ఎమ్మెల్యే హరిప్రియ
‘ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడం.. వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపడంలోనే తృప్తి ఉంటుంది. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నదాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. రాజకీయ కార్యకలాపాలు నడిపేందుకు వెచ్చిస్తున్నా. విద్యా సంస్థలు ఉన్నా.. వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రజా సేవకే వినియోగిస్తున్నా. చిన్న వయసులోనే 2002లో ఇంటర్ పూర్తయి.. ఎంసెట్ పరీక్ష రాసిన వెంటనే పెళ్లి కావడం.. రాజకీయ నేపథ్యం లేకున్నా రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చాను. పార్టీపరంగా.. పదవులపరంగా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నా. నా భర్త హరిసింగ్ సహకారంతోనే నిత్యం ప్రజల మధ్య ఉంటూ రాజకీయంగా రాణించగలుగుతున్నా. ఉన్నత విద్యను అభ్యసించడం.. చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడంతో బాధ్యతలు మరింతగా పెరిగాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ.. కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం కేటాయిస్తూ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నా. నా భర్త బానోతు హరిసింగ్‌నాయక్ బండికి ఇరుసులా మారి రాజకీయంగా నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. రాజకీయ సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు’. ‘సాక్షి’ పర్సనల్ టైమ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియనాయక్
ఇల్లెందు: మాది కొత్తగూడెంలోని బాబు క్యాంప్ ప్రాంతం. నాన్న బాదావత్ సీతారాంనాయక్ సింగరేణిలో ఉద్యోగం చేసేవారు. అమ్మ దర్జన్ గృహిణి. 2002లో ఇంటర్ పూర్తయి, ఎంసెట్ రాసిన వెంటనే టేకులపల్లికి చెందిన హరిసింగ్ నాయక్‌తో వివాహం అయింది. పెళ్లయ్యాకే భర్త హరిసింగ్ ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశాను. 2006లో టేకులపల్లిలో హరిసింగ్ విద్యాసంస్థలను ప్రారంభించారు. క్రమంగా హైదరాబాద్‌లోనూ ప్రైవేటు స్కూల్ పెట్టాం. నాతోపాటు మా బంధువుల పిల్లలం అందరం కలిసి హైదరాబాద్‌లో ఉండేవాళ్లం. స్కూల్‌లో బోధించడంతోపాటు చదువు కోసం కాలేజీకి వెళ్లడం, అందరికీ వంట చేయడం.. ఇలా రోజంతా కష్టపడేదాన్ని. టేకులపల్లి, హైదరాబాద్‌లో కలిపి ఇప్పుడు నాలుగు ప్రైవేటు స్కూళ్లు, నాలుగు జూనియర్ కాలేజీలు ఎనిమిది బ్రాంచీలు ఉన్నాయి. మొత్తం 3,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో అనేక మంది పేద పిల్లలకు ఉచితంగానే విద్యా బోధన చేస్తున్నాం.
ఉన్నత విద్యతోనే రాజకీయాల్లోకి..
2004లో ఇల్లెందు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి కల్పనాబాయి పోటీ చేశారు. ఆమె సోదరుడు నా భర్త హరిసింగ్‌నాయక్‌కు మిత్రుడు కావడంతో ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రభావంతోనే హరిసింగ్‌కు రాజకీయాలపై దృష్టి మళ్లింది. 2008లో టీడీపీలో చేరారు. అనతి కాలంలోనే తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ టీడీపీ నుంచి ఊకె అబ్బయ్యకు అవకాశం రావడంతో.. హరిసింగ్ రెబెల్‌గా నామినేషన్ వేశారు. అప్పుడు ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబునాయుడు ఇల్లెందుకు వచ్చినప్పుడు హరిసింగ్‌తో మాట్లాడి.. ‘నీకు మంచి భవిష్యత్ ఉంటుంది.. పోటీనుంచి తప్పుకో’ అని సూచించారు. అప్పటికే నామినేషన్ విత్‌డ్రాకు సమయం అయిపోవడంతో బరిలో ఉంటూనే అబ్బయ్య గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు మళ్లీ విద్యాసంస్థలపై దృష్టి పెట్టాం.
వాటినే పటిష్టం చేసి, అందులోనే నిలదొక్కుకోవాలనుకున్నాం. ఇంతలోనే 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇల్లెందు అభ్యర్థిని మార్చాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఉన్నత విద్యావంతురాలైన నన్ను బరిలోకి దింపితే బాగుంటుందని, గెలిచే అవకాశం ఉంటుందని నాటి బయ్యారం మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. తుమ్మల ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పడంతో ఇల్లెందు టికెట్ నాకు ఇవ్వాలని నిర్ణయించారు. టికెట్ ఇవ్వడానికి ఐదు గంటల ముందు మమ్మల్ని హైదరాబాద్‌కు రమ్మని ఫోన్ వచ్చింది. దీంతో హడావిడిగా వెళ్లి నాటి సీఎం చంద్రబాబును కలిశాము. ఆయనతో మాట్లాడిన తర్వాత టికెట్ నాకే ఇస్తున్నారనే సంకేతం వచ్చింది. మరుసటి రోజు పేపర్‌లో వార్త చూసి వచ్చి నామినేషన్ వేశాం. అయితే తొలిసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఐదేళ్ల పాటు టీడీపీ సమన్వయకర్తగా పని చేసి, అనేక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాం.
2017లో కాంగ్రెస్‌లోకి..
రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ బలహీనపడడంతో 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరాం. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీచేసి, ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మళ్లీ పార్టీ మారాల్సి వచ్చింది. అయితే మేము రాజకీయాల్లోకి వచ్చి సంపాదించింది ఏమీ లేదు. ప్రస్తుతం మా విద్యాసంస్థలను మా బంధువుల పిల్లలే నిర్వహిస్తున్నారు. వాటిపై వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. ఎమ్మెల్యేగా నాకు ప్రతి నెలా వచ్చే జీతంతో పాటు విద్యాసంస్థల డబ్బు కూడా రాజకీయాలు నడిపేందుకే వెచ్చిస్తున్నాం. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో ఎంతో ఆనందం ఉంది. రాజకీయాలతో పాటు కుటుంబ సమస్యలను కూడా మేమిద్దరం సమానంగా పంచుకుంటూ ముందుకు సాగుతున్నాం.
నాకు రాజకీయాలపై అవగాహన లేకున్నా హరిసింగ్ సహకారంతోనే రాణించగలుగుతున్నా. ఉన్నత విద్యావంతురాలిని కావడం, చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడంతో అందరూ ఎంతో అభిమానం చూపుతున్నారు. నేను సభలు, సమావేశాలకు వెళ్లినా.. అక్కడ ఏ మాట్లాడాలనేది ఇద్దరం చర్చించుకుంటాం. రాజకీయాలు, కుటుంబ విషయాల్లోనూ ఇద్దరిది ఒకే మాట–ఒకే బాట కావడం వల్లే దిగ్విజయంగా ముందుకు సాగుతున్నా. రాజకీయ జీవితానికి అలవాటు పడి విహారయాత్రలు కూడా మరిచిపోయాం. అయితే రాజకీయాల్లో ఉండాలనే బలమైన కోరికతో వచ్చిన భర్త హరిసింగ్ తన కుర్చీని నాకు త్యాగం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment