శ్రీనివాసుడి చెంత బుల్లెమ్మ స్వర ధార
ఆమె గానం ‘శ్రీవారి’కి స్వరనీరాజనం
స్వరం.. మృదు మాధుర్యం
తెనాలి: తిరుమల ఏడుకొండలవాడిని దర్శించుకొనే లక్షలాది భక్తులు లిప్తపాటు కలిగే దర్శన భాగ్యానికి భక్తి పారవశ్యంతో పొంగిపోతారు. మరికొన్ని క్షణాలు అక్కడే ఉండాలని ఆరాటపడతారు. అలాంటి అదృష్టమే కాదు.. శాశ్వతంగా స్వామికి సేవ చేసుకునే భాగ్యం ఓ సాధారణ గాయనికి దక్కింది. పెళ్లి ఊరేగింపులు, వేడుకల్లో సంగీత బృందాల్లో పాటలు పాడిన యువతి ఇప్పుడు తిరుమల వాసుని పాదాల చెంతకు చేరిన తీరు ఆద్యంతం హృద్యం. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన గాయనిగా ఎదిగి.. ఒదిగిన గాయని రావూరి బుల్లెమ్మ విజయప్రస్థానం ఆమె మాటల్లోనే...
నా పేరు రావూరి బుల్లెమ్మ. తెనాలి సమీపంలోని కొలకలూరు. తండ్రి రావూరి ముసలయ్య మాజీ సైనికుడు. తల్లి సామ్రాజ్యం. మేం తొమ్మిది మంది సంతానం. ఆడపిల్లల్లో నేనే చివరిదాన్ని. నాన్న పౌరాణిక నాటకాల్లో నటించేవారు. ఆయన వారసత్వమేమో తెలియదు కానీ.. మా అందరికీ ఏదొక కళలో ప్రవేశం ఉండేది. నాకు పాటలు పాడటమంటే పిచ్చి. ఇంటర్మీడియట్‌లో రోజూ తెనాలి వెళ్లి సంగీతం నేర్చుకునేదాన్ని. గాయని మాధవపెద్ది మీనాక్షి తొలి గురువు. చదువు ఇంటర్మీఇయట్‌తోనే ఆపేయాల్సి వచ్చినా సంగీతంతో మాత్రం నా అనుబంధాన్ని కొనసాగించాను. నాలాగే పాటలు పాడే సోదరుడు బుజ్జి ఓ పాటల పోటీకి నన్ను వెంటబెట్టుకు వెళ్లాడు. మ్యూజికల్ పార్టీ నిర్వాహకులు నా పాట విని తమ ట్రూపులోకి ఆహ్వానించారు.
మాధుర్యంతో మెప్పు..
జీవనానికీ తోడ్పడుతుందనే భావనతో గుంటూరులో సంగీత కళాశాలలో సర్టిఫికెట్ కోర్సు చేశా. గాన కళాకారిణి సుమశ్రీగా సంగీత ప్రపంచానికి మరింత చేరువయ్యా. గొంతులోని మాధుర్యం.. ఎంతటి కఠినమైన పాటనైనా భావం చెడకుండా చూసేది. పాడిన పాట అచ్చు సినిమాలో గాయకులు పాడిన విధంగానే ఉండేది. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, చిత్ర, ఆనంద్ సంగీత కచేరీల్లో పాడటం మరచిపోలేని అనుభవం.
హిందోళం.. మాల్కోస్ రాగమని చెప్పా..
పాటతో అల్లుకున్న జీవితం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పత్రిక ప్రకటనతో అద్భుతమైన మలుపు తీసుకుంది. అన్నమయ్య ప్రాజెక్టులో టీటీడీ ఆస్థాన గాయని పోస్టుకు దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూలో ‘కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు’ పాడి వినిపించా..‘కర్ణాటక సంగీతంలో ఏ రాగం?’ అన్న ప్రశ్నకు, ‘హిందోళం’ అనీ హిందూస్థానీలో ‘మాల్కోస్ రాగం’ అంటారని చెప్పా. నెలరోజుల తర్వాత వచ్చిన అపాయింట్‌మెంట్ లెటరు వచ్చింది. 2001 జూన్ 14 నుంచి ఇక స్వామి సేవకు అంకితమయ్యాను. టీటీడీ ఆస్థాన వయొలిన్ కళాకారుడు కె.శంకర్‌తో నా భావాలు కలిసి వివాహానికి దారి తీసింది. ఇద్దరమూ శ్రీవారి సేవలో గడుపుతున్నాం. మాకో కుమారుడు హరిచరణ్.
దేశవిదేశాల్లో కచేరీలు..
టీటీడీ అన్నామాచార్య ప్రాజెక్టులో అన్నమాచార్యుడి సంకీర్తనలు గానం చేయటం నా ఉద్యోగం. ‘శ్రీవారి ఊంజల సేవ (సహస్ర దీపాలంకరణసేవ)లో గానం చేస్తుంటాం.. ‘ఉయ్యాలా.. బాలు నూచెదరూ’, ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’ వంటి లాలి పాటలు పాడతాం. అలివేలు మంగాపురంలో అమ్మవారి ఊంజలసేవలోనూ పాల్గొంటాం. గోవిందరాజుల ఆలయం, కాణిపాకం వినాయకుడు, బైరాగిపట్టెడలో ఆంజనేయస్వామి ఆలయం, కపిలతీర్థంలో గానం చేస్తుంటాం. ఒడిశా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, దక్షిణాఫ్రికాలోని కెన్యాలో జరిగిన స్వామివారి కల్యాణోత్సవాలకూ టీటీడీ నన్ను పంపింది.
500 కీర్తనలు పాడగలను..
డజను అన్నమాచార్య పాటలతో ఉద్యోగంలో చేరిన నేను ఇప్పుడు తేలిగ్గా 500 కీర్తనలు గానం చేయగలుగుతున్నా. ప్రముఖ విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌తో కలిసి ‘అన్నమయ్య సంకీర్తన కుసుమాంజలి’ ఆడియో క్యాసెట్ తీసుకొచ్చా. సొంతంగా ‘అన్నమయ్య సంకీర్తన మహాహారం’ వెలువరించా. టీటీడీ చేసిన ‘అలిమేల్మంగ నామావళి’లో 108 నామాలు నేను పాడాను. నా గానంతో ‘అన్నమయ్య సంకీర్తన శిఖామణి’, ‘అన్నమయ్య సంకీర్తన వైభోగం’, ‘వెంగమాంబ కీర్తనలు’ ఆడియో క్యాసెట్లు వచ్చాయి. టీటీడీ గతేడాది ఆగస్టులో ‘ఉత్తమ గాయని’గా నన్ను గౌరవించింది. ఇటీవల కరీంనగర్‌లో సామవేదం షణ్ముఖశర్మ చేతుల మీదుగా ‘సంకీర్తన సుమశ్రీ’ బిరుదు పొందా.
Comments
Please login to add a commentAdd a comment