ఇంటర్‌లో ఫెయిలైనా.. జీవితంలో పాస్‌ | Private Teacher Life Successes Store | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ఫెయిలైనా.. జీవితంలో పాస్‌

Published Mon, May 20 2019 8:20 AM | Last Updated on Mon, May 20 2019 8:20 AM

Private Teacher Life Successes Store - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: ‘ఎక్కడ పొగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి’ అంటుంటారు. ఓ వ్యక్తి అచ్చం అలాగే చేశాడు. ఏ సబ్జెక్టులో అయితే ఫెయిలయ్యాడో.. అదే సబ్జెక్టుపై కసి, పట్టుదలతో నైపుణ్యం పెంపొందించుకొని ఇప్పుడు విద్యార్థులకు అదే సబ్జెక్టు బోధిస్తున్నాడు. ఆత్మస్థైర్యం.. పట్టుదల ఉంటే జీవితంలో సాధించలేనిది ఏమిలేదని నిరూపించారు..వకులాభరణం ఆదినాథ్‌. ఇంటర్‌లో ఫెయిలైనా మనోధైర్యంతో ముందుకు సాగారు. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన నేడు ఓ పాఠశాలను స్థాపించి వంద మందికి ఉపాధి కల్పిస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ జీవితంలో పాసైన ఆదినాథ్‌ సక్సెస్‌పై ‘సాక్షి’ కథనం.

మనోధైర్యంతో ముందుకు..
ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన వి.ఆదినాథ్‌ 1 నుంచి 10వ తరగతి వరకు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల నం.2లో చదివారు. ఇంటర్మీడియెట్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1984 నుంచి 1986
వరకు విద్యను అభ్యసించారు. ఫస్టియర్, సెకండియర్‌ గణితంలో ఫెయిలయ్యారు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇంటర్‌ చదువుకుంటూ తాపీమేస్త్రి వద్ద కూలి పనిచేసేవారు. అదేవిధంగా హౌస్‌వైరింగ్, వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేవాడు. తన ఇంట్లోని ఐదు గదులను రూ.500లకు అద్దెకు ఇస్తూ కుటుంబాన్ని పోషించారు. తండ్రి నర్సింహయోగి, తల్లి లక్ష్మీమాత. వీరికి తొమ్మిది మంది కూతుళ్లు, ముగ్గురు కుమారులు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో ఇంటర్‌ చదివే సమయంలోనే కుటుంబ బాధ్యతలు భుజాన ఎత్తుకున్నారు.

రూ.150కు ఉద్యోగంలో చేరి..
మా ఇంట్లోని ఐదు గదులను పాఠశాల నడిపేందుకు లింబాద్రి అనే వ్యక్తికి రూ.500లకు అద్దెకు ఇచ్చాం. ఆ పాఠశాలలోనే నేను రూ.150కు ఉద్యోగంలో చేరాను. మూడునాలుగు నెలల పాటు ప్రగతి పాఠశాలను నడిపిన యాజమాన్యం టీచర్లకు వేతనాలు, ఇతర ఖర్చులను భరించలేక పాఠశాలను వదిలి వెళ్లిపోయారు. దీంతో అక్కడ పనిచేసే నేను, సాంబయ్య, సునంద పాఠశాలను నడిపించాం. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని చదువును కొనసాగించాం. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాను. పాఠశాలలో అటెండర్, వాచ్‌మెన్‌తోపాటు అన్ని నేనే అయి ముందుకు తీసుకెళ్లాను. ఇప్పటివరకు 25 బ్యాచ్‌ల వరకు పదో తరగతి విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్నారు. ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు, ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు.

నేడు వంద మందికి ఉపాధి..
పట్టణంలోని ప్రగతి పాఠశాలను నడిపిస్తూ దాదాపు వంద మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు ఆదినాథ్‌. అదేవిధంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. పాఠశాలలో పనిచేస్తూనే ఇంటర్‌ పాసయ్యారు. ఆ తర్వాత డిగ్రీ, తెలుగు పండిత్‌ పూర్తి చేశారు. ఏ సబ్జెక్టులోనైతే ఫెయిల్‌ అయ్యారో అదే సబ్జెక్టుపై నైపుణ్యం పెంపొందించుకొని విద్యార్థులకు గణితం బోధిస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యం అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పలుసార్లు ఎన్నికవుతూనే ఉన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని వివిధ పాఠశాలల యాజమాన్యాలు ముందుకు సాగుతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్‌ అయినంత మాత్రానా జీవితంలో ఫెయిల్‌ అయినట్టు కాదని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ఆయన చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement