Telangana Assembly Elections: సార్‌ నుంచి అధ్యక్షా వరకు..  | Worked in government job and entered politics | Sakshi
Sakshi News home page

Telangana Assembly Elections: సార్‌ నుంచి అధ్యక్షా వరకు.. 

Published Mon, Nov 20 2023 5:09 AM | Last Updated on Mon, Nov 20 2023 7:59 AM

Worked in government job and entered politics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగమంటే..ప్రభుత్వ నిర్ణయాలను అమలుపర్చడం, ఉన్నతాధికారి ఆదేశాలను పాటిస్తూ నిర్దేశించిన విధులు నిర్వర్తించడం మాత్రమే. కానీ చట్టసభలో సభ్యుడంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ముఖ్యపాత్ర పోషించడంతో పాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల రూపకల్పనలో కీలకమైన ప్రతినిధి.

ప్రభుత్వం ముందుకు సాగాలంటే పాలకులు, ఉద్యోగులు ముఖ్యులే. కానీ ఈ రెండు రంగాల్లో అనుభవం గడించిన ఘనులు అరుదుగా కనిపిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసిన అనుభవంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చి విజయం సాధించిన వారు రెండుపదులకు పైబడే ఉన్నారు.అలాంటి వారెవరో ఇప్పుడు చూద్దాం. 

ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన జయప్రకాశ్‌నారాయణ ఆ తర్వాత లోక్‌సత్తా పార్టీని స్థాపించి కూకట్‌పల్లి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 
 సంక్షేమశాఖలో అధికారిగా పనిచేసిన స్వర్ణకు మారి శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు. బ్యాంకు అధికారిగా పనిచేసిన అరుణతార ఎమ్మెల్యేగా గెలుపొంది చట్టసభల్లో అడుగుపెట్టారు.  
♦ రెవెన్యూ శాఖలో పనిచేసిన సినీనటుడు బాబుమోహన్‌ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా రాష్ట్ర మంత్రిగా సేవలందించారు.  
 లెక్చరర్‌గా ప్రస్థానం ప్రారంభించిన కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి కూడా పనిచేశారు.   
♦ ఉపాధ్యాయులుగా పనిచేసిన కోవా లక్ష్మి, ఆత్రం సక్కు, రేగా కాంతారావు  శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.  
 రవాణాశాఖలో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన మాణిక్‌రావు జహీరాబాద్‌ నుంచి 2014లో పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ 2018లో రెండోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  
♦ ఐపీఎస్‌ అధికారిగా అత్యున్నత పదవులు చేపట్టిన విజయరామారావు ఖైరతాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు.  
 మరో ఐపీఎస్‌ అధికారి పీవీ రంగయ్య కూడా ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా పనిచేశారు. జడ్జి హోదాలో కొనసాగిన మల్యాల రాజయ్య ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరో అధికారి బలరాం నాయక్‌ సైతం ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేశారు.  
♦ ప్రభుత్వ శాఖల్లో వివిధ స్థాయిలో పనిచేసిన పి.రాములు, సంజీవరావు, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, ఐపీఎంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసిన స్వామిగౌడ్‌ గెలుపొంది తెలంగాణ శాసనమండలికి తొలి చైర్మన్‌గా నియమితులయ్యారు. 
♦ పురపాలక శాఖలో మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన వి.శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఎకైŠస్‌జ్‌ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన వెంకటేశ్‌నేత పెద్దపల్లి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రొఫెసర్‌గా పనిచేసిన కె.నాగేశ్వర్‌ ఎమ్మెల్సీగా, సీతారాంనాయక్‌ ఎంపీగా ఎన్నికయ్యారు.  
♦ జిల్లా పరిషత్‌ సీఈఓగా పనిచేసి రాజయ్య వరంగల్‌ ఎంపీ గెలుపొందారు. 
♦ ఎఫ్‌సీఐలో అధికారిగా పనిచేసిన సోమారపు సత్యనారాయణ రామగుండం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
♦ ఇక ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో నిలిచినప్పటికీ విజయం సాధించని వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో కొందరు ప్రస్తుతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ ఎన్నికల్లోనూ పోటీలో ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement