‘తల్లి’ విగ్రహం ప్లాన్‌ సార్‌దే...: ఎంపీ దయాకర్‌ | MP Pasunuri Dayakar Life Store | Sakshi
Sakshi News home page

అన్ని కేసుల్లో ఏ–1 నేనే : ఎంపీ దయాకర్‌

Published Sun, May 26 2019 11:20 AM | Last Updated on Sun, May 26 2019 7:51 PM

MP Pasunuri Dayakar Life Store - Sakshi

భార్యతో పసునూరి దయాకర్‌

నేను వృత్తిరీత్యా చిత్రకారుడిని.. తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్తగాఎంతో పేరొచ్చింది.. అంతకంటే తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్‌ మెచ్చిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. టీఆర్‌ఎస్‌లో అంచెలంచెలుగా ఎదిగిన నాకు 2014లో వర్దన్నపేట టికెట్‌ వచ్చినట్టే వచ్చి చేజారింది.. అయినప్పటికీ రాజకీయంగా నేను ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది, అంతా సార్‌(కేసీఆర్‌) చూసుకుంటారు అని సరిపుచ్చుకున్నా. అంతే 2015 పార్లమెంట్‌ వరంగల్‌ ఉప ఎన్నికలో ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. తెలంగాణలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచా. రెండోసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ అసాధారణ మెజారిటీతో 
వరంగల్‌ ఎంపీగా మళ్లీ గెలిచాను’
సాక్షి పర్సనల్‌ టైం’లో వరంగల్‌ లోక్‌సభ సభ్యుడు పసునూరి దయాకర్‌

తెలంగాణ ఉద్యమ కాలంలో చురుగ్గా పాల్గొనే ఆయన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు అత్యంత ఇష్టుడిగా మారారు. అయినా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా అవకాశం దక్కలేదు. దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా టీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగారు. ఆ విధేయతే వరంగల్‌ ఎంపీ టికెట్‌ను తెచ్చిపెట్టింది. 2015 ఉప ఎన్నికలతో పాటు తాజా సాధారణ ఎన్నికల్లో ఎంపీగా అద్భుతమైన మెజార్టీతో గెలుపొందారు పసునూరి దయాకర్‌. ఈ సందర్భంగా తన చదువు, వివాహం.. ఉద్యమంలో తీరుతెన్నులు.. కేసులు ఎదుర్కొన్న వైనమే కాకుండా వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ‘సాక్షి పర్సనల్‌ టైమ్‌’లో పంచుకున్నారు. ఆ వివరాలు దయాకర్‌ మాటల్లోనే... 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : ఉమ్మడి రాష్ట్రంలోని 25 మందిలో నేనొక్కడిని.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా సంగెం మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన పసునూరి కమలమ్మ – ప్రకాశం మా అమ్మానాన్నలు. 1967 ఆగస్టు 2న జన్మించాను. హైదరాబాద్‌ జేఎన్టీయూలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 25 సీట్లు మాత్రమే ఉండేవి. అందులో ఒక సీటు రావడంతో బీఏ ఫైన్‌ ఆర్ట్స్‌ చదివా. హైదరాబాద్‌లో చదువు పూర్తి చేసుకుని వరంగల్‌కు చేరి ఫొటో స్టూడియో ఏర్పాటు చేసి చిత్రకారుడిగా వృత్తి ప్రారంభించాను. 2001 టీ ఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో కీలకంగా పని చేశా.

 స్విమ్మింగ్‌ అంటే ఇష్టం
పదో తరగతి వరకు మా ఊరు బొల్లికుంటలోనే చదువుకున్నా. ఆ రోజుల్లో చదువుతో పాటు స్నేహితులతో కలిసి ఊరిలో అన్ని ఆటలు ఆడా. స్విమ్మింగ్‌తో పాటు అన్ని ఆటలు ఇష్టమే. చిన్నప్పుడు కొద్దిగా రఫ్‌గానే ఉండేవాన్ని. కోతి కొమ్మచ్చి, తాటిముంజల కోసం చెట్లు ఎక్కడం ఇప్పటికీ మరిచిపోలేను. ఇంటర్మీడియట్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌లో మా చిన్నాన్న దగ్గర చదుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్‌ జేఎన్‌టీయులో బీఏ ఫైన్‌ ఆర్ట్స్‌ సీటు రావడంతో అక్కడి వెళ్లా.

లాస్ట్‌బెంచ్‌ స్టూడెంట్‌ను..
హైస్కూల్, కాలేజీ, యూనివర్సిటీలలో లాస్ట్‌బెంచ్‌లో కూర్చునేవాన్ని. చదువు, మార్కుల విషయంలో మాత్రం పర్‌ఫెక్ట్‌. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తయ్యాక హైదరాబాద్‌లో చదవాలనుకున్నా. జేఎన్‌టీయూలో బీఏ ఫైన్‌ ఆర్ట్స్‌ సీట్లు ఉమ్మడిరాష్ట్రంలో 25 సీట్లు మాత్రమే ఉం డేవి. అయినా అందులో సీటు కోసం ఎంట్రన్స్‌ రాస్తే 25 మం దిలో ఒకడిగా నాకు సీటు దక్కడం సంతోషాన్ని కలిగించింది.

‘సత్య’ సినిమా బాగా నచ్చింది
చదువుకునే రోజుల్లో అన్ని ఆటలు ఆడేవాన్ని. స్విమ్మింగ్‌తో పాటు జిమ్‌కు కూడా వెళ్లేవాణ్ని. వాలీబాల్, అథ్లెటిక్స్‌ అంటే కూడా చాలా ఇష్టం. వాలీబాల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్, స్టేట్‌ పోటీల్లో పాల్గొన్నా. అథ్లెట్స్‌లో షాట్‌పుట్, జావెలిన్‌ త్రో, డిస్కస్‌ త్రో కూడా ఇష్టంగా ఆడే వాళ్లం.రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా బాగా నచ్చింది.

ప్రేమ, గీమల జోలికి వెళ్లలే...
చదువుకునే రోజుల్లో ప్రేమ, గీమల జోలికి వెళ్లలేదు. ఆ రోజుల్లో కనీసం ఆ ఆలోచన కూడా రాలేదు. కాలేజీకి వెళ్లిన సందర్భాల్లో ఎవరైనా తోటి విద్యార్థినులు పరిచయమైనా.. మరుసటి కనిపిస్తే కనీసం ‘హాయ్‌’ అని కూడా అనలేదు. ఎందుకంటే చదువుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మిగతా వాటికి ప్రాధాన్యత అవసరం లేదని భావించేవాడిని. సేమ్‌ టైమ్‌ కేవలం పరిచయం చేసుకున్నంత మాత్రాన దానిని అవకాశంగా కూడా తీసుకోవడం సరికాదనే అనిపించేది. అందుకే వాటికి జోలికి వెళ్లలే. నాటుకోడి కూర బాగా ఇష్టం.

పెద్దలు కుదిర్చిన పెళ్లి
హైదరాబాద్‌లో బీఏ ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తి చేసి వరంగల్‌కు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నా. గౌరవంగా ఉంటుందని పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఓకే అన్నా. అయితే, జయవాణి (భార్య) నాకు సీనియర్‌గా ఉన్న విద్యాదర్‌ చెల్లెలు అని ఆ తర్వాతే తెలిసింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కనక వెంటనే జరిగిపోయింది. 1995 డిసెంబర్‌ 4 మా పెళ్లిరోజు.

ఉద్యమ సమయంలో అన్నీ ఆమే
తెలంగాణ ఉద్యమ సమయంలో నా భార్య జయవాణి కుటుంబాన్ని అంతా తానై చూసుకునేది. అటు ఉద్యమం.. ఇటు రాజకీయాల్లో నేను ముందుకు నడవడంలో ఆమె సహకారం మరవలేనిది. పిల్లలను చూసుకోవడం, ఇంటికి వచ్చే నాయకులు, కార్యకర్తలను ఆదరించి మాట్లాడటం వల్ల నాకు కొంత వెసలుబాటు లభించేది. అసలు అర్ధరాత్రి దాటంది ఇంటికి చేరుకున్న రోజులు తక్కువ.

మాదిగవారి కుంట మా ముత్తాత నాటిదే...
దళిత కుటుంబంలో పుట్టినా బాగానే ఉన్నాం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు కలిపి మొత్తం ఆరుగురం. అందరం కూడా కారుల్లోనే తిరిగే పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే మా ముత్తాత షేర్‌ మల్లయ్య 90 – 100 ఎకరాల ఆసామి. ఆయన సంపాదించిన ఆస్తి మా తాతలు, తండ్రులు, మా వరకు వస్తోంది. ఇప్పటికీ ఆశాలపల్లి శివారులో ఉన్న మాదిగవారి కుంట మా ముత్తాత నుంచి వచ్చిందే. ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. ఆస్తుల పంపకాలు లేవు. కలిసే ఉంటున్నాం.

టీఆర్‌ఎస్, కేసీఆర్‌ చలవే..
షెడ్యూల్‌ కులంలో పుట్టినా మా కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందులు లేవు. ఇదే సమయంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం కూడా లేదు. కనీసం సర్పంచ్‌ కూడా గెలవని నేను రెండు సార్లు ఎంపీగా ఎన్నిక కావడం అనేది టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చలవ, ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ వల్ల నాకు ఈ స్థాయి వచ్చింది. ఇది జీవితంలో గొప్ప అనుభూతి, అవకాశం. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం, కేసీఆర్‌ సార్‌ దృష్టిలో నాకు స్థానం దక్కడం నా అదృష్టం. నా జీవితంలో గొప్ప టర్నింగ్‌ పాయింట్‌. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ కేసు నమోదైనా ఏ–1గా నా పేరే ఉండేది. అంతలా ఉద్యమంలో పాల్గొనేవాన్ని.

‘తల్లి’ విగ్రహం ప్లాన్‌ సార్‌దే...
దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం ప్లాన్‌ మా అధినేత కేసీఆర్‌ సార్‌దే. ఆయన ప్లాన్, సూచనలకు అనుగుణంగా విగ్రహాన్ని రూపొందించా. తెలంగాణ ఉద్యమం, ప్రజల ఆశలు, ఆశయాలకు ఆనుగుణంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం సృష్టికర్తగా కేసీఆర్‌ దగ్గర దక్కిన గుర్తింపు, పేరు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది.

అమ్మానాన్న, అన్న కొడుకు మరణం బాధించాయి...
ఉమ్మడి కుటుంబంలో జీవితం హాయిగా సాగుతున్న సమయంలో అమ్మ కమలమ్మ, నాన్న ప్రకాశం మరణం విషాదాన్ని నింపింది. ఆరుగురి సంతానంలో ఆఖరి వాడినైన నాకు ఆ సమయంలో అమ్మనాన్నల మృతి తీవ్రంగా బాధించింది. సోషల్‌ మూమెంట్‌లో తిరిగే మా అన్న కొడుకు టిల్లు(21) చనిపోవడం కూడా తీవ్రంగా కలచివేసింది. మా అన్న బాగా సెన్సిటివ్‌. టిల్లు కొందరు యువకులతో గొడవ పడ్డారని వాళ్ల తల్లిదండ్రులు మా అన్నకు ఫిర్యాదు చేశారు. దీంతో అన్న టిల్లును మందలించగా ఆత్మహత్య చేసుకున్నాడు. అన్న కుమారుడు టిల్లు చనిపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం.

మా ఆయన బంగారం..
వర్ధన్నపేట టికెట్‌ మిస్సయితే బాధ పడ్డా...పసునూరి దయాకర్‌ సతీమణి జయవాణి ఉద్యమం, టీఆర్‌ఎస్‌లో 2014 వరకు కీలకంగా పని చేస్తున్న దయాకర్‌కు వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్‌ వస్తుం దని ఆశించాం. కేసీఆర్‌ సార్‌ కూడా దాదాపుగా దయాకర్‌కే ఇస్తామన్నారు. ఇదే సమయంలో పార్టీలో సమీకరణ కోణంలో అరూరి రమేష్‌కు కేటాయించారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. అయితే, ‘జయా.. సార్‌కు అన్నీ తెలుసు, ఎప్పుడు ఎవరికీ టికెట్‌ ఇవ్వాలన్నది కేసీఆర్‌ సార్‌కు బాగా తెలుసు.. సరైన సమయంలో న్యాయం చేస్తానన్నారు.. సార్‌ దృష్టిలో మనం ఉన్నాం.. టికెట్‌తో సంబంధం లేదు’ అని ఆయన(దయాకర్‌) నన్ను అనునయించారు.

ఆ తర్వాత వెంటనే వచ్చిన 2015 వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా దయాకర్‌ పేరును కేసీఆర్‌ సార్‌ ప్రకటించడంతో మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మళ్లీ ఇప్పుడు టికెట్‌ ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా ఎంపీగా గెలిపించారు. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేసినందుకు గొప్ప గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ఇక మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఉమ్మడి కుటుంబంలో ఈ ఇంటికోడలుగా రావడం ఆనందంగా ఉంది. రాజకీయంగా ఎక్కడికి వెళ్లినా.. ఏ సమయంలో వచ్చినా ఇంట్లోకి చేరగానే అవన్నీ మరచిపోయి చికాకు లేకుండా నాతో పాటు పిల్లలు రోని భరత్, ప్రీతమ్‌తో గడుపుతారు. అందుకే మా ఆయన బంగారం. పార్లమెంట్‌ సభ్యుడిగా కేసీఆర్‌ బాటలో సాగుతూ ఆయన ప్రజాజీవితంలో ఉండటం నిజంగా మా అదృష్టం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement