సాగుమడిలో ధీర వనిత | women farmers success stories in nizamabad | Sakshi
Sakshi News home page

సాగుమడిలో ధీర వనిత

Published Wed, Feb 14 2018 1:00 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

women farmers success stories in nizamabad - Sakshi

నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వ్యవసాయంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. భర్తకు చేదోడుగా ఉంటూ వ్యవ‘సాయం’ చేస్తున్న వారు కొందరైతే.. కుటుంబ పెద్ద దూరమై, బతుకు భారంగా మారిన పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో ఇంటిని నడిపిస్తున్న వారు ఎందరో ఉన్నారు.
 

కూతుళ్లకు ఉన్నత విద్య

ఆర్మూర్‌: అక్షరాలు రాకపోయినా చదువు విలువ తెలిసిన ఆ కన్నతల్లి వ్యవసాయాన్నే నమ్ముకొని ఇద్దరు కూతుళ్లకు ఉన్నత చదువులు చెప్పించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె కష్టానికి ప్రతిఫలంగా ఆ ఇద్దరు కూతుళ్లలో ఒకరు ఎంబీబీఎస్, మరొకరు కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కన్నవారి కలలు నిజం చేశారు. కూతుళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయి అమెరికాలో స్థిరపడ్డారు. అయినా ఇద్దరు పిల్లలు ఎప్పడు తల్లి వద్దకు వచ్చి వెళ్తూ ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. 

ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌కు చెందిన సామ నర్సయ్య, గన్నుబాయి దంపతులకు నలుగురు ఆడపిల్లలు. కొడుకు లేకపోవడంతో పెద్ద కూతురైన గంగుబాయికి ఊర్లోనే సంబంధం చూసి గడ్డం చిన్న గంగారెడ్డికి ఇచ్చి వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. వ్యవసాయంపై వచ్చిన ఆదాయంతో మిగిలిన ముగ్గురు కూతుళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశారు. చిన్న గంగారెడ్డి, గంగుబాయి దంపతులకు ఇద్దరు కూతుళ్లు స్వర్ణరెడ్డి, శ్వేతరెడ్డి పుట్టారు. ఒక కొడుకు పుట్టి చనిపోయాడు. కొద్ది రోజులకే ఇంటికి మగదిక్కైన తండ్రి నర్సయ్యతో పాటు అనారోగ్యంతో చిన్న గంగారెడ్డి మృత్యువాత పడ్డారు. దీంతో ఇంటి భారం గంగుబాయిపై పడింది. ప్రధానంగా వ్యవసాయాధారిత కుటుంబమే కావడం, తల్లిదండ్రులతో వ్యవసాయం పనులకు వెళ్లిన అనుభవం గంగుబాయి జీవనోపాధికి మార్గం చూపాయి. పిల్లలిద్దరినీ బాగా చదివించాలనే భర్త కోరిక నెరవేర్చాలనే సంకల్పం మాత్రమే ఆమెకు మిగిలింది. అందుకోసం రేయింబగళ్లు కష్టపడింది. తానుపడే కష్టం పిల్లలు పడవద్దని వారిద్దరిని హాస్టల్‌లో ఉంచి చదివిపించింది. గ్రామంలో తండ్రి కట్టించిన ఇంట్లోనే ఉండేది. వ్యవసాయం పనులన్నీ గంగుబాయే చేసుకొనేది. పంటలు వేయడం మొదలుకొని పండించిన పంటను మార్కెట్‌ యార్డులో అమ్మాలన్నా, కూరగాయలను మార్కెట్‌కు తరలించాలన్నా అన్నీ తానే చూసుకొనేది. 2007 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నుంచి ప్రశంసాపత్రం అందుకుంది. 


