వివేకం: బాధ్యత బరువు కాదు!
సామాన్యంగా బాధ్యత అనగానే బరువు అనుకుంటారు. బాధ్యత అంటే తమ విద్యుక్తధర్మం అని తప్పుగా భావించడం వలనే ఇలా బరువు అనిపిస్తున్నది. చిన్నప్పటినుండే అందరికీ విద్యుక్తధర్మం అనే భావాన్ని పెంపొందించారు. కొడుకుని చదివించడం తండ్రి ధర్మం, వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడటం కొడుకు ధర్మం, విద్యార్థులను తీర్చిదిద్దడం ఉపాధ్యాయుని ధర్మం, దేశాన్ని కాపాడటం రక్షణ సిబ్బంది ధర్మం అంటూ ధర్మం అనే మాటను మీ మనసులో బలంగా నాటుకుపోయేలా చేశారు. ‘నా ధర్మం నిర్వహిస్తున్నాను’ అనుకుంటూ ఏది చేసినా అలసటగా ఉంటుంది, దానివల్ల రక్తపు పోటు పెరుగుతుంది.
ఒక పాదరక్షల ఫ్యాక్టరీని చూడటానికి యజమాని వచ్చాడు. ఒక కార్మికుడు అట్టపెట్టె అందుకుని, దానిమీద లేబుల్ అతికిస్తున్నాడు. మరో కార్మికుడు దానిలో ఒక పాదరక్షనుంచాడు. అతని తర్వాతి కార్మికుడు ఆ పెట్టెను మూసి, ముందుకు జరిపాడు. తరువాత అతను దాన్ని బండిలోకెక్కించాడు.
‘‘ఏం జరుగుతున్నదిక్కడ? చెప్పులను జతలుగా తయారుచేస్తున్నాం కదా. కాని పెట్టెలో ఒక చెప్పునే ఎందుకు పెట్టి పంపిస్తున్నారు?’’ అని కంగారుగా అడిగాడా యజమాని.
‘‘అయ్యా తీసుకుంటున్న జీతాని కన్నా ఇక్కడ ఎవరూ తక్కువ పనిచేయడం లేదు. ఎడం కాలి చెప్పు అందుకుని పెట్టెలో పెట్టే అతను ఈ రోజు సెలవులో ఉన్నాడు. అదే సమస్య’’ అని ఫ్యాక్టరీ మేనేజర్ సమాధానం.
తమ విద్యుక్తధర్మాన్ని క్రమం తప్పకుండా నెరవేర్చే కార్మికులున్నప్పటికీ, ఇలా జరుగుతూ ఉంటే ఆ వ్యాపారం ఏమవుతుందో కాస్త ఆలోచించండి.
పూర్తి బాధ్యత తీసుకోకుండా, డ్యూటీ చేస్తున్నామనుకుంటూ ప్రవర్తిస్తే, అది అభివృద్ధికి పనికిరాదు. త్వరలో మీరు విరక్తి, ద్వేషం, చిరాకు కలగలిసిన యంత్రంలా మారిపోతారు. ఎవరో చెప్పింది చేయడం కంటే, మీరే గ్రహించి బాధ్యతాయుతంగా చేస్తే ఈ బాధ ఉండదు.ముందు బాధ్యతను పనిగా భావించకుండా, దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి ప్రయత్నించండి. ఇష్టంగా, సంపూర్ణంగా బాధ్యతను స్వీకరిస్తే, ‘‘ఇది నాది. నాకు సంబంధించినది’’ అనే భావన కలుగుతుంది. అప్పుడది భారం కాదు. ఇది నా బాధ్యత అనుకున్నప్పుడు, ఈయన నా భర్త, నా గృహం, నా వాహనం అని భావిస్తారు. అలా అనుకోగానే పూర్తి ఆసక్తి కలుగుతుంది. అప్పుడది తేలిక అవుతుంది. ఏ భారమూ ఉండదు.
మీరీ భూమిని తలపై పెట్టుకున్నారనుకుందాం. ఈ భూమి నాది అనే తలంపుతో ఉన్నంతవరకు, అది మీకు బరువుగా తోచదు. కాని, ‘నేను బాధ్యుడను కాను’ అనే భావనతో, ఒక చిన్న సూది తీసుకున్నా, అది బరువుగా ఉంటుంది. మనస్ఫూర్తిగా ‘నాది’ అని అనుకుంటున్నప్పుడు మీరు జీవితంతో ఇష్టంగా స్పందిస్తారు. ‘నేను బాధ్యుడను కాను’ అని అనుకుంటే వ్యతిరేకత, అయిష్టత కలుగుతాయి.
జీవితంతో మనస్ఫూర్తిగా స్పందించేప్పుడు, ఆ మాధుర్యాన్నే స్వర్గం అంటున్నాం. ఇష్టం లేకుండా, వ్యతిరేక భావంతో స్పందిస్తున్నప్పుడు, దాన్ని నరకం అంటున్నాం. కాబట్టి స్వర్గం, నరకం మరణం తర్వాత కాదు - ఇక్కడే, ఇప్పుడే మీరు స్పష్టించుకోగలిగినవే.
సమస్య - పరిష్కారం
అందరూ నాకు అహం చాలా ఎక్కువ అంటారు. నా అహానికి భయమే కారణమా? నా అహాన్ని నేను ఎలా తెంచుకోగలను?
-కె.ఎల్.శ్రీనివాస్, కావలి
సద్గురు: దీనిని అటువైపు నుంచి చూడాలి. భయం వల్ల అహం కాదు, అహం వల్లనే భయం ఉంటుంది. అహం గాయపడుతుందేమోనన్న భయం అది. ఎవరో పరుషంగా దూషించినట్లు మనకు అనిపించేది - అహం వల్లే. మీకు మీరు ఒక పరిమితమైన సరిహద్దు గీసుకున్నారు. ‘నేను’ అనే దానికి ఒక గుర్తింపు పెట్టుకున్నారు. అందువల్ల, సహజంగానే భయం కలుగుతుంది.
‘నేను’ అని మీరు భావించుకునే వ్యక్తి, మీరు స్వయంగా సృష్టించుకున్న రూపమే. మీరు నిజంగా భయపడేది, శరీరాన్ని పోగొట్టుకుంటామని కాదు. మీరు స్వయంగా నిర్మించుకున్న ఈ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటామేమోనని మాత్రమే మీరు భయపడుతూ ఉంటారు. ఉదాహరణకు, మిమ్మల్ని అవమానానికి, దూషణకు గురిచేశామనుకోండి. అప్పుడు ఈ వ్యక్తికి మరణం వచ్చినట్లే అని మీరు భావిస్తారు. అటువంటి సందర్భంలో మరణమే నిజమైన వరం అనిపిస్తుంది. మీ ఈ గుర్తింపును మీరు ధ్వంసం చేయాలి. అప్పుడు ఇక హద్దులు, అహాలు, భయాలు ఉండవు.
- జగ్గీ వాసుదేవ్