రూ.200లతో ప్రస్థానం.. నేడు కోట్లకు అధిపతి | Industrial Man Life Success Story Khammam | Sakshi
Sakshi News home page

గుమాస్తా నుంచి పారిశ్రామికవేత్తగా

Published Sat, May 18 2019 7:51 AM | Last Updated on Sat, May 18 2019 7:51 AM

Industrial Man Life Success Story Khammam - Sakshi

రఫీక్‌ జివాని

ఆసిఫాబాద్‌: చేసేది గుమాస్తాగా.. వచ్చేది రూ. 200ల వేతనం.. దీంతోనే కుటుంబ పోషణ బాధ్యత.. ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే ఉన్నతంగా ఎదగడం కష్టమే. కాని కష్టాలకు ఏమాత్రం వెరవకుండా తనకున్న ఆలోచన విధానంతో ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగారు రఫీక్‌ జివాని. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితోనే చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సి వచ్చింది. అయినా సరే కేవలం ఒక పూట భోజనం, నాలుగు గంటలు మాత్రమే నిద్రతో నిరంతరం శ్రమించి అంచెలంచెలుగా ఎదిగారు రఫీక్‌. ఉన్నత చదువులు లేకపోయినా స్వయం కృషితో నేడు వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. రూ.వందలతో మొదలైన ప్రస్థానం రూ.కోట్లకు అధిపతిగా మా రారు. పెద్దపెద్ద చదువులు లేకపోయినా వ్యాపారంలో విజయవంతంగా కొనసాగుతున్న రఫీక్‌ జివానిపై ‘సాక్షి’ సక్సెస్‌ స్టోరీ.

ఆసిఫాబాద్‌ పట్టణానికి చెందిన సదృద్దీన్‌ జివానీ, రోషన్‌ బాయి దంపతులకు తొమ్మిది మంది సం తానం. ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమారుడు రఫీక్‌ జివాని. సదృద్దీన్‌ పూర్వీకులు గుజరాత్‌లోని కచ్‌ నుంచి 150 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మహారాష్ట్రలోని పాండ్రకౌడకు వలస వచ్చారు. కొంతకాలం అక్కడే ఉన్న వీరి కుటుంబం అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని ఇంద్రవెళ్లికి వచ్చారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్‌ వచ్చారు. ఈక్రమంలో రఫీక్‌ జివాని ప్రాథమిక విద్యాభ్యాసం నాలుగో తరగతి వరకూ హిందీ మాద్యమంలో జరిగింది. పదో తరగతి ఆసిఫాబాద్‌లో చదువుకున్నారు.

1981లో పదోతరగతి ఉత్తీర్ణత సాధించినా ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్‌ చదువుకోలేకపోయాడు. చదువుకు స్వస్తి చెప్పిన రఫీక్‌ ఉపాధి వేటలో వాంకిడి మండలం అర్లిలో కమీషన్‌ పద్ధతిలో కల్లేదార్‌గా చేరారు. నాలుగు నెలలు పనిచేసి మొట్టమొదటి సంపాదన రూ.5200/– కమీషన్‌ పొందారు. అనంతరం 1981 నుంచి 83 వరకు పట్టణంలోని ఓ హోల్‌సేల్‌ వ్యాపారి వద్ద రూ. 200/– కు గుమాస్తాగా చేరారు. రెండేళ్లు పనిచేసినా వేతనం పెంచకపోవడంతో 1984 నుంచి 91 వరకు పట్టణంలోని మరో వ్యాపారి వద్ద రూ.400/– కు పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. గుమాస్తాగా పనిచేసిన 13 ఏళ్ల కాలంలో కేవలం ఒకపూట భోజనం, నాలుగైదు గంటల నిద్ర మాత్రమే దొరికేది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో పదిమంది కుటుంబం ఒకే గదిలో ఉండాల్సి వచ్చేది.

అంచెలంచెలుగా వ్యాపార విస్తరణ..
గుమాస్తాగా వచ్చే జీతం సరిపోకపోవడం, తమ్ముళ్లు ఎదగడంతో పట్టణంలో కిరాణా హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారం ప్రారంభించారు. రఫీక్‌ వ్యాపార నిపుణత, తమ్ముళ్ల సహకారంతో వ్యాపారం మరింత విస్తరించారు. గుమాస్తాగా పనిచేసిన అనుభవంతో పట్టణంలో హోల్‌సేల్‌ వ్యాపారంలో రాణించారు. అప్పట్లో మండలంలో వట్టివాగు ప్రాజెక్టు ప్రారంభమవడంతో ఈ ప్రాంతంలో వరి ధాన్యం పండించే వారు. ఈక్రమంలో పట్టణంలో అద్దె ప్రాతిపదికన రైస్‌మిల్‌ ప్రారంభించారు. 2005లో వట్టివాగు కాల్వకు గండిపడడంతో పొట్టకు వచ్చిన వరి పంట సాగునీరందక ఎండిపోయింది. దీంతో రైస్‌మిల్‌ నిర్వహణ భారంగా మారింది. సగం నష్టంతో రైస్‌మిల్‌ మిషనరీ విక్రయించారు.

జిన్నింగ్‌మిల్లుల ఏర్పాటు..
మారిన పరిస్థితులతో ఈ ప్రాంతంలో పతి సాగు పెరగడంతో బ్యాంకు సహకారంతో ఆరు డీఆర్‌ల జిన్నింగ్‌ పరిశ్రమ స్థాపించారు. అంచెలంచెలుగా వ్యాపారాభివృద్ధి చేసి 2010లో పట్టణానికి సమీపంలోని రాష్ట్రీయ రహదారిపై స్వంతంగా 24 డీఆర్‌ జిన్నింగ్, ప్రెస్సింగ్‌ ఇండస్ట్రీ ప్రారంభించారు. తనకున్న వ్యాపార మెలకువలు, అనుభవంతో జిన్నింగ్‌ ఇండస్ట్రీలో రాణిస్తూ వచ్చాడు.

2016–17లో పక్కనే రెండో జిన్నింగ్‌ మిల్లు ప్రారంభించారు. అప్పటి నుంచి సుమారు 400 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. స్థానికంగా జిన్నింగ్‌ మిల్లు ఏర్పాటు చేయడంతో రైతులు ఆదిలాబాద్‌ మార్కెట్‌కు వెళ్లడం తప్పడంతో పాటు మద్దతు ధర పొందుతున్నారు. వ్యాపారంలో, మాటల్లో చతురత కలిగిన రఫీక్‌ సుమారు 20 ఏళ్ల పాటు పట్టణ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. గత మూడేళ్లుగా ఏ ఎంసీ డైరెక్టర్‌గా ఉన్నారు. ధాతృత్వంలోనూ ముం దుండే రఫీక్‌ కుల, మతాలకతీతంగా గుళ్లు, మసీ దులకు  సాయం చేయడంలో ముందున్నారు.

కుమారులను ఉన్నతులుగా తీర్చిదిద్ది..
చిన్నప్పటి నుంచి కషాలు పడ్డ  రఫీక్‌ గుజరాత్‌లోని పోరుబందర్‌కు చెందిన పేదింటి అమ్మాయి మునీరాను వివాహం చేసుకున్నారు. రఫీక్‌కు ఇద్దరు కుమారులు. పెద్దోడు రిజ్వాన్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, ప్రస్తుతం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. చిన్న కుమారుడు ఇర్ఫాన్‌ హైదరాబాద్‌లోని దక్కన్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. తాను చదువులకు దూరమైనా తన కుమారులను ఉన్నత చదువులు చదివిస్తున్నానని సంతృప్తిగా చెబుతారు రఫీక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement