నాన్న లేని లోటు ఎప్పటికీ తీరనిది.. | MLA Vittal Reddy Political Life Story | Sakshi
Sakshi News home page

నేను దేవుడిని నమ్ముతా..

Published Sun, May 19 2019 7:56 AM | Last Updated on Sun, May 19 2019 9:43 AM

MLA Vittal Reddy Political Life Story - Sakshi

కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

‘నేను దేవుడిని నమ్ముతా.. ప్రతీ గురువారం సాయిబాబా గుడికి వెళ్తా.. వేంకటేశ్వరస్వామి మా ఇంటిదైవం.. సొంతూరు దేగాం అంటే ఎంతో ఇష్టం.. ఎక్కడికి వెళ్లినా రాత్రికి ఇక్కడికే వచ్చేస్తా.. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఇప్పటికీ నన్ను ఆత్మీయులు, స్నేహితులు వకీల్‌ సాబ్‌ అనే పిలుస్తుంటారు. కుటుంబ బాధ్యతలు నా భార్య చూసుకుంటుంది.. నాన్న లేని లోటు ఎప్పటికీ తీరనిది..’ అంటూ ‘పర్సనల్‌ టైం’లో ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  

భైంసా (ముథోల్‌): మాది భైంసా మండలం దేగాం గ్రామం. అమ్మానాన్న గడ్డెన్న–రాజవ్వ. మేము ఆరుగురం సంతానం. అందులో నేను మూడో వాడిని. అక్క భోజవ్వ, రెండో అక్క కిష్టవ్వ, తర్వాత నేను పుట్టా ను. నా తర్వాత చెల్లె లక్ష్మి, తమ్ముడు గోపాల్‌రెడ్డి, చిన్నతమ్ముడు సూర్యకాంత్‌రెడ్డి జన్మించారు. నా చదువు దేగాం, భైంసాలోని ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఎల్‌ఎల్‌బీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేశా.

తర్వాత జస్టిస్‌ సుభాషన్‌రెడ్డి వద్ద ప్రాక్టీస్‌ ప్రారంభించా. ఆయన ఇటీవలే మరణించడం నన్ను కలిచి వేసింది. న్యాయవాద వృత్తిలో ఆయనే నా గురువు. ఆయన వద్ద ప్రాక్టీస్‌ చేశాక భైంసా, నిర్మల్, హైదరాబాద్‌ కోర్టులో న్యాయవాదిగా కొనసాగాను. నాన్న గడ్డెన్న మా కుటుంబానికి ఎప్పుడు దూరంగా ఉండేవారు. అమ్మ రాజవ్వనే మా బాగోగులు చూసేది. చిన్నతనంలో పక్కనే ఉన్న చేన్లకు వెళ్లి పని చేసేవాళ్లం. చిన్నప్పటి నుంచి సింపుల్‌గా ఉండడం అలవాటైపోయింది. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు పూర్తిచేశాను.

దైవచింతన, గుడులకు ఎక్కువగా వెళ్తా.. 
విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మికంగా గడపడం నాకు ఇష్టం. గురువారం ఎక్కడ ఉన్నా సాయిబాబా గుడికి వెళ్లి దర్శించుకుంటా. ఇక చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని ఎంతో పూజిస్తా. వేంకటేశ్వరస్వామి మా ఇంటిదైవం. ఆధ్యాత్మికంగా గడపడం ఎంతో ఇష్టం. కాని ఎక్కువ సమయం ప్రజలమధ్యే ఉంటాను. ఎమ్మెల్యేగా గెలిచాక మహాదేవుని మందిరాలు, హనుమాన్‌ ఆలయాలు, జగదంబాదేవి ఆలయాలు చాలానే దర్శించుకున్నాను. దైవం అంటే ఎంతో ఇష్టం. ఎక్కడికి వెళ్లినా గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటాను. అది కూడా సామాన్యులతో కలిసి వెళ్లడమే ఇష్టం. ఆలయాల్లో వీఐపీ దర్శనాలంటే నచ్చవు. దేవుడి ముందు అందరూ సమానమన్నదే నా ఆలోచన.

కుటుంబ బాధ్యత ఆవిడదే.. 
ఎల్‌ఎల్‌బీ పూర్తయ్యాక న్యాయవాద వృత్తిలో ఉన్న సమయంలోనే లక్ష్మితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు సులోచనను దేగాంలో అక్క కొడుకు అప్పం శ్రీనివాస్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశా. కొడుకు వెంకట్‌రాంరెడ్డికి కామోల్‌ గ్రామానికి చెందిన అక్షయతో పెళ్లి జరిపించా. నా తల్లి రాజవ్వ, భార్య లక్ష్మి, కోడలు అక్షయ ముగ్గురిది భైంసా మండలం కామోల్‌ గ్రామం. నాకు ఇద్దరు మనుమళ్లు. వ్యవసాయంతోపాటు కుటుంబ బాధ్యతలను నా భార్య చూసుకుంటుంది. ఇప్పటికీ పంటపొలాలకు వెళ్లి వస్తుంది. ఏటా పంటలు వేయడం, కోయడం అన్ని ఆమే చూసుకుంటుంది.

ప్రజల మధ్య ఉండడం ఇష్టం.. 
సామాన్య జీవితం గడపడమే ఎంతో ఇష్టం. ఏసీలో ఉండడం నచ్చదు. ఇప్పటికీ ఫ్యాన్‌ కిందే నిద్రపోతాం. ఇంట్లోనూ హంగు ఆర్భాటాలు నచ్చవు. మా సొంత గ్రామం దేగాంలో నాన్న కట్టిన ఇంట్లో నా తమ్ముళ్లతో కలిసి ఉంటాను. ఎంత రాత్రి అయినా దేగాంలోని సొంతింటికే వెళ్లి అక్క డే నిద్రపోతాను. నా తముళ్లు గోపాల్‌రెడ్డి, సూర్యకాంత్‌రెడ్డి ఇప్పటికీ వ్యవసాయం చేస్తారు. శుభకార్యాలు ఉన్నా, గుడులకు వెళ్లాలన్నా, ఊర్లకు వెళ్లాలన్నా మా కుటుంబ సభ్యులెవరైనా బస్సు ల్లోనే ప్రయాణం చేస్తారు. రక్త సంబంధీకులు, బందువుల శుభకార్యాలకు మా కుటుంబీకులే వెళ్తుం టారు. సామాన్యుల శుభకార్యాలు ఉంటే నేను తప్పకుండా హాజరవుతాను. నేను ప్రయాణించే వాహనం సాదాగా ఉందని మార్చాలంటూ పదేపదే చెబుతుంటారు. కాని అలాంటి వాహనంలోనే వెళ్లడమే నాకు ఇష్టం. చాలా సార్లు మారుమూల గ్రామాలకు ద్విచక్రవాహనాలపైనే వెళ్తుంటా. అక్కడ వారితో కలిసిపోతా. నా దగ్గరికి ఎవరైనాసాయం కోరి వస్తే కచ్చితంగా చేసిపెడుతాను.  

నాన్న మరణం  కలిచివేసింది.. 
ప్రజా సేవ కోసం మా తండ్రి గడ్డెన్న భైంసాలో ఉండేవారు. ఆయనలేని లోటు ఎప్పటికీ తీరనిది. ఆయన వారసత్వమే మాకు వచ్చింది. మాకు ఉన్నా లేకున్నా సామాన్యుల కోస మే మేమున్నామని అలాగే కలిసిపోతున్నాం.  

ఇష్టా ఇష్టాలు.. 
ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం సామాన్య జీవితం గడపడమే నాకు ఇష్టం. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమా థియేటర్‌కు కూడా వెళ్లలేదు. జేసుదాస్, మహ్మద్‌రఫీ, కిశోర్‌కుమార్, ఘంటసాల ఇలా వారు పాడిన అలనాటి పాటలు జర్నీలో విం టుంటాను. మాంసాహారం అంటే కొంచెం ఇష్టం. నా భార్యకు, నాకు, నా కుటుంబానికి, నా అక్కలు, తమ్ముళ్లు, చెల్లెలు ఇలా ఎవరికైనా సామాన్య జీవితం గడపడమే ఇష్టం. సింపుల్‌గా పల్లెల్లోనూ ఉంటూ ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు వారంతా. 

వ్యవసాయ పనులు చూసుకుంటా 
మంత్రిగారి కోడలన్న ఆలోచన కూడా మాకు లేకపోయేది. ఇప్పుడు మా వారు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. అయినా మాకు అలాంటి ఆలోచనలే రావు. ఎప్పటిలాగే ఉండడం మాకు తెలుసు. తెలిసిన వారంతా హైదరాబాద్‌లో ఉండాలని చెబుతుంటారు. దేగాం విడిచి పెట్టి వెళ్లడం నాకు నచ్చదు. ఆయన ఎప్పుడూ ప్రజలతో బిజీగా ఉంటారు. కుటుంబ బాధ్యతలు నేను చూసుకుంటాను. ఉన్న వ్యవసాయ పనులు చేయిస్తాను. ఎక్కడికి వెళ్లాలన్న బస్సులోనే వెళ్లివస్తాను. తెలిసినవారు కారులో పోదామన్న అలాంటిది ఇష్టం ఉండదు. న్యాయవాద వృత్తిచేసే సమయం నుంచే ఎక్కువగా ప్రజల మధ్య ఉండేవారు. ఇప్పటికీ ఆయన ప్రజలతోనే ఉంటారు.  – గడ్డిగారి లక్ష్మి, ఎమ్మెల్యే సతీమణి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement