వివేకం: మార్పు రావాల్సింది మీలోనే! | Changes to be made in you | Sakshi
Sakshi News home page

వివేకం: మార్పు రావాల్సింది మీలోనే!

Published Sun, Sep 1 2013 2:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

వివేకం: మార్పు రావాల్సింది మీలోనే!

వివేకం: మార్పు రావాల్సింది మీలోనే!

ఈ కాలంలో ఎవరు చూసినా కోపాలు, చిరాకులతో సతమతమౌతున్నారు. అలా ఎందుకుంటున్నారంటే మా తండ్రులు, తాతల నుంచీ మా రక్తంలో ఉందనో, ఉంటున్న పరిస్థితులలో ఉందనో చెప్పబోతారు. కాని మీ కోపాలకు, చిరాకులకు కారణం మీరేననీ, అది మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉందనీ గ్రహించడం మంచిది. దీనికి శంకరన్ పిళ్లై ఉదాహరణ చెప్పాలి. ఎండాకాలం. శంకరన్ పిళ్లై వీధివీధిన టోపీలు అమ్ముకుంటున్నాడు.మధ్యాహ్న సమయం. అలసిపోయి ఒక చెట్టు నీడన కూర్చొని ఉండగా, బాగా నిద్ర పట్టేసింది. చాలాసేపైనాక కళ్లు తెరచి చూశాడు.
 
 అమ్మకానికి పెట్టుకున్న టోపీలన్నీ, కోతులు తీసుకెళ్లాయి. అతని తాతగారొకరు ఇదే పరిస్థితిలో ఏం చేశారో శంకరన్ పిళ్లైకి బామ్మ చెప్పిందొకసారి. మనిషి చేసేది కోతి అలాగే చేస్తుంది కాబట్టి, అతని తాతగారు తన టోపీని తీసి భూమ్మీదకు విసిరికొట్టారనీ, అది చూసి కోతులూ అలాగే టోపీలను కిందకు విసిరికొట్టాయనీ బామ్మ చెప్పింది.
 
 అలాగే చేయాలనుకుని, కోతులను చూసి చేతులను ఆడించాడు. అవి కూడా చేతులు ఆడించాయి. తన బుగ్గ మీద చేత్తో చిన్నగా కొట్టుకున్నాడు. కోతులు కూడా తమ చెంపల మీద తట్టి చూపించాయి. శంకరన్ పిళ్లై తన టోపీని తీసి ఒకసారి తిప్పి, మరలా తలమీద పెట్టుకున్నాడు. కోతులు కూడా అలానే చేశాయి. ఇలా కాస్సేపు వాటిని ఆడించి, చివరికి తన టోపీని తీసి నేలకేసి కొట్టాడు. చెట్టుపైనున్న ఒక కోతి వేగంగా కిందికి దూకి, శంకరన్ పిళ్లై విసిరికొట్టిన టోపీని టక్కున అందుకుంది. తెల్లమొహం పెట్టి చూస్తున్న అతణ్ని సమీపించి, అతని చెంప మీద బలంగా ఒక్కటిచ్చింది. ‘‘ఇడియట్! నీకేనా బామ్మ ఉండేది?’’ అనడిగింది.
 
 కోతుల ఆలోచనలు మారవా? రోజూ అన్నిటికీ చిరాకేనా? కోపాలు, చిరాకులు మంచివి కావని తెలియదా? మీ తెలివితో వాటిని అధిగమించలేరా?
 జీవితంలో ఏ రోజూ చిరాకు కలిగించేది కాదు. ఈ భూమి కూడా ఆగకుండా తిరుగుతూ ఉంది. ఏ నిమిషం మీరు తలెత్తి చూసినా, ఆకాశంలో ఒక కొత్త భాగాన్ని చూస్తారు. మీ మనసే ఆ అనుభూతి పొందలేక అల్లాడుతోంది. అధీనంలో పెట్టుకోవడం తెలియక కట్లు విప్పదీస్తే, మనసుకు వేరే విధంగా పని చేయడం తెలియదు. చిరాకుకు కారణం మీ ఆఫీస్ కాదు. మీరు మీ మనసుకు బానిస అయిపోయినందుకే. మనసును ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియకపోవటం వల్లే, అది మిమ్మల్ని ఉపయోగించుకుంటోంది. ఒక స్టేజ్‌లో అది మిమ్మల్ని మింగేసి మిమ్మల్ని ఏమీ లేనివాడుగా చేస్తుంది.
 
 చిరాకు నుండి బయటపడ్డానికి ఒక మార్గం ఉంది. ఏ పనిచేసినా, దాంట్లో పూర్తిగా లీనమైపోండి. పూర్తిగా అంటే, మిమ్మల్నే దానికోసం అర్పించుకునేందుకు సిద్ధమయ్యే పూర్ణ స్థితి. చేసేది సంతోషంగా చేస్తున్నామని భావించగలిగితే, పూర్తిగా పనిచేయగలుగుతారు. ఎవరి బలవంతం మీదో పనిచేస్తున్నాననుకుని విసుగ్గా చేస్తే, రక్తపోటు, గుండెనొప్పి, మిగతా మానసిక వ్యాధులు పిలువకుండా వచ్చి కూర్చుంటాయి. బయట దేనిని మార్చినా, ఎన్ని మార్చినా, అది నిజమైన మార్పు కాదు. సరైన స్పృహతో జీవిస్తే, ప్రతిక్షణం జీవంతో ఉంటారు. ఒక్క క్షణం కూడా పాతగా ఉండదు. ధ్యానం చేస్తే మీ లోపల మార్పు వస్తుంది, చిరాకు ఎగిరిపోతుంది.
 
 సమస్య - పరిష్కారం
 పెద్దవారంటే ఇప్పటివాళ్లకు మర్యాద లేకుండా పోయింది. మా ఆత్మగౌరవం ఎలా కాపాడుకోవాలి?
 - ఎం.రాజలింగం, మహబూబ్‌నగర్
 సద్గురు: మీ కింద పనిచేసేవారో, మీ ఇంట్లో వారో మీకు తగిన మర్యాదనివ్వటం లేదని బాధపడుతున్నారా? ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మీ ఆత్మ ఎటువంటి మర్యాదా ఆశించడం లేదు. ఆత్మగౌరవం అనేదేదీ లేదు. అదొక కాల్పనిక భావం. అందులోని నిజం ఏమిటంటే...
 ప్రస్తుతం, మీలో మీకు పూర్ణత్వం కనిపించడం లేదు. అసంపూర్ణంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ ఖాళీని భర్తీ చేయడానికి మీకు ఇతరులు అవసరమౌతున్నారు.
 
 మర్యాదను అధికారికంగానో, ప్రేమతోనో అడిగి తీసుకోవడం భిక్షం అడిగినట్లే. తిండి కోసం చేతులు చాచవచ్చు. మర్యాదల కోసం చేతులు చాచరాదు. ఈ రోజు మీకు అపరిమితంగా గౌరవ మర్యాదలు ఇచ్చేవారు, రేపు మిమ్మల్ని తిరిగి చూడకుండా వెళ్లవచ్చు. అది మిమ్మల్ని బాధిస్తే, తప్పు మీదే. ఎప్పుడు మిమ్మల్ని మీరు అసంపూర్ణంగా భావిస్తారో, అప్పుడే ఎదుటివారి నుండి ఏదో ఆశిస్తారు.
 మిమ్మల్ని మీరు సంపూర్ణులుగా చేసుకోక, పక్కవారి నుండి మర్యాదలు కోరడం హీనం కదా! నన్నడిగితే, చేదు అనుభవాలన్నీ వెంట వెంటనే కలగడం మంచిదే. చిన్న చిన్న పాఠాలు ఆలస్యమయ్యే కొద్దీ, మీ జీవితం వృథా అయిపోతుంది. అభిమానం, ఆత్మగౌరవం అంటూ పోతే, ఒక్కరోజైనా ఆనందం పొందలేరు. ఇది తెలుసుకోగలిగితే, మిగిలిన జీవితాన్నైనా ఆనందంగా ఎలా గడపాలా అని చూడటం మొదలెడతారు.
 - జగ్గీ వాసుదేవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement