వివేకం: దెబ్బతింటేనే జీవితపు పంట పండుతుంది! | failures are though stepping stones | Sakshi
Sakshi News home page

వివేకం: దెబ్బతింటేనే జీవితపు పంట పండుతుంది!

Published Sun, Sep 15 2013 2:14 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

వివేకం: దెబ్బతింటేనే జీవితపు పంట పండుతుంది!

వివేకం: దెబ్బతింటేనే జీవితపు పంట పండుతుంది!

ఉత్కంఠ భరితమైన వార్తలంటేనే అందరికీ ఆసక్తి. ‘ఎవరో ఇద్దరు ప్రేమగా కాపురం చేస్తున్నారు, సంతోషంగా జీవిస్తున్నారు’ అన్న వార్త చప్పగా ఉంటుంది. కాని మీ జీవితం మటుకు ఏ ప్రతిఘటనా లేకుండా, ఒడుదుడుకుల్లేకుండా, ఒకే రీతిలో ఉండాలి.
 మీరు అడిగినా, అడక్కపోయినా ఈ ప్రపంచం మీ మీద సమస్యలను విసిరి, తమాషా చూడబోతోంది. మరి వాటిని ఎదుర్కోవడానికి మీరు ఎందుకు జంకుతున్నారు?  ఒకసారి రైతు దేవుడితో పొట్లాట వేసుకున్నాడు. ‘‘నీకు వ్యవసాయం గురించి ఏమి తెలుసు? నీవనుకున్నప్పుడే వర్షాలు కురిపిస్తున్నావు. నీ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. నా మాట విని ఈ పనులన్నీ ఒక రైతుకు ఇచ్చెయ్’’ అన్నాడు.
 
 దేవుడు, ‘‘ఎండ, వాన, గాలి అంతా నీ వశంలో ఉండుగాక’’ అని వరమిచ్చేసి వెళ్లిపోయాడు.  పంటల కాలం వచ్చింది.‘‘ఓ వానా, కురు!’’ అన్నాడు. వాన పడింది! ఆగమంటే ఆగింది!  నేలను దున్నాడు. కావలసిన వేగంతో గాలిని రమ్మన్నాడు. విత్తనాలు జల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ అతను చెప్పినట్లు విన్నాయి. చేలు పచ్చగా ఎదిగాయి. కోతల కాలం వచ్చింది. రైతు ఒక వరి కంకిని కోశాడు. తీసి చూశాడు. నివ్వెరపోయాడు! లోపల ధాన్యం కనిపించలేదు. వెంటనే, మరో కంకిని కోసి చూశాడు. దానిలో కూడా ధాన్యం లేదు. ‘‘ఓ భగవంతుడా! గాలి, వాన, ఎండ అన్నింటినీ సమంగానే వాడాను. కానీ పంట ఎందుకు దెబ్బతిన్నది?’’ అంటూ కోపంగా అరిచాడు.
 
 దేవుడు ‘‘నా దగ్గరున్నప్పుడు గాలి వేగంగా వీచేది, అప్పుడు పైరు అమ్మను గట్టిగా వాటేసుకునే పసిపిల్లల్లా భూమిలో తమ వేర్లను చాలా లోతుల్లోకి తీసుకెళ్లేవి. అలాగే వాన తగ్గిందంటే, నీటిని వెదుక్కుంటూ వేర్లను నాల్గు దిక్కులకూ పంపించేవి. పోరాట పటిమ ఉంటేనే మొక్కలు తమను తాము కాపాడుకునేందుకు బలంగా పెరుగుతాయి. అన్నింటికీ వసతులు కల్పించి, ఇవ్వగానే నీ పంటకు సోమరితనం వచ్చేసింది. ఏపుగా ఎదిగిందే గాని, ధాన్యం ఇవ్వడం దానిచేత కాలేదు’’ అన్నాడు.
 
 ‘‘వద్దు స్వామీ! ఇలాగైతే నీ వాన, గాలి నువ్వే ఉంచుకో’’ అని ఆ రైతు వాటిని దేవుడికే అప్పగించేశాడు. జీవితంలో అన్నీ సులభంగా సమకూరితే, ఆ జీవితం ఇలాగే ఉంటుంది. దానికి మించిన శూన్యం వేరొకటి ఉండదు. ఊహించని అనుభవాలు ఎదురొస్తే, జీవితంలో అనుభవించి తెలుసుకునే అవకాశాలుగా వాటిని భావించాలి. చిక్కులు వచ్చినప్పుడే మన సామర్థ్యం ఏమిటి? మనం ఎక్కడ ఉన్నాం అనేది స్పష్టంగా తెలుస్తుంది. చీకటి సమస్య ఉన్నందుకే కదా విద్యుద్దీపాలు కనుగొన్నారు. సమస్యలే లేకుంటే, మీ మెదడు పనితీరు ఏ విధంగా ఉందో ఎలా తెలుసుకోగలరు? వాస్తవానికి, మీ పద్ధతి సరిగా లేనందువల్లే, సాధారణ పరిస్థితులు కూడా సమస్యలుగా కనిపిస్తాయి.
 
 సమస్య - పరిష్కారం
 ఒత్తిడి వల్ల జీవితంలో సంబంధాలు దెబ్బతింటున్నాయి. సహాయం చేయగలరు.
 - డి.రాజ్మలక్ష్మి, సికింద్రాబాద్


 సద్గురు: మీలాగే  ప్రస్తుత ప్రపంచంలో అనేక మంది వివిధ రకాల ఒత్తిడులకు గురి అవుతున్నారు. ఒత్తిడి, ఆందోళన అనేవి మనం కొత్తగా పెట్టుకున్న పేర్లు మాత్రమే. పూర్వకాలంలో వీటిని అజ్ఞానం అని పిలిచేవారు. మీరు చేస్తున్న పనివల్ల మీకు ఒత్తిడి లేదు. మీ జీవన క్రియను మీరు సరిగ్గా నిర్వహించుకోలేని అసమర్థతతో ఉన్నారు. దీనివల్లనే మీకు ఒత్తిడి కలుగుతోంది. మీ జీవన క్రియను - మీ శరీరాన్ని, మీ బుద్ధిని, మీ భావోద్వేగాలను, మీ ప్రాణశక్తిని - ఒక క్రమపద్ధతిలో నిలుపుకోలేని మీ అసమర్థతయే ఒత్తిడి.
 
 ఏ వ్యక్తి అయినా ఒక స్పష్టతా స్థితిలో ఉంటే ఒత్తిడి అనే ప్రశ్నే తలెత్తదు. మనం ధ్యానం అని చెబుతున్నది, దీనికి చికిత్సయే. ధ్యానం అనేది ఒక పని కాదు. అది ఒక లక్షణం, గుణం. మీ శరీరాన్ని, బుద్ధిని, భావోద్వేగాలను, ప్రాణశక్తులను - ఒక పరిపక్వ స్థాయిలో ఉండేటట్లు మీరు మలచుకోగలిగితే, ధ్యానం సహజంగానే కలుగుతుంది. ఇది సరిగ్గా ఎలాంటిదంటే, మీరు నేలను సారవంతంగా ఉంచారు. సరైన ఎరువును, నీటి వసతిని కల్పించారు. ఇక సరైన రకపు విత్తనం అక్కడ ఉంటే కనుక, అది పెరుగుతుంది, పుష్పాలుగా, ఫలాలుగా వికసిస్తుంది.  మీరు కోరుకున్నంత మాత్రం చేత, మొక్క నుండి పుష్పాలు, ఫలాలు రావు. అందుకు ఆవశ్యకమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తే అవి వస్తాయి. అదే విధంగా, మీరు మీ లోపల అవసరమైన వాతావరణాన్ని కల్పించుకోవాలి. అప్పుడు ధ్యానం మీ లోపల సహజంగా కనిపిస్తుంది.  
 - జగ్గీ వాసుదేవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement