కష్టాలను గెలిచిన ముత్యం | Common Man Life Success Story Rangareddy | Sakshi
Sakshi News home page

కష్టాలను గెలిచిన ముత్య

Published Fri, May 10 2019 10:52 AM | Last Updated on Fri, May 10 2019 10:52 AM

Common Man Life Success Story Rangareddy - Sakshi

కుటుంబ సభ్యులతో ప్రభు

చదువుకోవాలనే తపన ఉంటే పరీక్షల్లో ఫెయిలైనా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని నిరూపించాడు తాండూరు పట్టణానికి చెందిన ముత్యాల ప్రభు. నాన్న మంచం పట్టడంతో.. కుటుంబ భారాన్నంతా అమ్మ తనపై వేసుకుని నడిపించడాన్ని మర్చిపోలేదని చెప్పారు. 8 మంది సంతానానికి కూడు, గుడ్డ కోసం ఆమె పడిన ఇబ్బందులను కళ్లారా చూశాడు. ఇదే అతని పట్టుదలకు కారణమైంది. పక్క రాష్ట్రంలోని ఊరూరూ తిరిగి ముత్యాలమ్మిన ఆయన.. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు.

తాండూరు: పట్టణంలోని సాయిపూర్‌ ప్రాంతం ముత్యాల బస్తికి చెందిన ఒబులమ్మ, లక్ష్మణ్‌ దంపతులకు 8 మంది సంతానం. ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు.. వీరిలో మూడవ కుమారుడు ముత్యాల సెని ప్రభు. ఈయన 1నుంచి 7వ తరగతి వరకు దయానంద్‌ బాలవిహార్‌ పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం 8నుంచి 10వ తరగతి వరకు విలియమూన్‌ హైస్కూల్‌లో చదివాడు. అంబేడ్కర్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌లో చేరి.. ఫస్టియర్, సెకండియర్‌లో ఫెయిలయ్యాడు. 

అమ్మకు ఆసరాగా.. 
కుటుంబం గడవటం ఇబ్బందిగా మారడంతో ముత్యాల ప్రభు 1999లో చదువుకు బ్రేక్‌ వేశాడు. అమ్మ ఒబులమ్మ చేస్తున్న ముత్యాల వ్యాపారాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అమ్మ, అన్నయ్య నుంచి రూ.5 వేలు తీసుకున్నాడు. ఈ డబ్బుతో హైదరాబాద్‌లోని చార్మినార్‌ ప్రాంతానికి వెళ్లి ముత్యాలు, రోల్డ్‌ గోల్డ్‌ వస్తువులను కొనుగోలు చేశాడు. మహారాష్ట్రలోని పూణే, షోలాపూర్, ముంబై తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి విక్రయించాడు. ఇలా వచ్చిన లాభాన్ని అన్న, తమ్ముళ్ల చదువు కోసం ఖర్చు చేశాడు. వీరిలో ఒక అన్న టీచర్‌గా,  ఇద్దరు తమ్ముళ్లు పోలీసు కానిస్టేబుళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మరో అన్న పట్టణంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. వీరి ఎదగడంలో ప్రభు కృషి ఎంతగానో ఉంది.
 
ఉన్నత చదువులు.. 
ఇంటర్‌లో ఫెయిలైనా కూడా చదువుకునే అవకాశం ఉందని తెలుసుకున్న ప్రభు తాండూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని స్టడీ సర్కిల్‌లో అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం నిర్వహించిన అర్హత పరీక్షలో పాసయ్యాడు. తర్వాత ముత్యాల వ్యాపారం చేస్తూనే  9 ఏళ్ల పాటు చదువును కొనసాగించాడు. డిగ్రీ అనంతరం పీజీ పూర్తిచేశాడు. తర్వాత బీఈడీలో చేరాడు. వైఎస్సార్‌ హయాంలో నిర్వహించిన 2008 డీఎస్సీ పరీక్షలు రాసేందుకు విజయవాడ వెళ్లి మూడు నెలల పాటు కోచింగ్‌ తీసుకున్నాడు. డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా అర్హత సాధించాడు. తాండూరు మండలం రాంపూర్‌తండా ప్రాథమిక పాఠశాలలో తొలిసారి ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. ప్రస్తుతం తాండూరు మండలం పర్వతాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు.

భార్య ప్రోత్సాహం.. 
తన విజయంలో భార్య ఉమారాణి ప్రోత్సాహం ఎంతో ఉందని ప్రభు చెబుతున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు ప్రణవ్య, అక్షిత ఉన్నారు. ఉమారాణి మధ్యలోనే చదువు ఆపేసినా పెళ్లి తర్వాత బీఈడీ పూర్తి చేశారు. 

ఆత్మహత్యలు సరికాదు.. 
ఇంటర్‌లో ఫెయిలయ్యామనే కారణంతో ఇటీవల పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది సరైన నిర్ణయం కాదు. చదువులేకపోయినా జీవితంలో ఎదిగేందుకు అనేక అవకాశాలు వస్తుంటాయి. అన్ని సమస్యలను అధిగమిస్తేనే సక్సెస్‌ లభిస్తుంది. చదువులో ఫెయిలైతే బతుకు ముగిసినట్లు కాదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement