we-success-story
-
మౌనంగానే ఎదగమని..
అడగకముందే మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు. అప్పుడప్పుడూ పొరపాటుపడి ఇవ్వాల్సినవి ఇవ్వకపోయినా.. ఇచ్చి తీసేసుకున్నా మనం ఏం చేయగలం! ప్చ్.. మన రాత ఇంతేనని నిట్టూర్చి మిన్నకుండిపోతాం. కానీ మన ‘కౌసర్‌భాను’ అలా ఊరికే ఉండిపోలేదు. దేవుడి నుంచి మరోటి లాగేసుకుంది. ‘గీత’ నేర్చుకుంది.. రాత మార్చుకుంది. వైకల్యాన్ని అధిగమించేందుకు కాస్తంత ప్రోత్సాహం ఉంటే చాలుననీ, ఆ ఆసరాతో పోగొట్టుకున్న దాని కంటే ఎక్కువ సాధించవచ్చని నిరూపిస్తున్నారు. ఆమెనే కౌసర్‌బాను. కడప కల్చరల్ : కడప నగరానికి చెందిన కౌసర్బానుది మధ్య తరగతి కుటుంబం. తండ్రి ముర్తుజాకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కౌసర్ చిన్న కుమార్తె. అందరిలాగానే ఆడుతూ, పాడుతూ ఎంతో సరదాగా ఉండేది. అందరితో వస పిట్టలా మాట్లాడుతూ ఉండేది. సరిగ్గా అక్కడే ఆమె జీవితం పెద్ద మలుపు తిరిగింది. నాలుగున్నరేళ్ల చిన్నారి కౌసర్‌కు జ్వరం. తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. ఒకచోట వైద్యం వికటించింది. గలగలా మాట్లాడుతూ తిరిగే తమ చిన్నారి ఉన్నట్లుండి ‘మౌనమే నా భాష’ అన్నట్లుగా ఉండిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పాడుజ్వరం తన మాటను తీసుకెళ్లిందని, తను మాట్లాడలేకపోతోందని ఆ చిట్టి మనసు అర్థం చేసుకుంది. తనకు ప్రాణప్రదమైన అమ్మానాన్నల కళ్లల్లో నీటితడికి బదులుగా ఆనందం చూడాలని గట్టిగా నిర్ణయించుకుంది. రంగుల లోకంలో... కౌసర్‌కు బొమ్మలు గీయడమంటే చాలా ఇష్టం. నచ్చిన ప్రతి బొమ్మను గీసేది. మూడున్నరేళ్ల వయసులోనే చక్కని చిత్రాలు గీస్తున్న కుమార్తెను చూసి అమ్మానాన్న ప్రోత్సహించారు. చెప్పదలుచుకున్న విషయాన్ని బొమ్మల ద్వారా చెప్పడం గమనించారు. ప్రోత్సాహాన్ని కొనసాగించారు. అక్క అర్షియ ఏదైనా పోటీలకు వెళ్లేటపుడు తానూ వస్తానని కౌసర్ మారాం చేసేది. కాస్త మార్పుగా ఉంటుందని తీసుకెళ్లేది. పోటీల్లో పాల్గొని చెల్లి బహుమతులు సాధిస్తుండడంతో అక్క ఆమెకు తన డ్రాయింగ్ సామగ్రి ఇచ్చి ప్రోత్సహించేది. ఈ ప్రత్యేకతను గమనించిన తల్లిదండ్రులు రషీదా, ముర్తుజా, అన్న అసదుల్లా కౌసర్‌కు అవసరమైన డ్రాయింగ్ సామగ్రిని సమకూరుస్తూ ఉత్సాహ పరిచారు. పర్యాటకం సీతారామయ్య, అక్క స్నేహితులు నాగవేణి, అఖిల ఆమె గీసిన చిత్రాలతో ప్రదర్శనలు నిర్వహింపజేశారు. ఆలోచనాత్మకం కౌసర్ సమకాలీన సమస్యలపై పలు పెయింటింగ్‌లు గీశారు. ముఖ్యంగా మహిళా సాధికారత, భ్రూణహత్యలు, మసిబారుతున్న పసితనం ప్రధాన అంశాలుగా ప్రతిభావంతమైన చిత్రాలు గీశారు. ఎందరో ప్రముఖ వ్యక్తులు, దేశభక్తుల చిత్రాలు కూడా గీశారు. ముఖ్యంగా సింహం చిత్రంలో సూక్ష్మ మైన అంశాలను కూడా వదలకుండా గీసిన తీరు ఆమె సునిశిత పరిశీలనాశక్తికి నిదర్శంగా నిలుస్తోంది. పలు చిత్రాలు విమర్శకులను సైతం మెప్పించాయి. కౌసర్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. పనికిరాని వస్తువులతో కళ్లు చెదిరే ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేస్తుంది. కోడిగుడ్ల డొల్లలు, పాత సీసాలు, ఐస్‌క్రీమ్ కప్‌లు, స్ట్రాలు ఇలా అన్నింటినీ కళాత్మకంగా రూపొం దిస్తోంది. ముఖ్యంగా ఆమె తయారు చేసిన కాగితం నగలు అందరినీ ఆకర్శిస్తున్నాయి. అంతర్జాతీయ అవార్డులు కౌసర్ స్థానికంగా వందలాది పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. గండికోట ఉత్సవంలో స్పాట్ పెయింటింగ్ చేసి బహుమతి సాధించి సత్తా చాటారు. పికాసో ఆర్ట్ సంస్థ వారు ఆన్లైన్ ద్వారా నిర్వహించే పోటీల్లో ఆమెకు రెండు మార్లు వరుసగా బహుమతులు లభించాయి. 2016లో ఆమె ఈ పోటీల్లో ద్వితీయ బహుమతి, 2017లో ప్రథమ బహుమతి సాధించారు. కంగ్రాట్స్.. అంటూ అభినందిస్తే కౌసర్ మెత్తగా నవ్వేస్తుంది.. ప్రస్తుతం స్పీచ్ థెరఫీ తీసుకుంటున్న కౌసర్‌భాను త్వరలో ‘సాక్షి’కి స్వయంగా ధన్యవాదాలు చెప్పగలదని ఆశిద్దాం! -
మా సుమతమ్మ.. పోలీసాఫీసర్..!
జిల్లాలోనే పేరుగాంచిన వంశం.. సుమారుగా 125 ఏళ్ల నుంచి వందలాది శివభక్తులకు ప్రతిఏటా అన్నదానం.. ఇది వంశపారంపర్యంగా చేస్తున్న కార్యక్రమం. అంతపెద్ద కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నప్పటి నుంచి కుటుంబం, గ్రామ పరిస్థితులపై అవగాహన ఉంది. ‘మా సుమతమ్మ పెద్దాయ్యాక పోలీసాఫీర్ అవుతుంది.. మన జిల్లాకే ఎస్పీగా వస్తుంది..అంటూ తెలియని వయస్సులోనే నాయనమ్మ నూరిపోసిన మాటలు ఆమెలో ఓ పట్టుదలను తెచ్చిపెట్టాయి... చివరకు అనుకున్నది సాధించి నేడు వేలాది మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ‘నార్త్‌జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్’ బడుగుల సుమతి. తను ఈ వృత్తిలోకి ఎలా వచ్చిందీ.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందీ.. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకుంది. హిమాయత్‌నగర్: కుగ్రామం నుంచి సిటీ వరకు మాది అప్పట్లో మహబూబ్‌నగర్ జిల్లా, ప్రస్తుతం జోగులాంబ జిల్లాలోని కలుగోట్ల అనే కుగ్రామం. మా నాన్న తిరుపతిరెడ్డికి 17 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు. మేం నలుగురు ఆడపిల్లలం, ఒక అబ్బాయి మొత్తం ఐదుగురం. నేను మూడో సంతానం. నేను కష్టపడి చదువుకుని వైద్యురాలి కావాలని చిన్నప్పుడే ఆశించా. ఆ తరువాత నా జీవితంలో నాకూ నాయనమ్మ మధ్య జరిగిన సంభాషణే.. నేను పోలీసాఫీర్ అయ్యేలా చేసింది. మన జిల్లాకు ఎస్పీగా వస్తుంది మా ఊరిలో సర్పంచుల వ్యవస్థ మా కుటుంబం నుంచే ప్రారంభం అయింది. మా నాన్ననే మొట్టమొదటి సర్పంచ్. వరుసగా పదిసార్లు సర్పంచ్‌గా గెలుపొంది ఎంతోమంది పేదలకు సేవ చేయడం చూశాను. ‘‘చూడు ఓ గ్రామానికి పెద్ద అయితేనే ఇంత సేవ చేస్తున్నాడు. జనం కూడా న్యాయం కోసం మీ నాన్నని ఆశ్రయిస్తున్నారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నారు, ఎస్పీని ఆశ్రయిస్తున్నారు. ఒక కలెక్టర్, ఎస్పీకి ఎంత పలుకుబడి ఉంటుందో చూడు ’’అంటూ నాయనమ్మ నన్ను పదే పదే అంటుండేది. ఇలా నాతో మాట్లాడుతూనే మా ఊరిలో ఉన్న వారందరితో ‘రేప్పొద్దున మా సుమతమ్మ ఖచ్చితంగా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతుంది.. మన ఊరికే..మా జిల్లాకే ఎస్పీగా వస్తుంది ’అంటూ చెబుతుండేది. ఆ మాటలు నా చెవుల్లో ఎప్పుడూ మార్మోగుతూ ఉండేవి.. అమ్మ ప్రోత్సాహంతో విజయం.. నాకు సమాజం నుంచి పెద్దగా అవమానాలు రాకపోయినప్పటికీ బంధువుల నుంచి మాత్రం ఎదురయ్యాయి. ఒకానొక సమయంలో ‘ఈ అమ్మాయి ఇంటలిజెంట్ అయితే అయ్యి ఉండొచ్చు. అయినా మెడిసనే కొట్టలేకపోయింది సివిల్స్ కొట్టిద్దా.? ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి, ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటూ ఆ అమ్మాయిని చదివించడం’ అంటూ మా అమ్మతో, నా మొహంపై అనేశారు. అయితే.. అమ్మ నా భుజం తట్టి ‘నువ్వేంటో..మాకు తెలుసు, నీకు తెలుసు. ఎవరెవరో ఏవేవో అన్నారని వాళ్లందరికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం కావాలనుకున్నావో..అయ్యి చూపించు నువ్వు అవుతావ్ అని ఆ నమ్మకం మాకు ఉంది’ అంటూ నాలో ధైర్యం తట్టింది. మెడిసిన్ రాలేదు సివిల్స్ కొట్టాల్సిందే నాయనమ్మ నేను పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నప్పటికీ నాకు మెడిసిన్ చదవాలనిపించేది. మెడిసిన్ కోసం చాలా కష్టపడ్డాను. మెడిసిన్ సీటు రాకపోయే.. కలెక్టర్, ఎస్పీ కావాలని దీనికోసం సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా విజయం సాధించాలని నిశ్చయించుకున్నాను. దీనికోసం మా అమ్మ సుజాతమ్మ, నాన్న తిరుపతిరెడ్డిలను ఒప్పించి రూ.50వేలు తీసుకుని హైదరాబాద్‌కు వచ్చా. 2000లో ఒకటేసారి సివిల్స్, గ్రూప్–1కు ప్రయత్నించా. సివిల్స్ కొట్టలేకపోయా గ్రూప్స్ కొట్టాను. డీఎస్పీగా పోస్టింగ్‌వచ్చింది. 2007లో ఐపీఎస్‌గా పదోన్నతి సాధించాను, ఆరేళ్ల సర్వీసుకే ఒక గ్రూప్–1 అధికారి ఐపీఎస్ కావడం తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి, ఇదినాకు చాలా గర్వకారణమనే చెప్పాలి. మా ఆయన ప్రోత్సాహమే నడిపిస్తోంది నేను తిరుపతిలో అగ్రికల్చర్ కోర్స్ చదివే సమయంలో శ్రీనాథ్‌తో పరిచయం ఏర్పడింది. నా మనసుని దగ్గరగా చూస్తారు. నేను చెప్పకపోయినా నా మనసుని అర్థం చేసుకుని భుజం తడతారు. అయితే చాలాసార్లు ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో మేం మాట్లాడుకునే అవకాశమూ వచ్చేది కాదు. నా కోసం ఆయన కెరీర్‌ను వదులుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేనిది. కొన్నేళ్ల క్రితం వారం రోజులపాటు పని ఒత్తిడిలో ఉండిపోయా. నేను ఇంటికి రాగానే ఆయన వెళ్లిపోతూ.. ఎక్కడికి అని అడగొద్దు అన్నారు. మనసు అల్లకల్లోలం అయింది. కన్నీళ్ల వరద ఆగలేదు. చివరకు ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాను. నేనూ మీ వెంటే అంటూ బ్యాగ్ సర్దుకుని ఆయన బ్యాగ్ పక్కన పెట్టాను. అదే రాత్రి రాజీనామా లేఖను డ్రైవర్‌తో డీజీపీ కార్యాలయానికి పంపాను. అయితే తరువాత భర్త సర్దిచెప్పడంతో నిర్ణయం మార్చుకున్నాను. -
‘మెట్రో’లో అలా భాగమయ్యా..
టీనేజ్‌లో ఉన్నవారికి పెద్ద బాధ్యత అప్పగిస్తే కంగారు పడతారు. ఆ బాధ్యత దేశ, రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించింది అయితే భయపడతారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అందరి వేళ్లు అటువైపే చూపిస్తాయి. ఎంతో ఒత్తిడిలో కూడా ప్రతిభావంతంగా తనకు అప్పగించిన పని పూర్తి చేసి దేశప్రధాని చేత శభాష్ అనిపించుకుంది ‘సుప్రియా సనమ్’. ఈ పేరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గతేడాది నవంబరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి, ఇంకా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రయాణించిన మెట్రో రైల్‌ను విజయవంతంగా నడిపిన యువతి అంటే గుర్తుపడ్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా సుప్రియ తన మనోగతాన్ని, తన విజయ రహస్యాన్ని ‘సాక్షి’కి వివరించారు. సాక్షి, సిటీబ్యూరో: సాహసమే శ్వాసగా సాగుతున్న సుప్రియ.. లక్ష్య సాధనలో సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. ఓటములను సమర్థంగా ఎదుర్కొని గమ్యాన్ని చేరుకోవాలని నేటి తరం అమ్మాయిలకు పిలుపునిస్తున్నారు. అవకాశాలు ఎవరో ఇస్తారని ఎదురు చూడటం కంటే ఎంచుకున్న మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నిలిచి గెలిచి సాధించడమే ధీర వనితల లక్షణమంటున్నారు. లక్ష్య సాధనలో ఓసారి విఫలమైనా.. ప్రయత్నించడమే నేటి తరం అమ్మాయిలు నేర్చుకోవాల్సిన జీవితపాఠం అంటున్నారు. ప్రస్థానం మొదలైందిలా.. ‘మాది నిజామాబాద్ పట్టణంలోని కంఠేశ్వర్ ప్రాంతం. నాన్న ప్రమోద్‌కుమార్ ప్రైవేటు స్కూలు టీచర్. తర్వాత అదే పాఠశాలకు ఇన్చార్జ్గా పనిచేశారు. అమ్మ ప్రభావతి డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసేవారు. నేను, అన్నయ్య ప్రసన్న కుమార్ పిల్లలం. చిన్నప్పుడు పాఠశాల చదువు నిజామాబాద్‌లోనే సాగింది. బీటెక్ హైదరాబాద్‌లోని విజ్ఞానభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ పూర్తిచేశాను. ఎంటెక్ సీబీఐటీలో చేశాను. ‘మెట్రో’లో అలా భాగమయ్యా.. ఎంటెక్ ఫైనల్స్‌లో ఉన్నప్పుడు నగరంలో మెట్రో బూమ్ మొదలైంది. సాహసం.. సవాళ్లను ఎదుర్కొనేవారికి ఎల్అండ్టీ సంస్థ ఆహ్వానం పలికింది. వెంటనే అప్లై చేశాను. నాలుగు దశల పరీక్షలను పూర్తిచేసి మెట్రో లోకోపైలెట్‌గా ఎంపికయ్యాను. ఏడాది పాటు శిక్షణ పొందాను. ఛాలెంజింగ్ జాబ్‌ను నిత్యం ఎంజాయ్ చేస్తున్నా. మా ఇంట్లో వివక్ష లేదు.. మా తల్లిదండ్రులు ఎప్పుడూ నాపట్ల వివక్ష చూపలేదు. నేను చదవాలనుకున్న కోర్సులో చేర్పించారు. అన్నయ్యతో పాటే నేనూ క్రికెట్, బాస్కెట్‌బాల్ ఆడాను. నేను ఆడపిల్లను అన్న కోణంలో ఎప్పుడూ చూడలేదు. లోకోపైలెట్‌గా జాబ్‌లో చే రతానంటే ఓకే అన్నారు తప్ప ఎక్కడా నో చెప్పలేదు. నా సక్సెస్‌లో నా తల్లిదండ్రుల పాత్ర మరువలేనిది. చిన్నప్పటి నుంచి వారు నాకు ఇచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహంతోనే ఎదిగాను. చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడమంటే నాకు ఇష్టం. బైక్ డ్రైవింగ్ కూడా ఆ సక్తితో నేర్చుకున్నాను. లక్ష్య సాధనకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలన్నదే నా సిద్ధాంతం. నేటి యువతలకు నేను చెప్పే మాట కూడా అదే.. -
ఆమె కోసం జనం రోడ్లెక్కారు
బిడ్డ ఆశయాన్ని గుర్తించింది. ఆమె కలను నెరవేర్చాలని ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంది. ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారి..ఎదురొడ్డి నిలిచింది. తన బిడ్డకు అండగా నిలబడింది. చివరకు ఆమె కృషి ఫలించింది. కన్నబిడ్డను కలెక్టర్‌ను చేసింది..ఆ కలెక్టర్‌కు అమ్మగా ఎనలేని సంతోషాన్ని మూటగట్టుకుంది కర్నాటక ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరి తల్లి శ్రీలక్ష్మీరెడ్డి. విదేశాలకు వెళ్లమంటే తిరస్కరించి..కలెక్టర్‌నవుతానంటూ మారాం చేసిన సింధూరి కలను నిజం చేసిన శ్రీలక్ష్మీరెడ్డి..ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, కష్టాలు, సవాళ్ల గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు శ్రీలక్ష్మీరెడ్డి మాటల్లోనే... హిమాయత్‌నగర్: మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామం. మావారు దాసరి జయపాల్‌రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. మాది చాలా పెద్ద కుటుంబం. మా పెద్దమ్మాయి రోహిణీ సింధూరిని విదేశాలకు పంపించి ఉన్నత చదువులు చదివించాలనుకున్నాం. కానీ సింధూరి ఒప్పుకోలేదు. ఇండియాలోనే ఉంటానని ఖరాకండిగా చెప్పేసింది. చేసేదేం లేక ఇంజనీరింగ్‌లో చేర్పించాం. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో కూడా మళ్లీ అమెరికా గురించి అడిగితే చిరాకుపడింది. ఇక వదిలేశాం. ఇండియాలోనే ఉండాలనే కోరికతో సివిల్స్ వైపు దృష్టి... నాకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. 1990 నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాను. నా సేవా కార్యక్రమాలు చూసి సింధూరి ఇన్స్పైర్ అయింది. తాను కూడ ప్రజలకు సేవచేయాలనుకుంది. అందుకు ఐఏఎస్ బెస్ట్ మార్గం అనుకుంది. ‘అమ్మా నేను కలెక్టర్ అవుతా’ అన్నది. ‘కలెక్టర్ అయితే ఎంచక్కా ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు సేవ చేయోచ్చు. కాబట్టి నన్ను సివిల్స్‌లో చేర్పించండంటూ’ కోరింది. ఆమె కోరిక మేరకు హిమాయత్‌నగర్‌లోని ఆర్.సి.రెడ్డి కోచింగ్ సెంటర్లో సివిల్స్‌లో చేర్పించాం. మెయిన్స్ సమయంలో యాక్సిడెంట్ మెయిన్స్ కోసం సింధూ ఢిల్లీ వెళ్లింది. ఆ సమయంలో పొద్దున్నే తను పాలప్యాకెట్ కోసం కిరాణా స్టోర్‌కి వెళ్లింది. పాలు తీసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో కారు ఢీకొంది. ఆ సమయంలో సింధూ తీవ్ర గాయలపాలయ్యింది. మాకు చెబితే మేం కంగారు పడ్తాం అని తన స్నేహితురాలికి ఫోన్ ద్వారా చెప్పింది. ఆమె నాకు ఫోన్ చేసి చెప్పడంతో నేను ఢిల్లీ పయనమై వెళ్లి అక్కడ ఒక ఇల్లు తీసుకుని ఉన్నాం. బెడ్ మీద పడుకునే చార్ట్‌లపై క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్‌ని రాసుకోవడం, వీల్‌ఛైర్‌లో కూర్చుని గోడలపై పెద్దపెద్ద అక్షరాలతో రాతలు రాయడం చేసింది. ఆఖరికి బాత్రూమ్లోని గోడలపై కూడా తను రాతలు రాసి ప్రిపేర్ అయింది. ఆ రోజులు గుర్తొస్తే..కన్నీరు ఆగదు నాకు. అమ్మా నేను ఇంకా కాలేజీకి వెళ్లను అన్నది... సింధూకి దేవుడు అందమైన రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపం కోసం ఎందరో పోకిరీలు ఎన్నో సందర్భాల్లో సింధూని వేధించారు. తను కాలేజీకి వెళ్తున్న సమయంలో చాలా మంది వెంటపడి ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి. ‘అమ్మా నేను ఇంకా కాలేజీకి వెళ్లను. ప్రతి ఒక్కడు నాతో మాట్లాడు, లేదంటే బాగోదు అంటూ బెదిరిస్తున్నారు’ అని చెప్పి ఏడ్చేది. చేసేదేమీ లేక మూడు కాలేజీలు మార్చాం. ఎన్ని కాలేజీలు మార్చినా సింధూపై వేధింపులు మాత్రం ఆగలేదు. ఆ సమయంలో తల్లిగా నేను తనలో ధైర్యాన్ని నింపాను. సమాజంలో ఎలా ఉండాలి, అబ్బాయిల నుంచి వేధింపులు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఓ స్నేహితురాలిగా వివరించా. అప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదురించి నిలబడింది. వచ్చేదా..చచ్చేదా అన్నారు బంధువుల నుంచి సింధూకి ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. తనకు నచ్చకపోవడం వల్ల మేం తిరస్కరించాం. ఆ సమయంలో ‘ఏంటి మీరు లక్షలు పోసి చదివిస్తున్నారు? అసలు ఆమెకు ఐఏఎస్ వచ్చేదా..చచ్చేదా..? ఏం..మా వాడికిచ్చి పెళ్లి చేస్తే ఏమౌవతదంట? అంటూ ఎంతో మంది సూటిపోటి ప్రశ్నలతో నన్ను వేధించారు. కానీ నేను ఏనాడూ సింధూ వద్ద ప్రస్తావించలేదు. తను కలెక్టర్ అయ్యాక కానీ వారంతా నోరుమసూకున్నారు. నా బిడ్డ నన్ను తల ఎత్తుకునేలా చేసిందని గర్వపడుతున్నాను. అసలు మా వంశంలో కలెక్టర్ అయినవారు ఏవరూ లేరు. ఆమె కోసం జనం రోడ్లెక్కారు రోహిణీ సింధూరి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా డీసీగా పనిచేస్తున్నారు. అక్కడి ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో స్థానికుల నుంచి ఆమెకు పెద్దఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. ఇటీవల రెండు, మూడు ఇష్యూస్‌లో అక్కడి మంత్రులు ఆమెను విభేదించారు. ట్రాన్స్ఫర్ చేయాలని పట్టుబట్టారు. దీంతో ఆమెకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజానీకం ఆమెను ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనం రోడ్లెక్కి ధర్నాలు, ఉద్యమాలు చేయడంతో ప్రభుత్వం మూడుసార్లు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చి వెనక్కి తీసుకుంది. నిజాయితీ కలిగిన ఓ కలెక్టర్‌ని వేధిస్తే..ప్రజల నుంచి ఎలా ఇబ్బందులు వస్తాయో..ప్రభుత్వమే స్వయంగా గుర్తించింది. -
వి'జయ' గాథ
ఆమె పశువైద్యురాలు.. భర్త ఎంబీబీఎస్ డాక్టర్.. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో ఓ యాక్సిడెంట్ చీకట్లు నింపింది. రోడ్డు ప్రమాదం లో భర్తను కోల్పోయిన ఆమె.. మానసికంగా కుంగిపోయి ఉద్యోగం చేయలేకపోయింది. ఆ తర్వాత గుండె దిటవు చేసుకుని ఉన్నత విద్యాభ్యా సం చేసింది. గ్రూప్స్ రాసి డీపీవోగా ఎంపికయ్యింది. ఇటీవలే కామారెడ్డి డీపీవోగా విధుల్లో చేరిన జయసుధ సక్సెస్ స్టోరీ.. బాన్సువాడ: మాది బాన్సువాడ. నాన్న పెర్క రాజారాం పోస్ట్ మాస్టర్. అమ్మ సరోజ. మేము నలుగురం అక్కాచెల్లెళ్లం, ఇద్ద రు సోదరులు. నేను ఐదో సంతానం. మేమంతా ప్రభుత్వ పాఠశాలలోనే తెలుగు మీడియంలో చదివాం. ఐదో తరగతి వరకు బాన్సువాడలోనే చదివా. ఆరో తరగతిలో జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష రాసి ఎంపికయ్యా. అలా 6 నుంచి 12 వరకు నవోదయలో చదివా. ఆ తర్వాత డిగ్రీలో ఎనిమిల్ హస్బెండరీ అండర్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేశా. 2002లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌గా నాగిరెడ్డిపేట మండలంలో పోస్టింగ్ సాధించా. 2003లో మెదక్‌కు చెందిన ప్రభుత్వ వైద్యుడు కేశవ్‌తో వివాహం జరిగింది. ఉద్యోగం రావడం.. ఎంతో ప్రేమించే భర్త ఉండడంతో నేను ఎంతో సంబరపడ్డా.. అంతా సంతోషంగా సాగిపోతున్న తరుణంలో ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. డ్యూటీకి వెళ్లిన ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. పెళ్లయిన తొమ్మిది నెలలకే ఆయన నన్ను విడిచి వెళ్లిపోయారు. అంతా శూన్యమై పోయినట్లు అనిపించింది. మానసికంగా చాలా కుంగిపోయా. ఆ ఊరిలో ఉండి ఉద్యోగం చేయలేక పోయా. చివరకు ఎలాగోలా కోలుకున్నా. ఆ బాధను మరిచి పోయేందుకు చదువుకోవాలని నిర్ణయించుకున్నా. ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి హైదరాబాద్ వెళ్లిపోయా. వెటర్నరీ మైక్రోబయోలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశా. వెటర్నరీ బయాలజికల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో వెటర్నరీ మెడిసిన్స్ తయారీలో నిమగ్నమయ్యా. అలా ఏడేళ్లు గడిచి పోయాయి. 2010లో బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన నాగనాథ్ నా జీవితంలోకి వచ్చారు. ఆయన డిగ్రీ కళాశాల లెక్చరర్. హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా కాలం సాగిపోతోంది. అయితే, ప్రజా సంబంధాలు గల ఉద్యోగం చేస్తూ, ప్రజలకు సేవలందించాలనే తపన నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ లక్ష్యాన్ని చేరాలనుకున్నా. కష్టపడి చదివి 2011లో గ్రూప్స్ పరీక్ష రాశా. ఇంటర్వ్యూకూ సెలక్ట్ అయ్యా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పరీక్షలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రేయింబవళ్లు కష్టపడి చదివి ఇంటర్వ్యూకు ఎంపికైన తర్వాత ఇలా జరగడంతో మానసికంగా కుంగిపోయా. ఆ సమయంలో నాగ్నాథ్ నాకు ఎంతో ధైర్యం చెప్పారు. పరీక్షలకు మళ్లీ సిద్ధం కావాలని ప్రోత్సహించారు. ఆయనిచ్చిన ధైర్యంతో పరీక్షలకు మళ్లీ సన్నద్ధమయ్యా. రోజులో సగభాగం పుస్తకాలకే సమయం కేటాయించా. 2016లో గ్రూప్స్ పరీక్షలు రాశా. ఎట్టకేలకు అనుకున్నది సాధించా. సొంత జిల్లాలోనే డీపీవోగా ఉద్యోగం సాధించా. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా. పెళ్లయిన తొమ్మిది నెలలకే భర్త మృతితో కుంగిపోయా. ఎంతో కష్టపడి చదివి రాసిన పరీక్షలు రద్దవడంతో మరింత ఆందోళనకు గురయ్యాయి. కానీ, భర్త నాగ్నాథ్ ప్రోత్సాహంతో గ్రూప్స్‌పై పూర్తి దృష్టి సారించా. రోజూ 12–13 గంటలు చదివే దాన్ని. ఎట్టకేలకు అనుకున్నది సాధించా. మహిళలు ధైర్యంతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చు. అందుకు నా జీవితమే ఉదాహరణ. -జయసుద -
పోస్ట్ ఉమన్ జమీల
గార్ల: భర్త చనిపోయినా మొక్కవోని ధైర్యంతో పోస్ట్ ఉమన్‌గా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండల కేంద్రానికి చెందిన జమీల. జమీల భర్త ఖాజామియా పోస్ట్ ఉమన్‌గా పనిచేస్తూ పది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పుడు జమీల పిల్లలు మూడవ తరగతి, ఐదో తరగతి చదువుతున్నారు. భర్త మృతితో కుటుంబ పోషణ జమీలకు భారమైంది. ఈ క్రమంలో తపాలా శాఖ అధికారులు భర్త ఉద్యోగాన్ని జమీలకు ఇచ్చారు. మొదట్లో సైకిల్ తొక్కరాకపోవడంతో కొన్ని రోజులు కాలినడకన ఉత్తరాలు బట్వాడా చేసింది. రోజుకు 4 గంటలు నడుస్తూ అనేక ఇబ్బందులు పడేది. సైకిల్ తొక్కడం నేర్చుకుని ఉత్తరాలు బట్వాడా చేయడం ప్రారంభించింది. పిల్లల చదువుల ఫీజులు పెరిగాయి. నెల జీతం రూ.6 వేలు సరిపోకపోవడంతో పోస్ట్ ఉమన్ ఉద్యోగం చేస్తూ చీరల వ్యాపారం మొదలుపెట్టింది. భర్త చనిపోయిన మహిళను సమాజం చిన్నచూపు చూస్తుంది..ఎవరేమనుకున్నా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పెద్ద కూతురు జరీనా ఇంజనీరింగ్, చిన్న కూతురును డిప్లొమా చదివిస్తోంది జమీల. ప్రస్తుతం ఆమె వేతనం రూ.పది వేలు. పోస్ట్‌మన్‌గా, చీరల వ్యాపారంతో కుటుంబాన్ని పోషిస్తూ శభాష్ అనిపించుకుంటోంది జమీల. వేతనం రూ.20 వేలకు పెంచాలని ఆమె తపాలా శాఖను కోరుతోంది. -
లక్ష్యం ఎంతైనా ఆమె ముందు చిన్నదే...
విద్య, ఉద్యోగం, రాజకీయం, వ్యాపారం, క్రీడలు ఇలా ఏ రంగమైనా తామున్నామంటూ ముందుకు సాగిపోతున్నారు నారీమణులు. ఒకప్పుడు వంట గదికే పరిమితమైన అబల నేడు అంతరిక్షయానం చేస్తూ సత్తా చాటుతోంది. తమకు కాస్త ప్రోత్సాహం అందిస్తే చాలు ఎంతటి లక్ష్యమైనా చేరుకుంటామని చెబుతోంది మహిళాలోకం. ప్రముఖ కంపెనీల్లో సీఈఓలుగా ఉంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవారు కొందరైతే.. క్రీడల్లో రాణిస్తూ భారతదేశ ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నవారు మరికొందరు.. ఉద్యోగాల సాధనలో కూడా తామేమీ పురుషులకు తక్కువ కాదని నిరూపిస్తున్నారు యువతులు. అలాంటి కొంతమంది మహిళల సక్సెస్‌పై ప్రత్యేక కథనం మీకోసం.. విజయనగరం, శృంగవరపుకోట రూరల్: నా పేరు లగుడు శ్రీలక్ష్మి, మాది ఎస్.కోట మండలంలోని ధర్మవరం స్వగ్రామం. భర్త అల్లు శ్రీనివాసులనాయుడు, తల్లిదండ్రులు లగుడు రమణమ్మ, సత్యనారాయణమూర్తిల ప్రోత్సాహంతో పట్టుదలగా చదివి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2010లో ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం విశాఖ జిల్లా ఏటికొప్పాకలో ఎస్బీఐ బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. తల్లిదండ్రులు ఇద్దరు కూడా శృంగవరపుకోట మండల పరిషత్ అధ్యక్షులుగా (ఎంపీపీ) పదవులు అలంకరించారు. భర్త శ్రీనివాసులనాయుడు బీఎస్ఎన్ఎల్లో (విశాఖ) సహాయ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా కుమార్తె అఖిల ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరన్నది నా ప్రగాఢ విశ్వాసం. ప్రస్తుత కాలంలో మగవారికి దీటుగా ఇటు ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించడంతో పాటు రాజకీయం, వ్యాపార రంగాల్లో కూడా రాణిస్తున్నారు. మహిళలు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ రావాలంటే ప్రతి మహిళా విద్యావంతురాలు కావాలి. మారిన ఆధునిక జీవనశైలికి అనుగుణంగా కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాలంటే భార్యభర్తలిద్దరూ పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మహిళలను వంటింటికే పరిమితం చేయాలనే ఆలోచనను నుంచి ప్రతి ఒక్కరూ బయటకు రావాలి. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉద్యోగం చేయాల్సిన సత్తా మహిళలకు ఉంది. -
నృత్యమేవ'జయ'తే..
భవిష్యత్ ప్రణాళికల గురించి ఆమె ఏమంటున్నారంటే... మా ఏకైక సంతానం లక్ష్మీదీపికకు కూడా నాట్యంలో చక్కని అభినివేశం ఉంది. ఆమె కూడా ఈ రంగంలో ఎన్నో పురస్కారాలను, సత్కారాలను అందుకొంటోంది. భారతీయ నృత్యకళలు అనే అంశంపై పరిశోధన చేయడానికి మెటీరియల్ సేకరించి అధ్యయనం ప్రారంభించాను. మన రాష్ట్రప్రభుత్వం కళలను ప్రోత్సహించడానికి ఆశించిన స్థాయిలో ముందుకు రాకపోవడం బాధాకరమైన వాస్తవం. రాజమహేంద్రవరం కల్చరల్: ఐదో ఏట నుంచి ఆమెకు నాట్యమంటే మక్కువ ఏర్పడింది. డ్యాన్స్ నేర్పించకపోతే అన్నం తిననని మారాం చేసేంత స్థాయికి ఎదిగింది. మరోవైపు తల్లిదండ్రులు ‘‘మా తల్లివి కాదూ.. సంగీతం నేర్చుకోవమ్మా, రేపు పెళ్లయితే, ఎలాంటివాడు వస్తాడో, సంగీతం నేర్చుకుంటే ఇబ్బంది ఉండదు’’ అని ఆమెకు నచ్చజెప్పేందుకు విఫలయత్నం చేశారు. ఆ అమ్మాయి మారాం మానలేదు. పంతం నెగ్గించుకుంది. ఆ శిక్షణ అంతర్జాతీయ వేదికలపై పురస్కారాలు అందుకోవడం వరకు వెళ్లింది. అంతే కాదు, నాట్య శాస్త్రానికే అంకితమైన వ్యక్తితోనే ఆమెకు ‘పెద్దలు కుదిర్చిన’ వివాహం జరిగింది. ఆమే గొల్లపూడి ఉమాజయశ్రీ. 1978లో విశాఖలో జన్మించిన ఈమె పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (నృత్యం) పట్టా తీసుకున్నారు. ఎంబీఏ చేశారు. వివాహానంతరం జిల్లాలోని ధవళేశ్వరంలో భర్త స్థాపించిన రాధాకృష్ణ కళాక్షేత్రకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్నో ప్రదర్శనలు–అరుదైన పురస్కారాలు ఎనిమిదో ఏటే వరల్డ్ టీచర్స్ ట్రస్టు నిర్వహించిన పోటీల్లో తొలి ప్రదర్శన ఇచ్చిన ఉమా జయశ్రీ ఇప్పటి వరకు వందలాది ప్రదర్శనలలో పాల్గొన్నారు. కళాభారతి, విశాఖలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సంప్రదాయ, జానపద, నృత్యరీతుల్లో మొదటి బహుమతిని గెలుచుకున్నారు. 2015లో ఉత్తరాఖండ్‌లో అంతర్జాతీయ ఉత్తమ కొరియోగ్రఫీ పురస్కారాన్ని, 2017లో కర్నూలులో అభినయగురుశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి, కళాభిమానుల జేజేలు అందుకున్నారు. 2017 జూన్ నాలుగో తేదీన రాజమహేంద్రి ఆనం కళాకేంద్రంలో రాధాకృష్ణ కళాక్షేత్ర 12.23 నిమిషాల, ఒక సెకనులో సప్తనృత్యరూపకాల ప్రదర్శనకు నృత్య దర్శకత్వం వహించారు. ఈ ప్రదర్శన ప్రపంచ రికార్డులు, జీనియస్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికారŠుడ్సలో నమోదైంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికారŠుడ్సలో కూడా నమోదు కానుంది. ఉత్తరాఖండ్, డెహ్రాడూన్‌లోని యూనివర్సల్ సాంస్కృతిక్ శోధ్ నాట్య అకాడమీలో, యునెస్కోవారి ఫ్రాన్స్పారిస్ సంస్థలలో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారు. మనసున మనసై..అడుగులో అడుగై.. ప్రతి పురుషుడి విజయం వెనుక, ఒక స్త్రీ ఉంటుందంటారు. అయితే ఇక్కడ ప్రతి స్త్రీ వెనుకా ఓ పురుషుడు ఉంటాడని చెప్పుకోవచ్చు. ఉమాజయశ్రీ, ఆమె భర్త గోరుగంతు బదరీనారాయణలు ఇద్దరి వృత్తీ, ప్రవృత్తి నాట్యం కావడం విశేషం. భర్త ప్రోత్సాహంతో ఉమాజయశ్రీ హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాట్యవిభాగాధిపతి డాక్టర్ ఉమారామారావు వద్ద ఐదేళ్లు నాట్యంలో శిక్షణ పొందారు. భర్త గోరుగంతు బదరీనారాయణ స్థాపించిన రాధాకృష్ణ కళాక్షేత్రంలో ప్రిన్సిపాల్‌గా చిన్నారులకు కూచి పూడి, గాత్రం, వీణ, లలితసంగీతాలలో శిక్షణ ఇస్తున్నారు. -
శాల్యూట్ టూ ప్రశాంతి
పశ్చిమగోదావరి:‘ పేదరికంలో పుడితే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే.. ఉద్యోగాలు రావనే అపోహ విడనాడండి. కష్టపడే తత్వం, పట్టుదల, నిరంతరం లక్ష్యం కోసం శ్రమించడం వంటి లక్షణాలు అలవరచుకొంటే సాధించలేనిది ఏదీ లేదు. అందుకే నేనే ఉదాహరణ.’ అంటున్నారు పెంటపాడు గ్రామానికి చెందిన మరపట్ల ప్రశాంతి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. మాది పెంటపాడు గ్రామం. మా తండ్రి నిరక్ష్యరాస్యుడు. వృత్తిపరంగా వ్యాన్ డ్రైవర్. తల్లి జయలక్ష్మి. ఇంటర్ చదివారు. మేము ఇద్దరం ఆడపిల్లలం. నా అక్క పేరు సింధు. ఆమె ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ చేసింది. విశాఖపట్నంలోని రెడ్డిల్యాబ్‌లో పనిచేస్తోంది. నేను పెంటపాడు ప్రభుత్వ పాఠశాలలో వి«ధ్యాభ్యాసం చేశాను. 2009–12లో స్థానిక డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తిచేసి కళాశాల టాపర్‌గా నిలిచాను. ఇంట్లో తండ్రి పడుతున్న కష్టాలు చూశాను. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొన్నాను. అప్పుడే పేదలకు సేవా చేయాలనే తలంపుతో ఎన్సీసీలో చేరాను. అప్పటి ఎన్సీసీ అధికారి నతానియేలు సూచన మేరకు ఎస్సై కావాలనే లక్ష్యం ఉండేది. ఎస్సై ఉద్యోగానికి దేహదారుఢ్యం అవసరమని గుర్తించాను. కళాశాలలోనే ఉదయం రన్నింగ్, లాంగ్‌జంప్, లాంటి వ్యాయామాలు చేశాను. ఎప్పటికైనాసివిల్ సర్వీస్ సాధించాలని.. ఎస్సై కావాలనే లక్ష్యం అలా ఉండగానే, 2012–13లో పెదతాడేపల్లి వాసవి జీఎంఆర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాను. గూడెం ఏయూ క్యాంపస్‌లో ఎంఏ పూర్తి చేశాను. కరెంట్ ఎఫైర్స్ కోసం వార్తా పత్రికలు నిత్యం చదివేదాన్ని. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో మెంబర్‌గా ఉండి పలుసార్లు రక్తదానం చేశాను. తిరుపతిలో జరిగిన జాతీయ సమైక్యతా శిబిరంలో పాల్గొని నృత్యంలో రెండో బహుమతి సాధించాను. కాగా ఎన్సీసీలో తీసుకొన్న నిర్ణయం మేరకు పోలీస్‌శాఖలో నోటిఫికేషన్ ఆధారంగా పరీక్షలు రాశాను. ఎస్సైగా ఎంపికయ్యాను. ప్రస్తుతం అనంతపురంలో ఎస్సై శిక్షణ పొందుతున్నాను. మరో మూడు నెలల్లో ఈ శిక్షణ పూర్తవుతుంది. మేనమామ ఏలూరి జగదీష్, పెద్దమ్మ మరపట్ల బాలకృష్ణ ప్రోత్సాహం, సహకారం కారణంగా పోలీస్ శాఖలో ఎస్సై అయ్యాను. అయినా ఈ లక్ష్యం కాక మరో టార్గెట్ ఉంది. ఎప్పటికైనా సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించి సమాజ శ్రేయస్సుకు, పేద ప్రజలకు సహాయం చేయాలనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితేనేమి? పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉద్యోగాలు రావనే అపోహ విడనాడాలి. కష్టపడే తత్వం, పట్టుదల, నిరంతరం లక్ష్యం కోసం శ్రమించడం వంటి లక్షణాలు అలవరచుకొంటే సాధించలేనిది లేదు. నాతోటి యువతులు కూడా ఈ విధంగా ఆలోచించాలి. చదువు మధ్యలోనే ఆపకుండా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. పేదరికంలో ఉన్నా, ఉన్నతస్థితిలో ఉన్నా సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. -
మట్టిలో ‘మణి’క్యం
కడు పేద కుటుంబంలో పుట్టింది. చదువును మధ్యలోనే ఆపేసినా యాంకర్‌గా ఎదిగింది. స్టేజి షోలు ఇస్తూ సొంతంగా ఓ ఆర్కెస్ట్రాను ఆర్గనైజ్ చేస్తోంది. ఇలా పదిమందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు యాంకర్ మణి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. వీరవాసరం: ‘మా స్వగ్రామం తణుకు. భాష్యం స్కూల్ పక్కన చిన్న ఇంట్లో పుట్టాను. అమ్మ ఇండ్ల తులసి, నాన్న సత్యనారాయణ, అక్క శివ. చిన్నచిన్న పనులు చేస్తూ అమ్మానాన్న కుటుంబ పోషణ చేసేవారు. నేను మూడో తరగతి చదువుకునే సమయంలో అమ్మానాన్నల మధ్య కొద్దిపాటి వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో అమ్మ వేరు పడింది. అప్పటి నుంచి అమ్మ దగ్గరే పెరుగుతూ డ్యాన్స్‌పై ఇష్టం ఏర్పరచుకున్నాను. నా 12వ ఏటనే స్టేజీలపై స్టెప్పులేశాను. డ్యాన్స్ ట్రూపులతోనూ, సినీ సంగీత విభావరిలోనూ యాంకర్‌గా చేయడం ప్రారంభించాను. టీవీల్లో వస్తున్న పాటలను చూసి.. ఎవరి దగ్గర శిష్యరికం చేయకుండానే టీవీల్లో వస్తున్న పాటలను చూసి ఇంట్లోనే రిహార్సల్ చేసుకునేదాన్ని. ఏ స్టెప్పు చూసినా వెంటనే స్టేజిపై చేయడం నాకు ఛాలెంజింగ్‌గా ఉండేది. మావయ్య మూర్తి, అత్తయ్య ఆదిలక్ష్మి ప్రోత్సాహంతో డ్యాన్సర్‌తో పాటు యాంకర్‌గాను ప్రావీణ్యం సంపాదించాను. పదేళ్ల క్రితం భీమవరానికి చెందిన మధును వివాహం చేసుకున్నాను. సరిగమ ఆర్కెస్ట్రా ప్రారంభించాం సరిగమ ఆర్కెస్ట్రాను ప్రారంభించి డ్యాన్సర్గాను, యాంకర్‌గాను, డ్యాన్స్ బేబి డ్యాన్స్‌ల ప్రదర్శనలు ప్రారంభించాం. మా ఆయన మధు సహకారంతో భీమవరం, తణుకు, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం, విజయవాడ, హైదరాబాద్‌లతో పాటు బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైలోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాం. మా సరిగమ ఆర్కెస్ట్రాలోకి జబర్దస్త్ టీం ఆది, భాస్కర్, సుధాకర్, రాజు, నరేష్ తదితరులతో పాటు సినీ సింగర్లు సునీత, గీతామాధురి, మాళవిక, ఝాన్సీలతోను ప్రదర్శనలు ఇప్పించడం విశేషం. టీవీల్లో జరిగే సూపర్ డూప్స్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాను. నాతో పాటు మరో 10 మందికి అవకాశాలు చూపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. డ్యాన్సర్‌గా, యాంకర్‌గా రాణిస్తుండడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. -
పౌరాణిక పాత్రలతో శిఖరాగ్రం
వనపర్తి రమణమ్మ. అలియాస్ రమణశ్రీ.. పుట్టింది పేద కుటుంబం. పొట్టకూటికి కూడా లేని పరిస్థితి. తెలిసీతెలియని వయస్సు నుంచే అన్నతో కలిసి పాటలు పాడుకుంటూ భిక్షమెత్తుకుని పొట్టపోసుకోవాల్సి వచ్చింది. పౌరాణిక రంగంలో రాష్ట్రంలోనే దిగ్గజ కళాకారుడైన రేబాల రమణ చేరదీశాడు. దీంతో ఆమె అనేక జిల్లాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. ఆత్మకూరు రూరల్: తోలుబొమ్మలాట కుటుంబాలు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోని డీసీపల్లి, బోయలచిరివెళ్ల, నబ్బీనగరం, శంకర్నగరం, లింగంగుంట, వ్వూరుపాడులలో ఉన్నాయి. వీరిలో డీసీపల్లి కళాకారులు దశాబ్దాల క్రితమే విదేశాల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. అటువంటి కుటుంబానికి చెందిన వనపర్తి రమణమ్మ, తన అన్న ఆంజనేయులతో కలిసి ఏడేళ్ల పసిప్రాయం నుంచే పొట్టకూటి కోసం ఆత్మకూరు బస్టాండ్‌తో పాటు రోజుకోచోట వీధుల్లో తిరుగుతూ పాటలు పాడుతూ భిక్షమెత్తుకుని పొట్టనింపుకునే వారు. ఈ క్రమంలో ప్రఖ్యాత కళాకారుడు రేబాల రమణ ఓ సారి ఆత్మకూరు విచ్చేసి వీరి గురించి తెలుసుకున్నారు. తన వద్దకు పిలిపించుకుని ఇక నుంచి రోడ్ల వెంబడి తిరగవద్దని, కళాకారులుగా తీర్చిదిద్దుతానని ఆదాయ మార్గం చూపుతానని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అనేకప్రదర్శనలిచ్చి.. రమణ ఇచ్చిన ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. విజయవాడ, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో సుమారు వెయ్యి పౌరాణిక నాటకాల్లో నటించింది. చిత్ర, కలహకంటి, మాతంగి, బాలనాగమ్మ, లచ్చి, మంజరి, సంగు, ముత్తి, తదితర పాత్రల్లో నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఓ దశలో ఆమెకు గుండెపోటు రావడంతో పౌరాణిక రంగ కళాకారులు ఆర్థికసాయం చేసి ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత నుంచి నాటకాలు వేస్తూ రంగస్థల ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. పౌరాణికాలకు ఆదరణ తగ్గింది చిన్నతనం నుంచి కళాభిమానంతో ఈ రంగంపైనే ఆధారపడ్డాం. పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తూ దిగ్గజ కళాకారుల సరసన నటించే అవకాశం దక్కింది. పౌరాణికాలకు గతంలో ఉన్న ఆదరణ నేడు లేదు. సహచర కళాకారిణులైన శిరీషా, పద్మ, అపర్ణ, తదితరులం కలిసి తరచూ పౌరాణికాల్లో నటిస్తూ పొట్టకూటికి సరిపడా సంపాదించుకుంటున్నాం. ప్రభుత్వ సహకారం అందించి పౌరాణికాలను కాపాడితే మాలాంటి కళాకారులతో పాటు ఈ కళ కూడా సజీవంగా నిలుస్తుంది. – రమణశ్రీ -
పల్లె రుచులకు పట్టం
కాజీపేట అర్బన్: బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో లభించే పిజ్జాలు, బర్గర్లు, కబాబ్‌లపై మోజు పెంచుకుంటున్న నేటి కాలంలో సంప్రదాయ వంటలకు పట్టాభిషేకం చేస్తున్నారు ఓరుగల్లు వనితలు. కరకరాలడే కారప్పూస, నోరూరించే సకినాలు, గారెలు, తియతీయని అరిసెలు ఇలా ఒక్కటేమిటి మరెన్నో రకాల అసలు సిసలైన తెలంగాణ పిండి వంటకాలను నేటి తరానికి అందిస్తున్నారు. వరంగల్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాలు, ఇతర దేశాలకు వీరి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. నలుగురు మహిళలతో మొదలైన ఈ సంస్థలో ప్రస్తుతం 30మంది ఉపాధి దుతున్నారు. దినదినాభివృద్ధి చెందతూ ప్రగతి పథంలో పయనిస్తున్న వరంగల్ హంటర్‌రోడ్డులోని ‘శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు’ సంస్థపై ప్రత్యేక కథనం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన ధన్నపునేని రాజేశ్వర్‌రావు, రాధ దంపతులకు ముగ్గురు కుమార్తెలు రమ, ఉమ, ఉష, కుమారుడు భీంరావ్ ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. చిన్నతనంలో తల్లి చేసిన వంటలను ఆస్వాదించిన కుమార్తెలు నేటి తరానికి బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌కు దీటుగా సంప్రదాయ తెలంగాణ పిండి వంటకాలను పరిచయాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు అక్క చెల్లెలు, మరదలు అర్చన(తమ్ముడి భార్య) కలిసి 2016 మే 2న ‘శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు’ అనే సంస్థను ప్రారంభించారు. నలుగురితో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 30 మంది ఉపాధి పొందుతున్నారు. వరంగల్ నుంచి విదేశాలకు... శ్రీనిధి సంస్థ ఉత్పత్తులను నగరంతోపాటు దేశవిదేశాల్లోని ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. బెంగుళూరు, ముంబాయి, చెన్సై, నగరాలతోపాటు ఆస్టేలియా, అమెరికా వంటి దేశాలకు ఆర్డర్లపై పిండి వంటలను సరఫరా చేస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్లు.. శ్రీనిధి తెలంగాణ పిండి వంటల కోసం ఆన్లైన్లో జస్ట్ డైల్ యాప్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు. ఆన్లైన్లో శ్రీనిధి ఆర్డర్ కోసం 98494 03242, 93949 46666 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. రకరకాల రుచులు రుచిలో తేడా రాకుండా వంటలకు సంబంధించి కారం పొడి, పసుపు, ఇతర పదార్థాలను తామే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. పల్లి గారెలు, పçప్పు గారెలు, తెల్ల సకినాలు, కారం సకినాలు, చెగోడీలు, మురుకులు, బూందీ కార, మడుగులు, సర్వపిండి, అరిసెలు, బూందీ లడ్డూ, బాదుషా, గవ్వలు, పల్లి, నువ్వుల లడ్డూ, గరిజెలు, సున్నుండలతోపాటు, పచ్చళ్లను సైతం తయారు చేస్తున్నారు. పిండి వంటలు కిలోకు రూ.200 నుంచి రూ.300కి విక్రయిస్తున్నారు. ఆర్డర్ ఇస్తే చాలు.. వివాహాది శుభకార్యాల సందర్భంగా పిండి వంటలు కావాల్సిన వారు రెండు రోజుల ముందు ఆర్డర్ ఇస్తే చాలు సరఫరా చేస్తాం. తెలంగాణ పిండి వంటలకు నగరంలో మంచి డిమాండ్ ఉంటోంది. రుచికరమైన పిండి వంటలను అందించేందుకు స్వయంగా పప్పులు, కారం, పసుపును గిర్నీలో పట్టిస్తున్నాం. వంటల తయారీలో వంద శాతం, నాణ్యత, శుభ్రత పాటిస్తున్నాం. - రమ, సంస్థ ప్రతినిధి చాలా ఆనందంగా ఉంది నేను నా పిల్లలు చేస్తున్న వంటలకు ఆదరణ లభిస్తుండడంతో ఆనందంగా ఉంది. మా వద్ద మరో 30 మంది గృహిణులు ఉపాధి పొందుతున్నారు. నేటి తరానికి సంప్రదాయ వంటకాలు తప్పనిసరిగా పరిచయం చేయాలి. తెలంగాణ పిండి వంటలు రుచితోపాటు బలాన్ని ఇస్తాయి. – రాధ, సంస్థ నిర్వాహకులు వనమాలకనపర్తి నుంచి వస్తా.. ఐనవోలు మండలంలోని వనమాలకనపర్తి నుంచి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నా. పిండి వంటలు తయారు చేసి ఉపాధి పొందడం బాగుంది. నిర్వాహకులు సొంత మనుషుల్లా చూసుకుంటారు. మేం చేసే వంటలకు గిరాకీ పెరుగుతోంది. – కళ, కార్మికురాలు సొంత ఇంట్లో ఉన్నట్లుగానే శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు ప్రారంభించి నాటి నుంచి ఇక్కడ పని చేస్తున్నా. ఇంట్లో ఉండి పనిచేస్తున్నట్లుగానే ఉంటుంది. నాకు పూర్వ అనుభవం ఏమీ లేకున్నా నిర్వాహకులు నెల రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు. ఇక్కడ పనిచేయడం ఆనందంగా ఉంది. – దేవి, కార్మికురాలు. అమ్మ స్ఫూర్తితో.. అమ్మ స్ఫూర్తితో ప్రారంభించిన మా సంస్థకు ప్రత్యేక గుర్తింపు లభించింది. బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌లకు దీటుగా పిండి వంటలను పిల్లలకు అందించాలి. ప్రతిరోజు సుమారు 60 నుండి 100 మందికి పైగా కస్టమర్లు మా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పండుగల సమయంలో ఆర్డర్లపై పిండి వంటలను అందిస్తున్నాం. – ఉమ, సంస్థ ప్రతినిధి -
నాదస్వర మణులు
నాదస్వర కచేరీలో మహిళలు రాణించడం అరుదైన విషయం..అందులో కుటుంబ సభ్యులంతా రాణిస్తే విశేషం. ఆ కీర్తి ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి దక్కింది. మహిళలంతా నాదస్వర కచేరీలు నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ముదిగొండ: ముదిగొండ మండలం వల్లభి గ్రామంలోని పలువురు మహిళలు ‘నాదస్వర’ ప్రతిభావంతులుగా పేరు గడిస్తున్నారు. షేక్ మీరాబీ, హుస్సేన్‌బీ, జి రాజేశ్వరీ, అనిఫా, పి లక్ష్మి, పి నాగలక్ష్మి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రోగ్రాంలు ఇస్తున్నారు. వీరంతా గ్రామానికే చెందిన షేక్ యాకూబ్‌సాహెబ్ వద్ద నాలుగేళ్లు సాధన చేశారు. తల్లిదండ్రుల కూడా ప్రోత్సహించారు. నాదస్వర నారీమణులు చదువుకున్నది కూడా తక్కువ అయినా, సాధనలో మిన్నగా ఉన్నారు. ఊపిరి బిగపట్టుకుని సప్తస్వరాలను సన్నాయిలో వినిపించడం అంత తేలికకాదు. ఇటువంటివి నేర్చుకునేందుకు మగవారు సైతం జంకుతారు. కానీ మహిళలు మాత్రం నిష్ణాతులై ప్రదర్శనలు ఇస్తున్నారు. నేర్చుకున్న స్వరాలు సరళి స్వరాలు, జంటలు, అలంకారాలు, పిల్లారి, గీతాలు, కృతులు, వర్ణాలు, మొదలగు కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, లయ, తాళం, రాగం, సృతి ప్రధానమైనవి. ప్రతి ఏటా వీరికి ఆరు నెలల పాటు సీజనల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. మాఘమాసం, చైత్రం, వైశాఖమాసం, శ్రావణమాసం లలో వీరికి సీజన్. మిగతా ఆరు నెలలు జీవన భృతి కోసం కూలీ పనులకు వెళుతుంటారు. డోలు వాయిద్యకారుడు దరిపల్లి శేషయ్య కుమార్తెలు లక్ష్మి, నాగలక్ష్మి, నాగేశ్వరి ముగ్గురు నాదస్వరంలో ప్రావీణ్యం పొందారు. షేక్ మీరాబీ సిస్టర్స్ కూడా నాదస్వరంలో రాణిస్తున్నారు. ఖమ్మం, పాల్వంచ, భద్రాచలం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, తిరుపతి, సూర్యపేట, వేములవాడ రాజన్న దేవాలయాల్లో భక్తి గీతాలు ఆలపించడానికి సన్నాయి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. అవార్డులు..ప్రశంసలు.. ఖమ్మంలో జరిగిన తెలుగు మహాసభల్లో అప్పటి కలెక్టర్ సిద్దార్థ జైన్ చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, షీల్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో కళాకారులకు నిర్వహించిన సిల్కాన్ ఆంధ్రా ప్రోగ్రాంలో అవార్డులు, ప్రశంస పత్రాలు పొందారు. గత ఏడాది ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లచే సన్మానం పొందారు. అమ్మానాన్నల ప్రోత్సాహం.. చిన్ననాటి నుంచి సంగీతంపై మక్కువ పెంచుకున్నాం. నాన్న శేషయ్య డోలు వాయిద్యంలో మంచి ప్రావీణ్యుడు. మేం ముగ్గురం అక్కా చెల్లె్లళ్లం. అందరం కలిసి నాన్నతో పెళ్లిళ్లు, దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకు వెళుతుంటాం. అమ్మానాన్నల ప్రోత్సాహంతో సంగీతంలో రాణిస్తున్నాం.– లక్ష్మి, నాగలక్ష్మి సన్నాయి సిస్టర్స్ ఎంతో ఇష్టం సన్నాయి, సంగీతంలో కళాకారులుగా రాణించడం ఎంతో ఇష్టం. ఇతర జిల్లాలకు వెళ్లి పెళ్లిళ్లకు, దేవాలయాల్లో ఆరాధనోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మాకు సంగీతం నేర్పిన గురువుకు వందనం, మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చారు. అందరి ప్రసంశలు అందుకుంటున్నాం, –షేక్ మీరాబీ, సన్నాయి కళాకారిణి -
కరాటేలో సంధ్యా కిరణం
కరాటే.. శారీరక, మానసిక సామర్థ్యాలను పెంచడంతో పాటు ఆత్మరక్షణకు దోహదపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం, మనోధైరాన్ని పెంచుతుంది. అటువంటి క్రీడలో ఆసక్తితో ఆర్థిక ఇబ్బందులున్నా మొక్కవోని దీక్షతో పతకాలు సాధిస్తోంది. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రోత్సాహంతో పతకాల పంట పండిస్తోంది. ఎంబీఏ చదువును పూర్తిచేసి ఉన్నత చదువులతో పాటు కరాటేలో మరింత స్థాయికి ఎదిగేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది భీమవరం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన కొడమంచిలి సంధ్య. విజయగాథ ఆమె మాటల్లోనే.. భీమవరం: మాది భీమవరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ. తల్లిదండ్రులు అక్కమ్మ, దేవుడు, అక్క, అన్న ఇది మా కుటుంబం. అక్క, అన్న చదువుపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోయినా, నన్ను మాత్రం ఉన్నత స్థాయిలో చూడాలన్న కోరిక అమ్మా, నాన్నతో పాటు తోబుట్టువులకూ ఉంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పాఠశాల విద్య పస్తుల సాగరం మున్సిపల్ హైస్కూల్లో సాగింది. ఇంటర్ నుంచి ఎంబీఏ వరకూ డాక్టర్ చీడే సత్యనారాయణ కళాశాలలో చదువుకున్నా. మంచి మార్కులతోనే ఉత్తీర్ణత సాధించా. ఇదే సమయంలో రైస్ మిల్లు కార్మికుడిగా పనిచేసే నాన్న దేవుడు ప్రమాదవశాత్తు కాలువిరిగి మంచానపడ్డారు. కుటుంబ పోషణ కష్టం కావడంతో అమ్మ అక్కమ్మ మిల్లులో పనికి వెళ్లేది. అక్క టైలరింగ్, అన్న తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. నాకు చిన్నతనం నుంచి కరాటేలో మక్కువ ఉండటంతో కుటుంబసభ్యులు ప్రోత్సహించారు. స్థానికంగా ఉన్న కరాటే మాస్టార్ జోశ్యుల విజయభాస్కర్ వద్ద శిక్షణ ఇప్పించారు. పతకాల పంట విశాఖ, గుంటూరు, కరీంనగర్, తాడేపల్లిగూడెం, జొన్నాడ, తాళ్లరేవు, రాజమండ్రి, మల్కిపురం తదితర ప్రాంతాల్లో జరిగిన జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఎనిమిది స్వర్ణ, ఆరు రజత, రెండు కాంస్య పతకాలు సాధించాను. మరెన్నో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందుకున్నా ను. ప్రముఖుల ప్రశంసలు పొందాను. అయితే దూరప్రాంతాల్లో జరిగే టోర్నమెంట్లకు హాజరయ్యేందుకు ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారింది. చదువుతో పాటు కరాటేలో శిక్షణ తలకు మించిన భారమైంది. ప్రస్తుతం అన్న, అక్క సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది. కరాటేలో మరింత రాణించి పోలీసు ఉద్యోగం సంపాదించడమే నా లక్ష్యం. ఇందుకు ఆర్థిక ఇబ్బందులు ప్రతి బంధకంగా మారాయి. ఇప్పటికే ఎన్నో కష్టాలకోర్చి కుటుంబసభ్యులు ఇక్క డి వరకూ తీసుకువచ్చారు. దాతలు సహకరిస్తే కరాటేలో మరింత రాణిస్తానన్న నమ్మకం.. ఆత్మవిశ్వాసం నాకుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నా లక్ష్యాన్ని తప్పక సాధిస్తాను. -
మహిళల హక్కుల రక్షణకే వృత్తి చేపట్టా..
నల్లగొండ లీగల్ : ‘మహిళా హక్కుల రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి. వాటిని మహిళలకు తెలియజేసి, వారి హక్కులను కాపాడాలనే ఉద్దేశంతోనే న్యాయవాద వృత్తిని చేపట్టా’ అని చెబుతోంది.. నల్లగొండకు చెందిన న్యాయవాది జి.మనీషా. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె ‘సాక్షి’ వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నేను బీ.ఫార్మసీ పూర్తి చేసిన అనంతరం న్యాయవాది కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కార ణం మా నాన్న మాల కొండారెడ్డి కూడా న్యాయవాది కావడంతోనే ఈ వృత్తిపై ఆసక్తి పెరిగింది. 2011లో నెట్టెంపాడు ప్రాజెక్టులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తున్న (ప్రస్తుత నల్లగొండ జాÆ ‡ుుంట్ కలెక్టర్) సి.నారాయణరెడ్డితో వివాహం జరిగింది. నా భర్త ప్రోత్సాహంతో 2016లో లా డిగ్రీ పూర్తి చేశా. ప్రస్తుతం నల్లగొండ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నా. సత్వర న్యాయం సమన్యాయమే ధ్యేయంగా భారత న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. మహిళను ప్రోత్సహిస్తే ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవకాశం ఉంది. ప్రజలకు చట్టాలపై అవగాహ న తీసుకురావడానికి న్యాయవిజ్ఞాన శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. భూ వివాదాలు పరిష్కారం కావడానికి కోర్టుల్లో ఎక్కువ సమయం పడుతుంది. పెరుగుతున్న కేసుల రద్దీకి అనుగుణంగా కోర్టుల సంఖ్యను పెంచాలి. కక్షిదారులకు సమ్మతి మేర కు లోక్ అదాలత్‌ల ద్వారా కేసులను పరిష్కరించడం జరుగుతుంది. ఇటీవల పెద్ద సంఖ్యలో మహిళలు న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు న్యాయమందించడం సంతోషకరం. మహిళలు చట్టాలపై అవగాహన కలిగించాలి మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వాలు మహిళల రక్షణకు అనేక చట్టాలు రావడం జరిగింది. తమ హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ చట్టాల ద్వారా న్యాయస్థానాలను ఆశ్రయించి సత్వర న్యాయం పొందవచ్చు. – దువ్య గీత, న్యాయవాది, నల్లగొండ లాయర్ కావాలనే.. పేదలు, మహిళలు, బాలల హక్కులను కాపాడానికే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చినా, వదులుకుని న్యాయ విద్యనభ్యసించి న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నా. పట్టుదలతో చదివి న్యాయవాదిని అయ్యా. మహిళలకు న్యాయ సాయం అందించడంతో పాటు వారి హక్కులను తెలియపరుస్తున్నా. – మామిడి ప్రమీల, న్యాయవాది, నల్లగొండ బాల్యంలోనే అన్యాయంపై ప్రశ్నించేదాన్ని.. కోదాడఅర్బన్ : ఏ విషయంలో అన్యాయం జరిగిందని అనిపిస్తే దానిపై చిన్నతనంలోనే ప్రశ్నించేదానిని. బీఎస్సీ చదివిన నేను స్వతహాగానే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించాలనుకున్నా. 1988–91 మధ్య కాలంలో గుంటూరులోరి ఆంధ్రా క్రిస్టియన్(ఏసీ) కాలేజీలో బీఎల్ కోర్సు పూర్తి చేశా. అనంతరం ఆరునెలలు హైదరాబాద్‌లో పనిచేశా. 1992 నుంచి నేటివరకు కోదాడ కోర్టులోనే ప్రాక్టీస్ చేస్తున్నా. మా కుటుంబంలో అందరూ విద్యావంతులే కావడంతో నేను న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ప్రస్తుత తరం అమ్మాయిలు ధైర్యంగా ఉండి, క్లిష్ట పరిస్థితులను ఎదిరించే విధంగా తయారుకావాలి. న్యాయవాద వృత్తిలో ప్రవేశిస్తే సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించవచ్చు. బాధితులకు అండగా నిలబడే అవకాశం ఉంటుంది. – శ్రీదేవి, న్యాయవాది, కోదాడ పెండింగ్ కేసులను పరిష్కరించాలి వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసులను పరిష్కరించి సత్వర న్యాయం అందించేందుకు న్యాయ వ్యవస్థ కృషి చేయాలి. మహిళల హక్కుల రక్షణకు అనేక చట్టాలున్నా వాటి అమలులో లోపాల వల్ల నేటికి మహిళలు సకాలంలో న్యాయం పొందడం లేదు. చట్టాలను అమలు పర్చాల్సిన సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. – ఎన్.సంధ్యారాణి, న్యాయవాది, నల్లగొండ న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర పెరగాలి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో న్యాయసేవాధికార సంస్థతో పాటు ప్రభుత్వ కృషి ఉండాలి. న్యాయవాదిగా పనిచేస్తూ మహిళల తరఫున నిలబడాలనే తపనతోనే ఈ వృత్తిని ఎంచుకున్నా. న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. – ఎం.ప్రగతి, న్యాయవాది, నల్లగొండ -
వివక్షే అతి పెద్ద నేరం
సాక్షి, సిద్దిపేట: ‘పిల్లలకు ఎంత ఆస్తి ఇవ్వాలి.. వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి.. అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కానీ, మా అమ్మానాన్నలు అందుకు విరుద్ధం. తమ వారసులను ఎలా తయారుచేయాలో ఆలోచించారు. స్థిరచరాస్తులకే కాదు.. ఇంట్లోని గది నిండా ఉండే పుస్తకాలకూ వారసులు ఉండాలని భావించారు. ఈక్రమంలో అమ్మానాన్నల నుంచి అందిపుచ్చుకున్న న్యాయశాస్త్ర పరిజ్ఞానం, భర్త ప్రోత్సాహం.. నన్ను న్యాయమూర్తిగా నిలబెట్టింది. అమ్మే నాకు ఆదర్శం.. నాన్న పుస్తకాలకు వారసురాలిగా నా న్యాయవాద వృత్తిని ప్రారంభించా..’ అని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గూడ అనూష తెలిపారు. అమ్మానాన్నల కలలను సాధించడం నుంచి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తిగా సక్సెస్ అయిన వైనం.. తల్లిదండ్రుల పెంపకం.. మహిళా సాధికారత.. బాధ్యతలు మొదలైన అంశాలపై ఆమె సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు.. ఆమె మాటల్లోనే వివరాలు.. గది నిండా పుస్తకాలే.. మాది వరంగల్ పట్టణం. అమ్మ అమృతమ్మ, నాన్న యాదగిరిశర్మ న్యాయవాదులే. చిన్నప్పటి నుంచి ఇంటి వద్ద చట్టాలు, న్యాయాలు, కేసులు పరిష్కారాలు మాకు వినిపించేవి. కొత్త పుస్తకాలు వస్తే చాలు అమ్మానాన్నలు పోటీ పడి కొని మరీ ఇంటికి తెచ్చేవారు. ఇలా ఇంటి నిండా పుస్తకాలు చేరాయి. అయితే, వాటికి వారసులు ఎవరు? అనేది వారి ప్రశ్న. నేను, తమ్ముడు రవిశర్మ.. ఇద్దరం ఇతర చదువులతో పాటు న్యాయవాద కోర్సు పూర్తి చేశాం. అమ్మానాన్నలు మమ్మల్ని జడ్జీలుగా చూడాలని అనుకునేవారు. ఈ విషయం అమ్మ నాకు చెబుతూ ఉండేది. వారి కోరిక తీర్చడంతో పాటు పుస్తకాలకు వారసురాలిగా ఉంటానని ఏదో సరదాగే చెప్పేదాన్ని. కానీ, అవే మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. నా ఆలోచనకు భర్త ప్రోత్సాహం నా భర్త అనికుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. సమాజాన్ని చదివిన మనిషి. నేను బీటెక్ చదివి లా కోర్సు చేసిన వెంటనే వివాహమైంది. ఆయనది బెంగుళూర్లో ఉద్యోగం. మా కుటుంబ పరిస్థితి.. వాతావరణం చూసిన ఆయన న్యాయమూర్తి కావాలనే నా ఆలోచనకు ఏనాడు అడ్డు చెప్పలేదు. నన్ను మరింత ప్రోత్సహించారు. నా పెద్ద కుమారుడు సాయిసిద్దార్థ 18 నెలల వయస్సునప్పుడు ఆయాతో కలిసి హైదరాబాద్‌కు కోచింగ్‌కు వచ్చా. నేనెలా చదువుతున్నానో? ఆయన ప్రతిరోజు ఆరా తీసేవారు. నాకు ధైర్యం చెప్పేవారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను న్యాయమూర్తి పోటీ పరీక్షలో రాష్ట్రంలో ఐదో ర్యాంక్ సాధించగలిగాను. సంస్కృతి, సంప్రదాయాలతో ఆత్మవిశ్వాసం సంస్కృతి, సంప్రదాయాలు మనలోని ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పెంచుతాయి. పూజలు, ఉపవాసాలు, పండుగలు ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతాయి. వాటిని ఏనాడు విస్మరించవద్దు. అయితే, అందులో ఉన్న మంచిని మాత్రమే మనం స్వీకరించాలి. సర్వమానవాళి అభివృద్ధికి దోహదపడేందుకు ఎందరో మహానుభావులు చెప్పిన మాటలు, సూక్తులు స్వీకరించాలి. వాటిని మన జీవన మనుగడకు, తోటివారికి సహాయం చేసేందుకు వినియోగించాలి. అలాగే కట్టుబాట్లు, సామాజిక ఆచారాల ద్వారా ఇతరులను నొప్పించడం, ఇబ్బంది పెట్టకూడదు. అమ్మే నా రోల్ మోడల్ అమ్మే నా రోల్ మోడల్. పేరెంట్స్ ఇద్దరు న్యాయవాదులే. వారి కుటుంబ పరిస్థితి.. పడిన కష్టాలు.. సమాజంలో గుర్తింపులు.. మొదలైన విషయాలు మాకు ఎప్పుడు చెబుతుండేది. వారి న్యాయమూర్తుల గురించి చెబుతూ.. వారిచ్చిన తీర్పులు చర్చించే సమయంలో మేము కూడా న్యాయమూర్తులు అయితే బాగుంటుందని నాన్న పదేపదే చెప్పేవారు. ఆయన మాటలే నన్ను న్యాయమూర్తి పరీక్ష రాసేందుకు సిద్ధం చేశాయి. దీనికి తోడు స్వామి వివేకానంద ‘హన్మంతుడు’ పుస్తకం, పాల్కో రచించిన ‘ది ఆల్కమిస్ట్’ పుస్తకాలు నన్ను ప్రభావితం చేశాయి. సమయం దొరికనప్పుడు పుస్తకాలు చదవడం నా హాబీ. అందులో మనకు కావాల్సిన అంశాలుంటే రాసుకుంటాను. వివక్ష ఎక్కడ ఉన్నా నేరమే.. వివక్ష ఎక్కడ ఉన్నా నేరమే. నేను, తమ్ముడు ఇద్దరం పోటీ పడి చదివేవాళ్లం. మా పెంపకంలో ఎక్కడా తల్లిదండ్రులు వివక్ష చూపలేదు. తల్లిదండ్రులు తమ బిడ్డలను సమానంగా చూడాలి. ప్రస్తుతం మగవారి కన్నా ఆడపిల్లలే బాధ్యతగా చదువుతున్నారు. వారు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇంకెందుకు ఈ వివక్ష. పిల్లలు తమ తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేసిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వీరి రక్షణ కోసం ప్రభుత్వం చట్టాలు చేసింది. అంతేకాదు తల్లిదండ్రుల బాధ్యతలు విస్మరించిన వారిపైనా చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. పట్టుదల ఉంటే విజయం ఆడపిల్లలు.. మహిళలు ఎక్కడా తక్కువ కాదు. మేం తక్కువ అనే భావన తీసేయాలి. ఆడవాళ్లను భూమాతతో పోల్చుతారు. అంటే అంత సహనం ఉంటుందని అర్థం. అందుకే ఓపికతో పెంచుకోవాలి. లక్ష్యం ఎన్నుకొని.. దానిని సాధించే వరకు శ్రమించాలి. అంతేకానీ, నిరాశతో ఉంటే విజయం సాధించలేవు. కుటుంబసభ్యుల సహకారం తీసుకోవాలి. తల్లిదండ్రులు, పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలి. అంతేకాదు ఎన్నుకున్న రంగంలో రాణించాలి. -
నాన్న ప్రోత్సాహంతోనే..
మెదక్‌జోన్: ‘ఆడపిల్లవు నీకెందుకు ఉన్నత చదువులు అని మేనత్తలు, బంధువులు వారించినా.. చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని ఆడ, మగ చదవాల్సిందే అని నాన్న ప్రోత్సహించారు. ఆయన ప్రోత్భలంతోనే నేడు న్యాయమూర్తిగా రాణిస్తున్నా.’ అని మెదక్ జూనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ తెలిపారు. ఆమె మాటల్లోనే మరిన్ని వివరాలు.. మేము ఐదుగురు సంతానం మాది హైదరాబాద్. తండ్రి రజాక్, తల్లి సిరాజ్ నస్రీన్. మేము ఐదుగురు సంతానం. వీరిలో నలుగురుం ఆడపిల్లలం. మాకు ఒక అన్నయ్య ఉన్నాడు. అందులో నేను మూడో సంతానం. అమ్మ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నాన్న లా చదివి వ్యాపారంలో స్థిరపడ్డారు. మా ఐదుగురినీ ఉన్నత చదువులు చదివించారు. నా డిగ్రీ పూర్తి అయిన తర్వాత లా చదివే సమయంలో.. ‘ఆడపిల్లకు ఉన్నత చదువులు ఎందుకు.. చదువు మాన్పించు..’ అంటూ మా మేనత్త, బంధువులు నాన్నకు చెప్పారు. కానీ, నాన్న మాత్రం చదువుతోనే వాళ్లు సొంతంగా నిలబడతారని చెప్పారు. దీంతో నేను లండన్‌లో ఎల్.ఎల్.ఎం. పూర్తి చేశా. తర్వాత మొదటిసారి పరీక్ష రాసి జడ్జీగా ఎంపికయ్యా. ఇల్లాలికి చదువు చాలా అవసరం ప్రతి ఇల్లాలికి చదువు రావాలి. పిల్లలను పెంచడంలో తండ్రి కన్నా తల్లి పాత్రే ఎక్కువగా ఉంటుంది. ఆ తల్లికి చదువు వస్తే పిల్లల భవిష్యత్తు మరింత తీర్చిదిద్దవచ్చు. కుటుంబ బాధ్యతలు సైతం సక్రమంగా నిర్వహించే వీలుంటుంది. ప్రస్తుతం ఆడపిల్లలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. చదువుతోనే విజ్ఞానం పెరుగుతుంది.. అంతేకాదు తమ హక్కుల గురించి మహిళలు తెలుసుకునే వీలుంటుంది. చదువంటే ఉద్యోగం కాదు ఉన్నత చదువులు అనగానే కొందరు తల్లిదండ్రులకు మంచి ఉద్యోగం వస్తుంది అని ఆలోచిస్తారు. కానీ, చదువంటే ఉద్యోగం కాదు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం. విజ్ఞానం పెరిగితే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. మంచి ఉద్యోగం సాధించేలా మాత్రమే చదివించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదు. చట్టాలపై అవగాహన అవసరం మహిళలకు చట్టాలపై అవగాహన అవసరం. విడాకులు, మెయింటనెన్స్, వరకట్న వేధింపులు, గృహహింస లాంటి కేసుల్లో మహిళలు అధికంగా కోర్టుకు వస్తున్నారు. కానీ, కోర్టుకు వచ్చే మహిళల్లో 90 శాతం మందికి చట్టాలపై అసలు అవగాహన లేదు. కొన్ని సందర్భాల్లో ఈ విషయం నన్ను చాలా బాధిస్తుంది. మహిళలకు చట్టాల మీద అవగాహన కలగాలంటే చదువే ఏకైక మార్గం. వృత్తిలో సంతోషం నాన్న ఎంతో ఇష్టంతో లండన్‌లో నన్ను ఎల్.ఎల్.ఎం. చదివించారు. ఆ తర్వాత మొదటి పరీక్షలోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యా. సుమారు 18 నెలలుగా న్యాయమూర్తి వృత్తిలో కొనసాగుతున్నా. పట్టుదలతో ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఉన్నత శిఖరాలు చేరడం కష్టమేమీ కాదు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి. -
సమాన అవకాశాలు ఇవ్వాలి
సాక్షి, యాదాద్రి : తడక కల్పన.. ఎంఏ సోషియాలజీ, పీహెచ్డీ చదివింది. సౌత్ ఏసియా నెట్వర్క్ ఫెమినిజంపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కోర్సును పూర్తి చేశారు. మహిళలు, ఆడపిల్లలు, చేనేత కార్మికుల హక్కులపై పోరాడుతుంది. బంగ్లాదేశ్, మయన్మార్, సౌత్ ఆఫ్రికా దేశాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సెమినా ర్లలో మహిళల సమస్యలపై ప్రసంగించారు. ‘సాక్షి’ చేపట్టిన మహిళా క్యాంపెయిన్ ‘నేను శక్తి’కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ఆడపిల్ల ఈ దేశంలో పుట్టడానికే నోచుకోలేని దయనీయ స్థితిలో ఉంది. తల్లి కడుపులో ఆడపిల్ల పడగానే నిలువునా చంపేస్తున్నారు. ఆడపిల్ల పుడుతుందని తెలియగానే తోటి మహిళ(అత్త, ఆడబిడ్డ) ఇలా కోడలిని వేధిస్తున్నారు. ఇలాంటి సమయంలో మహిళా బతకడ మే కష్టమైంది. ఇక సాధికారిత ఎలా సాధ్యమవుతుంది. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారని నాలుగో గర్భంలో ఉన్న ఆడపిల్లకు జన్మనివ్వద్దని అబార్షన్ చే యిస్తే ఆ మహిళ చనిపోయింది. అబార్షన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్, కుటుంబ సభ్యులను సమాజం కాపాడింది. ఆడ పిల్లలను కేవలం విలాస వస్తువుగా, ఆస్తిగా మాత్రమే చూస్తున్నారు. వస్తువును తనకు నచ్చిన విధంగా వాడుకునే ఆలోచన తప్ప ఆమెకు కొన్ని భావాలు ఉంటాయి. వాటిని గౌరవించాలన్న వ్యక్తిత్వం లేదు. ఆడపిల్లను కంటే తల్లిదండ్రులు నష్టంగా కొడుకును కంటే లాభంగా మాత్రమే ఆలోచిస్తున్నారు. అందుకే ఇంకా ఈరోజుకు వరకట్న చావులు, నవవధువుల మృత్యుఘంటికలు మోగుతున్నాయి. కొన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉండాలి మహిళలకు తమ గర్భంలో ఉన్న శిశువు ఆడైన, మగైన కనే అధికారం ఉం డాలి. ఎలాంటి దుస్తులు ధరించాలి. ఏం తినాలి, ఏం చదవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, అనే విషయంలో స్వేచ్ఛ ఉండాలి. మారుతున్న పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్న తప్పులకు మహిళలను బాధ్యులుగా చేయ డం మారాలి. అమ్మాయిలకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఇస్తూ వారి ని నిందించే విధానం మానుకోవాలి. సమాన అవకాశాలతోనే సాధికారత మహిళలు సాధికారితతో అన్నిరంగాల్లో రాణించాలంటే వారికి అవకాశాలు ఇవ్వాలి. ప్రకృతి ఇచ్చిన శరీరాకృతిని అడ్డం పెట్టుకుని వారి ఆశయాలను, స్ఫూర్తిని దెబ్బతీసే సమాజం మారాలి. మహిళలు అన్నింటిలో రాణిస్తున్నారు. అయినా వివక్ష, వేధింపులు, నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల శక్తి, సామర్థ్యాలను చూడలేని వారు వారి పట్ల చిన్న చూపుతో సూటిపోటి మాటలతో నిరుత్సాహ పరుస్తున్నారు. నిర్ణయాధికారాల్లో సమా న భాగస్వామ్యం అన్ని రంగాల్లో సమాన అవకాశాల కోసం మాత్రమే మహిళలు పోటీపడుతున్నారు. ఆడ పిల్లలు 5వ తరగతి తర్వాత చదువులో ముం దుకుపోలేకపోతున్నారు.అవకాశాలు కల్పించి గౌరవం ఇస్తే రిజర్వేషన్లు లేకుండానే మహిళా సాధికారిత సాధ్యమవుతుంది. -
అర్ధరాత్రి 18 కిలోమీటర్లు నడిచా ..
ఊహ తెలియని స్థితిలో వివాహం... ఆపై పిల్లలు.. జీవితంలో ఆటుపోట్లు తట్టుకోలేక వదిలేసిన భర్త.. పట్టుమని 16 ఏళ్లు కూడా నిండకుండానే కష్టాలు.. కన్నీళ్లే జీవితం. కన్న బిడ్డలతో కలిసి రైలుకిందపడి ప్రాణాలు తీసుకోవాలని.. అదే రైలు ఎక్కి పరాయి రాష్ట్రంలో మూడేళ్ల అజ్ఞాతం. తర్వాత అత్తింటికి చేరుకుంటే అయినవాళ్ల సూటిపోటి మాటలు. తండ్రిలా ఆదరించాల్సిన బావ దారుణ ప్రవర్తన! ఇమడలేక అత్తింటిని వదులుకుని పట్నం చేరుకుంది. ఆత్మస్థైర్యంతో అడుగేసింది. చదువులు నేర్చింది. విధినెదిరించి విజయకేతనం ఎగురవేసింది. అర్ధరాత్రి 18 కిలోమీటర్లు నడిచా ఒకసారి బాబుకు ‘పెద్ద అమ్మవారు’ పోసింది. ఒళ్లంతా చీము కారుతోంది. ఇతర ఇళ్లలో దుస్తులు ఉతికి రాత్రి ఇంటికి చేరుకున్న నేను బాబును చూసి తట్టుకోలేకపోయాను. 18 కి.మీ. దూరంలోని అనంతపురం ఆస్పత్రికి బాబును, పాపను ఎత్తుకుని ఒక్కదాన్నే చీకట్లో నడుచుకుంటూ వెళ్లా. నా పరిస్థితి తలుచుకుని బాగా ఏడుపొచ్చింది. పిల్లలకు అన్నం పెట్టేలేక.. కష్టాలు భరిస్తూ బతకడం ఇక సాధ్యం కాదని అనుకున్నా. పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నా.. కానీ బతికి సాధించాలని నిర్ణయం తీసుకున్నా.. జీవితంలో నిలదొక్కుకున్నా.. నా బిడ్డలకు మంచి జీవితం ఇచ్చా. – మీనాక్షి మూడేళ్ల అజ్ఞాతంలో ఆదర్శ జీవితం.. పిల్లలతో కలిసి నేను ఎక్కిన రైలు ఎక్కిడికి పోతోందో కూడా నాకు తెలియదు. అటుఇటు చూసే లోపు ఓ పెద్ద ఊళ్లో రైలు ఆగింది. నేను ప్లాట్‌ఫాంపై దిగాను. చూస్తుంటే అంతా కన్నడలో రాసి ఉంది. అక్కడి వారి మాటలను బట్టి హుబ్లీ అని తెలుసుకున్నాను. నాకు భాష రాదు. ఎక్కడికెళ్లాలో తెలియక స్టేషన్లోనే ఓ బెంచిపై కూర్చొని ఉండిపోయాను. ఇంతలో ఒకావిడ నా దగ్గరకు వచ్చి వివరాలు అడిగింది. తెలుగులో చెప్పాను. ఆమెకు అర్థమైనట్లు ఉంది. తన పేరు రాధారాణి అని పరిచయం చేసుకుని తనతో పాటు మమ్మల్ని పిలుచుకెళ్లి, తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చారు. మూడు నెలల తర్వాత నేను బెల్గాంలో ఉన్నట్లు తెలుసుకున్నాను. మూడేళ్లలో ఎక్కడా ఎలాంటి పొరబాటు లేకుండా ఆదర్శంగా జీవనం సాగించాను. అప్పటికి భాష నేర్చుకున్నా. ఓ ప్రమాదంలో రాధారాణి చనిపోయారు. దీంతో మళ్లీ ఒంటరిదానయ్యా. ఇక అక్కడ ఉండిబుద్ధి కాలేదు. 2003లో అనంతపురానికి తిరిగి వచ్చాను. 12వ ఏటనే పెళ్లి చేశారు మాది నిరుపేద కుటుంబం. అనంతపురం పాతూరు సమీపంలోని రాణి నగర్లో ఉండేవాళ్లం. అమ్మనాన్న దుస్తులు ఉతికితే వచ్చే సంపాదనతోనే కుటుంబం గడుస్తుంది. 1996లో నేను ఏడో తరగతి చదువుకుంటుండగా (12వ ఏట) మా మేనమామ లక్ష్మీనారాయణతో నాకు పెళ్లి చేశారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలోని అత్తారింటిలో అడుగుపెట్టాను. పెళ్లైనా రెండేళ్లకు పాప పుట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు చెప్పాపెట్టకుండా మా ఆయన ఎక్కడికో వెళ్లిపోయాడు. కొన్ని నెలల తరువాత తిరిగొచ్చాడు. 2000 సంవత్సరంలో మాకు బాబు పుట్టాడు. ఆ తర్వాత నా భర్త మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. బతుకుపై చిరు ఆశ జీవితంపై విరక్తితో పిల్లలను తీసుకుని రైలు కిందపడి చనిపోవాలని అనుకున్నాను. ఇద్దరు పిల్లలను తీసుకుని అనంతపురం రైల్వే స్టేషన్‌ని చేరుకున్నాను. దూరంగా రైలు కూత వినిపిస్తోంది. నా కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చిన్నోడు ఒడిలో నిద్రపోతున్నాడు. పాప బుడిబుడి అడుగులతో ఆడుకుంటోంది. వారి మొహం చూస్తే బాధేసింది. ఇంతలో రైలు కూత దగ్గర కావడంతో చిన్నోడు ఉలిక్కిపడి లేచాడు. వాడి ఏడుపు నన్ను బతుకుపై ఆశలు రగిలింది. ఆత్మహత్య చేసుకునే ఆలోచనను విడిచి ఆగిన రైలు ఎక్కేసాను. ఆదుకున్న ఆర్డీటీ 2009 ఆగస్టులో ఆర్డీటీ సంస్థ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సార్‌ని కలిసి నా పరిస్థితి మొత్తం వివరించాను. డ్రైవర్‌గా ఉద్యోగం కల్పిస్తే పిల్లలను చదివించుకుంటానని ప్రాధేయపడ్డాను. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. నాకు డ్రైవింగ్ సరిగా రాకపోయినా జాబ్ ఇచ్చారు... నేను సరిగ్గా నడపలేనని చెప్పాను. అందుకు ఆయన... ‘నీలాంటి వాళ్లను ఎంకేరేజ్ చేయాలి. అందుకే అవకాశం ఇచ్చాను... ట్రైనింగ్ అవ్వు’ అంటూ గ్యారేజి డ్యూటీ వేశారు. అక్కడ పనిచేయిస్తూ ఆరు నెలల్లో డ్రైవింగ్ బాగా నేర్పారు. గ్యారేజీలో రెండున్నర ఏళ్లు పనిచేశా. అక్కడ వాహన మరమ్మతులు పూర్తిగా నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏటీఎల్ వాహనానికి డ్రైవర్‌గా పంపారు. మూడేళ్లు పనిచేశాను. అటు తరువాత అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ మూడేళ్లు పనిచేశాను. పనిచేస్తూనే టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. అక్కడే నా జీవితం మారిపోయింది. హెవీ లైసెన్స్ తీసుకుంటానని మాంఛో సార్‌కి చెప్పాను. టెస్ట్‌లో ఫెయల్ అయితే లైసెన్స్ ఫీజు జీతం నుంచి కట్ చేస్తా, పాస్ అయితే తానే కడతానని అన్నారు. నేను టెస్ట్‌లో పాస్ అయ్యాను. బతుకే కష్టమైంది ఇద్దరు చిన్న పిల్లలు. అత్తింటి వారు మమ్మల్ని పట్టించుకోలేదు. ఏమీ చేయాలో... పిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కాలేదు. కులవృత్తిని నమ్ముకుని దుస్తులు ఉతుకుతూ జీవించాలని అనుకుని ప్రతి రోజూ మదిగుబ్బ నుంచి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆత్మకూరుకు వచ్చి అక్కడి నుంచి బస్సులో అనంతపురం చేరుకునేదాన్ని ఐదారు ఇళ్లు ఒప్పుదల చేసుకుని దుస్తులు ఉతికి తిరిగి ఇంటికి వెళ్లిపోయేదాన్ని. అయినవాళ్లూ ఇబ్బంది పెట్టారు మూడేళ్ల తర్వాత అనంతపురానికి వచ్చిన నేను నేరుగా మదిగుబ్బకు పోయాను. నా భర్త చనిపోయినట్లు తెలిసింది. ఆ సమయంలో నా భర్త అన్నవాళ్లూ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. చాలా దారుణంగా వ్యవహరిస్తూ వచ్చారు. వారి ప్రవర్తనతో అక్కడ ఇమడలేక పిల్లలను తీసుకుని అనంతపురానికి చేరుకున్నాను. బాబానగర్‌లో చిన్న గది అద్దెకు తీసుకున్నాను. అక్కడికి దగ్గరలోని గుల్జార్ పేటలో ఐదారిళ్లలో దుస్తులు ఉతికేందుకు ఒప్పందం చేసుకున్నాను. నెలకు రూ. 1,500 వచ్చేది. దాంట్లోనే బాడుగ కట్టి, పిల్లలను పోషించుకునేదాన్ని. అలా నాలుగేళ్ల పాటు గడిచింది. మలుపు తిప్పిన డ్రైవింగ్ గుల్జార్‌పేటకు గవర్నమెంట్ ఐటీఐ మీదుగా రోజూ వెళ్లేదానిని. పొదుపు సంఘం సభ్యులకు కుట్టు, డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు డీఆర్డీఏ బోర్డు కనిపించింది. ఐటీఐలోకి వెళ్లి డ్రైవింగ్ నేర్చుకుంటానని అడిగాను. 8వ తరగతి పాస్ అయ్యి ఉండాలని చెప్పారు. నేను ఏడవ తరగతి వరకే చదువుకున్నాను. రాత్రి బడికి వెళ్లి 8వ తరగతి చదవాలని నిర్ణయించుకున్నాను. రాత్రి బడికెళితే పిల్లలను చూసుకోవడం కష్టంగా ఉంటుందని, బాబుని విజయవాడలోని క్రిష్టియన్ స్కూల్లో చేర్పించాను. పాపను గుమ్మఘట్ట హాస్టల్లో చేర్పించాను. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపన నన్ను వారిని దూరం చేసింది. రాత్రి బడికి వెళ్లి చదువుకుని 2008లో పరీక్ష రాసి 8వ తరగతి పాస్ అయ్యాను. తర్వాత ఐటీఐలోకి వెళ్లి డ్రైవింగ్ నేర్చకుంటానని చెప్పాను. 2008 డిసెంబరులో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేశాను. 2009లో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. డ్రైవింగ్‌లో మెళుకువలు, నిబంధనల గురించి విద్యార్థులకు క్లాస్ నిర్వహిస్తున్న మీనాక్షి డ్రైవింగ్ స్కూల్ పెడితే.. చాలా మంది మహిళా అధికారులు, తెలిసిన వారు డ్రైవింగ్ నేర్పించు అని అడిగేవారు. ఒక మహిళ డ్రైవర్ అవసరం ఇంత ఉందా అని అప్పుడు నాకు అనిపించి, సొంతంగా ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. 2016లో మాంఛోసార్ని కలిసి విషయం చెప్పాను. ఆలో చన మంచిదేనని అయన ప్రోత్సహించారు. ఆర్డీటీలో జాబ్‌కు రాజీనామా చేసి, బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుని డ్రైవింగ్ స్కూల్ పెట్టాను. స్పందన పేరుతో సేవ నేను ఎన్నో కష్టాలు అనుభవించి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. నాలాంటి వారికి ఏదైనా చేయాలనే ఉద్ధేశంతో స్పందన సంస్థ స్థాపించి రైతు బజార్లో కార్యాలయం ఏర్పాటు చేశాను. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడే గడుపుతాను. ఎవరైనా వారి వద్ద ఉన్న పాత దుస్తులు తెచ్చి కార్యాలయంలో ఉంచి వెళ్లవచ్చు. వాటిని పేదలు వచ్చి తమకు నచ్చినవి ఉచితంగా తీసుకెళతారు. నాలా ఎవరూ ఇబ్బంది పడకూడదనేది నా కోరిక. అందుకే పేదవారికి ఉచితంగా డ్రైవింగ్ నేర్పించి నాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలతో ఫీజు కట్టించి లైసెన్స్ ఇప్పిస్తుంటాను. -
ది బ్రేవ్ లేడీ
బ్రేవ్. రోజ్ మెక్గావన్. బ్రేవ్! ఇది హాలీవుడ్‌తో పరిచయం ఉన్నవాళ్లు.. ‘మీ టూ’ ఉద్యమం గురించి తెలిసినవాళ్లు.. స్త్రీవాదులు.. స్త్రీల మీద హింసను, వేధింపులను వ్యతిరేకిస్తున్నవాళ్లంతా అనుకుంటున్న మాట! రోజ్ మెక్గావన్ రాసిన పుస్తకం పేరు కూడా .. ‘బ్రేవ్’! రోజ్ మెక్గావన్ హాలీవుడ్ నటి, మోడల్, రచయిత్రి. హాలీవుడ్ దిగ్గజం ‘హార్వే వెన్స్టేన్’ బాధితుల్లో ఒకరు. హార్వే వెన్స్టేన్ను రాక్షసుడిగా అభివర్ణించి హాలీవుడ్ విస్తుపోయేలా చేశారు. ‘నేను హాలీవుడ్ అనే మెంటల్ డిజార్డర్‌తో బాధపడ్డాను’అనే స్టేట్మెంట్తో ప్రపంచ చిత్రపరిశ్రమకు, దానితో సంబంధం ఉన్నవాళ్లందరికీ షాక్ ఇచ్చారు. ఇటీవలే తను పూర్తిచేసిన ‘బ్రేవ్’ అనే పుస్తకంలో తన పెంపకం దగ్గర్నుంచి హాలీవుడ్ దాకా ఎన్నో విషయాలను చెప్పారు. ఇప్పుడు ఇక్కడ రోజ్ బయోగ్రఫీకి కారణం కూడా ఆమె బ్రేవ్నెస్ అండ్ బ్రేవ్ పుస్తకమే! సన్డాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్ సమయంలో 1997 సన్డాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్ జరుగుతోంది. అప్పటికే రోజ్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దాదాపు అయిదేళ్లవుతోంది. హార్వే వెన్స్టేన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్. లాబీలో ఉన్న మీటింగ్ రోజ్ వెళ్లగానే హఠాత్తుగా మీటింగ్‌ను హోటల్లోని తన రూమ్‌లోకి మార్చాడు. రోజ్ వెళ్లారు. అక్కడ ఆమె పట్ల అతను అనుచితంగా ప్రవర్తించాడు. అది బయటకు వెళ్లకుండా ఉండటానికి ఆమెతో సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయం 2017, అక్టోబర్‌లో ది న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది. 2017, అక్టోబర్ 12న రోజ్ కూడా చెప్పింది.. అవును హార్వే తనను రేప్‌చేశాడు, ఈ విషయం మీద అమెజాన్ స్టూడియోలో కంప్లయింట్ చేస్తే చర్య తీసుకోకపోగా.. ఆ ప్రాజెక్ట్ నుంచి తననే తొలగించారని. ఈ విషయంతో పాటు హాలీవుడ్‌లోని ఇతర పురుషపుంగవుల మీదా దాడి చేసింది తన ట్విట్టర్లో. అయితే హాలీవుడ్లో నటీమణుల మీద జరుగుతున్న వేధింపులు, సెక్సువల్ అబ్యూజ్తో పాటు తన బాల్యం, జీవితంలోని ముఖ్య ఘట్టాలతో తాను రాసిన బ్రేవ్ అనే పుస్తకాన్ని 2018, జనవరి 30న రిలీజ్ చేశారు రోజ్ మెక్గావన్. అంతేకాదు ఆ మరుసటి రోజు అంటే జనవరి 31న ‘సిటిజన్ రోజ్’పేరిట ముర్రే ప్రొడక్షన్స్ కింద బనిమ్ నిర్మించిన అయిదు భాగాల డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. ఇందులో ‘మీ టూ మూవ్మెంట్’లో మెక్గావన్ పోషించిన ముఖ్యభూమిక గురించి ఉంటుంది. ఎక్కడ పుట్టారు? ఎలా పెరిగారు? రోజ్ ఇటలీలో పుట్టారు. తండ్రి డానియల్. ఆర్టిస్ట్ . తల్లి.. టెర్రీ. రచయిత. 1968 కాలంలో ఇళ్లల్లోంచి పారిపోయిన టీనేజర్స్, హిప్పీ మూవ్‌మెంట్‌లోని ఇంకొంత మందితో కలిసి డేవిడ్ బెర్గ్ మొదలుపెట్టిన ‘చిల్డ్రన్ ఆఫ్ గాడ్’ ఇటాలియన్ చాప్టర్‌ను నిర్వహిస్తుండేవాడు రోజ్ తండ్రి డానియల్. ఆ కల్ట్లోనే పెరిగిన రోజ్ పదిహేనేళ్ల వరకు అస్తవ్యస్త బాల్యాన్ని గడిపారు. ఆమెకు నిద్రలో నడిచే అలవాటూ ఉండింది. చిల్ట్రన్ ఆఫ్ గాడ్ గ్రూప్‌లో భాగంగా తల్లిదండ్రులతో కలిసి యూరప్ అంతా తిరిగారు ఆమె. ఇటలీలో తండ్రికున్న పరిచయాలతో రోజ్ చైల్డ్ మోడల్‌గా మారింది. తనకు పదేళ్లున్నప్పుడు తల్లిదండ్రులతో సహా అమెరికా మకాం మార్చారు రోజ్. టీన్స్‌లో ఉన్నప్పుడు తల్లితండ్రి విడిపోయారు. తండ్రితో కలిసి సియాటెల్‌లో ఉండసాగారు రోజ్. పదిహేనేళ్ల వయసులో తల్లి, తండ్రినీ కాదనుకొని లాస్ఏంజెల్స్కు ప్రయాణమయ్యారు. హాలీవుడ్ ఎంట్రీ.. 1992లో ‘ఎన్సినో మ్యాన్’తో హాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యారు. 1995లో వచ్చిన ది ‘డూమ్ జెనరేషన్’తో అందరి దృష్టి పడింది ఆమె మీద. ఆ సినిమాకు ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్‌ను అందుకున్నారు రోజీ. ఆ తర్వాత వచ్చిన స్క్రీమ్ ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. అందులో తన సహనటుడుగా ఉన్న బెన్ అఫ్లెక్ కూడా తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశారు రోజ్. ఆ తర్వాత 2001 నుంచి 2006 వరకు ది డబ్ల్యూబీ లో ప్రసారమైన చార్మ్డ్ సీరియల్లోని పెయిజ్ మాథ్యూతో టెలివిజన్ ప్రేక్షకులకూ అభిమాన నటి అయ్యారు. కంట్రావర్సీస్ ముక్కుసూటి తనం, నమ్మినదాన్ని ఆచరించడం రోజ్ మెక్గావన్ తత్వం. అదే ఆమె వ్యక్తిత్వం. ఎల్జీబీటీ యాక్టివిస్ట్ అయిన ఆమె స్వలింగ వివాహాలను నిషేధించిన కాలిఫోర్నియా స్టేట్‌కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పాల్గొన్నారు. గేస్కు మద్దతు పలికిన ఆమెనే తర్వాత గేస్ కూడా స్త్రీద్వేషులనే స్టేట్మెంట్ను ఇచ్చారు. వాళ్లూ మహిళా హక్కుల కోసం తమ గొంతును కలుపుతారు అనుకున్నా. కాని మిగిలిన పురుషుల్లాగే వాళ్లూ ప్రవర్తిస్తున్నారు. మహిళలపట్ల, వాళ్ల హక్కుల పట్ల చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడనిపిస్తోంది అనవసరంగా వాళ్లకు మద్దతు పలికానని’ అంటూ కామెంట్ చేశారు. దీంతో గే కమ్యూనిటీ ఆమె మీద ధ్వజమెత్తింది. అయినా తన మాటను వెనక్కి తీసుకోలేదు. అయితే తమను స్త్రీ ద్వేషులన్నందుకు క్షమాపణ చెప్పాలని గే కమ్యూనిటీ డిమాండ్ చేస్తే ఆ ఒక్కమాటను మాత్రమే వెనక్కి తీసుకుంటున్నానని, మిగిలిన విషయంలో తన అభిప్రాయం ఏమాత్రం మారదని, అలా అన్నందుకు పశ్చాత్తాపం కూడా లేదని స్పష్టం చేశారు రోజ్. గోల్డెన్ గ్లోబ్... బ్లాక్ డ్రెస్ ‘మీ టూ’ క్యాంపెయిన్‌లో ప్రధాన గొంతుక అయిన రోజ్ గోల్డెన్‌గ్లోబ్ అవార్డు ప్రదానోత్సవ సభలో హాలీవుడ్‌లోని మహిళల మీద వేధింపులకు నిరసనగా నటి మెరిల్‌స్ట్రీప్ బ్లాక్ డ్రెస్ వేసుకొని రావడాన్నీ తప్పు పట్టారు. మెరిల్ స్ట్రీప్‌ను హిపోక్రాట్గా వర్ణించారు. ‘మీ టూ క్యాంపెయిన్‌కు మద్దతు తెలపకుండా, హాలీవుడ్‌లోని లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నోరువిప్పకుండా నల్ల బట్టలు వేసుకొని రెడ్‌కార్పెట్ మీద నడిస్తే నిరసన తెలిపినట్టు కాదు. ఇండస్ట్రీలో అన్యాయాల మీద వ్యూహాత్మకంగా పాటిస్తున్న మౌనాన్ని వీడాలి’ అంటూ మెరిల్ స్ట్రీప్‌కు చురక అంటించారు రోజ్. ఇది హాలీవుడ్లో పెద్ద చర్చగా మారింది. అయినా రోజ్ లెక్క చేయలేదు. తన అన్న మాటమీదే నిలబడ్డారు. ఇప్పటికైనా సైలెన్స్‌ను బ్రేక్ చేయండి అంటూ అభ్యర్థించారు. సెక్స్సింబల్ కాదు.. మనిషి ‘చిల్డ్రన్ ఆఫ్ గాడ్’ .. పిల్లలను కూడా లైంగిక సాధనాలుగా చూసే కల్ట్. ఆ నేపథ్యంలో పెరిగారు రోజ్. ఎంత భయంకరమైన బాల్యాన్ని అనుభవించారో.. అంతే భయంకరమైన యూత్‌నీ గడిపారు. మహిళను సెక్స్‌సింబల్‌గా చూసే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. అక్కడా అంతే భయంకరమైన అనుభవాలు. వీటన్నిటి మీద ఇప్పుడు పోరాటం తలపెట్టారు. నేనింతే.. అనే స్వభావం గల మనిషి ఆమె. అదే స్వభావం రోజ్ మెక్గావన్ను నిలబెడ్తోంది. తన పోరాటానికి శక్తినిస్తోంది. ‘‘మహిళను మనిషిగా చూడండి.. లైంగిక సాధనంగా కాదు. స్త్రీలు కూడా సెక్సువలైజ్ కాకుండా తమ సెక్సువాలిటీని ఓన్ చేసుకోవాలి’’ అంటారు రోజ్మెగావన్.. ది బ్రేవ్ లేడీ! మహిళను మనిషిగా చూడండి.. సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా కాదు. స్త్రీలు కూడా సెక్సువలైజ్ కాకుండా తమ సెక్సువాలిటీని ఓన్ చేసుకోవాలి. – రోజ్ మెక్గావన్ -
ఎవుసం అంటే ప్రాణం
కాలం కలిసి రాక.. పంట దిగుబడి లేక, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించక.. వ్యవసాయాన్ని వదిలి ఎంతో మంది రైతులు పట్టణాల వైపు చూస్తున్నారు. అప్పుల పాలై తనువుచాలిస్తున్నవారు కొందరైతే, నగరాలకు వలసపోతున్నవారు మరికొందరు. ఇలాంటి వారికి భిన్నంగా.. భూమిని నమ్ముకుంటే అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తోంది ఓ మహిళ. వ్యవసాయాన్ని ప్రాణంగా భావించి సాగులో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ అధిక దిగుబడులు సాధిస్తోంది. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా వ్యవసాయంలో అన్ని పనులూ చేస్తూ ఏటా రూ. 3 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది మానుకోట మండలంలోని అమనగల్ గ్రామానికి చెందిన కోట యాకమ్మ. సేంద్రియ సాగుతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న స్త్రీమూర్తిపై ప్రత్యేక కథనం.. మహబూబాబాద్: పంటను కంటికి రెప్పలా చూసుకుంటూ నిత్యం వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుంది. జాతీయ ఆహార భద్రత పథకం సభ్యురాలిగా ఉంటూ ఎక్కడ అవగాహన సదస్సులు జరిగినా అక్కడికి వెళ్లి మెళుకువలు నేర్చుకుని ఆచరణలో పెట్టి రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. కోట యాకమ్మ–ఐలయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరి వివాహాలయ్యాయి. కుమారులు వేర్వేరు పనులు చేస్తున్నారు. కాగా యాకమ్మ మాత్రం తనకున్న నాలుగు ఎకరాల్లో అధిక దిగుబడులు సాధించి క్రమంగా సాగును 10 ఎకరాలకు విస్తరింపజేసింది. అన్నీ తానై .. పొలంలో దుక్కి దున్నడం, కలుపు తీయడం, పురుగుల మందులు చల్లడంతో పాటు ఇతర వ్యవసాయ పనులన్నీ తానే స్వయంగా చూసుకుంటోంది. రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల వాడకంపైనే మొగ్గు చూపి అధిక దిగుబడులు సాధిస్తూ జిల్లాలోనే చెప్పుకోదగిన రైతుగా పేరు సంపాదించింది. తనకున్న నాలుగు ఎకరాలను 10 ఎకరాలు చేసింది. తనకు తోడుగా భర్త కూడా సాయపడుతున్నాడు. మరోవైపు కార్యాలయాలకు వెళ్లి, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పురుగుల మందులు, ఎరువులను ఉపయోగిస్తూ.. ఆధునిక పద్ధతులను అవలంబిస్తోంది. ప్రతి సంవత్సరం రూ.3 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తోంది. ప్రస్తుతం 10 ఎకరాల్లో మూడు ఎకరాల్లో మామిడి తోట, ఎకరంలో వేరుశనగ, రెండున్నర ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసింది. వ్యవసాయ అధికారులు యాకమ్మను ఉత్తమ రైతుగా గుర్తించి సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. ప్రముఖుల సన్మానం.. మల్యాల కేవీకే అధికారులు యాకమ్మను ఉత్తమ మహిళా రైతుగా గుర్తించి రెండుసార్లు సన్మానించారు. పంటలు బాగా పండించినందుకు పలు సంస్థలు, కంపెనీల ప్రతినిధులచే ప్రశంసలు, సత్కారాలు అందుకుంది. వ్యవసాయ కార్యాలయాలు, మరెక్కడైనా సదస్సులు జరిగినా యాకమ్మ అక్కడికి వెళ్లి అధికారుల సూచనలు విని పాటిస్తోంది. కాగా ప్రస్తుతం జాతీయ ఆహార భద్రత పథకంలో సభ్యురాలిగా పనిచేస్తోంది. చిన్నతనం నుంచే.. చిన్నతనం నుంచే వ్యవసాయ పనులంటే ఇష్టం. ప్రతిరోజూ పొలం వద్దకు వెళ్లకుంటే ఏదో పోగొట్టుకుంటున్నట్లు ఉంటుంది. వారానికి ఒకసారి వ్యవసాయ కార్యాలయాలకు వెళ్లి పంటలకు సంబంధించి నూతన పద్ధతుల గురించి తెలుసుకుని వాటిని పాటిస్తా. ప్రతి సంవత్సరం రూ. 3 లక్షల ఆదాయం వస్తుంది. ఉత్తమ రైతు అవార్డు కోసం చాలాసార్లు ఇక్కడి అధికారులు పేరును పంపారు. నాకు ఇవ్వకపోయినా నాలాగా పనిచేసే రైతులకు ఇచ్చినా బాగుంటుంది. వ్యవసాయ పనుల్లోనే నాకు సంతృప్తి ఉంది. – కోట యాకమ్మ, అమనగల్, మనుకోట -
సాగుమడిలో ధీర వనిత
నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వ్యవసాయంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. భర్తకు చేదోడుగా ఉంటూ వ్యవ‘సాయం’ చేస్తున్న వారు కొందరైతే.. కుటుంబ పెద్ద దూరమై, బతుకు భారంగా మారిన పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో ఇంటిని నడిపిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కూతుళ్లకు ఉన్నత విద్య ఆర్మూర్: అక్షరాలు రాకపోయినా చదువు విలువ తెలిసిన ఆ కన్నతల్లి వ్యవసాయాన్నే నమ్ముకొని ఇద్దరు కూతుళ్లకు ఉన్నత చదువులు చెప్పించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె కష్టానికి ప్రతిఫలంగా ఆ ఇద్దరు కూతుళ్లలో ఒకరు ఎంబీబీఎస్, మరొకరు కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసి కన్నవారి కలలు నిజం చేశారు. కూతుళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయి అమెరికాలో స్థిరపడ్డారు. అయినా ఇద్దరు పిల్లలు ఎప్పడు తల్లి వద్దకు వచ్చి వెళ్తూ ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్‌కు చెందిన సామ నర్సయ్య, గన్నుబాయి దంపతులకు నలుగురు ఆడపిల్లలు. కొడుకు లేకపోవడంతో పెద్ద కూతురైన గంగుబాయికి ఊర్లోనే సంబంధం చూసి గడ్డం చిన్న గంగారెడ్డికి ఇచ్చి వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. వ్యవసాయంపై వచ్చిన ఆదాయంతో మిగిలిన ముగ్గురు కూతుళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశారు. చిన్న గంగారెడ్డి, గంగుబాయి దంపతులకు ఇద్దరు కూతుళ్లు స్వర్ణరెడ్డి, శ్వేతరెడ్డి పుట్టారు. ఒక కొడుకు పుట్టి చనిపోయాడు. కొద్ది రోజులకే ఇంటికి మగదిక్కైన తండ్రి నర్సయ్యతో పాటు అనారోగ్యంతో చిన్న గంగారెడ్డి మృత్యువాత పడ్డారు. దీంతో ఇంటి భారం గంగుబాయిపై పడింది. ప్రధానంగా వ్యవసాయాధారిత కుటుంబమే కావడం, తల్లిదండ్రులతో వ్యవసాయం పనులకు వెళ్లిన అనుభవం గంగుబాయి జీవనోపాధికి మార్గం చూపాయి. పిల్లలిద్దరినీ బాగా చదివించాలనే భర్త కోరిక నెరవేర్చాలనే సంకల్పం మాత్రమే ఆమెకు మిగిలింది. అందుకోసం రేయింబగళ్లు కష్టపడింది. తానుపడే కష్టం పిల్లలు పడవద్దని వారిద్దరిని హాస్టల్లో ఉంచి చదివిపించింది. గ్రామంలో తండ్రి కట్టించిన ఇంట్లోనే ఉండేది. వ్యవసాయం పనులన్నీ గంగుబాయే చేసుకొనేది. పంటలు వేయడం మొదలుకొని పండించిన పంటను మార్కెట్ యార్డులో అమ్మాలన్నా, కూరగాయలను మార్కెట్‌కు తరలించాలన్నా అన్నీ తానే చూసుకొనేది. 2007 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి ప్రశంసాపత్రం అందుకుంది. అమెరికాలో కూతుళ్లు.. తల్లి కష్టాన్ని గుర్తించిన ఇద్దరు ఆడపిల్లలు నేడు ఉన్నత చదువులను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డారు. పెద్ద కూతురు స్వర్ణరెడ్డి గుంటూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. చిన్న కూతురు శ్వేత రెడ్డి నెల్లూర్లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివింది. వీరిద్దరికి పెళ్లిళ్లుకావడంతో ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. తల్లి తమ కోసం పడ్డ కష్టాన్ని చూసి ఆ కూతుళ్తు తల్లి వద్దకు ఎప్పుడు వస్తుంటారు. తల్లిబాగోగులు చూసుకుంటున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకుని.. నిజాంసాగర్(జుక్కల్): కట్టుకున్న భర్త దూరమవడంతో ఇద్దరు కూతుళ్ల భారం ఆమెపై పడింది. దీంతో భర్త పోయిన బాధను దిగమింగుకుంది. వ్యవసాయాన్ని నమ్ముకుంది. తనకు ఉన్న రెండు ఎకరాల భూమిని సొంతంగా వ్యవసాయం చేస్తూ, పంట పండిస్తోంది. పురుషులతో సమానంగా అన్ని పొలం పనులు చేసుకుంటుంది నిజాంసాగర్ మండలం తున్కిపల్లికి చెందిన మామిడి సంగవ్వ. నిజాంసాగర్ మండలం తున్కిపల్లి గ్రామానికి చెందిన మామిడి పెంటయ్య, భూమవ్వ దంపతులకు ముగ్గురు కూతుళ్లు జన్మించారు. వీరికి మగ సంతానం లేదు. దీంతో పెద్దకూతురు మామిడి సంగవ్వను వెంకటనారాయణకు వచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. రెండో కూతురు గంగవ్వను పెళ్లి చేసి ఇవ్వగా, చిన్నకూతురు మృతి చెందింది. సంగవ్వ, వెంకటనారాయణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు సుజాత, పద్మ జన్మించారు. భర్త మృతిచెందడంతో తల్లిదండ్రులు, కూతుళ్ల సంరక్షణ భారం సంగవ్వపై పడింది. దీంతో సంగవ్వ ధైర్యాన్ని కూడగట్టుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబ పోషణను తన భుజాలపై వేసుకుంది. కొన్నాళ్లకు తల్లిదండ్రులు తనువు చాలించారు. కొంత కాలానికి పెద్ద కూతురు సుజాతకు అంజయ్యతో వివాహం చేసి ఇల్లరికం తెచ్చింది. చిన్నకూతురు పద్మ వివాహం జరిపించింది. ఇంట్లోనే ఇల్లరికం ఉన్న పెద్ద కూతురు సుజాత, అంజయ్య దంపతులకు కుమార్తె మమత, కుమారులు అనిల్‌కుమార్, సాయికుమారు ఉన్నారు. పిల్లలు పెరుగుతున్న సమయంలో మరోమారు విధి వక్రించింది. దురదృష్టవశాత్తు అల్లుడు అంజయ్య ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో సంగవ్వకు మరిన్ని కష్టాలు పెరిగాయి. వయస్సు పెరిగినా అధైర్యపడకుండా వ్యవసాయ పనులు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో ఉన్నదాంట్లో మనువళ్లు, మనవరాలిని చదివిస్తోంది. భర్త దూరమైన కూతురి ఆలనా పాలన చూస్తోంది. ఇలా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి బాధలను దిగమింగుకుని, వ్యవసాయాన్ని నమ్ముకుని జీవితంలో ముందుకు సాగుతూ పలువురు అభినందనలు పొందుతోంది. కష్టాలు ఎదురొడ్డి పోరాడుతున్నా.. : మామిడి సంగవ్వ చిన్నప్పటి నుంచి కష్టాలను చూస్తున్నా. ఇప్పటికి కష్టాలు తీరడం లేదు. తల్లిదండ్రులతో పాటు తాళికట్టిన భర్త దూరం కావడం, కన్న కూతురికి పెళ్లి చేసినా అల్లుడు అకాల మరణంతో కుటుంబంలో బోలెడు కష్టాలు వచ్చాయి. పిల్లలకు భవిష్యత్తు కోసం కూలినాలి పనిచేస్తూ కష్టపడుతున్నా. వారి ఆలనాపాలనా చూసుకుంటున్నా. 40 ఏళ్లుగా వ్యవసాయం బీర్కూర్: మండల కేంద్రానికి చెందిన మేత్రి కుర్మసాయవ్వ గత 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏమాత్రం అక్షర జ్ఞానం లేని సాయవ్వ పొలం చూసి పంటకు ఏ రోగం వచ్చిందో.. ఏ మందు వేయాలో ఇట్టే చెప్పేస్తుంది. సాయవ్వ భర్త సాయిగొండ ఆరోగ్యం సహకరించకపోవడంతో అన్నీ తానై 10 ఎకరాల్లో వరిపంట సాగు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. నాట్లేయడం మొ దలుకుని పంటకోతకు వచ్చే వరకు అన్నీ తానై పంట సాగు చేస్తుంది. తన భర్తతో కలిసి వ్యవ సాయం చేస్తూ రెండు ఎకరాల నుంచి ఈరోజు 10 ఎకరాలకు ఆసామి అయ్యానంటూ సగర్వంగా చెప్పుకుంటుంది. భూతల్లి నమ్ముకున్న వారు ఎప్పుడు నష్టపోరని, రెక్కల కష్టం ఎన్నటికీ వృథా కాదంటోంది సాయవ్వ. చదువు లేని మాలాంటి వారు ఇంటిపట్టున కూర్చునే బదులు ఇలా వ్యవసాయం చేయడంతో తప్పులేదని అంటోంది. నా వయస్సు 50 ఏళ్లకు చేరుకున్నా పొలం గట్టుపై నిల్చుని సూచనలు ఇవ్వనని, కూలీలతో కలిసి అన్ని పనులు చేస్తానంటుంది. 9 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు – సాయవ్వ, బీర్కూర్ మా అమ్మగారు చిన్న దేవాడ. నాకు 9 ఏళ్ల వయస్సులోనే బీర్కూర్ చెందిన సాయిగొండతో పెళ్లి జరిగింది. అప్పుడు నా పెనిమిటి వయస్సు 15 ఏళ్లే. నేను చదువు కోలేదు. 12 ఏళ్ల వయస్సు నుంచే వ్యవసాయ పనులు చేయడం ప్రారంభించా. మా అత్తమామలు ఉన్నప్పుడు మాకు 2 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉంది. నేను నా పెనిమిటి బాగా కష్టపడి వ్యవసాయం చేశాం. ఐదారు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పనిచేసే వాళ్లం. తర్వాత 8 ఎకరాల వరకు పొలం కొన్నాం. డాబా ఇల్లు కట్టుకున్నాం. మా ఆయనకు నాలుగేళ్లుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో మొత్తం 10 ఎకరాల వ్యవసాయం నేనే చూసుకుంటున్నా. మొదట్నుంచి కూడా నాట్లేయడం, కలుపుతీత, పంటకోత వరకు అన్ని పనులకు కైకిలోళ్లను నేనే పిలుస్తా. బిడ్డ పెళ్లి చేశాం. కొడుకు బీరప్ప ప్రయివేట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. భర్తకు అండగా పశుపోషణ బోధన్‌రూరల్(బోధన్): ఈ మహిళ పేరు లోకిరెడ్డి ధనలక్ష్మి. బోధన్ మండలంలోని ఆచన్‌పల్లి గ్రామం. ఈమెది పేద, మధ్య తరగతి కుటుంబం. వీరికి సొంత పొలం లేదు. భర్త వ్యవసాయం మీద మక్కువతో ప్రతియేటా రెండు, మూడు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటాడు. తన భర్తకు అండగా నిలవాలనుకుంది. ఇంటి వద్ద మూడు పాడి గేదెలు, ఒక ఆవును పోషిస్తోంది. భర్త తీసుకునే కౌలు పొలంలో ఎకరం వరకు పచ్చి గడ్డిని సాగు చేస్తూ పాడి గేదెల పోషణపై దృష్టి సారించింది. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు పాడి గేదెల సంరక్షణను చూసుకుంటుంది. ప్రతిరోజు గేదెలను వభ్రం చేయడం, వాటికి కావాల్సిన దాణ, గడ్డి టైంకు అందిచడం, ఉదయం, సాయంత్రం పాలు తీసి దగ్గరలోని పాల కేంద్రంలో అమ్ముతుంటారు. ప్రతి రోజు గేదెల నుంచి సుమారు 15 నుంచి 18 లీటర్ల పాలు వస్తాయని ధనలక్ష్మి చెబుతోంది. పాలన కేంద్రం రూ. 45 నుంచి రూ. 50లకు అమ్ముతున్నామని, పాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకు ఉపయోగిస్తూ కుటుంబ పోషణలో పాలు పంచుకుంటూ భర్తకు బాసటగా నిలుస్తోంది. మొక్కవోని ధైర్యంతో.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి చెందిన డోకూరి శోభ, రవీందర్ రెడ్డి దంపతులు. వీరిది మధ్య తరగతి కుటుంబం. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రవీందర్ రెడ్డి తన భార్య శోభతో కలిసి వారికున్న నాలుగున్నర ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలను పండిస్తూ జీవనాన్ని సాగించారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా రవీందర్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చాలా రోజుల పాటు మంచం పట్టిన భర్తకు అన్ని సేవలు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. తొమ్మిదేళ్ల క్రితం భర్త మరణించాడు. అప్పుడు కుమారుడు నితిన్ పదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె నిఖిత 8వ తరగతి చదువుతుంది. మగ దిక్కులేకపోవడంతో ఇద్దరు పిల్లలను పెంచి పోషించడం ఎలా అని తరచూ మదనపడుతుండేది. ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగింది. ఈ క్రమంలో దు:ఖాన్ని దిగమింగి మొక్కవోని ధైర్యంతో పిల్లల చదువుకు ఆటంకం కలగనీయకుండా చదివించింది. భర్త కొనసాగించిన వృత్తి అయినా వ్యవసాయం పనులు చేస్తూ పిల్లలను చదివించింది. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్రమేల్కొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి నీళ్ల పారకం చూసుకుంటూ మంచి దిగుబడి సాధిస్తుంది. భర్త లేని లోటును తీరుస్తుంది. ఇద్దరు పిల్లలను చూసుకుంటోంది. కుమారుడు నితిన్ ఇంటర్ చదువుతుండగానే ఆర్మీలో ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం కుమార్తె నిఖిత ఎంబీఏ చదువుతుంది. పిల్లలను గొప్ప ప్రయోజకులను చేయడమే నా లక్ష్యమంటుంది శోభ. భర్త ఆశయాన్ని బతికిస్తూ.. మోర్తాడ్(బాల్కొండ): వ్యవసాయంతో పది మందికి పట్టెడు అన్నం పెట్టవచ్చనే భావనతో నష్టమైనా, కష్టమైనా వ్యవసాయాన్ని వదలకుండా తన తుది శ్వాస వరకు వ్యవసాయమే ఊపిరిగా బతికిన తన భర్త ఆశయానికి ప్రతి రూపం ఇచ్చింది మోర్తాడ్ మండలం దొన్కల్ కు చెందిన మహిళా రైతు కౌసల్య. దొన్కల్కు చెందిన రైతు కుకునూర్ చిన్నయ్య వ్యవసాయాన్ని నమ్ముకుని రైతు నాయకుడిగా పేరు సంపాదించారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వ్యవసాయ వృత్తినే నమ్ముకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఏడేళ్ల కింద చిన్నయ్య మరణించాడు. తన భర్త మరణంతో కౌసల్యకు తీరని లోటు ఏర్పడింది. అయితే తన భర్త తనతో వ్యవసాయం గురించి చెప్పిన ప్రతిమాటను తన మదిలో నిలుపుకుంది. తన భర్త మరణం వల్ల వ్యవసాయం కుంటు పడకూడదని భా వించి తమకు ఉన్న 12 ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న, ఎర్రజొ న్న, సోయా, సజ్జ, వరి పంటలను సాగు చేస్తోంది. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించింది. ఈ మహిళా రైతు పెద్దకొడుకు రాజశేఖర్‌రెడ్డి ఐర్లాండ్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా, చిన్న కొడుకు చంద్రకాంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తన భర్త ఆశయాన్ని బతికిస్తూ కొడుకులను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో కౌసల్య కృషి ఎంతో మందికి ఆదర్శం. పంట సాగుచేస్తూ.. మోర్తాడ్(బాల్కొండ): ఒక వైపు తన భర్త తమతో లేడనే వేదన.. మరో వైపు ఏమి తెలియని వయస్సులో ఉన్న ఇద్దరు కొడుకులు.. భర్త మరణంతో తాను కుంగిపోతే తన కొడుకులు ఏమైతారోననే ఆందోళనతో ఉన్న ఆ మహిళ గుండెను రాయి చేసుకుంది. తన భర్త తమ నుంచి భౌతికంగా దూరమైనా ఆయన మిగిల్చిన జ్ఞాపకాలతో ముందుకు సాగాలని నిశ్చయించుకుని ముందడుగు వేసింది. ఆమెనే మోర్తాడ్ మండలం దొన్కల్కు చెందిన మహిళా రైతు లక్ష్మి. తన భర్త రాజేందర్, తనకు చదువు రాకపోయినా తమ కొడుకులు మాత్రం తమలా ఉండిపోకూడదనే ఉద్దేశంతో వారిని ఉన్నత చదువులు చదివించింది. సమాజంలో తమ కొడుకులకు ఒక మంచి స్థానాన్ని సంపాదించి పెట్టింది. లక్ష్మి తమకు ఉన్న 15 ఎకరాల భూమిలో కూలీల సహాయంతో వ్యవసాయం చేస్తూ నెట్టుకు వస్తుంది. పసుపు పంటతో పాటు, ఎర్రజొన్నలు, వరి, మొక్కజొన్న, సజ్జ, కూరగాయలను సాగిస్తూ వ్యవసాయంలో మగవారితో తాము ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తోంది. లక్ష్మి పెద్ద కొడుకు క్రాంతి కుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు రఘుదీష్ ఆస్ట్రేలియాలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. 20 ఏళ్ల నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని కొడుకులను ఎంతో ప్రయోజకులను చేసిన లక్ష్మి ఎంతో మంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తోంది. భర్తకు బాసటగా.. నస్రుల్లాబాద్: ఈ ఫొటో ఉన్న మహిళా రైతు పేరు కంది సావిత్రి.. ఈమెది నస్రుల్లాబాద్. భర్త మల్లేశ్. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి కోసం భర్త ఎనిమిదేళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లాడు. భర్త ఒక్కడే సంపాదించిన డబ్బులు సరిపోకపోవడంతో భర్తకు అండగా నిలవాలనుకుంది. తమకు రెండెకరాల భూమిలో వ్యవసాయం చేయడం ప్రారంభించింది. పొలానికి నీరు పెట్టడం, ఎరువులు చల్లడం ఇలా అన్ని పనులు చేస్తుంటుంది. ఇతరులతో సమానంగా ఎకరాకు 40 బస్తాల ధాన్యం పండిస్తుంది. భర్త పంపించే డబ్బుతో పాటు తాను వ్యవసాయం చేయగా వచ్చే ఆదాయంతో బిడ్డలను చదివిస్తూ పెంచిపోషిస్తోంది. భర్త అన్న బిడ్డలను సైతం.. భర్త తోడబుట్టిన అన్నయ్య కంది సాయిలు దంపతులు మరణించడంతో వారి ఇద్దరు అమ్మాయిలను ఒంటరి చేయకుండా తన వద్ద ఉంచుకొని తన పిల్లలతో సమానంగా చూసుకుంటోంది సావిత్రి. నాలుగేళ్ల క్రితం బావ దుబాయ్‌లో కష్టపడి పెద్ద బిడ్డ పెళ్లి చేయడం కోసం అని స్వదేశానికి వచ్చి, ఆరోగ్యం క్షీణించి మూలన పడ్డాడు. ఆ సమయంలో తోడికోడలుకు ఆసరా ఉంటూ దగ్గరుండి పెళ్లి చేయించింది. కూతురు పెళ్లి జరిగిన మూణ్నెళ్లలో తోడి కోడలు రాధ ఆత్మహత్య చేసుకొని మరణించగా మిగతా ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా కాకుండా తన సొంత పిల్లలతో సమానంగా చదివిస్తూ, పెంచి పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. బాధలను దిగమింగుకుంటూ.. మోర్తాడ్(బాల్కొండ): ఎంతో సంతోషంగా సాఫీగా సాగుతున్న తమ జీవితానికి విద్యుత్ షాక్ తీరని బాధను మిగిల్చినా, ఆ బాధను దిగమింగుకుంటూ ముందుకు సాగింది మోర్తాడ్‌కు చెందిన మహిళా రైతు తీగెల లక్ష్మి. దాదాపు 20 ఏళ్ల కింద తమ వ్యవసాయ క్షేత్రంలోని ట్రాన్స్ఫార్మర్ను మరమ్మత్తు చేసే సమయంలో షాక్‌కు గురైన లక్ష్మి భర్త లింబాద్రి తమ కళ్ల ముందే మరణించాడు. ఆ సమయంలో చిన్న వయస్సులో ఉన్న కొడుకు, కూతురు, వృద్ధులైన అత్తామామలు ఇలా కుటుంబ భారం అంతా లక్ష్మిపైనే పడింది. దుఖాన్ని దిగమింగుకుంటూ లక్ష్మి కుటుంబ భారాన్ని మీదవేసుకుని వ్యవసాయాన్ని నమ్ముకుంది. తమ వ్యవసాయక్షేత్రం లో వరి, పసుపు, ఎర్రజొన్న, మొక్కజొన్న, సజ్జ, సో యా పంటలతో పాటు కూరగాయలను సాగు చేస్తూ మగవారికి తానేమీ తీసిపోనని నిరూపించింది. కొ డుకు లింబాద్రిని ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదివిస్తుండగా, కూతురు లక్ష్మిని ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదివిస్తోంది. కుటుంబ భారాన్ని మోస్తూనే వ్యవసాయాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్న మహిళా రైతు తీగెల లక్ష్మి ఎంతో మందికి స్పూర్థిగా నిలుస్తున్నారు. కష్టాలను అధిగమిస్తేనే జీవితం ముందుకు సాగుతుందని నిరూపిస్తోంది. కష్టాలకు ఎదురొడ్డి సాక్షి, కామారెడ్డి: భర్త మరణం ఆమెను కుంగదీసినా, కన్నీళ్లను అదిమిపట్టుకుని పిల్లల కోసం బతుకుపోరాటం మొదలుపెట్టింది. తనకిష్టమైన వ్యవసాయాన్నే నమ్ముకుంది. వ్యవసాయంలో మగవాళ్లకు దీటుగా ఆమె పనులు చేస్తోంది. తాను ఒడ్లు చెక్కుకోవడం, పంటలకు ఎరువులు చల్లం, నాట్లు, కలుపు తీయడం.. ఇలా అన్ని పనులు ఒంటి చేత్తో చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఏ ఆస్తిపాస్తులు లేని రాజమణి రెక్కల కష్టం మీదనే పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేసింది. ఓ కూతురి పెళ్లి చేసిన రాజమణి, చిన్న కూతురి పెళ్లి కోసం ఆరాటపడుతోంది. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోశించుకుంటూ గ్రామస్తుల అభినందనలు పొందుతోంది కామారెడ్డి మండలం అడ్లూర్‌కు చెందిన రాజమణి. ‘నా పేరు కోమటిపల్లి రాజమణి. మా అవ్వగారు ఊరు కామారెడ్డి మండలం గూడెం. నాకు అడ్లూర్‌కు చెందిన లింగంతో ఇరువై రెండేండ్ల కిందట పెండ్లి అయ్యింది. ఇద్దరు బిడ్డెలు. చిన్న బిడ్డె పద్మ పదిహేను నెలల పిల్ల. పెద్దది పుష్పకు మూడేండ్లు అనుకుంట. మా ఆయనకు గుండెనొప్పి అచ్చి సచ్చిపోయిండు. అప్పటిదాకా ఇద్దరాలుమొగళ్లం కైకిలుగంబలి చేసుకుని బతికెటోళ్లం. ఇద్దరం కష్టపడితే ఇల్లు నడుస్తుండే. ఆయన పోయినంక నాకు కష్టాలు పెరిగినయి. చంటి పిల్లలతో ఎట్ల బతకాలె అని ఎంతో మదనపడ్డ. నాకు ఎవుసం పని అంటే ఎంతో ఇష్టం. ఎవుసం పనికి కైకిలుకు పోయేదాన్ని. కొంతకాలం అట్లనే బతికిన. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవల భూమి అన్న పాలుకు తీసుకుని సొంతంగా పంట పండించాలనుకున్న. పట్నంల ఉంటున్న మా ఊరి పటేండ్ల భూమిని అడిగితే వాళ్లు ఇచ్చిండ్రు. నాలుగెకరాలు ఉంటది. ఒక పాలు వాళ్లకు, రెండు పాళ్లు నాకు. రాత్రింబవళ్లు కష్టపడుకుంట వానకాలం, యాసంగి పంటలు తీస్తున్న. ఒక పంట దెబ్బతిన్నా, రెండో పంట మంచిగ పండేది. పిల్లలను నాతోటి అయిన కాడికి సదిపిచ్చి న. పెద్దమ్మాయి పుష్ప ఇంటర్‌దాకా సదివింది. సంబంధం చూసి పెండ్లి జేసిన. ఆమెకు ఇద్దరు పిల్లలు. చిన్నబిడ్డె పద్మ ఇప్పుడు డిగ్రీ సదువుతుంది. బిడ్డె పెళ్లి చేయాలంటే ఐదారు లక్షలు రూపాలు ఖర్చయితున్నయి. ఒక్కదాన్నే అన్ని పనులు జేయాలె. నా బిడ్డె గూడ సెలవు దినాలల్ల నాకు సాయంగా నాతోని పొలం కాడికి అస్తున్నది. ఆమెకు లగ్గం చేసి ఓ అయ్య చేతిల పెడితే నాకు ఎంతన్న తిరం అయితది. మొగోని కష్టమంతా జేస్కుంట అస్తున్న. నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు. ఒక చిన్న రూము ఉన్నది. అండ్లనే ఉంట. సొంతంగా గంటెడు భూమి గూడ లేదు. సర్కారోళ్లు ఎవుసం జేసుకునేందుకు ఇంత భూమి ఇస్తే మంచిగుండని మస్తు సార్ల దరకాస్తు బెట్టిన. కాని మా ఊళ్లె భూమి దొరకలేదని ఇస్తలేరు. యాడ భూమి దొర్కలేదు. ఇగ లాభం లేదని, పాలుకు వట్టుకుని జేస్కుంటున్న’అని తన జీవన గమనాన్ని వెలిబుచ్చింది. -
సాగులో సిరులు పండిస్తున్నారు
తాగుడుకు బానిసై ఒకరు.. విద్యుదాఘాతానికి గురై మరొకరు.. మనస్తాపంతో ఇంకొకరు..! ఇలా వేర్వేరు కారణాలతో ఇంటి యజమానులు కుటుంబాన్ని వదిలేసి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ఆశయం.. పలువురు మహిళలను ముందుకు నడిపించింది. కన్నీళ్లను దిగమింగి.. కష్టాలకు ఎదురొడ్డి వారు సాగుబాట పట్టారు. భూమాతను నమ్ముకుని వ్యవసాయ రంగంలో మేము సైతం అంటూ దూసుకెళ్తున్నారు.. పిల్లలను చక్కగా చదివిస్తూ.. పెళ్లిళ్లు చేయిస్తూ.. తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు మహిళా రైతుల విజయప్రస్థానంపై ప్రత్యేక కథనం. శభాష్ లత భీమదేవరపల్లి(హుస్నాబాద్): ఆమె నాగలి దున్నుతోంది.. గొర్రు కొడుతోంది.. పురుషులతో సమానంగా ప్రతి వ్యవసాయ పనిని చేస్తోంది.. ఏడుగురు ఆడపిల్లలున్న కుటుం బంలో ఒక్కతే పలుగు, పార పట్టింది.. తండ్రి, భర్త మరణించినా.. మనోధైర్యంతో కుటుంబభారాన్ని భుజాలపై వేసుకుంది.. వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు పాటిస్తూ నేటితరానికి ఆదర్శంగా నిలు స్తోంది ఓ మహిళా రైతు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లికి చెందిన తోట రాజయ్య–రాజమ్మ దంపతులకు ఏడుగురు కూతుర్లు ఉన్నారు. వీరికి నాలుగెకరాల భూమి ఉంది. అయితే రాజయ్య ఆరో కూతురు లత తనకు ఏడేళ్ల వయస్సు నుంచే తండ్రితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లేది. కాగా, రాజయ్య వ్యవసాయం చేసుకుంటూనే ఐదుగురు కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించారు. 14 ఏళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో మంచం పట్టాడు. అప్పటినుంచి లత వ్యవసాయ పనులు చేయడం ప్రారంభించింది. తండ్రి కుదుట పడేందుకు పలు ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ఆయన 2004లో మృతి చెందాడు. తండ్రి మరణంతో లత జీవితం పూర్తిగా వ్యవసాయానికే అంకితమైంది. ఆ సమయంలోనే నాగలి దున్నడం, గొర్రు కొట్టడం తదితర పనులు నేర్చుకుంది. అప్పటి నుంచే ఇంటికి పెద్ద దిక్కుగా మారి ఆర్థిక వ్యవహారాలన్ని కూడా ఆమె చూసుకునేది. అక్క, బావలను పండుగలకు ఆహ్వానించడం, శుభకార్యాలు నిర్వహిస్తూ ఉండేది. వివాహం.. ఇంటికి మగ దిక్కు ఉండాలనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్‌కు చెందిన సంపత్తో గత 8 ఏళ్ల క్రితం లతకు వివాహమైంది. ఈ సందర్భంగా సంపత్‌ను ఇల్లరికం తీసుకొచ్చారు. కొద్దికాలాని కి కుమారుడు అవినాష్ జన్మించాడు. అయితే ఆర్థిక ఇబ్భందుల కారణంగా భర్త సంపత్ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ వైపు తండ్రి, మరో వైపు భర్త చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన లత కొన్ని రోజులకు గుండె ధైర్యం తెచ్చుకుని ముందుకుసాగింది. చెల్లి, అమ్మ, కుమారుడి పోషణకు తిరిగి వ్యవసాయ పనులు ప్రారంభించిం ది. కాగా, లత.. తల్లి రాజమ్మ కిడ్నీ వ్యాధితో అనారోగ్యబారిన పడగా ఆమెకు చికిత్స చేయించింది. ఆమె ఏడా ది క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందింది. లత తన చెల్లె మాధవిని పీజీతో పాటుగా బీఈడీ పూర్తి చేయించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆమెకు డీఎస్సీ కోచింగ్ ఇప్పిస్తోంది. ఉన్న ఎకరంలో వరి, మరో ఎకరంలో మొక్కజొన్న సాగు చేస్తూనే మూడు పాడి గేదెలను పెంచుతూ జీవిస్తుంది. కష్టపడి పని చేస్తా.. నన్ను ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా మనోధైర్యంతో ముందుకు వెళ్తున్నా. చెల్లెలు మాధవికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమెకు పెళ్లి చేసే బాధ్యత నాపై ఉంది. తర్వాత నా కుమారుడు అవినాష్‌ను కష్టపడి ఉన్నత చదువులు చదివిస్తా. ప్రభుత్వం నాకు ఏదైనా సాయం అందించాలి. –తోట లత సలాం.. శకుంతల ఏటూరునాగారం: తాగుడుకు బానిసై భర్త ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఓ మహిళ తన పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. భూమాతను నమ్ముకుని అహర్నిషలు శ్రమిస్తూ వివిధ రకాల పంటలను పండిస్తోంది. అందుబాటులో ఉన్న వనరులతో పిల్లలను మంచిగా చదివిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం రాంనగర్‌కు చెందిన గగ్గూరి రాంబాబు, శకుంతల దంపతులకు లక్ష్మీకాంత, స్వప్న, తిరుపతమ్మ, సంధ్యారాణి నలుగురు కూతుళ్లు ఉన్నారు. వీరికి మూడెకరాల భూమి ఉంది. అయితే నలుగురు పిల్లలతో హాయిగా ఉంటున్న సమయంలో రాంబాబు తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో శకుంతల గుండెలవిసేలా రోదించింది. చిన్న పిల్లలను పట్టుకుని కాలం ఎలా వెళ్లతీయాలని లోలోపల కుమిలిపోతుండేది. అయితే కళ్ల ముందే కనిపిస్తున్న కూతుర్లకు మంచి భవిష్యత్ కల్పించాలంటే తాను ఏదైనా పనులు చేయాలని భావించింది. దీంతో 15 ఏళ్ల క్రితం వ్యవసాయరంగంలోకి దిగింది. సాగుపనులను నిర్విరామంగా చేస్తూ దూసుకుపోతోంది. తనకున్న 3 ఎకరాల్లో వరి, మిరప పంటలను పండిస్తూ పిల్లలను చదివిస్తోంది. కాగా, పెద్ద కూతురు లక్ష్మీకాంతను పదో తరగతి వరకు చదివించి 2012లో వివాహం చేసింది. రెండో కూతురు స్వప్నను ఇంటర్ వరకు చదివించి 2014లో, మూడో కూతురు తిరుపతమ్మను ఇంటర్ వరకు చదివించి 2016లో పెళ్లి జరిపించింది. ప్రస్తుతం నాలుగో కుమార్తె సంధ్యారాణి వరంగల్‌లోని ఓ ప్రైవే ట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివిస్తోంది. శకుంతల వరి, మిరప పంటలను సాగు చేసేందుకు మహిళా సంఘాల వద్ద, అడ్తి వ్యాపారస్తులు, బ్యాంకులో నుంచి ఏటా రుణం తీసుకుంటుంది. ఇంటిపెద్ద లేకపోయినా నలుగురు ఆడపిల్లలను చదివించి పెద్దచేసి శకుంతల తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. భళా.. భాగ్యలక్ష్మి పరకాల రూరల్: చిన్న కుటుంబం, ఇద్దరు కూతుర్లు, భర్తతో సంతోషంగా కాలం గడుపుతున్న సమయంలో విధి ఆమెపై విషం చిమ్మింది. వ్యవసాయ పనులు చేస్తూ హాయిగా కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటి పెద్దను కరెంట్ కాటేసి మంచానికి పరిమితం చేసింది. అయితే తమకున్న ఆస్తుల్లో కొంత అమ్ముకుని భర్తకు చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. నాలుగేళ్లు నరకయాతన అనుభవించిన ఇంటి యజమాని కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. గుండెను రాయి చేసుకుని ఓ మాతృమూర్తి పిల్లల భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. పరకాల మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పల్లెబోయిన ఎల్లస్వామితో భాగ్యలక్ష్మీకి 1997లో వివాహమైంది. అనంతరం వీరికి ఇద్దరు కూతుర్లు రాఘవి, రవళి జన్మించారు. అయితే తనకున్న రెండెకరాల పది గుంటల భూమిలో వ్యవసాయం చేసుకుం టూ భార్య, పిల్లలను పోషించుకుంటున్న క్రమంలో ఎల్లస్వామి 2007 ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో భాగ్యలక్ష్మి తన భర్తను బాగు చేసుకునేందుకు ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో 2011లో ఎల్లస్వామి మృతి చెందాడు. భూమాతను నమ్ముకుని.. ఎల్లస్వామి చనిపోయిన సమయంలో పెద్ద కూతురు రాఘవికి 9 ఏళ్లు, చిన్న కూతురుకి రవళికి 3 ఏళ్లు ఉన్నాయి. దీంతో కుటుంబ బాధ్యతలను భాగ్యలక్ష్మి తన భుజాలపై వేసుకుని ముందుకుసాగింది. ఉన్న భూమిలో ఏటా పత్తి, వరిని పండిస్తూ ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. ప్రస్తుతం పెద్ద కూతురు కస్తూర్బా పాఠశాలలో తొమ్మిది, చిన్న కూతురు నాగారం ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ భర్త చనిపోయినప్పుడు తీవ్రంగా కుం గిపోయానని, కూతుర్లలోనే భర్తను చూసుకుని ముందుకు సాగుతున్నానని చెప్పారు. ఇద్దరు పిల్లల ను విద్యావంతులను చేస్తానని ఆమె పేర్కొన్నారు. -
వైకల్యం ఓడింది..ఆశయం గెలిచింది
ఆమె చిన్నతనంలోనే పోలియో బారిన పడింది. నడిచేందుకు కాళ్లు సహకరించలే. చదివేందుకు ఇంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించలే. పేదరికంలో పుట్టిన ఆడబిడ్డగా అష్టకష్టాలు పడింది. అయినా జంకలే. పట్టుదల, ఆత్మస్థైర్యంతో..ఉన్నత కోర్సులు పూర్తి చేసింది. కసితో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కొలువు కొట్టి ఆదర్శ బోధనతో తనలాంటి ఎందరికో స్ఫూర్తి నింపుతోంది. టేకులపల్లి: మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న చింత వెంకటరమణ దివ్యాంగురాలు అయినప్పటికీ..ఎంతో ఆత్మవిశ్వాసంతో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. బహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతగుంపు గ్రామానికి చెందిన చింత వెంకన్న, గురువమ్మ దంపతుల పెద్ద కుమార్తె ఈమె. పుట్టుకతోనే పోలియో సోకడంతో అంగవైకల్యం బారిన పడ్డారు. పేద కుటుంబం కావడంతో 1–10 తరగతి వరకు కురవిలో హాస్టల్లో ఉండి చదువుకున్నారు. బయ్యారం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సీఈసీ గ్రూపు చదివారు. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువులకు నేరుగా కళాశాలలో చేరడం కష్టంగా భావించి..దూరవిద్య (ఓపెన్)లో ఎంఏ తెలుగు కోర్సు, అనంతరం 2008–09లో బీఈడీ పూర్తి చేశారు. 2013లో నిర్వహించిన ఏజెన్సీ డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యారు. టేకులపల్లి మండలం కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో అదే సంవత్సరం ఆగస్టులో విధుల్లో చేరి..ఇప్పటి వరకు విజయవంతంగా బోధిస్తున్నారు. బోధనలోనూ ప్రత్యేకమే.. ఓ కర్ర సాయంతో నడుచుకుంటూ..తరగతి గదికి వస్తారు. తనకు కేటాయించిన క్లాసుల్లో ఎంతో శ్రద్ధగా బోధిస్తోంది. పుస్తక జ్ఞానమే కాకుండా..సమాజంలోని కొన్ని ఉదాహరణలు వివరిస్తూ, సామాజిక అంశాలను కూడా నేర్పుతున్నారు. మాతృభాష అయిన తెలుగులో విద్యార్థులు ఎవరూ వెనుకబడి ఉండకుండా ప్రోత్సహిస్తున్నారు. పద్యాలు అలవోకగా చెబుతూ..పిల్లల చేత సాధన చేయిస్తున్నారు. పాఠాలు విద్యార్థులకు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చెబుతూ విశేష ప్రతిభను చాటుతున్నారు. చేతి రాత కూడా అందంగా ఉండేలా మెళకువలను బోధిస్తూ తీర్చిదిద్దుతున్నారు. మొక్కవోని దీక్షతో, ధైర్యంగా ముందుకు సాగుతున్న వెంకటరమణ ఇటీవలె ఓ అనాథ అయిన సారయ్యను వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వైకల్యం ఉందని దిగాలు చెందొద్దని, తమకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని..సాధన చేయాలని ఆమె సూచిస్తున్నారు. -
విధిని ఎదిరించి..
చెన్నూర్ రూరల్: తోటి పిల్లలు చెంగు చెంగున ఎగురుతుంటే చిన్ని మనసు బాధపడింది. ఆడపిల్ల.. పైగా రెండు కాళ్లు లేవు.. ఎలా బతుకుతుందో ఏమోనని సమాజం జాలిపడుతుంటే మరింత పట్టుదల పెరిగింది. ఎలాగైనా తన అంగవైకల్యాన్ని జయించాలని నిశ్చయించుకుంది. కన్న వాళ్లకు భారమవకూడదని స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుంది. అనంతరం దూరవిద్య ద్వారా పదో తరగతి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఆత్మస్థైర్యంతో అంగవైకల్యాన్ని జయించి.. వనితాలోకానికి ఆదర్శంగా నిలిచిన లక్ష్మి విజయమంత్రం ఆమె మాటల్లోనే.. మాది మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామం. అమ్మానాన్న ఎన్నం మల్లక్క, సమ్మయ్య. మేం మొత్తం ఆరుగురం సంతానం. వారిలో నలుగురు అమ్మాయిలం, ఇద్దరు అబ్బాయిలు. నేను రెండో కుమార్తెను. చిన్న వయస్సులోనే నాకు పోలియో సోకి రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. మాది నిరుపేద కుటుంబం. నా చిన్నతనంలో ఒక్కో రోజు పస్తులు కూడా ఉండాల్సి వచ్చేది. అంగవైకల్యం ఉండడంతో మనసులో చదువుకోవాలని ఉన్నా చదువుకోలేకపోయాను. అంగవైకల్యం ఉందని నన్నెప్పుడూ ఇంట్లో తిట్టలేదు. మా వాళ్లంతా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ నేను ఎన్ని రోజులు వారికి భారంగా ఉండాలని అనిపించింది. ‘కుట్టు’ నేర్చుకుని.. సొంత కాళ్లపై నిలబడ్డా.. తల్లిదండ్రులకు ఏదో విధంగా నా వంతుగా సహాయం అందించాలనుకున్నా. ఆతర్వాత మిషన్ నేర్చుకుని అప్పు చేసి కుట్టుమిషన్ కొనుకున్నా. గ్రామంలోని బస్‌స్టాప్ సమీపంలో రూ.1000తో ఓ గదిని అద్దెకు తీసుకున్నా. చిన్నగా లేడీస్ టైలర్ ఏర్పాటు చేశా. దుస్తులు కుట్టగా వచ్చిన సొమ్ముతో అదే గదిలో చిన్నగా కంగన్‌హాల్, బట్టల షాప్‌ను ఏర్పాటు చేశా. ఆ తర్వాత కుటుంబానికి కొంత ఆసరయ్యా. ఇంకా ఏదో చేయాలనే తపన నన్ను వేధించేది. గ్రామంలోని మహిళలకు, యువతులకు కుట్టులో శిక్షణ ఇచ్చా. అంతటితో ఆగకుండా చిన్నప్పుడు చదువుకోవాలనే ఆశను నెరవేర్చుకోవాలనుకున్నా. దూరవిద్యలో చదువుకున్నా.. 2012లో దూరవిద్యలో పదో తరగతి చదివా. ప్రతీ ఆదివారం చెన్నూర్‌లోని బాలికల పాఠశాలలో ఓపెన్ తరగతులకు 40 వారాలు హాజరయ్యా. పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించా. 2013లో మా నాన్న సమ్మయ్య మృతి చెందాడు. 2016 ఏప్రిల్‌లో వికలాంగుల కోటా కింద మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించా. ఆగçస్టు 8న ఉద్యోగంలో చేరి ప్రస్తుతం రూ.15వేల వేతనంతో ఉద్యోగం చేస్తున్నా. అమ్మా, తమ్ముళ్లకు చేదోడు, వాదోడుగా ఉంటున్నా. అంగవైకల్యం మనసుకే కానీ మనిషికి కాదు. వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. కుటుంబ అండ కూడా ఉండాలి.