టెన్త్‌ ఫెయిలైనా... డాక్టర్‌నయ్యా!: ఎమ్మెల్యే | TRS MLA Sanjay Kumar Political Life Story And Family Story | Sakshi
Sakshi News home page

టెన్త్‌ ఫెయిలైనా... డాక్టర్‌నయ్యా!: ఎమ్మెల్యే

Published Sun, May 19 2019 8:25 AM | Last Updated on Sun, May 19 2019 12:49 PM

TRS MLA Sanjay Kumar Political Life Story And Family Story - Sakshi

మ్మెల్యే సంజయ్‌కుమార్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: జగిత్యాలలో ఆయనో ప్రముఖ వైద్యుడు. కంటి డాక్టర్‌గా మారుమూల గ్రామాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించారు. వైద్య శిబిరంలో మందులు ఇచ్చి పంపించడమే గాక.. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసిన సేవా గుణం ఆయనది. 2014లో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. వెనుదిరిగి చూడలేదు. వైద్యుడిగా సేవలు అందిస్తూనే... ప్రజల్లో గుర్తింపు పొందారు. 6వేల ఓట్లతో ఓడిపోయిన చోటే 60వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనే జగిత్యాల ఎమ్మెల్యే ముకునూరు సంజయ్‌కుమార్‌. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రోత్సాహం, తాత చొక్కారావు ఆదర్శాలు తనను రాజకీయంగా నిలబెట్టాయని చెబుతున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌తో ‘సాక్షి’ పర్సనల్‌ టైం ఇది. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. 

వ్యవసాయం అంటే ఇష్టం
జగిత్యాల మండలం అంతర్గాం సొంతూరు. నాన్న హన్మంతరావు, అమ్మ వత్సల. నాన్న వ్యవసాయం పైనే ఆధారపడ్డారు. కుటుంబంలోని ఇతరులు రాజకీయంగా ఉన్నతస్థాయిలో ఉన్నా, నాన్న మాత్రం వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. 90 ఎకరాల భూమిని కౌలుకు ఇవ్వకుండా సాగు చేసేవారు. నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టమే. చిన్నప్పుడు, డాక్టర్‌ వృత్తిలోకి రాకముందు నాన్నకు వ్యవసాయంలో సాయపడేవాడిని. 

పట్టుబట్టి చదివా!
నాకు చదువు అంటే ఇష్టమే. అయినా 1977లో పదో తరగతిలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యా. అప్పట్లో 10వ తరగతి పాస్‌ పర్సంటేజీ 10 శాతం ఉండేది. అయినప్పటికీ పట్టుబట్టి సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్‌ అయి, ఇంటర్‌లో బైపీసీలో జాయిన్‌ అయ్యా. ఇంటర్మీడియట్‌లో 80 శాతం మార్కులతో పాస్‌ అయ్యా. ఇంటర్‌ పూర్తి కాగానే మా నాన్న హైదరాబాద్‌ నిజాం కాలేజీలో డిగ్రీలో చేర్చారు. 1980–81లో ఏడాది మాత్రమే డిగ్రీ చేశా. అప్పుడే విజయవాడలో ప్రైవేటు రంగంలో సిద్ధార్థ మెడికల్‌ కళాశాల వచ్చింది. నాకున్న మార్కులతో నేరుగా ఎంబీబీఎస్‌లో అడ్మిషన్‌ పొందాను. నాకు లా చేయాలని ఉన్నా, మా నాన్న కోరిక మేరకే ఎంబీబీఎస్‌ చదివి, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో పేరున్న నేత్ర వైద్య నిపుణుడిగా కొనసాగాను. ఇప్పుడు ఇంటర్మీడియట్‌ చదవి ఫెయిలైన విద్యార్థుల మానసిక స్థితిని చూస్తే బాధేస్తుంది. ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. అది గెలుపునకు మరో మెట్టుగా మార్చుకోవాలి. టెన్త్‌లో ఫెయిల్‌ అయినా బాధ పడలేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఓడిపోయినా నేను బాధ పడలేదు. రెండోసారి విజయం సాధించానుగా.

ఎదుగుదలలో సహధర్మచారిణి రాధిక
1989లో వివాహం జరిగింది. బంధువుల అమ్మాయి అయిన రాధికను పెళ్లి చేసుకున్నాను. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మా ఆవిడ రాధిక సైతం రాజకీయ కుటుంబం నుంచే వచ్చింది. రాధిక తండ్రి కమలాకర్‌రావు బోయినిపల్లి సర్పంచ్‌గా సేవలు అందించారు. రాధిక అమ్మ వాళ్ల నాన్న దివంగత మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా కరీంనగర్‌ జిల్లాలో రాజకీయ ఉద్ధండుడు. అయినా రాధిక నా భార్యగా నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. గృహిణిగా సేవలందించింది. నా వృత్తి విజయంలో, రాజకీయంగా ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ఆమె ప్రధానం.

సేవ చేసేందుకే వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి..
నాకు చిన్నప్పటి నుంచే సామాజిక సేవలో పాల్గొనడం ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన. డాక్టర్‌గా ఉంటూనే ఉచిత మెడికల్‌ క్యాంపులు పెట్టడం, గ్రామాల్లో వైద్య సేవలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేసేవాడిని. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు అందించాను. వేలాది మెడికల్‌ క్యాంపులు పెట్టడమే కాక, 10వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశాను. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా కొనసాగాను.
 
ఎమ్మెల్యేగా పూర్తి సమయం ప్రజాసేవకే
నాకు ఒక్కతే కూతురు హార్తిక, అల్లుడు రాజీవ్‌. హైదరాబాద్‌లో బిజినెస్‌ చేస్తుంటారు. నేను, నా భార్య ఇక్కడ ఉంటాం. వాళ్లు తరచూ వస్తూ వెళ్తుంటారు. ఎన్నికల సమయంలో నాకే సమయం కేటాయించారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రజా జీవితంలో మమేకం కావలసిందే. గ్రామాల్లో పేరుకుపోయిన అనేక సమస్యలు, ప్రజల బాధలను తెలుసుకుంటున్నా. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నా. జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం.
  
మా కుటుంబానిది రాజకీయ నేపథ్యమే
మా సొంత చిన్నాన్న శ్రీరంగారావు కరీంనగర్‌ ఎంపీగా సేవలందించారు. నా భార్య తాత చొక్కారావు రాజకీయ దిగ్గజం. కరీంనగర్‌ చరిత్రలో వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి వంటి నేతనే ఓడించిన రాజకీయ దిగ్గజం ఆయన. నా జీన్స్‌లోనే రాజకీయ నేపథ్యం ఉంది. అదే నా రాజకీయ ప్రవేశానికి ప్రధాన కారణమై ఉంటుంది.

గతంలో టికెట్‌ ఆఫర్‌ వచ్చినా... పోటీ చేయలేదు
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, ప్రజారాజ్యం తరఫున జగిత్యాల నుం చి పోటీచేసే అవకాశం వచ్చింది. ప్రత్యేక కారణమేమీ లేకపోయినా... ఎందుకో పోటీ చేయలేదు. తెలంగాణ వచ్చాక ముఖ్య మంత్రి కేసీఆర్, ఎంపీ కవిత సహకారంతో టీఆర్‌ఎస్‌లో చేరాను. తొలిసారి 2014లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాను. రెండోసారి మొన్నటి ఎన్నికల్లో ప్రజా ఆశీస్సులు, కేసీఆర్‌ ఇచ్చిన ధైర్యంతో ఏకంగా 60వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాను.
  
డాక్టర్‌గా, ఎమ్మెల్యేగా ప్రజాసేవలో సంతృప్తి పొందుతున్నా!
డాక్టర్‌గా ఉన్నప్పుడు వైద్య పరంగా ప్రజలకు సేవ చేసేవాడిని. ఫ్రీ క్యాంపులు ఏర్పాటు చేసి, ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసేవాడిని. ఎందరికో కంటి వెలుగునయ్యా. కానీ పూర్తిస్థాయిలో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పటికీ సంతృప్తిగా ఉంది. 

జగిత్యాల ఎమ్మెల్యేగా ఏం చేయాలనుకుంటున్నారు?
జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి చెరువులో నీరు నింపే మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా నీరందేలా చూ స్తున్నాం. ముఖ్యంగా జగిత్యాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందింది. పట్టణ ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉం ది. ముఖ్యంగా యావర్‌రోడ్డును వెడల్పు చేసేలా చర్యలు తీసుకుంటా. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి నన్ను అత్యధిక మెజారిటితో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement