ఆర్డీఓ వెంకటాచారి
భూపాలపల్లి అర్బన్: ఓటమి తర్వాత వచ్చే విజయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. జీవితంలో ఫెయిల్ అయ్యామని మనోవేదనకు గురైతే మనలో ఉన్న టాలెంట్ మరుగునపడిపోతుంది. నిరుత్సాహానికి లోనుకాకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే కొండలనైనా పిండి చేయవచ్చు. లక్ష్యాన్ని ఎంచుకు ని ముందుకు పయనించాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఓటమి చిన్నబోయి గెలుపు భుజం తట్టుతుందని జయశంకర్ భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారి విద్యార్థులకు సూచించారు. తాను పదో తరగతిలో ఫెయిల్ అయ్యాయని.. కృంగిపోకుం డా మనోనిబ్బరంతో ముందుకు సాగి ఉద్యోగం సాధించానని ‘సాక్షి’కి తెలిపారు.
వివరాలు ఆయన మాటల్లో..
మాది నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం కేంద్రం మాది. స్వగ్రామంలోనే పదో తరగతి వరకు చదువున్నాను. 10వ తరగతి వార్షిక పరీక్షలో గణితం సబ్జెక్టులో 28 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాను. ప్రశ్నపత్రం చాలా హార్డ్‌గా వచ్చింది. కానీ 1వ తరగతి నుంచి 10 తరగతి వరకు క్లాస్‌లో ఫస్ట్ ర్యాంకు నాదే. ఇంకో విషయమేమిటంటే పదో తరగతి వార్షిక పరీక్షలో సైతం ఫెయిల్ అయినా పాఠశాలలో మొదటి ర్యాంకు సాధించాను. నేను ఫెయిల్ అయిన విషయం మా నాన్నకు చెబితే నమ్మలేదు. ఆ తర్వాత గట్టిగా చెప్పడంతో అప్పుడు నమ్మి ఏమన లేదు. ప్రశ్నపత్రంలో కొన్ని ప్రశ్నలు తప్పులుగా రావడం అప్పటి విద్యాశాఖ ప్రతి విద్యార్థికి గణితంలో పది మార్కులు కలపడంతో ఉత్తీర్ణత సాధించాను.
ట్యూషన్లు చెప్పా..
చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని లక్ష్యంతో చదివాను. గణితం అంటే భయం ఉండేది. అందుకే పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. అయినా మనోవేదనకు గురికాలేదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో చదువుకున్నాను. ఇంటర్‌లో బైపీసీలో చేరి 57 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించాను. డిగ్రీలో బీజెడ్‌సీ గ్రూప్‌లో చేరాలనుకున్నాను. నాన్న వడ్రంగి పని చేసేవారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో చదువు మానేసి తనతో పాటు పనికి రమ్మన్నారు. ఆయన మాట వినలేదు. నల్లగొండలో పొద్దంతా ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అక్కడే సాంయంత్రం నడిచే కళాశాలలో బీఏలో ప్రవేశం పొందాను. ఇలా మూడు సంవత్సరాల పాటు నెలకు రూ. 250 వేతనంతో పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేయడంతో ఖాళీ సమయాల్లో ట్యూషన్ చెబుతూ డిగ్రీ పూర్తి చేశాను. ఉత్తమ మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాను. అనంతరం సివిల్స్ గ్రూప్–1 సర్వీసెస్ పరీక్ష రాసినప్పటికీ ఉద్యోగం రాలేదు. గ్రూప్–2 పరీక్ష రాసి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాను. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి ఆలిండియా 14వ ర్యాంక్ సాధించాను.
ప్రేరణ కలిగించిన బోర్డు
నల్లగొండలో డిగ్రీ కళాశాలకు వెళ్లే దారిలో ఆర్డీఓ కార్యాలయానికి(రాజస్య మండల అధికారి) కార్యాలయం అని బోర్డు ఉండేది. ఆ బోర్డు చూసిన ప్రతి సారి రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాలనే తపన నాలో పెరిగింది. ఇంటర్ తర్వాత గ్రూప్ మారడం ద్వారా డాక్టర్ కాలేకపోయాను. ఎలాగైనా గ్రూప్–1 ఆఫీసర్‌గా అర్హత సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్లాను. సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. జీవితంలో ఓటమి తర్వాత గెలుపుతో వచ్చే కిక్కు వేరు. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఎవరైనా విద్యార్థులు ఫెయిల్ అయిన, మార్కులు తక్కువ వచ్చిన ఏ మాత్రం దిగాలు చెందకుండా కంటి ముందు ఉన్న లక్ష్యాన్ని ఎలా అధిగమించాలో ప్రణాళికలు తయారు చేసుకోవాలి. మా నాన్న నాకు పదో తరగతిలో మార్కులు తక్కువ వచ్చినప్పటికీ ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా అన్నింట్లో ప్రోత్సహించారు. నేను కూడా నా పిల్లల్ని అదే విధంగా ప్రోత్సహిస్తున్నాను. మార్కులనేవి శాశ్వతం కాదు.
కుటుంబ సభ్యుల సహకారంతో..
వివాహమైన తర్వాతే నాకు ఉద్యోగం వచ్చింది. అమ్మనాన్నలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ నన్ను చదువులో ప్రోత్సహించే వారు. పెళ్లైన తర్వాత భార్య కూడా అదే విధంగా సహకరించేది. ఉద్యోగం సాధించాలని తపన నాకు ఉన్నప్పటికీ వారి సహకారం, ప్రోత్సాహం లేకపోతే ఉద్యోగం సాధించలేకపోయేవాడిని కావచ్చు. మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దు. విద్యార్థులను మానసికంగా వేధింపులకు గురి చేయడం వల్ల వారు ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రానా జీవితం ముగిసిందనుకోవడం పొరపాటు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే అన్ని విజయాలే అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment