షబానా వద్ద డిజైన్లు నేర్చుకుని పీస్ వర్క్ చేస్తున్న మహిళలు
పదో తరగతిలో ఫెయిల్ కావడంతో చదువుకు ఫుల్‌స్టాప్ పడింది. కొంతకాలానికి వివాహం. కుటుంబ పోషణ కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు మకాం మారింది. ఖాళీగా ఉండకుండా తనవంతుగా కుటుంబానికి చేయూతనివ్వాలనుకుంది. ఏం చేయాలా అని ఆలోచించింది. చిన్ననాటి నుంచి దుస్తులపై డిజైన్లు చేయాలంటే ఇష్టం. దీంతో ఆలోచనలు అటు వైపు మళ్లాయి. అంతే జాకెట్లు, చీరలు, డ్రెస్‌లపై డిజైన్లు చేయడం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఈ రంగంలో నిలదొక్కుకుంది. ప్రస్తుతం మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. ఆమే నర్సాపూర్‌కు చెందిన షబానా. చదువు లేకపోయినా సాధించాలన్న పట్టుదల ఉంటే చాలంటున్న ఆమె విజయగాథ ఆమె మాటల్లోనే..
నర్సాపూర్: మాది హైదరాబాద్‌లోని కవాడిగూడ. పదో తరగతి వరకు చదివాను. ఫెయిల్ కావడం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడితో చదువుకు స్వస్తి పలికాను. ఆ తర్వాత కొంత కాలానికి వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటకు చెందిన అక్బర్‌తో వివాహం జరిగింది. అత్తారింట్లో అడుగుపెట్టాను. కుటుంబ పోషణ కోసం 13 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు మకాం మార్చాం. ఐడీపీఎల్‌లో అద్దె ఇంట్లో దిగాం. అక్బర్ కారు నిడిపి కుటుంబాన్ని పోషించేవారు. నా వంతుగా కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాను. మేం ఉంటున్న ఇంటికి దగ్గరలో మాధవి అనే ఆవిడ జాకెట్లు, చీరలు, డ్రెస్‌లపై డిజైన్లు వేసే పని చేస్తుండేది. నాకు అందులో ప్రవేశం ఉండడంతో ఆమె నుంచి చీరలు, జాకెట్లు ఇంటికి తెచ్చుకుని పీస్ వర్క్ కింద వాటిపై డిజైన్లు వేసి ఇచ్చేదాన్ని. అలా నెలనెలా కొంత సొమ్ము సంపాదించడం ప్రారంభమైంది.
కొన్నాళ్లకు నర్సాపూర్‌కు మకాం
నర్సాపూర్‌లో దగ్గరి బంధువులు ఉండడంతో మా మకాం ఇక్కడికి చేరింది. బంధువులతో పాటు స్వ యం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరా. అందులో వచ్చిన రుణంతో డిజైన్లు వేసేందుకు అవసరమైన సామగ్రిని హైదరాబాద్ నుంచి తెచ్చుకొని ఇంట్లోనే డిజైన్లు వేసే పని మొదలుపెట్టా. చీరలు, జాకెట్లు, డ్రెస్సులపై టచ్ వర్క్, మిర్రర్ వర్క్, త్రేడింగ్ వర్క్, కాసుల వర్క్ అందరికీ నచ్చేలా వేయడం ప్రారంభించా. ముందుగా నా వద్దకు వచ్చే వారికి పేపర్లపై డిజైన్లు గీసి చూపిస్తాను. వారికి నచ్చిన డిజైన్ వేసిస్తాను. నేను వేసిన డిజైన్లు నచ్చడంతో చాలామంది వస్తున్నారు. క్రమంగా గిరాకీ పెరిగింది
పలువురికి శిక్షణ, ఉపాధి
ఈ రంగంలో నెమ్మదిగా నిలదొక్కుకున్నాం. ప్రస్తుతం ఆసక్తి ఉన్న మహిళలకు డిజైన్లు వేయడంలో శిక్షణ సైతం ఇస్తున్నాను. అనంతరం పీస్ వర్క్ అప్పగిస్తూ వారికి కూడా సం పాదించుకునే మార్గం చూపిస్తున్నాను. ఇప్పటి వరకు సుమారు 300 మంది నా దగ్గర శిక్షణ తీసుకున్నారు. చాలామంది పీస్‌వర్క్ చేస్తూ రోజుకు పనిని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు సంపాదించగలుగుతున్నారు. ఇది ఆనందాన్నిస్తోంది.
పెళ్లిళ్ల సీజన్ మంచి డిమాండ్
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ఇక ఫుల్ బిజీ. డిజైన్ పనుల గిరాకీ రెట్టింపవుతుంది. పీస్ వర్క్ చేసే మహిళలకు ఇస్తుంటాను. మామూలు సీజన్‌లో నెలకు రూ.15 వల వరకు ఆదాయం వస్తుంది. పెళ్లిళ్ల సీజన్ అయితే సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది.
తోటి మహిళల్లో చైతన్యం
2016లో ఢిల్లీలో జరిగిన హ్యాండిక్రాఫ్టŠస్ మేళాకు వెళ్లా. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గత ఫిబ్రవరిలో కౌంటర్ ఏర్పాటు చేశా. చీరలు, జాకెట్లు, డ్రెస్ మెటీరియల్‌పై డిజైన్లు వేసి విక్రయానికి పెట్టా. అగ్ని ప్రమాదంలో తగలబడడంతో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగే పలు సమావేశాలకు వెళ్తుంటాను. నా అనుభవాలను తోటి మహిళలకు వివరించడంతోపాటు ఉపాధి అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో చైతన్య పరుస్తుంటాను.
పిల్లల భవిష్యత్తు కోసం
నాతో పాటు నా భర్త అక్బర్ చాలా కష్టపడ్డాం. మాకు ముగ్గురు పిల్లలు. మాలాంటి కష్టం వారికి రావద్దని కష్టపడుతున్నాం. వారికి మంచి భవిష్యత్తు అందించాలన్నదే మా తపన. మగ్గం ఉంటే మరింత సులువుగా డిజైన్ వేసే వీలుంటుంది. మగ్గంతో పాటు మెటీరియల్ కొనుగోలుకు, దుకాణం పెట్టుకునేందుకు రుణం అందిస్తే నాతో పాటు మరింత మందికి పని కల్పించాలన్నది ఆశయం. – షబానా
Comments
Please login to add a commentAdd a comment