వివేకం: ఇవ్వడంలో ఉన్నది పొందడంలో లేదు
ఎంతో సారవంతమైన భూమిని తన ఇద్దరు కొడుకులకు అప్పగించాడో భూస్వామి. పెద్దవాడికి వివాహమైంది. ఐదుగురు పిల్లలు. చిన్నవాడు పెళ్లి చేసుకోలేదు. తండ్రి ఇష్టప్రకారం, పంటను ఇద్దరూ సమంగా పంచుకుంటున్నారు. ఓరోజు పెద్దవాడికి, ‘‘నాకు వయసైపోయినా చూసుకోవడానికి పిల్లలున్నారు. తమ్ముడికి ఎవరూ లేరే? వాడికి అదనంగా ధనం అవసరం కదా!’’ అని ఆలోచన వచ్చింది. దాంతో అతను ప్రతినెలా తన వాటా నుండి ఒక మూట ధాన్యాన్ని తమ్ముడి గిడ్డంగిలో చేర్చడం మొదలుపెట్టాడు. రెండోవాడు, ‘‘నేను ఒంటరిని. అన్న కుటుంబానికి ఎక్కువ భాగం కావాలి కదా’’ అని వేరేవిధంగా ఆలోచించాడు. అతను కూడా తన వాటా నుండి ఒక మూట ధాన్యాన్ని ఎత్తుకెళ్లి అన్న గిడ్డంగిలో రహస్యంగా చేర్చడం మొదలెట్టాడు.
కొంతకాలం తర్వాత ఒకరోజు అన్నదమ్ములిద్దరూ ధాన్యపు బస్తాలతో ఎదురెదురుగా రావడం జరిగింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ ధాన్యపు బస్తాలను తమ తమ గిడ్డంగులలో దించేసి, ఇళ్లకు చేరుకున్నారు.
తర్వాత, ఆ ఊరిలో ఒక గుడి కట్టడానికి తగిన స్థలం వెతికేటప్పుడు, ఆ అన్నదమ్ములు కలుసుకున్న ఆ ప్రత్యేకమైన స్థలమే పవిత్రమైన స్థలంగా ఎన్నుకున్నారు. సత్సంబంధాలు అంటే ఇలా ఉండాలి. మరి మన సంబంధాలు ఎలా ఉంటున్నాయి?
ఎంతటి సన్నిహితులైనా ఒక హద్దు విధించుకుని, గిరి గీసుకుని కూర్చుంటున్నాం. ఇరువురిలో దాన్ని ఎవరు దాటినా, యుద్ధం ప్రకటిస్తున్నాం. ఒక్కరైనా పోనీలే అనుకుని గొప్ప మనసుతో ఉంటే కదా ఎదుటివాడు బతికేది!
బాగా గమనించండి. ప్రత్యేకించి ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నప్పుడు, అతనితో పనిచేయడం చాలా సులభంగా ఉంటుంది. అతనే సంతోషంగా లేని సమయాన అతనితో కలిసి పనిచేయడం కష్టమౌతుంది. ఆటలు కానీ, వ్యాపారం కానీ, ఆఫీసు కానీ, ఎక్కడైనా అందరూ ఒకటిగా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వేరు వేరు విభాగాల నుండి వచ్చినవారు కలిసి ఉన్న సమయంలో, అంతా ఒకరి ఇష్టప్రకారం జరగడమనేది కష్టమే. అక్కడ ఇతరులను తక్కువగా చూసే అలవాటును మొదట మానాలి. ఎవరినీ ‘నీలా ఎవరు ఉండరంటూ’ తప్పు పట్టకండి. చుట్టూ ఉన్నవారంతా గొప్పవారే. ఒకటీ రెండు సందర్భాల్లో వారు తెలివితక్కువగా ప్రవర్తించి ఉండవచ్చు. దగ్గరి బంధువులు కూడా పలు సందర్భాల్లో నిరాశపరచి ఉండవచ్చు. దాన్ని కొండంత చేయకండి.
జీవితం యొక్క సారం దాని ఒడిదుడుకుల్లోనే ఉంది. అందరినీ మీకు కావలసిన రీతిగా వంచాలని చూడకండి. ఎదుటివారిని అలాగే అంగీకరించటం నేర్చుకోండి. అలా చేస్తే, ఇతరులు మీ ఇష్టప్రకారం ఉండకపోవచ్చు. కాని జీవితం మీ ఇష్టప్రకారమే ఉంటుంది.
ఇవ్వడంలో లభించే ఆనందం, పొందడంలో లేదు. ‘‘ఆకలితో ఉన్నవాడికి నీ ఆహారం ఇచ్చేస్తే, నీవు బలహీనపడవు. బలపడతావు’’ అని బుద్ధ భగవానుడు అందంగా దీన్ని ఉటంకించారు. ఆహారం మటుకే కాదు, ప్రేమ కూడా అంతే. ప్రేమను అంతులేకుండా ఇవ్వడంలో లభించే ఆనందానికి సరితూగేది మరేదీ లేదు. దీన్ని మాటల్లో కంటే చేతల్లో చూడండి. దీనిలోని పూర్తి నిజం, అనుభవం మీద తెలుస్తుంది.
సమస్య - పరిష్కారం
దేవుని కంటే దెబ్బే గురువు అన్నట్లు, ఈ కాలంలో భయపెట్టకుండా ఎవరిచేత ఏ పనీ చేయించుకోలేకపోతున్నాం. అలా చేయడం సబబేనా?
-కె.వేణుగోపాల్, హైదరాబాద్
సద్గురు: ఒక్క విషయం గుర్తుంచుకోండి - అలా బలవంతపెట్టి పనిచేయించుకుంటే, పనిచేసినవారు మీరెప్పుడు చిక్కుతారా అని అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అదను చూసి మీరు వేసిన దెబ్బ కంటే బలంగా వేస్తారు.
మీరు మీ కుటుంబంలోనైనా, వ్యాపారంలోనైనా మీ చుట్టూ ఉన్నవారిపై ప్రేమతో ఉండాలి. అప్పుడే వారి నుండి మీకు పరిపూర్ణ సహాయం అందుతుంది.
ఇదెలా సాధ్యమవుతుంది? ముందుగా మీరు వారి నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వారిపై మీరు ప్రేమ కురిపించాలి. మీపై నమ్మకం కలిగించుకోవాలి. మీరు వారి హృదయంలో చోటు చేసుకోవాలి.
ఎప్పుడైతే మీరు ఆవలి మనసు చూరగొన్నారో అప్పుడు మీరెక్కడున్నా మీ పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. మీరు ఉన్నా లేకపోయినా వారి కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చగలరు.
ప్రేమతో అనితర సాధ్యమైన పనులను కూడా సాధించగలం. కాని భయాలు, బలవంతాల వల్ల ఏమీ చేయలేమన్నది నగ్న సత్యం.
- జగ్గీ వాసుదేవ్