులు శ్రీకాంత్, రవికాంత్, చంద్రకాంత్, కూతురు ప్రియాంక. చిన్న కుమారుడు చంద్రకాంత్ వివాహం కావాల్సింది ఉంది. పిల్లలు పెద్దవారైనా ఇప్పటికీ స్వగ్రామంలోనే ఉంటున్నా. సాగుపై మక్కువ గ్రామంలో నాన్న వాటాగా వచ్చిన ఐదెకరాల భూమిని నేనే సాగు చేసుకుంటున్నా. అప్పట్లో నాన్న రైల్వే ఉద్యోగి కావటంతో వేరే వారికి కౌలుకు ఇచ్చే వారు. కానీ, నేను ఎమ్మెల్యే అయిన తరువాత వ్యవసాయంపై ఉన్న మక్కువతో నేనే సాగుచేసుకుంటున్నా. ఎమ్మెల్యేగా ఎప్పుడు బిజీగా ఉంటున్నా సమయం ఉన్నప్పుడాల్లా పొలానికి వెళ్లి పనులు చేస్తుంటాను. ఉదయం వాకింగ్ చేస్తూ కూడా పొలం వద్దకు వెళ్లి వస్తాను. చిన్నప్పటి నుంచి గ్రామంలోనే పుట్టి పెరిగినందుకు వల్ల అన్ని పనులు తెలుసు. గ్రామానికి సమీపంలోనే పొలం ఉండటంతో నేను లేనప్పుడు నా భార్య చూసుకుంటుంది. టమాట, మిర్చి, చిక్కుడు పంటలు సాగు చేస్తున్నాం. ఆయనకు ప్రజాసేవ ఎంతో ఇష్టం నా భర్త యాదయ్యకు రాజకీయలు అంటే ఎంతో ఇష్టం. పెళ్లి అయిన నాటినుంచి కూడా ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు. అయినా, ఆయన కుటుంబాన్ని ఎప్పుడూ మరిచిపోలేదు. ఎన్ని పనులు ఉన్నా.. ఎంత దూరం వెళ్లినా.. రాత్రి వరకు తప్పని సరిగా ఇంటికి వచ్చేవారు. ఏదైనా అనుకోని పరిస్థితులు ఉంటే ఫోన్ చేసి చెప్పేవారు. కుటుంబ బాధ్యత నేనే చూసుకున్నా.. ప్రతి విషయం ఆయనకు చెప్పేదాన్ని. నా మాట ఎప్పుడూ కాదనే వారు కాదు. పిల్లల చదువు, పెంపకంలో కూడా ఎక్కవగా నా బాధ్యతే ఉండేది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా పూర్తిగా ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఎవరు వచ్చి పిలిచినా పలుకుతూ.. వారి కష్టాన్ని విని ఓదార్చాటం ఆయనకు ఉన్న మంచి గుణం. ఎవరి మనస్సూ నొప్పించరు. అందరికి అందుబాటులో ఉండాలనే ఆలోచనే ఎప్పుడు ఆయనకు ఉంటుంది. అవే ఆయనను ఎమ్మెల్యే స్థాయికి తీసుకువచ్చాయి. – జయమ్మ, యాదయ్య భార్య -
నాన్న లేని లోటు ఎప్పటికీ తీరనిది..
‘నేను దేవుడిని నమ్ముతా.. ప్రతీ గురువారం సాయిబాబా గుడికి వెళ్తా.. వేంకటేశ్వరస్వామి మా ఇంటిదైవం.. సొంతూరు దేగాం అంటే ఎంతో ఇష్టం.. ఎక్కడికి వెళ్లినా రాత్రికి ఇక్కడికే వచ్చేస్తా.. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఇప్పటికీ నన్ను ఆత్మీయులు, స్నేహితులు వకీల్ సాబ్ అనే పిలుస్తుంటారు. కుటుంబ బాధ్యతలు నా భార్య చూసుకుంటుంది.. నాన్న లేని లోటు ఎప్పటికీ తీరనిది..’ అంటూ ‘పర్సనల్ టైం’లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భైంసా (ముథోల్): మాది భైంసా మండలం దేగాం గ్రామం. అమ్మానాన్న గడ్డెన్న–రాజవ్వ. మేము ఆరుగురం సంతానం. అందులో నేను మూడో వాడిని. అక్క భోజవ్వ, రెండో అక్క కిష్టవ్వ, తర్వాత నేను పుట్టా ను. నా తర్వాత చెల్లె లక్ష్మి, తమ్ముడు గోపాల్‌రెడ్డి, చిన్నతమ్ముడు సూర్యకాంత్‌రెడ్డి జన్మించారు. నా చదువు దేగాం, భైంసాలోని ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఎల్ఎల్బీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేశా. తర్వాత జస్టిస్ సుభాషన్‌రెడ్డి వద్ద ప్రాక్టీస్ ప్రారంభించా. ఆయన ఇటీవలే మరణించడం నన్ను కలిచి వేసింది. న్యాయవాద వృత్తిలో ఆయనే నా గురువు. ఆయన వద్ద ప్రాక్టీస్ చేశాక భైంసా, నిర్మల్, హైదరాబాద్ కోర్టులో న్యాయవాదిగా కొనసాగాను. నాన్న గడ్డెన్న మా కుటుంబానికి ఎప్పుడు దూరంగా ఉండేవారు. అమ్మ రాజవ్వనే మా బాగోగులు చూసేది. చిన్నతనంలో పక్కనే ఉన్న చేన్లకు వెళ్లి పని చేసేవాళ్లం. చిన్నప్పటి నుంచి సింపుల్‌గా ఉండడం అలవాటైపోయింది. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు పూర్తిచేశాను. దైవచింతన, గుడులకు ఎక్కువగా వెళ్తా.. విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మికంగా గడపడం నాకు ఇష్టం. గురువారం ఎక్కడ ఉన్నా సాయిబాబా గుడికి వెళ్లి దర్శించుకుంటా. ఇక చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని ఎంతో పూజిస్తా. వేంకటేశ్వరస్వామి మా ఇంటిదైవం. ఆధ్యాత్మికంగా గడపడం ఎంతో ఇష్టం. కాని ఎక్కువ సమయం ప్రజలమధ్యే ఉంటాను. ఎమ్మెల్యేగా గెలిచాక మహాదేవుని మందిరాలు, హనుమాన్ ఆలయాలు, జగదంబాదేవి ఆలయాలు చాలానే దర్శించుకున్నాను. దైవం అంటే ఎంతో ఇష్టం. ఎక్కడికి వెళ్లినా గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటాను. అది కూడా సామాన్యులతో కలిసి వెళ్లడమే ఇష్టం. ఆలయాల్లో వీఐపీ దర్శనాలంటే నచ్చవు. దేవుడి ముందు అందరూ సమానమన్నదే నా ఆలోచన. కుటుంబ బాధ్యత ఆవిడదే.. ఎల్ఎల్బీ పూర్తయ్యాక న్యాయవాద వృత్తిలో ఉన్న సమయంలోనే లక్ష్మితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు సులోచనను దేగాంలో అక్క కొడుకు అప్పం శ్రీనివాస్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశా. కొడుకు వెంకట్రాంరెడ్డికి కామోల్ గ్రామానికి చెందిన అక్షయతో పెళ్లి జరిపించా. నా తల్లి రాజవ్వ, భార్య లక్ష్మి, కోడలు అక్షయ ముగ్గురిది భైంసా మండలం కామోల్ గ్రామం. నాకు ఇద్దరు మనుమళ్లు. వ్యవసాయంతోపాటు కుటుంబ బాధ్యతలను నా భార్య చూసుకుంటుంది. ఇప్పటికీ పంటపొలాలకు వెళ్లి వస్తుంది. ఏటా పంటలు వేయడం, కోయడం అన్ని ఆమే చూసుకుంటుంది. ప్రజల మధ్య ఉండడం ఇష్టం.. సామాన్య జీవితం గడపడమే ఎంతో ఇష్టం. ఏసీలో ఉండడం నచ్చదు. ఇప్పటికీ ఫ్యాన్ కిందే నిద్రపోతాం. ఇంట్లోనూ హంగు ఆర్భాటాలు నచ్చవు. మా సొంత గ్రామం దేగాంలో నాన్న కట్టిన ఇంట్లో నా తమ్ముళ్లతో కలిసి ఉంటాను. ఎంత రాత్రి అయినా దేగాంలోని సొంతింటికే వెళ్లి అక్క డే నిద్రపోతాను. నా తముళ్లు గోపాల్‌రెడ్డి, సూర్యకాంత్‌రెడ్డి ఇప్పటికీ వ్యవసాయం చేస్తారు. శుభకార్యాలు ఉన్నా, గుడులకు వెళ్లాలన్నా, ఊర్లకు వెళ్లాలన్నా మా కుటుంబ సభ్యులెవరైనా బస్సు ల్లోనే ప్రయాణం చేస్తారు. రక్త సంబంధీకులు, బందువుల శుభకార్యాలకు మా కుటుంబీకులే వెళ్తుం టారు. సామాన్యుల శుభకార్యాలు ఉంటే నేను తప్పకుండా హాజరవుతాను. నేను ప్రయాణించే వాహనం సాదాగా ఉందని మార్చాలంటూ పదేపదే చెబుతుంటారు. కాని అలాంటి వాహనంలోనే వెళ్లడమే నాకు ఇష్టం. చాలా సార్లు మారుమూల గ్రామాలకు ద్విచక్రవాహనాలపైనే వెళ్తుంటా. అక్కడ వారితో కలిసిపోతా. నా దగ్గరికి ఎవరైనాసాయం కోరి వస్తే కచ్చితంగా చేసిపెడుతాను. నాన్న మరణం కలిచివేసింది.. ప్రజా సేవ కోసం మా తండ్రి గడ్డెన్న భైంసాలో ఉండేవారు. ఆయనలేని లోటు ఎప్పటికీ తీరనిది. ఆయన వారసత్వమే మాకు వచ్చింది. మాకు ఉన్నా లేకున్నా సామాన్యుల కోస మే మేమున్నామని అలాగే కలిసిపోతున్నాం. ఇష్టా ఇష్టాలు.. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం సామాన్య జీవితం గడపడమే నాకు ఇష్టం. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమా థియేటర్‌కు కూడా వెళ్లలేదు. జేసుదాస్, మహ్మద్‌రఫీ, కిశోర్‌కుమార్, ఘంటసాల ఇలా వారు పాడిన అలనాటి పాటలు జర్నీలో విం టుంటాను. మాంసాహారం అంటే కొంచెం ఇష్టం. నా భార్యకు, నాకు, నా కుటుంబానికి, నా అక్కలు, తమ్ముళ్లు, చెల్లెలు ఇలా ఎవరికైనా సామాన్య జీవితం గడపడమే ఇష్టం. సింపుల్‌గా పల్లెల్లోనూ ఉంటూ ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు వారంతా. వ్యవసాయ పనులు చూసుకుంటా మంత్రిగారి కోడలన్న ఆలోచన కూడా మాకు లేకపోయేది. ఇప్పుడు మా వారు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. అయినా మాకు అలాంటి ఆలోచనలే రావు. ఎప్పటిలాగే ఉండడం మాకు తెలుసు. తెలిసిన వారంతా హైదరాబాద్‌లో ఉండాలని చెబుతుంటారు. దేగాం విడిచి పెట్టి వెళ్లడం నాకు నచ్చదు. ఆయన ఎప్పుడూ ప్రజలతో బిజీగా ఉంటారు. కుటుంబ బాధ్యతలు నేను చూసుకుంటాను. ఉన్న వ్యవసాయ పనులు చేయిస్తాను. ఎక్కడికి వెళ్లాలన్న బస్సులోనే వెళ్లివస్తాను. తెలిసినవారు కారులో పోదామన్న అలాంటిది ఇష్టం ఉండదు. న్యాయవాద వృత్తిచేసే సమయం నుంచే ఎక్కువగా ప్రజల మధ్య ఉండేవారు. ఇప్పటికీ ఆయన ప్రజలతోనే ఉంటారు. – గడ్డిగారి లక్ష్మి, ఎమ్మెల్యే సతీమణి -
నన్ను తీర్చిదిద్దింది వైఎస్ జగన్మోహన్రెడ్డి..
కష్టాలు ఎదుర్కొన్నా.. అర్ధాకలితో అలమటించా.. మా కుటుంబానికి నాన్న చెప్పిన మాటే వేదం అనుకున్నదానికంటే ముందే రాజకీయ అరంగేట్రం చేశా ప్రజలతో మమేకమయ్యే అవకాశం రావడం ఒక వరం పర్సనల్ టైమ్‌లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ‘ప్రతి పనిని మనసుపెట్టి చేస్తే విజయం సాధిస్తాం. కష్టాల కడలిలో చిక్కుకున్నా.. విజయాల పరంపర కొనసాగినా.. ఒకే తీరున ఉండడం మా కుటుంబ సంప్రదాయం. కష్టాలకు కుంగిపోవడం.. విజయాలకు ఉప్పొంగిపోవడం మా ఇంట అలవాటు లేదు. ప్రతి అంశంపై అవగాహన ఉంటేనే మరో మెట్టెక్కుతామని నాన్న చెప్పిన మాట మాకు వేదం. అదే మా ఎదుగుదలకు సోపానం. మూడు దశాబ్దాల క్రితం సాగునీటిపరంగా మా సొంతూరు నారాయణపురం, సమీప గ్రామాల రైతాంగం పడుతున్న అగచాట్లకు అల్లాడిపోయి నేను తీసుకున్న నిర్ణయం.. ఆ ఊళ్లకు సాగునీరివ్వడంతోపాటు ఆ ఉపకారం నాకు ఉపాధి చూపింది. ఉన్నత విలువలు పాటించే వృత్తిపరమైన కాంట్రాక్టర్‌గా తీర్చిదిద్దింది. ప్రతి సమస్యను రైతుల కోణంలో.. సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాల కోణంలో చూడడం నాకు జన్మతః లభించిన వరం.. అదే నన్ను ఖమ్మం జిల్లా ప్రజలకు చేరువ చేసింది. శీనన్నగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా చేసింది’ అంటున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఈవారం పర్సనల్ టైమ్. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కల్లూరు మండలం నారాయణపురం మా సొంతూరు. చిన్నప్పుడు ఊళ్లోనే వ్యవసాయ పనులు చేశా. 1985లో ఎన్టీ ఆర్ హయాంలో గ్రామోదయ పథకం అమలులో ఉండేది. దానిని ఆసరా చేసుకుని మాఊరి సమీ పంలో గల పేరువంచ మేజర్‌పై క్రాస్‌వాల్ నిర్మించేందుకు ఉపక్రమించా. దీనికి అవసరమైన డబ్బులు మాత్రం నా దగ్గర లేవు. పని విలువలో సగం ఊరు చెల్లిస్తే.. సగం ప్రభుత్వం భరించేది. అయితే ఊళ్లో ఉన్న పరిస్థితి దృష్ట్యా విరాళాలు అడిగేందుకు నాకు మనసు రాలేదు. శ్రమను పెట్టుబడిగా పెట్టి నిర్మాణానికి అవసరమైన వస్తు సామగ్రిని సమకూర్చుకుని పేరువంచ మేజర్‌పై క్రాస్‌వాల్ శ్రమదానంతో నిర్మించా. నా జీవితంలో తొలి నిర్మాణం కావడంతో ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్తే ఎంతో ఆనందం కలుగుతుంది. క్రాస్‌వాల్ నిర్మాణం వల్ల 450 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. క్రాస్‌వాల్ నిర్మాణానికి నేను పడిన తప న ఎన్నెస్పీ అధికారులను ముగ్ధులను చేసింది. రూ.28వేల విలువైన క్రాస్‌వాల్ నిర్మాణంతో నేను తొలి విజేతగా నిలబడితే.. అప్పటి ఎన్నెస్పీ ఎస్ఈ చెరుకూరి వీరయ్య ప్రోత్సాహం నాకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. ‘నీకు కాంట్రాక్టర్‌గా రాణించే ఓర్పు.. నేర్పు, శ్రమించే తత్వం ఉంది.. నేను నామినేషన్ ప్రాతిపదికన ఒక పని కేటాయిస్తున్నా.. చేసుకో’ అని ప్రోత్సహించారు. రూ.9 వేల పని అప్పగిస్తే దిగ్విజయంగా పూర్తి చేశా. ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, నేను అందరం శ్రమజీవులమే. ఒకరి శ్రమపై ఆధారపడే అలవాటు మాకు ఎప్పుడూ లేదు. ఎవరి పని వారు చేసుకోవాలని, అందులో సంతృప్తి పొందాలనేది మా సంస్కృతి. దాన్ని ఇంట్లో పెంపొందించింది నాన్నే. నాన్నకు భూమిపై ఎడతెగని మక్కు వ. వ్యవసాయం గిట్టుబాటు కాక నాన్న కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నా.. కరువు వేధిస్తున్నా.. ఆయనకు భవిష్యత్‌పై ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కుచెదిరేది కాదు. నాన్న వారసత్వపు ఆస్తిగా 32 ఎకరాలు పంచుకుంటే.. ఆయన శ్రమ పెట్టుబడిగా పెట్టి మరో 32 ఎకరాలు సంపాదించారు. మూగజీవుల పట్ల నాన్నకు ఉండే మమకారం, ప్రేమ మమ్మల్ని కట్టి పడేసేవి. వాటికి ఆకుపసరు, దినుసులతో వైద్యం చేయడంలో నాన్న రాఘవరెడ్డిది అందెవేసిన చేయి. 4 గంటలకు లేచి మోట కొట్టేవారు. అమ్మ సామ్రాజ్యం పొలానికి వెళ్లి పశువులకు మేత తెచ్చేది. అవకాశం ఉన్నంత మేర కష్టపడి పేరు తెచ్చుకుని ఉన్నతిలోకి రావాలన్నది నాన్న సిద్ధాంతం. అందుకే నాన్న మరణించేంత వరకు శ్రమించారు. కుటుంబాన్ని వృద్ధిలోకి తేవడంలో నాన్న పాత్ర ఎంతో.. ఆయనకు చేదో డు వాదోడుగా ఉండి క్షణం సమయాన్ని వృథా చేయకుండా కుటుంబ ఉన్నతికి ధారపోసిన అమ్మ స్వరాజ్యం సేవా దృక్పథం, త్యాగనిరతి అంతే గొప్పది. నాన్నకు భూమి అంటే ప్రాణం .. మా పొలం పక్కన ఎకరం అమ్ముతున్నారని తెలిసి దాన్ని కొనేందుకు ఆయన పెళ్లి సందర్భంగా మా అమ్మమ్మ వాళ్లు పెట్టిన వెండి పళ్లెం సైతం అమ్మా రు. ఇప్పుడు నేను, తమ్ముడు ప్రసాదరెడ్డి సైతం నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం. మేము చేస్తున్న వ్యాపారాల్లో రూపాయి మిగిలినా దానిని భూమి మీద పెట్టడానికే ఆసక్తి చూపుతాం. దుబారా చేయడం మా ఇంటా.. వంటా లేదు. ఎన్ని డబ్బులు వచ్చినా.. వాటిని భవిష్యత్‌కు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తామే తప్ప ఆడంబరాలకుపోం. ఇక కాంట్రాక్టర్‌గా ఎంత పేరున్నా.. అదే రీతిలో ఆర్థిక కష్టాలు సైతం చవిచూడాల్సి వచ్చింది. వృత్తి ప్రారంభ సమయంలో చేతినిండా పనులున్నా.. జేబులో చిల్లిగవ్వ లేక అల్లాడిన పరిస్థితులనేకం. నిర్మల్‌లో కాంట్రాక్టు పనులు చేస్తున్న సమయంలో ఆర్థిక కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నేను, ప్రసాదరెడ్డి ఆ రోజు నిర్మల్ నుంచి ఇంటికి తిరిగొచ్చే సమయంలో ఇద్దరి దగ్గర కడుపు నిండా తినడానికి డబ్బులేని పరిస్థితి. ఇద్దరం చెరి రెండు అరటి పండ్లు తిని అయిందనిపించాం. ఇక వృత్తిపరంగా.. వ్యాపారపరంగా దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నేను నిరంతరం బిజీగా ఉంటుండడంతో కుటుంబ వ్యవహారాలన్నీ నా సతీమణి మాధురి చూసుకునేది. పిల్లలను ఉన్నతులను చేయడం, వారి అభిరుచులకు అనుగుణంగా ఎదిగేలా తీర్చిదిద్దడంలో ఆవిడ పాత్ర ఉదాత్తమైంది. ఇప్పటికీ మా మధ్య మాట పట్టింపులు ఉండవు. ఎదుటివారు నొచ్చుకునేలా మాట్లాడే పద్ధతికి మేము ఇద్దరం వ్యతిరేకం. నేను ఎప్పుడైనా తొందరపాటుగా మాట తూలే పరిస్థితి వచ్చినా.. సరిచేయడం.. సర్దిచెప్పడం ఆమెకు మాత్రమే సాధ్యం. ఇక ఎంపీగా.. రాజకీయ నేత గా నన్ను తీర్చిదిద్దింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండలతో ఖమ్మం లాంటి క్లిష్టతరమైన రాజకీయ పరిస్థితులు కలిగిన ప్రాంతంలో ఎంపీగా వైఎస్సార్ సీపీ నుంచి విజయం సాధించా. అసలు 2013లో నేను రాజకీయ అరంగేట్రం చేస్తానని అనుకోలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశం జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం ఐదేళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా ప్రజలకు చేరువయ్యే అవకాశం వచ్చింది. 2019లో రాజకీయాల్లోకి రావాలని తొలుత అనుకున్నా.. కానీ.. ముందే జరిగిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు చేరువయ్యే విధానం.. ప్రతి అంశంపై సమగ్ర అవగాహన ఉండటం నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. కాంట్రాక్టర్‌గా నా ఉన్నతిని ఒక దశలో అయిన వారే జీర్ణించుకోలేని పరిస్థితి. అవకాశం వచ్చినప్పుడల్లా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగా. కాంట్రాక్టర్‌గా 60 శాతం వరకు నాకు సక్సెస్ రేటు ఉంది. నాన్న రాఘవరెడ్డి ఎప్పుడూ నన్ను సాధారణ ఉద్యోగిగా చూడాలనుకోలేదు. జీవితంలో నలుగురికి ఉపయోగపడేలా.. పదిమంది మెచ్చేలా జీవన విధానం ఉండాలనేవారు. మా అబ్బాయి హర్షారెడ్డి ఎంబీఏ పూర్తి చేశాడు. వ్యాపారరంగంలో అడుగు పెట్టాడు. తనదీ శ్రమించే స్వభావమే. పాప సప్ని పబ్లిక్ రిలేషన్స్ సబ్జెక్టులో స్పెయిన్‌లో మాస్టర్ డిగ్రీ చేసింది. మీడియా రంగంలోకి అడుగిడాలనేది ఆవిడ సంకల్పం. వ్యాపార రంగంలో ఉండటం మూలాన పిల్లల ఎదుగుదలలో పూర్తిగా భాగస్వామ్యం కాలేకపోయా. సతీమణి మాధురి తోడ్పాటు వల్ల వారిని ఉన్నతులను చేశా. అప్పట్లో వారికి కేటాయించలేకపోయిన సమయాన్ని ఇప్పుడు వారితో గడిపేందుకు ప్రయత్నిస్తున్నా. అప్పుడప్పుడు కుటుంబపరంగా వివిధ ప్రాంతాలకు వెళ్లడం.. సినిమాలకు వెళ్లడం ఇప్పుడిప్పుడే చేస్తున్నా. కాంట్రాక్టు వ్యవహారాలు ఇప్పటికీ నేను, తమ్ముడు చూసుకుంటాం. క్షేత్రస్థాయి పనుల పర్యవేక్షణ బాధ్యత ప్రసాదరెడ్డిది అయితే. టెండరింగ్ వ్యవహారాలు, పత్రాల సేకరణ, సమర్పణ వంటి అంశాల బాధ్యతను నేను చూస్తుంటా. నాన్న పేరుతో రాఘవ సంస్థ అనేక రంగాల్లో ఇప్పటికే అడుగిడింది. పొలం పనులంటే ఇప్పటికీ నాకెంతో ఇష్టం. రైతు పడుతున్న కష్టానికి తగిన ఫలితం రావడం లేదనే ఆవేదన. విద్యార్థి దశలో నాన్న పడుతున్న కష్టం, తోటి రైతులు వ్యక్తం చేస్తున్న ఆవేదన నా చెవుల్లో పదే పదే ధ్వనించేవి. ఇక మా ఊరి వ్యవసాయ పరిస్థితి విభిన్నం. తలాపునే సాగర్ కాల్వ ప్రవహిస్తున్నా.. పొలాలకు చుక్క నీరందేది కాదు. మాకు మెట్ట పంటలే దిక్కు. దీంతో రైతులకు సహాయం చేయాలనే లక్ష్యం.. పొలంలో సిరులు పండించాలనే పట్టుదల నన్ను సేవాభావం వైపు నడిపించింది. -
రూ.200లతో ప్రస్థానం.. నేడు కోట్లకు అధిపతి
ఆసిఫాబాద్: చేసేది గుమాస్తాగా.. వచ్చేది రూ. 200ల వేతనం.. దీంతోనే కుటుంబ పోషణ బాధ్యత.. ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే ఉన్నతంగా ఎదగడం కష్టమే. కాని కష్టాలకు ఏమాత్రం వెరవకుండా తనకున్న ఆలోచన విధానంతో ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగారు రఫీక్ జివాని. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అయినా సరే కేవలం ఒక పూట భోజనం, నాలుగు గంటలు మాత్రమే నిద్రతో నిరంతరం శ్రమించి అంచెలంచెలుగా ఎదిగారు రఫీక్. ఉన్నత చదువులు లేకపోయినా స్వయం కృషితో నేడు వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. రూ.వందలతో మొదలైన ప్రస్థానం రూ.కోట్లకు అధిపతిగా మా రారు. పెద్దపెద్ద చదువులు లేకపోయినా వ్యాపారంలో విజయవంతంగా కొనసాగుతున్న రఫీక్ జివానిపై ‘సాక్షి’ సక్సెస్ స్టోరీ. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన సదృద్దీన్ జివానీ, రోషన్ బాయి దంపతులకు తొమ్మిది మంది సం తానం. ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమారుడు రఫీక్ జివాని. సదృద్దీన్ పూర్వీకులు గుజరాత్‌లోని కచ్ నుంచి 150 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మహారాష్ట్రలోని పాండ్రకౌడకు వలస వచ్చారు. కొంతకాలం అక్కడే ఉన్న వీరి కుటుంబం అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని ఇంద్రవెళ్లికి వచ్చారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ వచ్చారు. ఈక్రమంలో రఫీక్ జివాని ప్రాథమిక విద్యాభ్యాసం నాలుగో తరగతి వరకూ హిందీ మాద్యమంలో జరిగింది. పదో తరగతి ఆసిఫాబాద్‌లో చదువుకున్నారు. 1981లో పదోతరగతి ఉత్తీర్ణత సాధించినా ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ చదువుకోలేకపోయాడు. చదువుకు స్వస్తి చెప్పిన రఫీక్ ఉపాధి వేటలో వాంకిడి మండలం అర్లిలో కమీషన్ పద్ధతిలో కల్లేదార్గా చేరారు. నాలుగు నెలలు పనిచేసి మొట్టమొదటి సంపాదన రూ.5200/– కమీషన్ పొందారు. అనంతరం 1981 నుంచి 83 వరకు పట్టణంలోని ఓ హోల్‌సేల్ వ్యాపారి వద్ద రూ. 200/– కు గుమాస్తాగా చేరారు. రెండేళ్లు పనిచేసినా వేతనం పెంచకపోవడంతో 1984 నుంచి 91 వరకు పట్టణంలోని మరో వ్యాపారి వద్ద రూ.400/– కు పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. గుమాస్తాగా పనిచేసిన 13 ఏళ్ల కాలంలో కేవలం ఒకపూట భోజనం, నాలుగైదు గంటల నిద్ర మాత్రమే దొరికేది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో పదిమంది కుటుంబం ఒకే గదిలో ఉండాల్సి వచ్చేది. అంచెలంచెలుగా వ్యాపార విస్తరణ.. గుమాస్తాగా వచ్చే జీతం సరిపోకపోవడం, తమ్ముళ్లు ఎదగడంతో పట్టణంలో కిరాణా హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం ప్రారంభించారు. రఫీక్ వ్యాపార నిపుణత, తమ్ముళ్ల సహకారంతో వ్యాపారం మరింత విస్తరించారు. గుమాస్తాగా పనిచేసిన అనుభవంతో పట్టణంలో హోల్‌సేల్ వ్యాపారంలో రాణించారు. అప్పట్లో మండలంలో వట్టివాగు ప్రాజెక్టు ప్రారంభమవడంతో ఈ ప్రాంతంలో వరి ధాన్యం పండించే వారు. ఈక్రమంలో పట్టణంలో అద్దె ప్రాతిపదికన రైస్‌మిల్ ప్రారంభించారు. 2005లో వట్టివాగు కాల్వకు గండిపడడంతో పొట్టకు వచ్చిన వరి పంట సాగునీరందక ఎండిపోయింది. దీంతో రైస్‌మిల్ నిర్వహణ భారంగా మారింది. సగం నష్టంతో రైస్‌మిల్ మిషనరీ విక్రయించారు. జిన్నింగ్‌మిల్లుల ఏర్పాటు.. మారిన పరిస్థితులతో ఈ ప్రాంతంలో పతి సాగు పెరగడంతో బ్యాంకు సహకారంతో ఆరు డీఆర్‌ల జిన్నింగ్ పరిశ్రమ స్థాపించారు. అంచెలంచెలుగా వ్యాపారాభివృద్ధి చేసి 2010లో పట్టణానికి సమీపంలోని రాష్ట్రీయ రహదారిపై స్వంతంగా 24 డీఆర్ జిన్నింగ్, ప్రెస్సింగ్ ఇండస్ట్రీ ప్రారంభించారు. తనకున్న వ్యాపార మెలకువలు, అనుభవంతో జిన్నింగ్ ఇండస్ట్రీలో రాణిస్తూ వచ్చాడు. 2016–17లో పక్కనే రెండో జిన్నింగ్ మిల్లు ప్రారంభించారు. అప్పటి నుంచి సుమారు 400 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. స్థానికంగా జిన్నింగ్ మిల్లు ఏర్పాటు చేయడంతో రైతులు ఆదిలాబాద్ మార్కెట్‌కు వెళ్లడం తప్పడంతో పాటు మద్దతు ధర పొందుతున్నారు. వ్యాపారంలో, మాటల్లో చతురత కలిగిన రఫీక్ సుమారు 20 ఏళ్ల పాటు పట్టణ కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. గత మూడేళ్లుగా ఏ ఎంసీ డైరెక్టర్‌గా ఉన్నారు. ధాతృత్వంలోనూ ముం దుండే రఫీక్ కుల, మతాలకతీతంగా గుళ్లు, మసీ దులకు సాయం చేయడంలో ముందున్నారు. కుమారులను ఉన్నతులుగా తీర్చిదిద్ది.. చిన్నప్పటి నుంచి కషాలు పడ్డ రఫీక్ గుజరాత్‌లోని పోరుబందర్‌కు చెందిన పేదింటి అమ్మాయి మునీరాను వివాహం చేసుకున్నారు. రఫీక్‌కు ఇద్దరు కుమారులు. పెద్దోడు రిజ్వాన్ ఇంజినీరింగ్ పూర్తిచేసి, ప్రస్తుతం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. చిన్న కుమారుడు ఇర్ఫాన్ హైదరాబాద్‌లోని దక్కన్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. తాను చదువులకు దూరమైనా తన కుమారులను ఉన్నత చదువులు చదివిస్తున్నానని సంతృప్తిగా చెబుతారు రఫీక్. -
మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్.. ‘మోడల్’ సారయ్యారు..!
హుజూరాబాద్: పదో తరగతిలో మంచి మార్కులు వచ్చినా స్నేహితుల ప్రభావమో.. లేక అక్కడి పరిస్థితుల వల్లనో ఇంటర్మీడియెట్‌లో ఫెయిలయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు సబ్జెక్టులు తప్పడంతో నిరాశ చెందాడు. ఇక చదువు అబ్బదు.. ఊరిలో వ్యవసాయం చేసుకుందామని ఇంటికి పయనమయ్యే సమయంలో తల్లిదండ్రులు వెన్నుతట్టారు. జీవితంలో ఒడిదొడుకులు సహజం.. నిర్భయంగా మరోసారి పరీక్షలు రాయి తప్పక విజయం సాధిస్తావు అని ప్రోత్సహించడంతో క్రమశిక్షణ, పట్టుదలతో మరోసారి ప్రయత్నించాడు. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూక్తిని మదిలో నింపుకొని 86శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి సత్తాచాటాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరగలేదు. 2013లో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఎంపికై, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకునే స్థాయికి ఎదిగాడు. హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ అనుమాండ్ల వేణుగోపాల్‌రెడ్డి. ప్రస్తుతం వీణవంక మండలం ఘన్ముక్కుల మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వరుసగా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ రాషర్ట స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటర్ ఫైయిలైనా.. సడలని పట్టుదలతో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన వేణుగోపాల్‌రెడ్డి ‘సక్సెస్’ స్టోరీ ఆయన మాటల్లోనే.. కుటుంబ నేపథ్యం.. మా తల్లిదండ్రులు అనుమాండ్ల తిరుపతిరెడ్డి, విజయలక్ష్మి. నేనొక్కడినే కొడుకు. చెల్లెలు ఉంది. నాన్న గుడివాడలో రైల్వే డిపార్ట్మెంట్లో(1983) ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగ రీత్యా కుటుంబం అక్కడే ఉండాల్సి వచ్చింది. కోస్తా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివాను. ‘పది’లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించడంతో మా నాన్న విజయవాడలోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంటర్లో చేర్చాడు. కళాశాలలో ఉన్న పరిస్థితుల ప్రభావామో లేక స్నేహితుల వల్లనో చదువు మీద కాకుండా ఇతరత్రా విషయాల వైపు దృష్టి మళ్లింది. చదువులు అటకెక్కాయి. ఇంటర్లో మూడు సబ్జెక్టులు ఫెయిలయ్యాను. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చదువుకు పుల్‌స్టాప్ పెట్టి వ్యవసాయం చేసుకొందామనుకున్నా.. కానీ మా నాన్న దిగాలుగా ఉన్న నన్ను చూసి జీవితంలో ఒడిదొడుకులు సహజం.. ప్రయత్నిస్తే పోయేదేం లేదు. మరోసారి ట్రై చెయ్యి అని వెన్నుతట్టాడు. అప్పుడు కొండంత బలం వచ్చింది. ఇంటర్ మళ్లీ పరీక్షలు రాయగా 83శాతం మార్కులు వచ్చాయి. ఇక చదువుతాననే ధైర్యం వచ్చింది. అక్కడే లయోల కళాశాలలో బీఎస్సీలో చేరాను. 91శాతం మార్కులు వచ్చాయి. ఆ తర్వాత ఎంఎస్సీ పూర్తి చేసి 2013 కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశాను. 15ఏళ్లుగా విద్యాబోధన ఇంటర్ ఫెయిలయ్యానని ఇంట్లో కూర్చుండి ఉంటే ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగేవాణ్ని కాదు. 1999 నుంచి 2013 వరకు హన్మకొండలోని న్యూసైన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా పని చేశాను. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దగలిగాను. వందల మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పీహెచ్డీ పూర్తి కాగా నే 2013లో మోడల్ స్కూల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపాల్‌గా వీణవంక మండలంలో ఎంపికయ్యాను. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు.. 2017లో తెలంగాణ రాష్ట్ర ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డుతోపాటు రూ.10,116 నగదు అందుకోవడం జీవితంలో మరిచిపోలేని సంఘటన. అవార్డు తీసుకునేటప్పుడు నా చేతులు వణికిపోయాయి. ఇంటర్లో ఫెయిలై ఇంటి వద్ద ఉంటే ఇలా ఉత్తమ అవార్డును అందుకునే వాడిని కాదు అని ఒక్కసారి నాటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. నా శ్రీమతి ఇంటర్ వరకే చదివింది. నా ప్రోద్బలంతో ఎంబీఏ, బీఎడ్, ఎల్ఎల్బీ చదివించాను. ప్రస్తుతం ఆమె వరంగల్‌లోని కోర్టులో టైపిస్టుగా విధులు నిర్వర్తిస్తోంది. మార్కులు శాశ్వతం కాదు.. ప్రతీ విద్యార్థి లక్ష్యం నిర్ధేశించుకుని లక్ష్య సా«ధనకు ఏకాగ్రతతో ముందుకెళ్లాలి. విఫలమైతే కుంగిపోవద్దు. మార్కులు శాశ్వతం కాదు.. జీవితం చాలా విలువైనది. ప్రతీ పాఠశాలలో కౌన్సెలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చర్చించాలి. విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించాలి. మా పాఠశాలలో ఏడో తరగతి నుంచే నెలకోసారి కౌన్సెలింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లలకు ఉండాలి. ఫెయిలయ్యానని మా తల్లిదండ్రులు ప్రోత్సహించకుంటే ఇప్పడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదిగేవాడిని కాదు. -
కష్టాలను గెలిచిన ముత్యం
చదువుకోవాలనే తపన ఉంటే పరీక్షల్లో ఫెయిలైనా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని నిరూపించాడు తాండూరు పట్టణానికి చెందిన ముత్యాల ప్రభు. నాన్న మంచం పట్టడంతో.. కుటుంబ భారాన్నంతా అమ్మ తనపై వేసుకుని నడిపించడాన్ని మర్చిపోలేదని చెప్పారు. 8 మంది సంతానానికి కూడు, గుడ్డ కోసం ఆమె పడిన ఇబ్బందులను కళ్లారా చూశాడు. ఇదే అతని పట్టుదలకు కారణమైంది. పక్క రాష్ట్రంలోని ఊరూరూ తిరిగి ముత్యాలమ్మిన ఆయన.. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. తాండూరు: పట్టణంలోని సాయిపూర్ ప్రాంతం ముత్యాల బస్తికి చెందిన ఒబులమ్మ, లక్ష్మణ్ దంపతులకు 8 మంది సంతానం. ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు.. వీరిలో మూడవ కుమారుడు ముత్యాల సెని ప్రభు. ఈయన 1నుంచి 7వ తరగతి వరకు దయానంద్ బాలవిహార్ పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం 8నుంచి 10వ తరగతి వరకు విలియమూన్ హైస్కూల్లో చదివాడు. అంబేడ్కర్ జూనియర్ కాలేజీలో ఇంటర్లో చేరి.. ఫస్టియర్, సెకండియర్‌లో ఫెయిలయ్యాడు. అమ్మకు ఆసరాగా.. కుటుంబం గడవటం ఇబ్బందిగా మారడంతో ముత్యాల ప్రభు 1999లో చదువుకు బ్రేక్ వేశాడు. అమ్మ ఒబులమ్మ చేస్తున్న ముత్యాల వ్యాపారాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అమ్మ, అన్నయ్య నుంచి రూ.5 వేలు తీసుకున్నాడు. ఈ డబ్బుతో హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతానికి వెళ్లి ముత్యాలు, రోల్డ్ గోల్డ్ వస్తువులను కొనుగోలు చేశాడు. మహారాష్ట్రలోని పూణే, షోలాపూర్, ముంబై తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి విక్రయించాడు. ఇలా వచ్చిన లాభాన్ని అన్న, తమ్ముళ్ల చదువు కోసం ఖర్చు చేశాడు. వీరిలో ఒక అన్న టీచర్‌గా, ఇద్దరు తమ్ముళ్లు పోలీసు కానిస్టేబుళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మరో అన్న పట్టణంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. వీరి ఎదగడంలో ప్రభు కృషి ఎంతగానో ఉంది. ఉన్నత చదువులు.. ఇంటర్లో ఫెయిలైనా కూడా చదువుకునే అవకాశం ఉందని తెలుసుకున్న ప్రభు తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్టడీ సర్కిల్లో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం నిర్వహించిన అర్హత పరీక్షలో పాసయ్యాడు. తర్వాత ముత్యాల వ్యాపారం చేస్తూనే 9 ఏళ్ల పాటు చదువును కొనసాగించాడు. డిగ్రీ అనంతరం పీజీ పూర్తిచేశాడు. తర్వాత బీఈడీలో చేరాడు. వైఎస్సార్ హయాంలో నిర్వహించిన 2008 డీఎస్సీ పరీక్షలు రాసేందుకు విజయవాడ వెళ్లి మూడు నెలల పాటు కోచింగ్ తీసుకున్నాడు. డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా అర్హత సాధించాడు. తాండూరు మండలం రాంపూర్‌తండా ప్రాథమిక పాఠశాలలో తొలిసారి ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. ప్రస్తుతం తాండూరు మండలం పర్వతాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య ప్రోత్సాహం.. తన విజయంలో భార్య ఉమారాణి ప్రోత్సాహం ఎంతో ఉందని ప్రభు చెబుతున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు ప్రణవ్య, అక్షిత ఉన్నారు. ఉమారాణి మధ్యలోనే చదువు ఆపేసినా పెళ్లి తర్వాత బీఈడీ పూర్తి చేశారు. ఆత్మహత్యలు సరికాదు.. ఇంటర్లో ఫెయిలయ్యామనే కారణంతో ఇటీవల పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది సరైన నిర్ణయం కాదు. చదువులేకపోయినా జీవితంలో ఎదిగేందుకు అనేక అవకాశాలు వస్తుంటాయి. అన్ని సమస్యలను అధిగమిస్తేనే సక్సెస్ లభిస్తుంది. చదువులో ఫెయిలైతే బతుకు ముగిసినట్లు కాదు. -
సప్లమెంటరీలో పాస్.. మూడు ఉద్యోగాలు సాధించాడు
పాలకుర్తి: కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని నిరూపించారు పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీష్. ఇంటర్మీడియట్, డిగ్రీలో ఫెయిల్ అయినా ధైర్యం కోల్పోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగారు.. ప్రభుత్వ ఉద్యోగంలోనైతే ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్ణయించుకుని కష్టపడి చదివారు.. తద్వారా ఒకటి కాదు రెండు కాదు మూడు ఉద్యోగాలకు ఎంపికైన ఆయన చివరకు ఎస్సై పోస్టును ఎంచుకుని కొనసాగుతున్నారు. మధ్య తరగతి రైతు కుటుంబం ప్రస్తుత భద్రాద్రి జిల్లా పినపాక మండలంలోని ఏడూర్ల బయ్యారం గ్రామానికి చెందిన మధ్య తరగతి రైతు కుటుంబంలో సతీష్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులైన గండ్రాతి వెంకటరమణ – సమ్మయ్యకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమారులు వ్యవసాయం చేస్తుండగా.. చిన్న కుమారుడైన సతీష్‌ను చదివించి ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక. అయితే, 10వ తరగతిలో సాధారణ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఆయన ఇంటర్లో చేరాడు. ఇంటర్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలయ్యాడు. అయినా తల్లిదండ్రులు చదువు కొనసాగించాలని ప్రోత్సహించడంతో సప్లమెంటరీ పరీక్షలు రాసి పాసయ్యాక డిగ్రీలో చేరాడు. అయితే, డిగ్రీలో కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలయ్యాడు. చివరకు మూడో సంవత్సరంలో అన్ని పరీక్షలు రాసి సాధారణ మార్కులతో గట్టెక్కాడు. ప్రభుత్వ ఉద్యోగం దొరికితే... ఒకసారి ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ కోసం సతీష్ వీఆర్వో వద్దకు వెళ్లాడు. అయితే, ఆ పని చేయకపోవడమే కాకుండా జులుం ప్రదర్శించడంతో సతీష్ ఆవేదన చెందాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తనకు ఎదురుపడిన వీఆర్వో మాదిరిగా కాకుండా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఊరికి దూరంగా హైదరాబాద్ వెళ్లాడు. ఒకసారి ఎస్ఐ ఉద్యోగానికి పరీక్ష రాస్తే అవకాశం దక్కలేదు. అయినా నిరుత్సాహానికి గురికాకుండా పోటీ పరీక్షలకు అవసరమైన సబ్జెక్టులపై పట్టు సాధించేలా చదివాడు. అలా రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంతో పాటు డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఇందులో డిప్యూటీ జైలర్ ఉద్యోగాన్ని ఎంచుకోగా ఖమ్మంలో పోస్టింగ్ లభించింది. అయితే, ఆరు నెలల పాటు ఉద్యోగం చేశాక ప్రజలకు సేవల చేయాలంటే ఇది సరైన ఉద్యోగం కాదనుకున్న సతీష్ మళ్లీ ఎస్సై రాతపరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆయన పాలకుర్తి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, లక్ష్యాన్ని ఎంచుకోవడమే కీలకం ఇంటర్లో ఫెయిలైనప్పుడు నన్ను తల్లిదండ్రులు తిడతారనుకున్నాను. కానీ ధైర్యం చెప్పి చదువు కొనసాగించేలా ప్రోత్సహించారు. ఉద్యోగం సంపాదించాలనే తల్లిదండ్రుల కోరికతో పాటు నా లక్ష్యం సాధించాను. చదువుపై ఆసక్తిని పెంచుకుని ఆత్మవిశ్వాసంతో చదివితే ఉన్నత ఉద్యోగాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే సమయంలో లక్ష్యాన్ని ఎంచుకోవడం, దాని చేరుకునేందుకు కష్టపడడం కూడా ముఖ్యమే. – గండ్రాతి సతీష్, ఎస్ఐ, పాలకుర్తి -
టెన్త్‌లో రెండు, ఇంటర్లో మూడు సార్లు ఫెయిల్..
సూర్యాపేటటౌన్ : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.. సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొచ్చెర్ల వేణు. పదో తరగతిలో రెండు సార్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో మూడుసార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా వెనుకడుగు వేయలేదు. ఎలాగైనా చదువును మధ్యలో అపేయకుండా కొనసాగించాలనే సంకల్ఫమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందంటున్నాడు. ఓ వైపు తండ్రి ఆర్థిక ఇబ్బందులు, అన్ని సార్లు ఫెయిల్ అయ్యావు.. ఇక ఏం చదువుతావులే అని అన్నప్పటికీ పట్టుదలతో చదివాడు. తండ్రి ఆర్థిక ఇబ్బందులతో చదువుకు డబ్బులు ఇవ్వకున్నా తాను సొంతంగా లేబర్ పని చేస్తూ వచ్చే డబ్బులతో కోచింగ్ తీసుకొని టెన్త్, ఇంటర్లో పాసయ్యాడు. అక్కడి నుంచి వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు.. సూర్యాపేటకు చెందిన కొచ్చెర్ల వేణు. తాను ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడో అదే సబ్జెక్టు టీచర్‌గా కొనసాగుతున్నాడు. సూర్యాపేటకు చెందిన కొచ్చెర్ల రాములు,లక్ష్మమ్మ కుమారుడు కొచ్చెర్ల వేణు. అతని తోడ ఇద్దరు చెల్లెళ్లు, అక్క, అన్నయ్య ఉన్నారు. తండ్రి రాములు సుతారి మేస్త్రీగా పని చేస్తూ పిల్లలను చదివించేవాడు. కాగా వేణు 7వ తరగతి చదువున్న సమయంలో తల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి వేణుకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే వారి పెద్ద అక్కకు పెళ్లి చేశారు. ఇద్దరు చెళ్లెళ్లను ప్రభుత్వ హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. సమయానికి ఇంట్లో వండి పెట్టేందుకు ఎవరూ లేకపోవడంతో వేణు, అతని అన్నయ్య ఇద్దరు కలిసి వండిపెట్టే వారు. ఇంట్లో పనులు చూసుకుంటూ వేణు స్కూల్‌కు వెళ్లేవాడు. ఫెయిల్ అయినా కుంగిపోలేదు సూర్యాపేటలోని జెడ్పీ బాలుర పాఠశాలలో వేణు పదో తరగతి వరకు విద్యనభ్యసించాడు. 1982 మార్చిలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వేణు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. మళ్లీ సప్లమెంటరీ పరీక్ష రాసి సైన్స్ పాసయ్యాడు. మ్యాథ్స్ ఫెయిలయ్యాడు. 1983 మార్చిలో మళ్లీ పరీక్ష రాసి మ్యాథ్స్ ఉత్తీర్ణుయ్యాడు. అనంతరం ఇంటర్ విద్యకోసం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాడు. 1983–84లో ఇంటర్ ఫస్టియర్‌లో గణితం తప్పాడు. సప్లమెంట్ పరీక్ష రాసినా ఫలితం లేకపోయింది. 1984–85లో ఇంటర్ సెకండరియర్లో ప్రవేశించాడు. ఆ సంవత్సరం వార్షిక పరీక్షలో సెకండరియర్ ఉత్తీర్ణుయ్యాడు. కానీ, ప్రథమ సంవత్సరం గణితం మాత్రం పాస్ కాలేదు. ఎంసెట్ రాస్తే ఇంజనీరింగ్‌లో మంచి ర్యాంకు వచ్చింది. కానీ ఇంటర్లో పాస్ కాకపోవడంతో ర్యాంకు వచ్చినా నిష్పయోజనమైంది. ఎఫ్‌సీఐ గోదాంలో పని చేస్తూ.. ఇంటర్ ఫెయిల్ కావడంతో చేసేదేమీ లేక రెండు సంవత్సరాల పాటు ఎఫ్‌సీఐ గోదాంలో లేబర్‌గా పనికి కుదిరాడు. పని చేస్తూనే ఇంటర్లో తప్పిన సబ్జెక్టు కోసం ట్యూషన్‌కు వెళ్లేవాడు. ఇన్ని సార్లు ఫెయిల్ అయ్యావు ..ఇక ఏం చదువుతావు లే.. పనికి వెళ్లూ అని తన తండ్రి చెప్పినా నిరాశ చెందలేదు. పనికి వెళ్తూనే ఫెయిల్ అయిన సబ్జెక్టులో పాస్ అయ్యేందుకు పట్టుదలతో చదివిడు. ఒక సంవత్సరం ఉప్పలపహాడ్ సమీపంలోని సంగీత కెమికల్స్‌లో పని చేసేవాడు వేణు. అలా పని చేసూకుంటూ 1987 అక్టోబర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టు పరీక్ష రాసి పాసయ్యాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1988లో సిటీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చేరాడు. డిగ్రీ చేస్తూనే వివిధ కంపెనీల్లో పార్ట్‌టైం పని చేస్తూ తన చదువుకు అయ్యే ఖర్చులు వెళ్లదీస్తూ చదివాడు. గణితంలో ఫెయిల్ అయ్యాననే కసితో... తాను టెన్త్, ఇంటర్లో మ్యాథ్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాననే కసితో మ్యాథ్స్‌ను బాగా నేర్చుకుని అదే సబ్జెక్టులో బీఈడీలో చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. 1994 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యాడు. మొదటి ఉద్యోగాన్ని 1995లో ఆత్మకూర్(ఎం) మండలం కూరెళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్న తి వచ్చింది. ప్రస్తుతం పిల్లలమర్రి జెడ్పీహెచ్ఎస్లో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పరీక్ష అనేది జీవితంలో ఒక భాగమే పరీక్ష అనేది జీవితంలో ఒక భాగమే కానీ.. పరీక్షే జీవితం కాదు. ప్రతి ఓటమిని ఛాలెంజ్‌గా తీసుకోవాలి. మన బల, బలహీనతలను అంచనవేసుకొని ముందుకెళ్లాలి. ఎక్కడ అపజయం ఎదురైందో అక్కడే పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. పరీక్ష ఫెయిల్ అయితే జీవితం అయిపోయిందనే భావన మన మనసులో ఉండకూడదు. –కొచ్చెర్ల వేణు, స్కూల్ అసిస్టెంట్ పిల్లలమర్రి జెడ్పీహెచ్ఎస్ -
‘పది’, ఇంటర్ ఫెయిల్.. రూ.3 లక్షల జీతం
పెద్దపల్లి: అతడు ఓ సామాన్య కుటుంబంలో పుట్టాడు.. అందరిలాగే సర్కార్ బడిలో చదువు కొనసాగించాడు. ఇంగ్లిష్, మ్యాథ్స్ సరిగా రాక ‘పది’, ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు. పదే పదే అవే సబ్జెక్టులు తప్పాడు.. ఫెయిల్ అయ్యానని ఏనాడూ కుంగిపోలేదు. జీవితంలో ఎదగాలనే లక్ష్యాన్నీ మరువలేదు. తనకు నచ్చని సబ్జెక్టులోనే పట్టు సాధించాలనుకున్నాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ ట్యూషన్‌కు వెళ్లాడు.. ఫెయిలైన సబ్జెక్టులనే తనకు ఇష్టమైనవిగా మార్చుకుని సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా నెలకు రూ.3 లక్షల వేతనంతో పనిచేస్తూ జీవితంలో డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం లొంకకేసారం గ్రామానికి చెందిన రొడ్డ వైకుంఠం. నిన్నటితరం యువకులతోపాటు రేపటితరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన వైకుంఠం సక్సెస్‌పై ఆయన మాటల్లో.. ‘మాది కమాన్‌పూర్ మండలం లొంకకేసారం. అమ్మ మార్తమ్మ, నాన్న పేరు నారాయణ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేనే ఇంట్లో చిన్నవాడిని నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పెంచాడు. పెద్దన్న భద్రయ్య సింగరేణి ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నన్న హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. నేను 5వ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్నా. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు కమాన్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న. 1986 వార్షిక పరీక్షల్లో మ్యాథ్స్‌లో ఫెయిల్ అయ్యాను. తర్వాత రెండుసార్లు సప్లిమెంటరీ రాసి టెన్త్ పాస్ అయ్యాను. ఫెయిలైన తర్వాత పెద్దన్న కొన్న ఆటో నడిపించాను. నాకు జీవితంలో బాగా ఎదగాలని, ఉన్నత స్థానంలో ఉండాలనే ఆకాంక్ష ఉండేది. అందుకే ఫెయిల్ అయినా చదువు ఆపాలనుకోలేదు. ఆటో నడుపుతూనే గోదావరిఖని జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాను. 1989 పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాను. నా లక్ష్యం అన్నయ్యలకు చెప్పడంతో ఆటో నడపడం మానేసి చదువుకోమని సూచించారు. చదువుకుంటేనే బాగుపడుతావని వారు ప్రోత్సహించారు. అయినా.. ఆటో నడుపుతూ నేను వీక్‌గా ఉన్న సబ్జెక్టులు ఇంగ్లిష్, మ్యాథ్స్ ట్యూషన్‌కు వెళ్లాను. అలా రెండు సబ్జెక్టుల్లో పట్టుసాధించి ఇంటర్ పాస్ అయ్యాను. 1989లో ఎంసెట్ కోచింగ్ తీసుకుని ర్యాంక్ సాధించాను. 1990లో వరంగల్ కిట్స్ కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరాను. ఇంగ్లిష్ మాట్లాడడానికి ఇబ్బంది.. ఇంజినీరింగ్‌లో చేరినా.. ఇంగ్లిష్ సబ్జెక్టులో ట్యూషన్‌కు వెళ్లినా మాట్లాడడం మాత్రం రాలేదు. కాలేజీలో ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే ఇబ్బంది పడేవాడిని. ఎలాగైనా తోటి విద్యార్థుల్లా నేనూ ఇంగ్లిష్ మాట్లాడాలని పట్టుసాధించేందుకు స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ తీసుకున్న. అందరితో మాట్లాడడం ప్రారంభించి సక్సెస్ అయ్యాను. 1994లో బీటెక్ పూర్తిచేశాను. అప్పటికే రాదనుకున్న ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడడం వచ్చింది. ఇంజినీరింగ్ అయిన ఏడాదికే ఉద్యోగం.. కిట్స్ కాలేజీ రాష్ట్రంలోని టాప్ కాలేజీల్లో ఒకటి. దీంతో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఏడాదికే 1995లో మలేషియా కంపెనీ నుంచి ఇంటర్వ్యూకు లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూ సక్సెస్ కావడంతో ఉద్యోగం వచ్చింది. అందులో పనిచేస్తూనే 2008లో ఎరెన్కో గ్రూప్ తలపెట్టిన ఇంటర్వ్యూకు వెళ్లి సెలక్ట్ కావడంతో దుబాయికి వెళ్లాను. దుబాయిలోనూ యూనియన్ రేబర్ కంపెనీ ఇచ్చిన ఆఫర్‌తో అందులో చేరి ప్రస్తుతం క్వాలిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నా. నా జీవితంలో ఎన్నోసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా. జీవితంపై విరక్తి చెందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొద్దిగా శ్రమిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే అన్నయ్యల మాటలతో స్ఫూర్తి పొంది నేడు ఈ స్థాయికి చేరుకున్నా. టెన్త్ ఫెయిల్ అయినప్పుడే చదువుపై ఆసక్తి చంపుకుంటే ఇంటర్లో చేరేవాణ్ని కాదు.. ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు ఆటోడ్రైవర్‌గా స్థిరపడితే ఇంజినీరింగ్ చేసేవాన్ని కాదు. అబుదాబి అవకాశం దక్కేది కాదు.. వీటన్నింటికి సమాధానం పట్టుదల.. ఓడినా కుంగిపోకుండా కష్టపడడం. -
ఆరోగ్య ‘యోగా థెరపీ’
ఇన్నాళ్లు పగలు జాబ్‌తో పోటీపడిన సిటీవాసులు ఇప్పుడు రాత్రి ఉద్యోగాలతోనూ క్షణం తీరిక లేకుండా లైఫ్ సక్సెస్ వైపు పరుగులు పెడుతున్నారు. సాఫ్ట్వేర్, బీపీవో, కాల్ సెంటర్, పాత్రికేయ వృత్తిలో.. ఇలా చాలా రంగాల్లో నైట్‌షిఫ్ట్ జాబ్‌లు చాలా మందే చేస్తున్నారు. రాత్రిపూట విధులు నిర్వర్తిచడం వల్ల అనేక మందికి వారికి తెలియకుండానే అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా నిద్రలేమి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కుర్చీలో తదేకంగా కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తోంది. పని టెన్షన్లో మానసిక ఒత్తడికి గురవుతున్నారు. మహిళలకైతే మరీ ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటివారికి ఎలాంటి మందులు వాడకుండానే వ్యాధులు నయం చేసేందుకు యోగా థెరపీ విధానం సిటీవాసుల ముందుకు వచ్చింది. మామూలుగా డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ వల్ల అప్పటికప్పుడు ఉపశమనం ఉంటుందేమో గానీ పూర్తి స్థాయిలో కంట్రోల్ కాదు. అరుుతే, యోగా థెరపీ ద్వారా వ్యాధులను జీవితాంతం దరి చేరకుండా చేయవచ్చంటున్నారు హిమాయత్‌నగర్‌లో ఉంటున్న సుమన పోతుగుంటల. నాన్న పండిట్ డాక్టర్ పీవీ సీతారామయ్య ప్రోత్సాహంతో యోగాను ఎంచుకున్నానన్న ఈమె నగరవాసుల ఆరోగ్య సమస్యలకు యోగా థెరపీతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. షట్క్రియాతో ఎంతో మేలు... షట్క్రియా చేయడం సిటీవాసుల ఆరోగ్యానికి ఎంతో మంచిది. జలనేతి, సూత్రానేతి క్రియల ద్వారా ఆస్థవూ, సైనసైటిస్, టీబీ, జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, కంటినొప్పి, చెవినొప్పి, గొంతునొప్పి, టాన్సిల్స్, మూర్చ, నిద్రలేమి, నిమోనియాలను నియంత్రింవచ్చు. అలాగే ముక్కు దిబ్బడ, కఫం, ముక్కు లోపల దుమ్ము ధూళిని పొగొట్టి శ్వాసక్రియ బాగా జరిగేలా షట్క్రియా విధానం మేలు చేస్తుంది. జలినేతి విధానంలో కాచి చల్చార్చిన గోరువెచ్చని నీరు, ఉప్పు వాడాలి. యోగనిద్రతో నిద్రలేమికి చెక్... ‘రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగులు శవాసనం, యోగ నిద్ర ద్వారా నిద్రలేమిని అధిగమించొచ్చు. కేవలం 15 నిమిషాలు పాటు ఈ యోగ చేస్తే రెండు గంటల నిద్రతో సమానం. బాడీ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. హర్మోన్స్ చక్కగా పనిచేస్తాయ’ని సుమన వివరించారు. పని ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాణయామ చేస్తే సరిపోతుంది. జాబ్ చేస్తూనే ఇది ఎప్పుడైనా చేయవచ్చు. చాలా మంది సిటీవాసుల వెంటబడుతున్న ఒబేసిటీని కపాలాభాతి ద్వారా నియంత్రించొచ్చు. పొట్టను లోపలికి లాగి గాలిని త్వరత్వరగా వదలాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలు గాలి ద్వారా బయటకు వస్తాయి. మామూలు ఫుడ్ తీసుకున్న గంట తర్వాత, భోజనం చేస్తే నాలుగు గంటల తర్వాత ఈ కపాలాభాతి చేయాలి. కనీసం ఐదు నిమిషాలు పాటు చేయాలి. అలాగే ఒకే కుర్చీలో నిరంతరాయంగా కూర్చొని ఉండటం, నిటారుగా కూర్చకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. కటి చక్రాసనం, అర్ధ చక్రాసనం, అర్ధకటి చక్రసనం చేయడం ద్వారా ఈ నొప్పిని నియంత్రించొచ్చు. బద్ధకోణాసనంతో నార్మల్ డెలివరీ.. అమ్మాయిలు గర్భవతిగా ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మంచి ఫుడ్‌తో పాటు నార్మల్ డెలివరీ అయ్యేందుకు బద్ధకోణాసనం, ఉపవిష్టకోణాసనం, పశ్చిమోత్తనా సనం వేయాలి. తాడాసనంతో మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. సిటీవాసులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను యోగా థెరపీతో నియంత్రించవచ్చు’ అని సుమన వివరించారు. వాంకె శ్రీనివాస్ -
వివేకం: దెబ్బతింటేనే జీవితపు పంట పండుతుంది!
ఉత్కంఠ భరితమైన వార్తలంటేనే అందరికీ ఆసక్తి. ‘ఎవరో ఇద్దరు ప్రేమగా కాపురం చేస్తున్నారు, సంతోషంగా జీవిస్తున్నారు’ అన్న వార్త చప్పగా ఉంటుంది. కాని మీ జీవితం మటుకు ఏ ప్రతిఘటనా లేకుండా, ఒడుదుడుకుల్లేకుండా, ఒకే రీతిలో ఉండాలి. మీరు అడిగినా, అడక్కపోయినా ఈ ప్రపంచం మీ మీద సమస్యలను విసిరి, తమాషా చూడబోతోంది. మరి వాటిని ఎదుర్కోవడానికి మీరు ఎందుకు జంకుతున్నారు? ఒకసారి రైతు దేవుడితో పొట్లాట వేసుకున్నాడు. ‘‘నీకు వ్యవసాయం గురించి ఏమి తెలుసు? నీవనుకున్నప్పుడే వర్షాలు కురిపిస్తున్నావు. నీ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. నా మాట విని ఈ పనులన్నీ ఒక రైతుకు ఇచ్చెయ్’’ అన్నాడు. దేవుడు, ‘‘ఎండ, వాన, గాలి అంతా నీ వశంలో ఉండుగాక’’ అని వరమిచ్చేసి వెళ్లిపోయాడు. పంటల కాలం వచ్చింది.‘‘ఓ వానా, కురు!’’ అన్నాడు. వాన పడింది! ఆగమంటే ఆగింది! నేలను దున్నాడు. కావలసిన వేగంతో గాలిని రమ్మన్నాడు. విత్తనాలు జల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ అతను చెప్పినట్లు విన్నాయి. చేలు పచ్చగా ఎదిగాయి. కోతల కాలం వచ్చింది. రైతు ఒక వరి కంకిని కోశాడు. తీసి చూశాడు. నివ్వెరపోయాడు! లోపల ధాన్యం కనిపించలేదు. వెంటనే, మరో కంకిని కోసి చూశాడు. దానిలో కూడా ధాన్యం లేదు. ‘‘ఓ భగవంతుడా! గాలి, వాన, ఎండ అన్నింటినీ సమంగానే వాడాను. కానీ పంట ఎందుకు దెబ్బతిన్నది?’’ అంటూ కోపంగా అరిచాడు. దేవుడు ‘‘నా దగ్గరున్నప్పుడు గాలి వేగంగా వీచేది, అప్పుడు పైరు అమ్మను గట్టిగా వాటేసుకునే పసిపిల్లల్లా భూమిలో తమ వేర్లను చాలా లోతుల్లోకి తీసుకెళ్లేవి. అలాగే వాన తగ్గిందంటే, నీటిని వెదుక్కుంటూ వేర్లను నాల్గు దిక్కులకూ పంపించేవి. పోరాట పటిమ ఉంటేనే మొక్కలు తమను తాము కాపాడుకునేందుకు బలంగా పెరుగుతాయి. అన్నింటికీ వసతులు కల్పించి, ఇవ్వగానే నీ పంటకు సోమరితనం వచ్చేసింది. ఏపుగా ఎదిగిందే గాని, ధాన్యం ఇవ్వడం దానిచేత కాలేదు’’ అన్నాడు. ‘‘వద్దు స్వామీ! ఇలాగైతే నీ వాన, గాలి నువ్వే ఉంచుకో’’ అని ఆ రైతు వాటిని దేవుడికే అప్పగించేశాడు. జీవితంలో అన్నీ సులభంగా సమకూరితే, ఆ జీవితం ఇలాగే ఉంటుంది. దానికి మించిన శూన్యం వేరొకటి ఉండదు. ఊహించని అనుభవాలు ఎదురొస్తే, జీవితంలో అనుభవించి తెలుసుకునే అవకాశాలుగా వాటిని భావించాలి. చిక్కులు వచ్చినప్పుడే మన సామర్థ్యం ఏమిటి? మనం ఎక్కడ ఉన్నాం అనేది స్పష్టంగా తెలుస్తుంది. చీకటి సమస్య ఉన్నందుకే కదా విద్యుద్దీపాలు కనుగొన్నారు. సమస్యలే లేకుంటే, మీ మెదడు పనితీరు ఏ విధంగా ఉందో ఎలా తెలుసుకోగలరు? వాస్తవానికి, మీ పద్ధతి సరిగా లేనందువల్లే, సాధారణ పరిస్థితులు కూడా సమస్యలుగా కనిపిస్తాయి. సమస్య - పరిష్కారం ఒత్తిడి వల్ల జీవితంలో సంబంధాలు దెబ్బతింటున్నాయి. సహాయం చేయగలరు. - డి.రాజ్మలక్ష్మి, సికింద్రాబాద్ సద్గురు: మీలాగే ప్రస్తుత ప్రపంచంలో అనేక మంది వివిధ రకాల ఒత్తిడులకు గురి అవుతున్నారు. ఒత్తిడి, ఆందోళన అనేవి మనం కొత్తగా పెట్టుకున్న పేర్లు మాత్రమే. పూర్వకాలంలో వీటిని అజ్ఞానం అని పిలిచేవారు. మీరు చేస్తున్న పనివల్ల మీకు ఒత్తిడి లేదు. మీ జీవన క్రియను మీరు సరిగ్గా నిర్వహించుకోలేని అసమర్థతతో ఉన్నారు. దీనివల్లనే మీకు ఒత్తిడి కలుగుతోంది. మీ జీవన క్రియను - మీ శరీరాన్ని, మీ బుద్ధిని, మీ భావోద్వేగాలను, మీ ప్రాణశక్తిని - ఒక క్రమపద్ధతిలో నిలుపుకోలేని మీ అసమర్థతయే ఒత్తిడి. ఏ వ్యక్తి అయినా ఒక స్పష్టతా స్థితిలో ఉంటే ఒత్తిడి అనే ప్రశ్నే తలెత్తదు. మనం ధ్యానం అని చెబుతున్నది, దీనికి చికిత్సయే. ధ్యానం అనేది ఒక పని కాదు. అది ఒక లక్షణం, గుణం. మీ శరీరాన్ని, బుద్ధిని, భావోద్వేగాలను, ప్రాణశక్తులను - ఒక పరిపక్వ స్థాయిలో ఉండేటట్లు మీరు మలచుకోగలిగితే, ధ్యానం సహజంగానే కలుగుతుంది. ఇది సరిగ్గా ఎలాంటిదంటే, మీరు నేలను సారవంతంగా ఉంచారు. సరైన ఎరువును, నీటి వసతిని కల్పించారు. ఇక సరైన రకపు విత్తనం అక్కడ ఉంటే కనుక, అది పెరుగుతుంది, పుష్పాలుగా, ఫలాలుగా వికసిస్తుంది. మీరు కోరుకున్నంత మాత్రం చేత, మొక్క నుండి పుష్పాలు, ఫలాలు రావు. అందుకు ఆవశ్యకమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తే అవి వస్తాయి. అదే విధంగా, మీరు మీ లోపల అవసరమైన వాతావరణాన్ని కల్పించుకోవాలి. అప్పుడు ధ్యానం మీ లోపల సహజంగా కనిపిస్తుంది. - జగ్గీ వాసుదేవ్ -
జగమంత కుటుంబంపాట కాదు... నా జీవితం!
పాట తప్ప, సీతారామశాస్త్రికి... వేరే స్వరూపం లేదు, సారూప్యం లేదు, సదృశమూ లేదు. పోనీ మాటల్లో? ‘బూడిదిచ్చేవాడినేది అడిగేది’ అని కదా అన్నాడు... అహాన్ని దహనం చేసుకుని, ఆ బూడిదగా కూడా మిగలని వాడితో... ఏం మాట్లాడి ఏం రాబడతాం? ఏం రాబట్టి ఏం రాస్తాం? ఒకర్ని ఒక మాట అనడు, అననివ్వడు. ‘మీరు గ్రేట్ సర్ ’ అంటే ఒప్పుకోడు. తనలోని జగమంత కుటుంబాన్ని చూపిస్తాడు. అందులో ఆయన తప్ప అంతా గ్రేట్‌గా కనిపించేలా చేస్తాడు! జీవితాన్ని, జీవితంలోని ప్రేమను, కవినీ, కవి డిగ్నిటీని... కళ్లకద్దుకుంటూ మాత్రమే తను కనిపిస్తాడు. మరెలా ఆయన్ని క్యాచ్ చెయ్యడం? కాని పని. నిర్నిమిత్తంలో, నిర్వికారంలో, నిరహంకారంలో... లుప్తమై విశ్వవ్యాప్తమైన సృజనశీలి ‘సిరివెన్నెల’! ఆ వెన్నెలలో లభించిన ఒకటీఅరా సాక్షాత్కారాలే... ఈవారం మన ‘తారాంతరంగం’! జీవితంలో సక్సెస్ మొదలయ్యేది మన ప్రజ్ఞ మనం తెలుసుకున్నప్పుడే. మీలో ఓ కవి ఉన్నాడని మీకెప్పుడు తెలిసింది? సిరివెన్నెల: అటు పల్లెటూరు, ఇటు పట్టణం.. రెండూ కాని ఓ ప్రాంతం. చదువుకున్నదేమో గవర్నమెంట్ బడి. ‘పాడిన వారు ఘంటసాల, సుశీల’ అని రేడియోలో చెబుతుంటే... ‘అదేంటి? పాడింది అక్కినేని, సావిత్రి అయితే.. ఘంటసాల, సుశీల అంటారు?’ అని నాకు నేనే ప్రశ్నించుకునే ఇన్నోసెన్స్. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన నాకు... రాయడం అనే ఒక ప్రక్రియ ఉంటుందని, రాస్తారని ఎలా తెలుస్తుంది? కానీ ఏదో రాస్తూ ఉండేవాణ్ణి... నాకు తెలీకుండానే! నేను రాస్తున్నది కవిత్వం అని ఓ రోజు నా తమ్ముడు చెబితే కానీ నాకు అర్థంకాలేదు. అంటే.. బాల్యం నుంచీ అక్షరసాన్నిహిత్యం ఉండేదన్నమాట! సిరివెన్నెల: పుస్తకాల్లో అక్షరాలు కనిపిస్తే చాలు, నమిలి మింగేసేవాణ్ణి. మా నాన్నగారు గొప్ప పండితుడు, మానవతావాది, సాహితీ ప్రేమికుడు, గొప్ప ఫిలాసఫర్. హిమాలయ శిఖరం అంచుని నేలపై నిలబడి చూస్తే కనిపించదు... ఆయన కూడా అంతటి వారే! కానీ దురదృష్టం ఆయన 40 ఏళ్లకే స్వర్గస్థులయ్యారు. ఇప్పుడుంటే అద్భుతాలు చేసి ఉండేవారు. ఆయన ద్వారా నాకు సంక్రమించిన ఆస్తే నాకు అక్షరం. మీ నాన్నగారితో మరచిపోలేని సంఘటన ఏమైనా ఉందా? సిరివెన్నెల: నాకు చిన్నప్పుడు డైరీ రాసే అలవాటు ఉండేది. ఓరోజు ఆయన నా డైరీని చదువుతూ కనిపించారు. నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ‘అదేంటి? ఒకరి డైరీని అలా చదవడం కుసంస్కారం కాదా?’ అని ఆయన్ను సీరియస్‌గా ప్రశ్నించాను. ‘ఏం? దొంగల డైరీలు పోలీసులు చదవడంలేదా?’ అన్నారు నింపాదిగా నాన్న. ‘నేను దొంగనా...’ అన్నాను ఉక్రోషంగా. ‘నువ్వు దొంగవు కాకపోవచ్చు, కానీ నేను పోలీసునే. నా కొడుకు ఆలోచనాధోరణి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది’ అన్నారు. పరులకు తెలియకూడని పనులు నువ్వెందుకు చేయాలి? పోనీ చేశావే అనుకో... అవన్నీ పుస్తకాల్లో రాయడమేంటి అర్థం లేకుండా? అవి నేను చూస్తే సంస్కారం లేదా అని నన్నడగటం ఏంటి?’ అంటూ ఆపకుండా అక్షింతలు వేశారు. ‘చూడు నాయనా... ప్రైవసీ, సీక్రెసీ అని రెండు ఉంటాయి. ప్రైవసీ అందరికీ ఉండాలి.. కానీ, సీక్రెసీ మాత్రం ఉండకూడదు. శరీరం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగని బట్టలు విప్పేసి తిరగం కదా’ అని నాన్న చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఒక కవిగా సాహిత్యానికి మీరిచ్చే నిర్వచనం? సిరివెన్నెల: సాహిత్యం.. ఓ విరాట్ స్వరూపం! ఆ విరాట్ స్వరూపాన్ని ఒక్కసారిగా చూడలేక దాన్ని మనం విభజించుకున్నాం. కథ, కథానిక, కవిత, నాటకం, నాటిక, వ్యాసం... ఇలా! ఇది పాశ్చాత్యుల ప్రభావంతో జరిగిన విభజన. సాహిత్యానికి అసలైన రూపం మహాభారతం! అందులో వచనం ఉంటుంది, వర్ణనలుంటాయి, శ్లేషలు, ధ్వనులు ఉంటాయి. ‘సిరివెన్నెల వంటి సాహితీవేత్త సినీరంగంలోకి రావడం సినిమా అదృష్టం.. ఆయన చేసుకున్న దురదృష్టం. ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి ఆయన’ అని ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ మీ గురించి అన్నారు. దానికి మీరు ఏకీభవిస్తారా? సిరివెన్నెల: కచ్చితంగా ఏకీభవించను! ఓ వ్యక్తి నా గురించి వ్యక్తపరిచిన అభిప్రాయం మాత్రమే అది. అదేం గీటురాయి కాదు, సర్టిఫికెట్ కాదు.. శిలాశాసనం అంతకన్నా కాదు. ‘ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి సీతారామశాస్త్రి’ అంటే.. ప్రేక్షకులకు స్థాయి లేదనా? ఇప్పటివరకూ అందరూ స్థాయిలేని పాటలు రాశారనా? శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, సినారె ఇత్యాది కవుల పాటలను ఆదరించిన అలనాటి శ్రోతలు స్థాయి లేనివారనా? అది తప్పు. సినిమాను నేను మరోతల్లిగా భావిస్తాను. నా భావాలను, ప్రతిభను ప్రపంచానికి వ్యక్తపరచడానికి సినిమా ఓ వేదిక అయ్యింది. అంతకంటే ఓ కళాకారుడికి ఏం కావాలి? సినిమా అంటే సకల కళల సమన్వయ వేదిక. ‘కావ్యేషు నాటకం రమ్యం’ అనే పదానికి పరిపూర్ణమైన రూపం సినిమా. అలాంటి సినిమాలో నేనూ ఓ భాగం అయినందుకు ఎప్పుడూ గర్విస్తాను. నాపై ఉన్న అభిమానంతో నా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడాడు త్రివిక్రమ్. అనేకమంది భావాలను తన మాటగా వ్యక్తపరచినందుకు తివిక్రమ్‌కి రుణపడి ఉంటానని ఆ వేదికపైనే చెప్పాను. అంతేకానీ ‘అక్షర సత్యాలు మాట్లాడాడు త్రివిక్రమ్’ అని చెప్పలేదే! సినిమా సకల కళల సమన్వయ స్వరూపం అన్నారు. కానీ ప్రస్తుతం సినిమా అలా లేదు కదా? సిరివెన్నెల: నేను చెబుతున్నది సినిమా గొప్ప వేదిక అని! అందులో ఏ మాత్రం సందేహం లేదు. వేదిక గొప్పతనాన్ని ప్రతిబింబించేలా సినిమా లేకపోతే.. చూడకండి. శుభ్రంగా చాగంటి కోటేశ్వరరావుగారితో పురాణ కాలక్షేపం చెప్పించుకోండి. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ‘పాడుతా తీయగా’ చూసుకోండి. సినిమా ఎవరు చూడమన్నారు? వేదిక అనేది పరమేశ్వర స్వరూపం. అది ఎప్పుడూ పూజనీయమైనదే! పాట ద్వారా సాహిత్యాన్ని వినిపించడమే కాదు, ఆ పదాల అర్థాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస పెంచిన రచయిత సిరివెన్నెల అని చాలామంది అభిప్రాయం... సిరివెన్నెల: అవునా.. ‘చిలక తత్తడి రౌతా.. ఎందుకీ హూంకరింత..’. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రాసిన ‘రహస్యం’ సినిమాలోని ఈ పాటను శ్రోతలు వినలేదా? ‘చిలక తత్తడి రౌతా..’ అంటే.. చిలకను వాహనంగా కలిగినవాడా. అంటే... ‘మన్మథుడా..’ అని! జనాలు విన్నారు... అర్థం తెలుసుకున్నారు. శ్రోతల మేథస్సును తక్కువ అంచనా వేయకూడదు. నా ‘విధాత తలపున’ పాటను అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారంటే కారణం.. నేను ఆ పాటను ‘సిరివెన్నెల’ సినిమా కోసం రాశాను కాబట్టి! అదే ఏ ‘యమకింకరుడు’ కోసమో రాసుంటే ఆ పాట గురించి మాట్లాడుకునేవారా? మీకు తెలీని విషయం ఏంటంటే... నేను కొన్ని రకాల పాటలు ఇప్పటికీ రాయలేను. మీరు రాయలేని పాటలు కూడా ఉన్నాయా? సిరివెన్నెల: ఎందుకుండవు? కొన్నికొన్ని పాటలుంటాయి. భలే తమాషాగా, తిక్కగా ఉంటాయి. ఉదాహరణకు ‘ప్రేమికుడు’ సినిమాలోని ‘మండపేట.. మలక్‌పేట.. నాయుడుపేట.. పేటర్యాప్..’ పాటనే తీసుకోండి. భలే ఉంటుంది ఆ పాట. ఎప్పుడు విన్నా కూడా ‘ఇలా రాయడం నావల్ల కాదేమో’ అనిపిస్తుంది. ‘జీన్స్’ సినిమాలో ‘కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవూ’ పాట విన్నప్పుడూ అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. డెఫినిట్‌గా అలాంటివి నేను రాయలేను. మీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి ఓసారి వెళితే.. అసలు ఇంతటి సాహితీ ప్రియులు టెలిఫోన్ శాఖలో ఎలా ఇమడగలిగారు? సిరివెన్నెల: జీవన కర్మక్షేత్రంలో తనకివ్వబడ్డ పనిని చేసుకొని పోవడం మానవధర్మం. ఇందులో ఇమడకపోవడానికి ఏముంది? ఇప్పుడు నేను చేస్తున్నది అదే! సద్గురువు సాంగత్యం లేకపోతే... ఇంత జ్ఞానసంపద అసాధ్యం! మీ గురువుల గురించి... సిరివెన్నెల: జన్మసిద్ధంగా మా నాన్నగారి నుంచి నాకు చాలా లక్షణాలు అలవడ్డాయి. సో... ఆ విధంగా నా తొలి గురువు ఆయనే! నా రెండో గురువు జీవితం! ప్రపంచంలో నేను చూసిన ప్రతి ఒక్కటీ నాకు గురువే! ఇష్టపడేవారు, ఇష్టపడనివారు... ఇలా అందరూ నాకు గురువులే! యోగీశ్వరులు శివానందమూర్తిగారు నా మూడో గురువు! కెరీర్ ప్రారంభంలోనే ‘విధాత తలపున’ లాంటి గొప్ప సాహిత్యంతో పాటలు రాసిన మీరు... కొన్ని సాధారణమైన పాటలు రాయడానికి అంతర్మథనానికి లోనౌతారా? సిరివెన్నెల: మీరంటున్న నా ‘సాధారణమైన పాట’... నా ‘విధాత తలపున’ కంటే ఏ విధంగా తక్కువో చెప్పండి. అప్పుడు అది రాయడానికి నేను పడ్డ అంతర్మథనం ఏంటో చెబుతాను. సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి సినిమాల్లోని మీ పాటలన్నీ కావ్యాలని చాలామంది అభిప్రాయం... సిరివెన్నెల: ‘గుండెనిండా గుడిగంటలు, గువ్వల గొంతులు, ఎన్నో మోగుతుంటే... కంటి నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే... వెంటనే.. పోల్చాను నీ చిరునామా ప్రేమా...’ ఈ కాన్సెప్ట్‌ని ఏ విధంగా వాటికంటే తక్కువ చేసి చూస్తారు మీరు? ఈ పాటలు ఆ పాటలంత గౌరవాన్ని పొందాయంటారా? సిరివెన్నెల: ఎందుకు పొందలేదు? ఎన్నో రసాల సమ్మేళనం జీవితం. ఒక చెట్టుని నువ్వు ఎన్ని రకాలుగా చూస్తే అన్ని రకాలుగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. నీ బిడ్డను చూస్తూ... ‘అబ్బా... పువ్వులా నవ్వుతుంది...’ అని నీ భార్యతో మురిపెంగా నువ్వంటున్నప్పుడు నువ్వో తండ్రివి. నీ భార్యను చూసి ‘నువ్వు ఈ రోజు ఎంతో నాజూగ్గా, తాజా పువ్వులా ఉన్నావ్’ అన్నప్పుడు నువ్వొక ప్రేమికుడివి. ఇవన్నీ జీవితానికి అవసరమే. కాబట్టి ‘విధాత తలపున’ రాస్తేనే పాట, ‘గుండెనిండా గుడిగంటలు’ రాస్తే పాటకాదు అనడం అసమంజసం. ‘గుండెనిండా గుడి గంటలు’ లాంటి సాహిత్యాన్ని రాయవలసి వచ్చినప్పుడు.. ‘ఎలా రాస్తే దానికి ఆ డిగ్నిటీ వస్తుంది’ అని ఆలోచించి రాసినప్పుడే కవిగా నీ డిగ్నిటీ ఏంటో తెలుస్తుంది. శృంగారం అనేది ఓ చెడు ప్రక్రియే అయితే... ఈ సృష్టే లేదు గుర్తుంచుకోండి. కాబట్టే శృంగారగీతం ఎంతో బాధ్యతాయుతమైనదని తెలుసుకోండి. ఇంకా ఎక్కువ పూజనీయమైనది, ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిందని అర్థం చేసుకోండి. ఆ పాటల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు. గొప్ప సాహిత్యంతో పాటలు రాసిన మీరు... నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా రాయవలసి వచ్చినప్పుడు పడే అంతర్మథనం గురించి అడుగుతున్నా... సిరివెన్నెల: నాకు ట్రెండ్ అనేది లేదు. ‘కళ్లు’లో ‘తెల్లారింది లెగండో..’ పాట నేనే రాశాను. మొన్నమొన్ననే ‘ఓనమాలు’లో ‘పిల్లలూ బాగున్నారా?’ అనే సందేశాత్మక గీతాన్నీ నేనే రాశాను. ‘కృష్ణంవందే జగద్గురుమ్’లో దశావతార రూపకం నేనే రాశాను. ఆ పక్కనే యూత్‌కోసం ‘స్పైసీ స్పైసీగాళ్...’ పాటనూ నేనే రాశాను. ‘స్పైసీ స్పైసీగాళ్’ పాటలో ఎక్కడైనా మీకు అశ్లీలత స్ఫురించిందేమో చెప్పండి. సో, ఇక్కడ అంతర్మథనానికి తావేది? ఓ పక్క ఆధ్యాత్మికం, మరో పక్క శృంగారం, ఇంకో పక్క విప్లవం.... ఓ వ్యక్తిలో ఇన్ని కోణాలా? సిరివెన్నెల: ప్రకృతి ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పగలిగే సహజ లక్షణం మనిషికి మాత్రమే ఉంది. అవన్నీ చూపించకపోతేనే తప్పు. మనిషి శరీరంలో ప్రతి అవయవం పనిచేయాలి. అందులో ఒక్కటి పనిచేయకపోయినా... ‘వికలాంగుడు’ అంటారు. ఇదీ అంతే! మీరు రాసిన కొన్ని పాటలు వింటుంటే.. సమాజంపై మీకు కోపమేమో అనిపిస్తుంది సిరివెన్నెల: ‘సమాజం వేరు.. నేను వేరు’ అని అనుకోను. నాకు జ్వరం వస్తే.. నాపై నేను ఆగ్రహం వ్యక్తం చేసుకోను కదా. ‘కాస్త ఇబ్బందిగానే ఉందండీ’ అంటాను. కారణం... అది నాకొచ్చింది కనుక. నన్ను నేను ప్రేమించుకుంటాను కనుక. ఇక్కడ సమాజమే నేను! సమాజంలోని అవకతవకలన్నీ నావే! అలాంటప్పుడు కోపానికి తావెక్కడిది. వర్మ, కృష్ణవంశీ, త్రివిక్రమ్, క్రిష్.. ఇలా కొందరు దర్శకులతో మీకు అటాచ్మెంట్ ఎక్కువ అంటారు. నిజమేనా? సిరివెన్నెల: కొందరితో అటాచ్మెంట్, కొందరితో డిటాచ్మెంట్ ఉండదు. ఉదాహరణకు మనిద్దరం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆసక్తి ఉన్నంతవరకూ మీరు నా మాటలు వింటారు. ఎక్కడో ఒక చోట ఆ ఆసక్తి తెగిపోతుంది. దాంతో ఏదో కారణం చెప్పి నా దగ్గరనుంచి తప్పుకుంటారు. దానికి కారణం కోపమే కానక్కరలేదు. దీన్నే మామూలుగా మాట్లాడుకునేటప్పుడు ‘వేవ్‌లెంగ్త్ కలవడం’ అంటుంటాం. సో... వాళ్ల అభిరుచికి తగ్గ సినిమా వాళ్లు తీస్తున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన నా ఒపీనియన్స్ కానీ, సలహాలు కానీ వాళ్లకు నచ్చి ఉండొచ్చు. దాంతో వాళ్లు నాతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడున్న దర్శకుల్లో మీకు ప్రియమైనవాళ్ళు... సిరివెన్నెల: ఏ రంగంలోనూ, ఏ అంశంలోనూ ఒక వ్యక్తిని ఇష్టపడటం ఉండదు నాకు. నాకే కాదు... ఎవరికీ ఉండకూడదు. ప్రతి దర్శకుడూ ఓ మంచి సినిమా తీసే ఉంటాడు. అలాగే ప్రతి దర్శకుడూ ఓ చెత్త సినిమా కూడా తీసే ఉంటాడు. వారి పనిని ఇష్టపడతాను కానీ.. వ్యక్తిని కాదు! కవిగా మీకు సాటి, పోటీ ఎవరనుకుంటున్నారు? సిరివెన్నెల: బాగుందా, లేదా అని చెప్పగలం కానీ... ఒక శిల్పంతో మరో శిల్పాన్ని ఎలా పోల్చగలం? వంద మీటర్ల పరుగుపందెంలో ఒకడు ఫస్ట్ వస్తాడు. ఆ వంద మీటర్లను రెండొందల మీటర్లు చేస్తే... ఆ ఫస్ట్ వచ్చినవాడే థర్డ్ రావచ్చు. చెప్పలేం కదా. సో... పోటీ అనేది తీసుకునే సంవిధానాన్ని బట్టి ఉంటుంది. ‘వశిష్టుడు’ అనే ఓ వేల్యూని చూసుకుంటూ... ‘బ్రహ్మర్షి’ అనే స్కేల్ పెట్టుకొని... విశ్వామిత్రుడు తన ధర్మప్రయాణాన్ని సాగించాడు. ఆ సంవిధానాన్నే పోటీ అంటారు. అలా ప్రయాణిస్తే జ్ఞానం సమృద్ధి అవుతుంది! రాయడంలో ఎప్పుడైనా బోర్‌గా ఫీలయ్యారా? సిరివెన్నెల: నా జీవితంలో మార్పు లేని రెండే విషయాలు నా భార్య, నా పాట. ఈ రెండూ నాకెప్పుడూ బోర్ కొట్టవు. ఆ విషయం మా ఆవిడక్కూడా తెలుసు. ఇంతటి జ్ఞానితో జీవితాన్ని పంచుకున్న మీ సహధర్మచారిణి గురించి తెలుసుకోవాలని ఉంది... సిరివెన్నెల: ‘సహ.. ధర్మ.. చారిణి’ అని మీరే అన్నారు. ధర్మంగా తను నడుస్తూ.. తనతో పాటు తన భర్తనూ నడిపించేది సహధర్మచారిణి. ఆ పదానికి అక్షరాలా యోగ్యురాలు నా భార్య పద్మావతి. నేను ఓ అద్భుతమైన శిల్పాన్ని అనుకుంటే... ఆ ‘అద్భుతం’ అనే పదం చెందాల్సింది ఆవిడకే. ఎందుకంటే... ఈ శిల్పాన్ని చెక్కింది తనే. అందమైన పాటలా నా జీవితం సాగిపోవడానికి కారణం ఆవిడ. నన్ను ఈ విధంగా మలచడానికి తన జీవితంలో చాలా భాగాన్ని పణంగా పెట్టి, తాను చాలా కోల్పోయి, నేను చాలా పొందేలా చేసిన త్యాగమయి నా భార్య. షీఈజ్ మై బెటర్ త్రీఫోర్త్! నేను వన్ ఫోర్త్ మాత్రమే. అందులో అసత్యం కానీ, నిష్టూరం కానీ, అతిశయోక్తి కానీ ఏమీ లేదు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఓ ఇంటి కోడలిగా తన ప్రతి బాధ్యతనూ పరిపూర్ణంగా నిర్వర్తించింది కాబట్టే.. నా ఒక్క బాధ్యతను నేను గొప్పగా నిర్వర్తించగలిగాను. మీకోసం మీ భార్య ‘ఎంతో కోల్పోయింది’ అన్నారు. అదేంటో కాస్త వివరంగా చెబుతారా? సిరివెన్నెల: నేను మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చేంత స్థాయికి రాగలిగానంటే, ఇన్ని వందల పాటలు రాయగలిగానంటే.. నాకెంత విశ్రాంతి లభించి ఉండాలి? ఈ విశ్రాంతి కోసం ఎన్ని బాధ్యతల నుంచి నేను తప్పుకొని ఉండాలి? చెప్పండి? ‘నీ బిడ్డలమైన మాకు.. ఓ తండ్రిగా నువ్వు ఏ మాత్రం ప్రేమనందించావ్?’ అని నా పిల్లలు నన్ను ప్రశ్నించొచ్చుగా? ‘అందరు తండ్రుల్లా ఏనాడైనా నువ్వు మమ్మల్ని సినిమాకు తీసుకెళ్లావా? పేరెంట్స్డేకి ఎన్నిసార్లు నువ్వు కాలేజీకొచ్చావ్? అసలు మేం చదువుతున్న స్కూళ్ల పేర్లయినా నీకు తెలుసా?’... ఈ ప్రశ్నలన్నీ నా పిల్లలు నాపై సంధించొచ్చుగా? అడక్కపోగా నన్ను గౌరవిస్తున్నారెందుకు? దీని వెనుక ఏ మెకానిజం ఉండుండాలి? పెళ్లిళ్లనీ, అశుభాలనీ, చుట్టాలనీ, పక్కాలనీ... అందరిలా తానూ ఓ పద్ధతి ప్రకారం జీవిస్తానంటే... ఇంత తపస్సు నాకు సాధ్యమయ్యేదా? రోజుకి 19 గంటల పాటు ఏకాంతంగా... ఏకధాటిగా 30 ఏళ్లు గడపగలిగానంటే... ఎన్ని సామాజికమైన బాధ్యతల నుంచి నేను తప్పుకొని ఉండి ఉండాలి? నేను సామాజిక బాధ్యతల నుంచి తప్పుకోలేదని జనాలు అనుకుంటున్నారు. అలా అనిపిచేలా చేసింది ఆవిడ కదా? దానికి ఆమె ఎంత సమయాన్ని కేటాయించి ఉండాలి? తన జీవితం తాను జీవిస్తూ ..ఇన్ని రకాలుగా నా ఖాళీలను పూరిస్తూ.. ఆమె ముందుకెళ్లింది కాబట్టే, ఈ రోజు బంధువుల్లో కూడా నన్నెవరూ బాధ్యతారహితుడనట్లేదు. ఓ యోధుణ్ణి కవచం కాపాడటం మనం చూస్తాం. కానీ ఆ కవచానికి తగిలే బల్లేల దెబ్బలు మనం చూస్తామా? నా కవచమే నా భార్య. మా చిన్నబ్బాయి ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడే ఓసారి ఇదే విషయాన్ని అందంగా, క్లారిటీతో చెప్పాడు. ‘మాకు మీకంటే అమ్మంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే.. మిమ్మల్ని ప్రేమించడం ఎలాగో అమ్మే మాకు నేర్పించింది’ అని. మీకోసం ఇంత చేసిన ఆమెకోసం మీరేమి చేశారు. ఆమె కోసం కొంతైనా చేయాలని మీకు అనిపించలేదా? సిరివెన్నెల: అరవైకి దగ్గరపడ్డాను. ఎవ్వరికీ రుణపడకుండా రిటైర్ అవ్వాలనేదే నా కోరిక! నిజంగా కూడా నేనెవ్వరికీ రుణపడిలేను... నా భార్యకు తప్ప! తన రుణం మాత్రం తప్పకుండా తీర్చుకుంటా. 30 ఏళ్ల సంసారంలో ఏనాడూ ఆమె ఒక్క పుణ్యక్షేత్రానికి కూడా వెళ్లలేదంటే నమ్ముతారా! అంతెందుకు... తన పుట్టింటికి కూడా నేను లేకుండా ఆమె వెళ్లలేదు. ఎందుకంటే... నేను లేని జీవితాన్ని ఆమె కోరుకోదు. అంతెందుకు.. ఇప్పుడామెను ‘ఏదైనా కోరుకో’ అంటే.. మహా అయితే.. ‘తిరుపతి తీసుకెళ్లండి’ అంటుంది. స్త్రీ అంటే ఏంటో.. స్త్రీత్వం అంటే ఏంటో.. తెలీని ఈ కాలంలో... అనవసరమైన బాధలు కొనితెచ్చుకుంటూ జీవితాన్ని నరకం చేసుకుంటున్న ఈ రోజుల్లో, ‘ఇవ్వడం ద్వారా ఏం పొందచ్చు’ అనే విషయం తెలుసుకోవడానికి నా భార్య గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. తను ఎంతో ఇచ్చింది. తద్వారా అన్నీ పొందింది. మీ మాటల్ని బట్టి చూస్తుంటే... మీది ప్రేమ వివాహమేమో అనిపిస్తోంది. సిరివెన్నెల: ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడం... ఇలాంటి కాన్సెప్టుల మీద నాకు సరైన అవగాహన లేదు. ప్రేమించడం ‘ఒక పని’ అని నేను అనుకోను. ఒకానొక క్షణంలో ఒకానొక చోట అది మొదలవుతుందని కూడా భావించను. నా పెళ్లి పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగానే జరిగింది. ఇక స్త్రీ, పురుషుల మధ్య ఉండవలసిన సహవాసం, సహచర్యం, సాన్నిహిత్యం, సాంగత్యం... ఇవన్నీ ప్రేమ అనే కాన్సెప్ట్‌లో ఉంటే కనుక... మాది కచ్చితంగా ప్రేమే! తెలుగులో ఓ సామెత ఉంది. ‘పేదవాడికి గంజే పరమాన్నం. పెళ్లామే ప్రియురాలు’ అని! దానితో నేను వందశాతం ఏకీభవిస్తా. అసలు ప్రేమ అనే కాన్సెప్ట్‌ని మీరు నమ్ముతారా? సిరివెన్నెల: సత్యాన్ని నమ్మడమేంటి? పగలు అనే కాన్సెప్ట్‌ని నమ్ముతారా? రాత్రి అనే కాన్సెప్ట్‌ని నమ్ముతారా? అనడిగితే ఏం సమాధానం చెబుతాం. ప్రేమ అనేది ఈ రోజు మనం ప్రశ్నించే స్థితికి దిగజారిందంటే... కారణం దానికి మనం వేరే వేరే అర్థాలు ఆపాదించడం వల్లే. ఈ విశ్వంలో ప్రేమ కానిది ఏది? ఎండ ప్రేమకాదా? వాన ప్రేమ కాదా? జీవితం పట్ల మనకున్నది ప్రేమ కాదా? మనపట్ల జీవితానికి ఉన్నది ప్రేమకాదా? ప్రేమ సర్వాంతర్యామి. భగవంతుడు ఆదిమధ్యాంతరహితుడంటూ గుళ్లూ గోపురాలు తిరిగే ఈ మనిషి... సర్వే సర్వత్రా ఉన్న ప్రేమను మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఇంతకీ మీరు ప్రేమికుడా? భక్తుడా? లేక విప్లవకారుడా? సిరివెన్నెల: మనిషిని. మనిషంటే ఇవన్నీ ఉండాలి. మీకు బలహీనతలున్నాయా? సిరివెన్నెల: మనిషంటే అవి కూడా ఉంటాయి కదా. మానవత్వానికి మహత్తరమైన కానుక మనదేశమే మనకిచ్చింది. అదే ‘రామాయణం’. మనిషితనానికి ప్రతిరూపం రాముడు. వాల్మీకి అనే కవి.. రాముడు అనే పాత్రను సృష్టించి, మనిషి అనేవాడు ఎలా బతకాలో సమాజానికి తెలియజేశాడు. ‘రాముడు మహావిష్ణువు అవతారం’ అని రామాయణంలో వాల్మీకి ఎక్కడా చెప్పలేదు. ‘నేను దశరథుని కుమారుడును.. రాముడను’ అని విజిటింగ్ కార్డు పట్టుకొని తిరిగాడు రాముడు. ఏం... ఆయన ఏడవలేదా? ఆయనకు కోపం రాలేదా? ఆయనకు నొప్పి కలగలేదా? ఒక మనిషికి ఎన్ని లక్షణాలుంటాయో రాముణ్ణి చూస్తే తెలుస్తుంది. మనల్ని రాముడితో పోల్చి చూస్తే కొన్ని ఆయన కంటే ఎక్కువ క్వాలిటీలు కనిపిస్తాయి. కొన్ని తక్కువ క్వాలిటీలు కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువైనా రోగమే, తక్కువైనా రోగమే. అదే మనం గ్రహించాల్సింది. వాటినే ‘బలహీతనలు’ అంటాం. అవి నాకూ ఉన్నాయి. మీ అబ్బాయ్ యోగీశ్వరశర్మ స్వరపరచిన తొలి గీతం విని మౌనం వహించారట కారణం? సిరివెన్నెల: నేను ఇంతవరకూ వినని ఓ నోవెల్ ప్రయోగం చేశాడు తను! అది వినడానికి చాలా బావుంది. కానీ రాయలేకపోయాను. దాంతో ఓ ముప్ఫై రోజుల పాటు నాలో నేను స్టడీ చేసి ఆ పాట రాశాను. సెలైంట్‌గా ఉండటం అనేది పాజిటివ్ కాంప్లిమెంటే కానీ, కామెంటూ కాదు, విమర్శ అంతకన్నా కాదు. తాను సంగీత దర్శకుడవ్వడంలో మీ ప్రోద్బలం ఉందా? సిరివెన్నెల: వాళ్ల అభిరుచిని, పాండిత్యాన్నీ వాళ్లే పెంపొందించుకున్నారు. దానికి తగ్గ కృషి వాళ్లే చేసుకున్నారు. ఇందులో నా ప్రోద్బలం లేదు అనడం కంటే.. నా ‘అడ్డు లేదు’ అనడం కరెక్ట్. సినిమాలోకి రావాలనేది వాళ్ల కోరిక. దాన్ని ఏనాడూ నాపై రుద్దలేదు. వాళ్ల ప్రయత్నాలు వాళ్లే చేసుకున్నారు. ప్రోత్సహించేవారు ప్రోత్సహించారు. ఒక తండ్రిగా.. సాయం చేసినవారికి థ్యాంక్స్ చెబుతుంటా. దర్శకుడు సందర్భం చెబుతాడు. దానికి తగ్గట్టు గేయరచయిత పాట రాస్తాడు. ప్రస్తుతం ఈ పద్ధతే నడుస్తోంది. కానీ మీరు మాత్రం అందుకు భిన్నంగా... సినిమా కథంతా తెలుసుకుంటారు. దాని ఆత్మను గ్రహిస్తారు. దాన్ని బట్టి పాట రాస్తారు. ఇంకా ఒకడుగు ముందుకేసి, దర్శకులుగా వాళ్లేమైనా తప్పులు చేస్తే సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఇంత స్ట్రగులు అవసరమా? సిరివెన్నెల: ఎముకల డాక్టర్లు చాలా మందే ఉంటారు. కానీ ఒకరిద్దరి పేర్లే గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం? అందరు చదివిందీ అదే చదువుగా?... అంటే.. ఎక్కడో వారి వ్యక్తిత్వాన్ని పనిలో లీనం చేస్తున్నారు వాళ్లు. తాము తెలుసుకున్న విషయాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేనూ అంతే. సినిమా కథ ఎలాంటిదైనా అది మనిషి జీవితానికి నీడలా ఉండాలని కోరుకుంటాను. నా పాటను నా తాత్వికాన్వేషణను ఆవిష్కరించే సాధనంగా భావిస్తాను. ఓ అమ్మాయి ఏడుస్తుంది. దానికి ఓ పాట రాయాలి. ‘ఏడవకమ్మా ఏడవకు..’ అని ఏదో ఓ పాట రాయొచ్చు. కానీ నేను అలా రాయను. ‘కన్నీళ్లే కురవాలా లోకానికి తెలిసేలా..? ముస్తాబే చెదరాలా.. నిను చూస్తే అద్దం దడిచేలా’ అని రాస్తా. ఏదో చెప్పాలి. అందులో ఫన్ ఉండొచ్చు. పరామర్శ ఉండొచ్చు. ప్రతిఘటన ఉండొచ్చు. అలా ఉండాలంటే.. కథ ఆత్మ తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కథకు పాట సరిపోతే చాలదు. ఆ తర్వాత కూడా శ్రోత హృదయంలో ఆ పాట చిరస్థాయిగా నిలవాలి. అంత కష్టపడేది అందుకే. గీత రచయితగా ఎంతో సాధించారు. పద్మశ్రీ రాలేదని ఎప్పుడైనా బాధపడ్డారా? సిరివెన్నెల: మెడ ల్ కోసం మెడలు వంచడం నాకు చేతకాదు. అయినా, పద్మశ్రీ కోసం నేను పాటలు రాయలేదు. దాని మీద నాకు ఆసక్తి కూడా లేదు. ఇంతమంది అభిమానాన్ని పొందగలిగాను. ఇన్ని కోట్లమందికి కుటుంబ సభ్యుణ్ణి కాగలిగాను. ‘జగమంత కుటుంబం నాది’ అని ఓ పాట రాశాను. తాము రాసిన పాట ఎంతమంది రచయితల జీవితాల్లో నిజమయ్యాయంటారు? నాకు మాత్రం నిజమైంది. ఇప్పుడు నాది ‘జగమంత కుటుంబం’... ఇంతకంటే గొప్ప అవార్డు ఇంకేదైనా ఉంటుందా? అందుకే అంటాను... ‘జగమంత కుటుంబం పాట కాదు... నా జీవితం’ అని! - బుర్రా నరసింహా *********** మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి? సిరివెన్నెల: నచ్చే సినిమా అనే సైంటిఫిక్ ఫార్ములా ఉంటే... ఆ ఫార్ములాను ఫాలో అవుతూ అందరూ సినిమాలు తీసేస్తారుగా. ఈ మధ్య ‘పా’ సినిమా చూశా. నచ్చింది. ఆ మధ్య ‘అదుర్స్’ అనే సినిమా చూశా. అదీ నచ్చింది. ఫలానా సినిమాలే నచ్చుతాయనేం లేదు. తప్పక రాసిన పాట ఏమైనా ఉందా? సిరివెన్నెల: అసలు అలాంటి పాటల్ని నేను రాయను. మీ కెరీర్లో కష్టపడి రాసిన పాట? సిరివెన్నెల: పాట రాయడం ఎప్పుడూ కష్టంగా ఫీలవ్వను. అయినా... కష్టపడి కోసే మామిడిపండు మహత్తరంగా ఉంటుంది. పాట కూడా అంతే. *********** ఇల్లాలుగా కాకుండా... ఆమెలో మీరు చూసిన అదనపు ప్రత్యేకతలేమైనా ఉన్నాయా? మొన్నటిదాకా నాకూ తెలీదు. ఈ మధ్య తెలిసింది. తాను అద్భుతంగా రాస్తుంది. ఆ మాటకొస్తే నాకన్నా బాగా రాస్తుంది. కొన్ని కొన్ని విషయాలను నేను సింపుల్‌గా చెప్పలేను. మా ఆవిడ అలా కాదు. ‘సంసారం-బంధములు’ అనే విషయాన్ని సరిగ్గా ఒకటిన్నర పేజీలో.. అయిదు పేరాల్లో విపులంగా చెప్పేసింది. అది చదివి షాక్ అయ్యాను. ఎందుకంటే.. అంతకు మించి చెప్పడానికి నాకేమీ కనిపించలేదు. అంత అద్భుతంగా రాసింది తను. మా నాన్నగారి గురించి వ్యాసాలు రాస్తున్నప్పుడు, తనూ ఓ భాగం రాసిచ్చింది. ఆమెలో నేను రచయిత్రిని చూసింది అప్పుడే. ఆమె శైలిని, వాక్య నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. అందుకే ఆ వ్యాసంలో మనసు విప్పి ఓ మాట చెప్పాను. ‘మా తమ్ముడంత సరళంగా, నా భార్య అంత గొప్పగా నేను రాయలేకపోయానేమో’ అని. మరి నవ రచయిత్రికి అభినందన ఎలా తెలిపారు? కెరీర్ ప్రారంభంలో అనంతశ్రీరామ్ నా దగ్గరకొచ్చాడు. అప్పటికి అతను ఓ నాలుగైదు పాటలు రాసుంటాడు. ‘నువ్వు రాసిన పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఒకటి చెప్పు’ అనడిగాను. తను చెప్పాడు. పల్లవిలోనే నాలుగైదు తప్పులు చెప్పాను. ‘నువ్వు గొప్పగా రాయబోతున్నావ్. నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండబోతోంది. సో... నిరంతరం నీ తప్పుల్ని వెతికి చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. మెచ్చుకోడానికి లేను’ అని చెప్పాను. తను నా మాటల్ని స్పోర్టీవ్‌గానే తీసుకున్నాడు. బాగా రాసేవాళ్లను నేను అభినందించను. వాళ్ల విషయం కఠువుగా ప్రవర్తిస్తా. ఎందుకంటే నిజమైన రచయిత అభినందనలకోసం చూడడు. మెప్పులు పొందకపోయినా.. అక్షరంతోనే జర్నీ చేస్తాడు. అలాంటి వాళ్లు ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే.. నా భార్య విషయంలోనే కూడా అలాగే ఉన్నాను. ‘గొప్పగా రాశావ్. రాయడంలో ఆనందాన్ని పొందు. ఇంకొకరికి చూపించి మెప్పు పొందాలని మాత్రం చూడకు. అలా చేస్తే రాయాలనే తపన ఆగిపోయే ప్రమాదం ఉంది’ అని చెప్పాను. అలా అన్నానని నాపై అలిగింది తను.