కుటుంబసభ్యులతో జేసీ నగేష్
నాకు బచ్చల కూర పప్పు అంటే భలే ఇష్టం. వంట కూడా బాగా వండుతా. చదువుకునేటప్పుడు నేర్చుకున్నా. సెల్ఫ్ కుకింగ్‌తో రిలాక్స్ కావొచ్చు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇంటి దగ్గర నేనే వండుతా. మా ఇంట్లో వాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. మమ్మీ కంటే డాడీనే బాగా వంట చేస్తారని మా పిల్లలు అంటుంటారు. మా నాన్న.. మా టీచర్.. ఆయనే బెస్ట్ ఫ్రెండ్ అని అంటున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్. మా నాన్నే నాకు స్ఫూర్తి అని.. ఆయన అండ, సూచనలతోనే ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. బుక్స్ రీడింగ్ అంటే ఇష్టమని, సమయం దొరికితే కవితలు రాస్తుంటానని, కామెడీ, కుటుంబకథా చిత్రాలు నచ్చుతాయని చెబుతున్నారు. వరుస ఎన్నికలు, నిత్య విధుల్లో తలమునకలైన ఆయన శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. చిన్ననాటి తీపిగుర్తులు, మరుపురాని సంఘటనలు, ఇష్టమైన వంటకాలు, సినిమాలు, ఆటలు, స్నేహబంధంపై నగేష్ పర్సనల్ టైం ఆయన మాటల్లోనే..
సాక్షి, మెదక్ : మా నాన్న రాంరెడ్డి రిటైర్డ్ టీచర్.. అమ్మ పద్మ హౌస్ వైఫ్. నాకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని తొర్లికొండకు చెందిన మమతతో వివాహమైంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. మాకు ఇద్దరు సంతానం. అబ్బాయి ధీరజ్ బీటెక్ తృతీయ సంవత్సరం.. అమ్మాయి లాస్య బీటెక్ ఫస్టియర్ చదువుతోంది.
విద్యాభ్యాసం..
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్‌లో నాలుగో తరగతి వరకు చదివాను. హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రభుత్వ పాఠశాలలో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు.. నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని చందూర్‌లో తొమ్మిది, పదో తరగతి విద్యనభ్యసించాను. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శంకర్‌నగర్‌లో ఉన్న మధుమలంచ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్.. నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో బీఎల్‌ఐసీ, ఎంఏ–తెలుగు విద్యనభ్యసించాను.
అది నాకు చేదు, తీపి జ్ఞాపకం
వెల్కటూర్‌లో నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఒక సంఘటన నన్ను మార్చేసింది. మా నాన్న ఆ ప్రభుత్వ స్కూల్‌లో ఉపాధ్యాయుడు. 30 ఏళ్లు అక్కడే టీచర్‌గా పనిచేశారు. సిన్సియర్ టీచర్‌గా పేరు సంపాదించారు. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఒక రోజు తెలుగు నెలల పేర్లు చెప్పమంటే.. చెప్పాను. వరుస క్రమంలో చెప్పకపోవడంతో అందరి ముందు బెత్తంతో బాదారు. ఆ తర్వాతే నేను చదువు మీద దృష్టిసారించాను. ఇది నాకు చేదు, తీపి జ్ఞాపకంగా మిగిలింది.
గాంధీ ఆటోబయోగ్రఫీ మరువలేను
నేను హైదరాబాద్‌లో ఏడో తరగతి చదువుతున్నా. స్కూల్‌లో ఆగస్టు 15 సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో నేనే ఫస్ట్ వచ్చా. నాకు జాతిపిత మహాత్మాగాంధీ ఆటో బయోగ్రఫీ ఉన్న పుస్తకం, ఒక డిక్షనరీ ప్రజెంట్ చేశారు. ఇది నేను ఎప్పటికీ మరిచిపోలేను.
హ్యాపీ మూమెంట్..
ఓయూ ఆర్ట్స్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న సమయంలో నాకు గ్రూప్–3 ఉద్యోగం వచ్చింది. 1994లో నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ ఇన్‌స్పెక్టర్‌గా నా తొలి పోస్టింగ్. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన రోజు యూనివర్సిటీ ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న పార్టీ చేసుకున్నాం. ఓ హోటల్‌లో అందరం భోజనం చేసి.. స్వీట్లు తిన్నాం. అది నాకు హ్యాపీ మూమెంట్.
మూడు సంఘటనలు మరిచిపోలేనివి
కామారెడ్డిలో ఆర్డీఓగా పనిచేస్తున్న సమయంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించాను. ఓ సంధులోని పాత ఇంట్లో ఆ స్కూల్ ఉంది. గాలి, వెలుతురు రాకపోవడంతోపాటు వసతులు సరిగా లేవు. పిల్లలు ఇక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకుంటే చాలా బాధేసింది. వెంటనే మార్చాలని నిర్ణయానికి వచ్చా. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఏఎస్‌డబ్ల్యూ ఆఫీస్‌లోకి మార్చా. ఈ ఆఫీస్‌ను అంతకు మునుపే కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ భవనంలోకి తరలించారు. దీంతో కేజీబీవీని అక్కడికి తరలించేలా దగ్గరుండి పర్యవేక్షించా. ఏడు, ఎనిమిది గదులను అప్పటికప్పుడు శుభ్రం చేసి బాలికల విద్యాలయాన్ని అక్కడికి మార్చాం. ఒక్క రోజులోనే ఇదంతా చేశాం. ఈ ప్రాంతం జనావాసాలకు కొంత దూరంగా ఉండడంతో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించేలా పోలీసులకు సూచించా. ఇందుకోసం పోలీసులు ప్రతి రాత్రి సంతకం చేసేలా బుక్ పెట్టాం. ఈ నేపథ్యంలో విద్యార్థినులు చాలా హ్యాపీగా ఫీల్ కావడం.. నాకు సంతోషాన్నిచ్చింది.
- కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది. 2015–16 అనుకుంటా. ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణ అనే అమ్మాయి అప్పుడు అక్కడే చదువుతోంది. ఈ పాఠశాల గుట్టమీద ఉండడంతో తాగునీటికి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు కాళేశ్వరం పనులు జరుగుతున్నాయి. విద్యార్థులు స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవు. వెంటనే గుట్ట కింద ఉన్న బావి వారితో మాట్లాడి పూడిక తీయాలని సంకల్పించా. వెంటనే జేసీబీతో బావి పూడిక తీయడంతోపాటు గుట్టపైకి పైపులైన్ వేసి విద్యార్థుల నీటి కష్టాలు తీర్చాను. విద్యార్థులు వచ్చి థ్యాంక్స్ సర్ అని చెప్పడంతో ఆనందమేసింది.
- కామారెడ్డిలో ఆర్డీఓగా ఉన్న సమయంలో 2016లో సుమారు పది వేల మందికి పౌతి చేసి రికార్డ్ సృష్టించాం. చనిపోయిన వారి వారసులకు సంబంధించిన భూములను గ్రామ సభలు నిర్వహించి గుర్తించాం. సుమారు పదేళ్లుగా వారు పట్టాపాస్ బుక్కుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారి వారి గ్రామాల్లో చెట్ల కింద పౌతి ప్రక్రియ పూర్తి చేసి వారి ఇంటి వద్దకు వెళ్లి పాస్‌బుక్కులు అందజేశాం. దీనికి సంబంధించి ఆయా గ్రామస్తులు అభినందించడాన్ని ఇప్పటికీ మరచిపోలేను.
బుక్స్ రీడింగ్ ఇష్టం
నాకు బుక్స్ చదవడమంటే ఇష్టం. ఇప్పటివరకు సుమారు 1000 నుంచి 1,200 వరకు బుక్స్ కలెక్ట్ చేశాను. దీంతోపాటు సాహిత్యం, కవితలపై ఇంట్రస్ట్ ఎక్కువ, అప్పడప్పుడు కవితలు రాస్తుంటా. సినిమాలు చాలా తక్కువగా చూస్తా. హిట్ టాక్‌వచ్చి.. ఫ్యామిలీ సినిమా అయితేనే వెళతాం. రెండు, మూడు నెలలకోసారి ఫ్యామిలీతో సహా సినిమా చూస్తాం. మా ఇంట్లో కామెడీ సినిమాలే ఇష్టపడతారు. నేను చూసిన వాటిలో ‘కిక్’ సినిమా చాలా బాగుంది.
స్నేహబంధంలో ప్రత్యేక అనుభూతి..
స్నేహ బంధంలో మరపురాని అనుభూతి ఉంటుంది. చిన్న నాటి స్నేహితులతోపాటు యూనివర్సిటీ ఫ్రెండ్స్‌తో ఇప్పటికీ మాట్లాడుతుంటారు. ఇటీవల ఎస్సెస్సీ బ్యాచ్ వాళ్లు గెట్ టుగెదర్ పెట్టారు. నేను బిజీగా ఉండడంతో వెళ్లలేకపోయా. దసరా వంటి పండుగలకు ఊరెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్‌ను తప్పనిసరిగా కలుసుకుంటా.
విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి
ప్రస్తుతం విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. విద్యార్థులతో స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించి.. పుస్తకాలు చదివించడం నేర్పించాలి. క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించేలా వారిలో తల్లిదండ్రులు స్ఫూర్తి నింపాలి.
విధులు ఇలా..
నా తొలి పోస్టింగ్ నిజామాబాద్ జిల్లా కో ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ ఇన్‌స్పెక్టర్. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్‌గా.. నిజామాబాద్‌లో ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్‌గా, భువనగిరిలో ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించాను. అనంతరం కామారెడ్డి ఆర్డీఓగా, నిర్మల్ డీఆర్వోగా, ప్రస్తుతం మెదక్ జాయింట్ కలెక్టర్‌గా 2017 నవంబర్ నుంచి పని చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment