govt job
-
అక్కాచెల్లెళ్ల డబుల్ ధమాకా
కోదాడ: ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టతరమవుతున్న ఈ రోజుల్లో చిలుకూరు మండలం జెర్రిపోతులగూడేనికి చెందిన అక్కాచెల్లెళ్లు రెండేసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. జెర్రిపోతులగూడేనికి చెందిన పందిరి అమృతారెడ్డి–లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె లంకెల తేజస్విని ఇంజనీరింగ్ పూర్తిచేసి 2020లో జైలు వార్డర్‌గా ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆమె ఖమ్మం జిల్లా జైలులో పనిచేస్తూ.. 2024 డీఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనపరిచి మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన నూతన ప్రభుత్వ ఉపాధ్యాయుల జాబితాలో ఎస్జీటీగా ఎంపికై ంది. ఈమె చెల్లెలు ప్రియాంక 2023లో సివిల్ ఎస్ఐగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రొబేషనరీ ఎస్ఐగా చర్లపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. ఇటీవల ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో కూడా ప్రియాంక మంచి ర్యాంక్ సాధించింది. అక్కాచెల్లెల్లిద్దరూ గ్రూప్–1 ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని, తమ విజయంలో కుటుంబ సభ్యులు అందించిన సహకారం మరువలేనిదని చెబుతున్నారు. -
Telangana Assembly Elections: సార్ నుంచి అధ్యక్షా వరకు..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగమంటే..ప్రభుత్వ నిర్ణయాలను అమలుపర్చడం, ఉన్నతాధికారి ఆదేశాలను పాటిస్తూ నిర్దేశించిన విధులు నిర్వర్తించడం మాత్రమే. కానీ చట్టసభలో సభ్యుడంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ముఖ్యపాత్ర పోషించడంతో పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల రూపకల్పనలో కీలకమైన ప్రతినిధి. ప్రభుత్వం ముందుకు సాగాలంటే పాలకులు, ఉద్యోగులు ముఖ్యులే. కానీ ఈ రెండు రంగాల్లో అనుభవం గడించిన ఘనులు అరుదుగా కనిపిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసిన అనుభవంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చి విజయం సాధించిన వారు రెండుపదులకు పైబడే ఉన్నారు.అలాంటి వారెవరో ఇప్పుడు చూద్దాం. ♦ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన జయప్రకాశ్‌నారాయణ ఆ తర్వాత లోక్‌సత్తా పార్టీని స్థాపించి కూకట్పల్లి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ♦ సంక్షేమశాఖలో అధికారిగా పనిచేసిన స్వర్ణకు మారి శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు. బ్యాంకు అధికారిగా పనిచేసిన అరుణతార ఎమ్మెల్యేగా గెలుపొంది చట్టసభల్లో అడుగుపెట్టారు. ♦ రెవెన్యూ శాఖలో పనిచేసిన సినీనటుడు బాబుమోహన్ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. ♦ లెక్చరర్‌గా ప్రస్థానం ప్రారంభించిన కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి కూడా పనిచేశారు. ♦ ఉపాధ్యాయులుగా పనిచేసిన కోవా లక్ష్మి, ఆత్రం సక్కు, రేగా కాంతారావు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ♦ రవాణాశాఖలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన మాణిక్‌రావు జహీరాబాద్ నుంచి 2014లో పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ 2018లో రెండోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ ఐపీఎస్ అధికారిగా అత్యున్నత పదవులు చేపట్టిన విజయరామారావు ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ♦ మరో ఐపీఎస్ అధికారి పీవీ రంగయ్య కూడా ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా పనిచేశారు. జడ్జి హోదాలో కొనసాగిన మల్యాల రాజయ్య ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరో అధికారి బలరాం నాయక్ సైతం ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేశారు. ♦ ప్రభుత్వ శాఖల్లో వివిధ స్థాయిలో పనిచేసిన పి.రాములు, సంజీవరావు, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, ఐపీఎంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసిన స్వామిగౌడ్ గెలుపొంది తెలంగాణ శాసనమండలికి తొలి చైర్మన్‌గా నియమితులయ్యారు. ♦ పురపాలక శాఖలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన వి.శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఎకైŠస్జ్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన వెంకటేశ్‌నేత పెద్దపల్లి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రొఫెసర్‌గా పనిచేసిన కె.నాగేశ్వర్ ఎమ్మెల్సీగా, సీతారాంనాయక్ ఎంపీగా ఎన్నికయ్యారు. ♦ జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేసి రాజయ్య వరంగల్ ఎంపీ గెలుపొందారు. ♦ ఎఫ్‌సీఐలో అధికారిగా పనిచేసిన సోమారపు సత్యనారాయణ రామగుండం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ ఇక ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో నిలిచినప్పటికీ విజయం సాధించని వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో కొందరు ప్రస్తుతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ ఎన్నికల్లోనూ పోటీలో ఉన్నారు. -
36 ఏళ్లుగా ఒక్క సెలవూ లేదు.. హ్యాట్సాఫ్ ‘కడారి’
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ ఉద్యోగమంటే ఏడాదిలో చాలా సెలవులుంటాయి. అతి తక్కువ మంది ఈ సెలవుల వినియోగంలో పొదుపుగా వ్యవహరిస్తారు. అత్యవసరానికి తప్ప మరే పనికీ సెలవు పెట్టారు. కానీ కడారి సుబ్బారావు తన 36 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదంటే ఆశ్చర్యమే మరి. కాకినాడ జిల్లా విద్యాశాఖలో కడారి సుబ్బారావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గొల్లప్రోలుకు చెందిన ఈయన 1987లో గ్రూప్–4 ఏపీపీఎస్సీ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగ జీవితం 36 ఏళ్ల 8 నెలల కాలంలో ఒక్క సెలవు తీసుకోలేదు. ఈ నెల 30న రిటైర్ కానున్నారు. 2003 నుంచి ఇప్పటి వరకూ 6 సార్లు ఉత్తమ జిల్లా స్థాయి ఉద్యోగిగా, 2009లో తెలుగు అకాడమీ పురస్కారం సాధించారు. -
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లైంగిక దాడి.. కట్ చేస్తే!
పెనమలూరు: ఉద్యోగం ఇప్పిస్తానని నిమ్మించి వివాహితపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఆర్ఎస్ఐపై బుధవారం కేసు నమోదైంది. కృష్ణాజిల్లా పెనమలూరు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా మండవల్లి మండల భైరవపట్నంకు చెందిన మహిళ 2014లో అదే ప్రాంతానికి చెందిన కె.వినోద్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా భార్యాభర్తలకు ఈ మధ్య కాలంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌లో ఆర్ఎస్ఐగా పని చేస్తున్న జి.భానుసతీష్ వినోద్‌కుమార్ భార్యకు పరిచయమయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమెను ఏడాది క్రితం పెనమలూరు మండలం పోరంకి తీసుకొచ్చి ఓ గదిలో ఉంచి లైంగికదాడి చేశాడు. ఆ తరువాత కానూరులో కొద్ది రోజులు, యనమలకుదురులో కొద్ది రోజులు ఇంట్లో ఉంచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్తకు విడాకులు ఇస్తే తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కాగా భానుసతీష్ గత నెల 30వ తేదీన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై బాఽధితురాలు మండవల్లి పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయటంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పెనమలూరు పోలీసులకు కేసు బదిలీ చేశారు. -
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు.. ఈ టిప్స్ పాటిస్తే జాబ్ మీదే!
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామనే సర్కారు ప్రకటనతో నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. పోటీ పరీక్షలకు శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. స్టడీ మెటీరియల్ కోసం పుస్తకాల షాపులను, నిపుణులను సంప్రదిస్తున్నారు. మరోవైపు స్టడీ హాళ్లు, లైబ్రరీలు సందడిగా మారాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, దిల్‌సుక్‌నగర్, తదితర ప్రాంతాలోని కోచింగ్ సెంటర్లకు అభ్యర్థులు వెల్లువెత్తుతున్నారు. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు పోటీ పరీక్షలనగానే ప్రతి ఒక్కరిలోనూ మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆందోళనకు గురవుతారు. ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించేందుకు సానుకూలమైన దృక్పథంతో అధ్యయనం ఆరంభించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. లక్ష్యం పట్ల స్పష్టత ఉండాలి.. పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవారు మొదట స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఎంపిక చేసుకున్న లక్ష్యం పట్ల బలమైన ఆకాంక్షను కలిగి ఉండాలి. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి కాబట్టి దరఖాస్తు చేస్తున్నాం అనే మొక్కుబడి వైఖరితో కాకుండా ఆ ఉద్యోగం తనకు ఎందుకు తప్పనిసరి అవసరమనే విషయంపై స్పష్టత ఏర్పర్చుకోవాలి. అనంతరం పరీక్షలకు అవసరమైన మెటీరియల్, కోచింగ్ వంటివి సమకూర్చుకొని మానసిక, శారీరక సంసిద్ధతతో ప్రిపరేషన్ ఆరంభించాలి. సంశయాత్మక వైఖరి కూడదు.. ప్రిపరేషన్ ప్రారంభించిన తర్వాత కూడా చాలా మంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. లక్షలాది మందితో పోటీపడడం తనకు సాధ్యం కాదేమోననే ఆందోళనకు గురవుతారు. తమ చుట్టూ ఉన్నవారు బాగా చదువుతున్నారని, తాము మాత్రమే వెనుకబడిపోతున్నామనే భావన కొంతమందిని వెంటాడుతుంది. ఇలాంటి సంశయాత్మక వైఖరి వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. తాము తప్పకుండా విజయం సాధిస్తామనే సానుకూలమైన భావనతో అధ్యయనం మొదలుపెట్టాలి. రాయబోయే పోటీపరీక్షలో తాను విజేతగా నిలవబోతున్నాననే ప్రగాఢమైన నమ్మకంతో సన్నద్ధం కావాలి. కఠినమైన అంశాలపై దృష్టి సారించాలి.. సాధారణంగా చాలా మంది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో తేలిగ్గా ఉండే అంశాలతో ప్రారంభించి ఆ తర్వాత కఠినమైన అంశాల్లోకి వెళ్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికి వారు తమకు కఠినమైనవిగా అనిపించిన పాఠ్యాంశాలను మొదట ఓ పట్టుపడితే ఆ తర్వాత తేలిగ్గా ఉన్న అంశాలను వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. మన స్థాయిని అంచనా వేసుకోవాలి.. ఇతరులతో పోల్చుకొని తాము వెనుకబడిపోతున్నామని ఆందోళనకు గురికావొద్దు. తోటివారితో పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ తమ ప్రిపరేషన్‌ను నిరుత్సాహానికి గురి చేసేలా ఉండకూడదు. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దాని కంటే ఆ రోజు చదివిన అంశాలపై మన అవగాహన ఏ స్థాయిలో ఉంది అనేది అంచనా వేసుకోవడం మంచిది. – డాక్టర్ గీత చల్లా, మానసిక నిపుణులు ప్రశాంతంగా ఉండాలి.. ప్రిపరేషన్ సమయంలో ఆందోళనకు గురైతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం తప్పనిసరిగా అలవర్చుకోవాలి. దీంతో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుంటాయి. అలసట లేకుండా అధ్యయనం చేయగలుగుతారు. సరైన నిద్ర, చక్కటి పోషకాహారం కూడా ఈ సమయంలో ఎంతో అవసరం. – డాక్టర్ సంహిత, సీనియర్ సైకియాట్రిస్ట్ -
ముగ్గురన్నలకు ప్రభుత్వ ఉద్యోగం.. తనకు మాత్రం..
సాక్షి, దండేపల్లి(ఆదిలాబాద్): ముగ్గురు అన్నయ్యలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు.. తనకు ఏ ఉద్యోగం రావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైనీ ఎస్సై శివకుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన భూక్య శంకర్‌నాయక్‌కు నలుగురు కుమారులు. అందులో పెద్దవారు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న కొడుకు నరేశ్(26) డిగ్రీ వరకు చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంటి వద్దనే ఉంటూ తండ్రితోపాటు వ్యవసాయ పనులకు వెళ్తున్నాడు. ‘అన్నయ్యలకు ఉద్యోగాలు వచ్చాయి. వాళ్లు మంచిగా బతుకుతున్నారు. నాకే రాకపాయే, నేను ఎలా బతుకుడో’ అని అప్పుడప్పుడు తల్లిదండ్రులతో చెప్పుకుంటూ బాధపడేవాడు. ఈనెల 21న అతనికి పెళ్లి నిశ్చయించారు. దీంతో భవిష్యత్‌పై మరింత ఆందోళనకు గురైన నరేశ్ ఈనెల 9న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి శంకర్‌నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ట్రైనీ ఎస్సై వెల్లడించారు. -
Assam Home Guard: నిజాయితీకి దక్కిన సత్కారం
గువాహటి: కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాల సరఫరాలో తమకు సహకరిస్తే భారీ నజరానా ఇస్తామని డ్రగ్ డీలర్లు ఆశజూపినా.. నిజాయితీకే కట్టుబడ్డాడు ఆ హోం గార్డు. అతని నిజాయతీకి, నిఖార్సయిన విధి నిర్వహణకు ప్రతిఫలంగా అస్సాం ప్రభుత్వం ఆయనను కానిస్టేబుల్ ఉద్యోగంతో సత్కరించింది. శనివారం ఆ హోంగార్డు బోర్సింగ్ బేకు కానిస్టేబుల్ నియామక పత్రాన్ని రాష్ట్ర సీఎం హిమంత స్వయంగా అందజేశారు. జూన్ 21న కార్బి అంగ్లాంగ్ జిల్లాలోని ఓ చెక్‌పోస్టు వద్ద మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది. అక్కడే విధుల్లో ఉన్న హోం గార్డు బస్సులో అక్రమ రవాణాను పసిగట్టాడు. అయితే, పోలీసులను ఏమార్చేందుకు, తమకు సాయపడేందుకు ఒప్పుకుంటే భారీ స్థాయిలో లంచమిస్తామని హోం గార్డు బోర్సింగ్కు డ్రగ్ డీలర్లు ఆశపెట్టారు. అందుకు బోర్సింగ్ ససేమిరా ఒప్పుకోలేదు. బస్సులో ఉన్న రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులకు సాయపడ్డాడు. దీంతో, హోం గార్డు నిజాయతీకి మెచ్చి సీఎం అతనికి కానిస్టేబుల్ ఉద్యోగనియామక పత్రం అందజేశారు. -
అత్యాచారం కేసులో నిర్దోషికి బంపర్ ఆఫర్
ఇంఫాల్ : అత్యాచారం, హత్య కేసులో 8ఏళ్ల జైలు శిక్ష అనంతరం నిర్దోషిగా బయటకొచ్చిన వ్యక్తికి సీఎం శుభవార్త చెప్పారు. వివరాల ప్రకారం..2013లో మణిపూర్‌లోని రిమ్స్‌లో పాథాలజీ విభాగానికి చెందిన ఓ విద్యార్ధిని హత్యాచారానికి గురయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సహచర విద్యార్ధి తౌడమ్ జిబల్ సింగ్‌ను చేరుస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే అనూహ్యంగా ఎనిమిదేళ్ల అనంతరం జిబల్ సింగ్ నిర్దోషి అని తేలింది. దీంతో అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు. (ఘరానా మహిళ.. వలవేసి దోచేసింది) 'ఈ కేసులో అమాయకుడైన జిబల్ సింగ్ జైలు చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాడు. అంతేకాకుండా ప్రజలు అతని ఇంటిని సైతం దహనం చేశారు. ఈ నేపథ్యంలో అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా నిర్ణయించాం' అని సీఎంపేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో సంతోషంలో మునిగిన జిబల్ సింగ్ జైలు నుంచి విడుదల కాగానే సీఎం బీరెన్ సింగ్‌ను కలిశారు. (లోన్ యాప్.. కటకటాల్లోకి బెంగళూరు కీర్తి ) -
ఫెయిల్ అయినా.. టాపర్ నేనే
భూపాలపల్లి అర్బన్: ఓటమి తర్వాత వచ్చే విజయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. జీవితంలో ఫెయిల్ అయ్యామని మనోవేదనకు గురైతే మనలో ఉన్న టాలెంట్ మరుగునపడిపోతుంది. నిరుత్సాహానికి లోనుకాకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే కొండలనైనా పిండి చేయవచ్చు. లక్ష్యాన్ని ఎంచుకు ని ముందుకు పయనించాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఓటమి చిన్నబోయి గెలుపు భుజం తట్టుతుందని జయశంకర్ భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారి విద్యార్థులకు సూచించారు. తాను పదో తరగతిలో ఫెయిల్ అయ్యాయని.. కృంగిపోకుం డా మనోనిబ్బరంతో ముందుకు సాగి ఉద్యోగం సాధించానని ‘సాక్షి’కి తెలిపారు. వివరాలు ఆయన మాటల్లో.. మాది నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం కేంద్రం మాది. స్వగ్రామంలోనే పదో తరగతి వరకు చదువున్నాను. 10వ తరగతి వార్షిక పరీక్షలో గణితం సబ్జెక్టులో 28 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాను. ప్రశ్నపత్రం చాలా హార్డ్‌గా వచ్చింది. కానీ 1వ తరగతి నుంచి 10 తరగతి వరకు క్లాస్‌లో ఫస్ట్ ర్యాంకు నాదే. ఇంకో విషయమేమిటంటే పదో తరగతి వార్షిక పరీక్షలో సైతం ఫెయిల్ అయినా పాఠశాలలో మొదటి ర్యాంకు సాధించాను. నేను ఫెయిల్ అయిన విషయం మా నాన్నకు చెబితే నమ్మలేదు. ఆ తర్వాత గట్టిగా చెప్పడంతో అప్పుడు నమ్మి ఏమన లేదు. ప్రశ్నపత్రంలో కొన్ని ప్రశ్నలు తప్పులుగా రావడం అప్పటి విద్యాశాఖ ప్రతి విద్యార్థికి గణితంలో పది మార్కులు కలపడంతో ఉత్తీర్ణత సాధించాను. ట్యూషన్లు చెప్పా.. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని లక్ష్యంతో చదివాను. గణితం అంటే భయం ఉండేది. అందుకే పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. అయినా మనోవేదనకు గురికాలేదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో చదువుకున్నాను. ఇంటర్లో బైపీసీలో చేరి 57 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించాను. డిగ్రీలో బీజెడ్సీ గ్రూప్‌లో చేరాలనుకున్నాను. నాన్న వడ్రంగి పని చేసేవారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో చదువు మానేసి తనతో పాటు పనికి రమ్మన్నారు. ఆయన మాట వినలేదు. నల్లగొండలో పొద్దంతా ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అక్కడే సాంయంత్రం నడిచే కళాశాలలో బీఏలో ప్రవేశం పొందాను. ఇలా మూడు సంవత్సరాల పాటు నెలకు రూ. 250 వేతనంతో పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేయడంతో ఖాళీ సమయాల్లో ట్యూషన్ చెబుతూ డిగ్రీ పూర్తి చేశాను. ఉత్తమ మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాను. అనంతరం సివిల్స్ గ్రూప్–1 సర్వీసెస్ పరీక్ష రాసినప్పటికీ ఉద్యోగం రాలేదు. గ్రూప్–2 పరీక్ష రాసి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాను. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి ఆలిండియా 14వ ర్యాంక్ సాధించాను. ప్రేరణ కలిగించిన బోర్డు నల్లగొండలో డిగ్రీ కళాశాలకు వెళ్లే దారిలో ఆర్డీఓ కార్యాలయానికి(రాజస్య మండల అధికారి) కార్యాలయం అని బోర్డు ఉండేది. ఆ బోర్డు చూసిన ప్రతి సారి రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాలనే తపన నాలో పెరిగింది. ఇంటర్ తర్వాత గ్రూప్ మారడం ద్వారా డాక్టర్ కాలేకపోయాను. ఎలాగైనా గ్రూప్–1 ఆఫీసర్‌గా అర్హత సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్లాను. సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. జీవితంలో ఓటమి తర్వాత గెలుపుతో వచ్చే కిక్కు వేరు. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఎవరైనా విద్యార్థులు ఫెయిల్ అయిన, మార్కులు తక్కువ వచ్చిన ఏ మాత్రం దిగాలు చెందకుండా కంటి ముందు ఉన్న లక్ష్యాన్ని ఎలా అధిగమించాలో ప్రణాళికలు తయారు చేసుకోవాలి. మా నాన్న నాకు పదో తరగతిలో మార్కులు తక్కువ వచ్చినప్పటికీ ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా అన్నింట్లో ప్రోత్సహించారు. నేను కూడా నా పిల్లల్ని అదే విధంగా ప్రోత్సహిస్తున్నాను. మార్కులనేవి శాశ్వతం కాదు. కుటుంబ సభ్యుల సహకారంతో.. వివాహమైన తర్వాతే నాకు ఉద్యోగం వచ్చింది. అమ్మనాన్నలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ నన్ను చదువులో ప్రోత్సహించే వారు. పెళ్లైన తర్వాత భార్య కూడా అదే విధంగా సహకరించేది. ఉద్యోగం సాధించాలని తపన నాకు ఉన్నప్పటికీ వారి సహకారం, ప్రోత్సాహం లేకపోతే ఉద్యోగం సాధించలేకపోయేవాడిని కావచ్చు. మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దు. విద్యార్థులను మానసికంగా వేధింపులకు గురి చేయడం వల్ల వారు ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రానా జీవితం ముగిసిందనుకోవడం పొరపాటు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే అన్ని విజయాలే అవుతాయి. -
నర్సు లినీ భర్తకు ఉద్యోగం
తిరువనంతపురం: కేరళలో నిపా వైరస్ వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి ప్రాణాలు విడిచిన నర్సు లినీ పుత్తుస్సెరి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు కేరళసర్కారు ముందుకొచ్చింది. లినీ భర్త సజీష్ విద్యార్హత ఆధారంగా అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే లినీ ఇద్దరు పిల్లలకు (5 ఏళ్లు, 2 ఏళ్లు) సీఎం సహాయక నిధి నుంచి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. నిపా కారణంగా మృతిచెందిన వారికి రూ.5 లక్షల సాయం అందించనుంది. ప్రమాదకర నిపా వైరస్ వ్యాప్తితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రానికి వచ్చే సందర్శకులు కొజికోడ్, మలప్పురం, వాయనాడ్, కన్నూర్ జిల్లాలకు వెళ్లవద్దని హెచ్చరించింది. -
ఫుట్‌బాలర్ వినీత్‌కు ఉద్యోగం వచ్చింది
తిరువనంతపురం: సరైన హాజరులేని కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యుడు సీకే వినీత్‌కు కేరళ ప్రభుత్వం అండగా నిలిచింది. అతనికి స్పోర్ట్స్ కోటా కింద రాష్ట్ర సచివాలయంలోని అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఆడిటర్‌గా పని చేసిన వినీత్ తన ప్రాక్టీస్, అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా విధులకు సరిగ్గా హాజరు కాలేకపోయాడు. దీంతో అతడిని గతేడాది మేలో కేంద్ర ప్రభుత్వ విధుల నుంచి తొలగించారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని కోరుతూ ముఖ్యమంత్రి విజయన్ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను కోరినా లాభం లేకపోవడంతో.. అతనికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. -
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని..
తమిళనాడు: ప్రభుత్వ ఉద్యోగం కోసం దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఈరోడ్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం కలకలం రేపింది. ఈరోడ్ జిల్లా గోపిచెట్టి పాళయం సమీపంలోని అయలూరు గ్రామానికి చెందిన పెయింటర్ చిన్నస్వామి(32). ఇతని భార్య సుధ (30). వీరికి నందకుమార్, మధన్ అనే ఇద్దరు కుమారులు, మధుమిత అనే కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో చిన్న స్వామి భార్య సుధ, ముగ్గురు పిల్లలతో సోమవారం ఉదయం ఈరోడ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ చిన్నస్వామి అకస్మాత్తుగా తనతో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడ భద్రత విధుల్లో ఉన్న పోలీసులు కిరోసిన్ క్యాన్‌ను లాక్కున్నారు. వారి వద్ద విచారణ చేయగా సుధ మాట్లాడుతూ.. పౌష్ఠికాహార ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నానని, అయితే తనకు రావాల్సిన ఉద్యోగాన్ని అధికారులు లంచం తీసుకుని మరొకరికి కేటాయించారని బోరున విలపించారు. తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ కలెక్టర్ ప్రభాకరన్‌కు వినతి పత్రం అందజేశారు. -
మాచర్లలో దారుణం : తండ్రి ఉద్యోగం కోసం
గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తండ్రి చనిపోతే ఉద్యోగం తనకే వస్తుందన్న అత్యాశతో తండ్రినే కొడుకు అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన మాచర్లలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కార్మిక శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు(47)కు రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య మాధవి 10 ఏళ్ల కిందట చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య భారతి అనారోగ్యంతో 4 సంవత్సరాల క్రితం మృతిచెందింది. దీంతో శ్రీనివాసరావు సైదమ్మ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. మొదటి భార్య కుమారుడు అమర్నాథ్ తండ్రి చేస్తున్న ఉద్యోగాన్ని వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా తనకివ్వమని కోరుతున్నాడు. తనకు ఉద్యోగం ఇవ్వడేమోనని అనుమానంతో తండ్రి చనిపోతే ఉద్యోగం తనకే వస్తుందని వ్యూహాం రచించాడు. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం సమయంలో తండ్రిని రాయితో తలపై మోది దారుణంగా హతమార్చాడు. అనంతరం అమర్నాథ్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న అమర్నాథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
ఇటుకలు పేర్చి.. బిడ్డ బతుకును మార్చి
ఇటుకలు పేర్చి.. బిడ్డ బతుకును మార్చి ూర్టూరు, ఇటుక మీద ఇటుక పేర్చి..మధ్యలో సిమెంట్ కూర్చి ఇంటిని నిర్మించే బేల్దారీ.. తన కుమారుడి బతుకునూ మార్చుకున్నారు. రెక్కాడితే గాని డొక్కాడదని తెలిసినా కుమారుడిని చదివించడం కోసం వెనుకాడలేదు. ఫలితంగా తన కుటుంబం ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంగా ప్రత్యేక స్థానాన్ని అధిరోహించింది. మార్టూరులోని శాంతినగర్ కాలనీకి చెందిన తన్నీరు వీరాంజనేయులు బేల్దారి కూలీగా జీవనం సాగిస్తున్నారు. తన కుమారుడు నాగరాజును ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగంలో చూడాలనేది అతని కోరిక. నాగరాజు మేనమామ కుంచాల కోటేశ్వరరావు కూడా మేనల్లుడి చదువుకు ఆర్థిక ప్రోత్సాహం అందించారు. దీంతో తన్నీరు నాగరాజు నల్గొండ జిల్లా కోదాడ సనా ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ దూర విద్య ద్వారా అభ్యసించారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఒంగోలులోని వివేకానంద కోచింగ్ సెంటర్లో గ్రూప్-2కోచింగ్ తీసుకున్నారు. ఇంతలో వీఆర్ఏ పరీక్షలో 94 మార్కులు, వీఆర్ఓ పరీక్షలో 96 మార్కులు సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. గ్రూప్-1 సాధించటమే లక్ష్యమని నాగరాజు తెలిపారు.