భార్య మాధురితో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కష్టాలు ఎదుర్కొన్నా.. అర్ధాకలితో అలమటించా.. మా కుటుంబానికి నాన్న చెప్పిన మాటే వేదం అనుకున్నదానికంటే ముందే రాజకీయ అరంగేట్రం చేశా ప్రజలతో మమేకమయ్యే అవకాశం రావడం ఒక వరం పర్సనల్ టైమ్‌లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
‘ప్రతి పనిని మనసుపెట్టి చేస్తే విజయం సాధిస్తాం. కష్టాల కడలిలో చిక్కుకున్నా.. విజయాల పరంపర కొనసాగినా.. ఒకే తీరున ఉండడం మా కుటుంబ సంప్రదాయం. కష్టాలకు కుంగిపోవడం.. విజయాలకు ఉప్పొంగిపోవడం మా ఇంట అలవాటు లేదు. ప్రతి అంశంపై అవగాహన ఉంటేనే మరో మెట్టెక్కుతామని నాన్న చెప్పిన మాట మాకు వేదం. అదే మా ఎదుగుదలకు సోపానం.
మూడు దశాబ్దాల క్రితం సాగునీటిపరంగా మా సొంతూరు నారాయణపురం, సమీప గ్రామాల రైతాంగం పడుతున్న అగచాట్లకు అల్లాడిపోయి నేను తీసుకున్న నిర్ణయం.. ఆ ఊళ్లకు సాగునీరివ్వడంతోపాటు ఆ ఉపకారం నాకు ఉపాధి చూపింది. ఉన్నత విలువలు పాటించే వృత్తిపరమైన కాంట్రాక్టర్‌గా తీర్చిదిద్దింది. ప్రతి సమస్యను రైతుల కోణంలో.. సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాల కోణంలో చూడడం నాకు జన్మతః లభించిన వరం.. అదే నన్ను ఖమ్మం జిల్లా ప్రజలకు చేరువ చేసింది. శీనన్నగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా చేసింది’ అంటున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఈవారం పర్సనల్ టైమ్.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కల్లూరు మండలం నారాయణపురం మా సొంతూరు. చిన్నప్పుడు ఊళ్లోనే వ్యవసాయ పనులు చేశా. 1985లో ఎన్టీ ఆర్ హయాంలో గ్రామోదయ పథకం అమలులో ఉండేది. దానిని ఆసరా చేసుకుని మాఊరి సమీ పంలో గల పేరువంచ మేజర్‌పై క్రాస్‌వాల్ నిర్మించేందుకు ఉపక్రమించా. దీనికి అవసరమైన డబ్బులు మాత్రం నా దగ్గర లేవు. పని విలువలో సగం ఊరు చెల్లిస్తే.. సగం ప్రభుత్వం భరించేది. అయితే ఊళ్లో ఉన్న పరిస్థితి దృష్ట్యా విరాళాలు అడిగేందుకు నాకు మనసు రాలేదు. శ్రమను పెట్టుబడిగా పెట్టి నిర్మాణానికి అవసరమైన వస్తు సామగ్రిని సమకూర్చుకుని పేరువంచ మేజర్‌పై క్రాస్‌వాల్ శ్రమదానంతో నిర్మించా.
నా జీవితంలో తొలి నిర్మాణం కావడంతో ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్తే ఎంతో ఆనందం కలుగుతుంది. క్రాస్‌వాల్ నిర్మాణం వల్ల 450 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. క్రాస్‌వాల్ నిర్మాణానికి నేను పడిన తప న ఎన్నెస్పీ అధికారులను ముగ్ధులను చేసింది. రూ.28వేల విలువైన క్రాస్‌వాల్ నిర్మాణంతో నేను తొలి విజేతగా నిలబడితే.. అప్పటి ఎన్నెస్పీ ఎస్‌ఈ చెరుకూరి వీరయ్య ప్రోత్సాహం నాకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. ‘నీకు కాంట్రాక్టర్‌గా రాణించే ఓర్పు.. నేర్పు, శ్రమించే తత్వం ఉంది.. నేను నామినేషన్ ప్రాతిపదికన ఒక పని కేటాయిస్తున్నా.. చేసుకో’ అని ప్రోత్సహించారు. రూ.9 వేల పని అప్పగిస్తే దిగ్విజయంగా పూర్తి చేశా.
ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, నేను అందరం శ్రమజీవులమే. ఒకరి శ్రమపై ఆధారపడే అలవాటు మాకు ఎప్పుడూ లేదు. ఎవరి పని వారు చేసుకోవాలని, అందులో సంతృప్తి పొందాలనేది మా సంస్కృతి. దాన్ని ఇంట్లో పెంపొందించింది నాన్నే. నాన్నకు భూమిపై ఎడతెగని మక్కు వ. వ్యవసాయం గిట్టుబాటు కాక నాన్న కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నా.. కరువు వేధిస్తున్నా.. ఆయనకు భవిష్యత్‌పై ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కుచెదిరేది కాదు. నాన్న వారసత్వపు ఆస్తిగా 32 ఎకరాలు పంచుకుంటే.. ఆయన శ్రమ పెట్టుబడిగా పెట్టి మరో 32 ఎకరాలు సంపాదించారు. మూగజీవుల పట్ల నాన్నకు ఉండే మమకారం, ప్రేమ మమ్మల్ని కట్టి పడేసేవి. వాటికి ఆకుపసరు, దినుసులతో వైద్యం చేయడంలో నాన్న రాఘవరెడ్డిది అందెవేసిన చేయి.
4 గంటలకు లేచి మోట కొట్టేవారు. అమ్మ సామ్రాజ్యం పొలానికి వెళ్లి పశువులకు మేత తెచ్చేది. అవకాశం ఉన్నంత మేర కష్టపడి పేరు తెచ్చుకుని ఉన్నతిలోకి రావాలన్నది నాన్న సిద్ధాంతం. అందుకే నాన్న మరణించేంత వరకు శ్రమించారు. కుటుంబాన్ని వృద్ధిలోకి తేవడంలో నాన్న పాత్ర ఎంతో.. ఆయనకు చేదో డు వాదోడుగా ఉండి క్షణం సమయాన్ని వృథా చేయకుండా కుటుంబ ఉన్నతికి ధారపోసిన అమ్మ స్వరాజ్యం సేవా దృక్పథం, త్యాగనిరతి అంతే గొప్పది. నాన్నకు భూమి అంటే ప్రాణం .. మా పొలం పక్కన ఎకరం అమ్ముతున్నారని తెలిసి దాన్ని కొనేందుకు ఆయన పెళ్లి సందర్భంగా మా అమ్మమ్మ వాళ్లు పెట్టిన వెండి పళ్లెం సైతం అమ్మా రు.
ఇప్పుడు నేను, తమ్ముడు ప్రసాదరెడ్డి సైతం నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం. మేము చేస్తున్న వ్యాపారాల్లో రూపాయి మిగిలినా దానిని భూమి మీద పెట్టడానికే ఆసక్తి చూపుతాం. దుబారా చేయడం మా ఇంటా.. వంటా లేదు. ఎన్ని డబ్బులు వచ్చినా.. వాటిని భవిష్యత్‌కు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తామే తప్ప ఆడంబరాలకుపోం. ఇక కాంట్రాక్టర్‌గా ఎంత పేరున్నా.. అదే రీతిలో ఆర్థిక కష్టాలు సైతం చవిచూడాల్సి వచ్చింది. వృత్తి ప్రారంభ సమయంలో చేతినిండా పనులున్నా.. జేబులో చిల్లిగవ్వ లేక అల్లాడిన పరిస్థితులనేకం. నిర్మల్‌లో కాంట్రాక్టు పనులు చేస్తున్న సమయంలో ఆర్థిక కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నేను, ప్రసాదరెడ్డి ఆ రోజు నిర్మల్ నుంచి ఇంటికి తిరిగొచ్చే సమయంలో ఇద్దరి దగ్గర కడుపు నిండా తినడానికి డబ్బులేని పరిస్థితి. ఇద్దరం చెరి రెండు అరటి పండ్లు తిని అయిందనిపించాం.
ఇక వృత్తిపరంగా.. వ్యాపారపరంగా దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నేను నిరంతరం బిజీగా ఉంటుండడంతో కుటుంబ వ్యవహారాలన్నీ నా సతీమణి మాధురి చూసుకునేది. పిల్లలను ఉన్నతులను చేయడం, వారి అభిరుచులకు అనుగుణంగా ఎదిగేలా తీర్చిదిద్దడంలో ఆవిడ పాత్ర ఉదాత్తమైంది. ఇప్పటికీ మా మధ్య మాట పట్టింపులు ఉండవు. ఎదుటివారు నొచ్చుకునేలా మాట్లాడే పద్ధతికి మేము ఇద్దరం వ్యతిరేకం. నేను ఎప్పుడైనా తొందరపాటుగా మాట తూలే పరిస్థితి వచ్చినా.. సరిచేయడం.. సర్దిచెప్పడం ఆమెకు మాత్రమే సాధ్యం. ఇక ఎంపీగా.. రాజకీయ నేత గా నన్ను తీర్చిదిద్దింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండదండలతో ఖమ్మం లాంటి క్లిష్టతరమైన రాజకీయ పరిస్థితులు కలిగిన ప్రాంతంలో ఎంపీగా వైఎస్సార్ సీపీ నుంచి విజయం సాధించా. అసలు 2013లో నేను రాజకీయ అరంగేట్రం చేస్తానని అనుకోలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశం జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం ఐదేళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా ప్రజలకు చేరువయ్యే అవకాశం వచ్చింది. 2019లో రాజకీయాల్లోకి రావాలని తొలుత అనుకున్నా.. కానీ.. ముందే జరిగిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు చేరువయ్యే విధానం.. ప్రతి అంశంపై సమగ్ర అవగాహన ఉండటం నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. కాంట్రాక్టర్‌గా నా ఉన్నతిని ఒక దశలో అయిన వారే జీర్ణించుకోలేని పరిస్థితి. అవకాశం వచ్చినప్పుడల్లా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగా.
కాంట్రాక్టర్‌గా 60 శాతం వరకు నాకు సక్సెస్ రేటు ఉంది. నాన్న రాఘవరెడ్డి ఎప్పుడూ నన్ను సాధారణ ఉద్యోగిగా చూడాలనుకోలేదు. జీవితంలో నలుగురికి ఉపయోగపడేలా.. పదిమంది మెచ్చేలా జీవన విధానం ఉండాలనేవారు. మా అబ్బాయి హర్షారెడ్డి ఎంబీఏ పూర్తి చేశాడు. వ్యాపారరంగంలో అడుగు పెట్టాడు. తనదీ శ్రమించే స్వభావమే. పాప సప్ని పబ్లిక్ రిలేషన్స్ సబ్జెక్టులో స్పెయిన్‌లో మాస్టర్ డిగ్రీ చేసింది. మీడియా రంగంలోకి అడుగిడాలనేది ఆవిడ సంకల్పం. వ్యాపార రంగంలో ఉండటం మూలాన పిల్లల ఎదుగుదలలో పూర్తిగా భాగస్వామ్యం కాలేకపోయా.
సతీమణి మాధురి తోడ్పాటు వల్ల వారిని ఉన్నతులను చేశా. అప్పట్లో వారికి కేటాయించలేకపోయిన సమయాన్ని ఇప్పుడు వారితో గడిపేందుకు ప్రయత్నిస్తున్నా. అప్పుడప్పుడు కుటుంబపరంగా వివిధ ప్రాంతాలకు వెళ్లడం.. సినిమాలకు వెళ్లడం ఇప్పుడిప్పుడే చేస్తున్నా. కాంట్రాక్టు వ్యవహారాలు ఇప్పటికీ నేను, తమ్ముడు చూసుకుంటాం. క్షేత్రస్థాయి పనుల పర్యవేక్షణ బాధ్యత ప్రసాదరెడ్డిది అయితే. టెండరింగ్ వ్యవహారాలు, పత్రాల సేకరణ, సమర్పణ వంటి అంశాల బాధ్యతను నేను చూస్తుంటా. నాన్న పేరుతో రాఘవ సంస్థ అనేక రంగాల్లో ఇప్పటికే అడుగిడింది.
పొలం పనులంటే ఇప్పటికీ నాకెంతో ఇష్టం. రైతు పడుతున్న కష్టానికి తగిన ఫలితం రావడం లేదనే ఆవేదన. విద్యార్థి దశలో నాన్న పడుతున్న కష్టం, తోటి రైతులు వ్యక్తం చేస్తున్న ఆవేదన నా చెవుల్లో పదే పదే ధ్వనించేవి. ఇక మా ఊరి వ్యవసాయ పరిస్థితి విభిన్నం. తలాపునే సాగర్ కాల్వ ప్రవహిస్తున్నా.. పొలాలకు చుక్క నీరందేది కాదు. మాకు మెట్ట పంటలే దిక్కు. దీంతో రైతులకు సహాయం చేయాలనే లక్ష్యం.. పొలంలో సిరులు పండించాలనే పట్టుదల నన్ను సేవాభావం వైపు నడిపించింది.
Comments
Please login to add a commentAdd a comment