 

అమెరికాలో కూతుళ్లు.. 
తల్లి కష్టాన్ని గుర్తించిన ఇద్దరు ఆడపిల్లలు నేడు ఉన్నత చదువులను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డారు. పెద్ద కూతురు స్వర్ణరెడ్డి గుంటూర్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. చిన్న కూతురు శ్వేత రెడ్డి నెల్లూర్‌లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదివింది. వీరిద్దరికి పెళ్లిళ్లుకావడంతో ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. తల్లి తమ కోసం పడ్డ కష్టాన్ని చూసి ఆ కూతుళ్తు తల్లి వద్దకు ఎప్పుడు వస్తుంటారు. తల్లిబాగోగులు చూసుకుంటున్నారు. 

వ్యవసాయాన్నే నమ్ముకుని.. 

నిజాంసాగర్‌(జుక్కల్‌): కట్టుకున్న భర్త దూరమవడంతో ఇద్దరు కూతుళ్ల భారం ఆమెపై పడింది. దీంతో భర్త పోయిన బాధను దిగమింగుకుంది. వ్యవసాయాన్ని నమ్ముకుంది. తనకు ఉన్న రెండు ఎకరాల భూమిని సొంతంగా వ్యవసాయం చేస్తూ, పంట పండిస్తోంది. పురుషులతో సమానంగా అన్ని పొలం పనులు చేసుకుంటుంది నిజాంసాగర్‌ మండలం తున్కిపల్లికి చెందిన మామిడి సంగవ్వ. నిజాంసాగర్‌ మండలం తున్కిపల్లి గ్రామానికి చెందిన మామిడి పెంటయ్య, భూమవ్వ దంపతులకు ముగ్గురు కూతుళ్లు జన్మించారు. వీరికి మగ సంతానం లేదు. దీంతో పెద్దకూతురు మామిడి సంగవ్వను వెంకటనారాయణకు వచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. రెండో కూతురు గంగవ్వను పెళ్లి చేసి ఇవ్వగా, చిన్నకూతురు మృతి చెందింది. సంగవ్వ, వెంకటనారాయణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు సుజాత, పద్మ జన్మించారు. భర్త మృతిచెందడంతో తల్లిదండ్రులు, కూతుళ్ల సంరక్షణ భారం సంగవ్వపై పడింది. దీంతో సంగవ్వ ధైర్యాన్ని కూడగట్టుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబ పోషణను తన భుజాలపై వేసుకుంది.

కొన్నాళ్లకు తల్లిదండ్రులు తనువు చాలించారు. కొంత కాలానికి పెద్ద కూతురు సుజాతకు అంజయ్యతో వివాహం చేసి ఇల్లరికం తెచ్చింది. చిన్నకూతురు పద్మ వివాహం జరిపించింది. ఇంట్లోనే ఇల్లరికం ఉన్న పెద్ద కూతురు సుజాత, అంజయ్య దంపతులకు కుమార్తె మమత, కుమారులు అనిల్‌కుమార్, సాయికుమారు ఉన్నారు. పిల్లలు పెరుగుతున్న సమయంలో మరోమారు విధి వక్రించింది. దురదృష్టవశాత్తు అల్లుడు అంజయ్య ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో సంగవ్వకు మరిన్ని కష్టాలు పెరిగాయి. వయస్సు పెరిగినా అధైర్యపడకుండా వ్యవసాయ పనులు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో ఉన్నదాంట్లో మనువళ్లు, మనవరాలిని చదివిస్తోంది. భర్త దూరమైన కూతురి ఆలనా పాలన చూస్తోంది. ఇలా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి బాధలను దిగమింగుకుని, వ్యవసాయాన్ని నమ్ముకుని జీవితంలో ముందుకు సాగుతూ పలువురు అభినందనలు పొందుతోంది. 


కష్టాలు ఎదురొడ్డి పోరాడుతున్నా.. : మామిడి సంగవ్వ 
చిన్నప్పటి నుంచి కష్టాలను చూస్తున్నా. ఇప్పటికి కష్టాలు తీరడం లేదు. తల్లిదండ్రులతో పాటు తాళికట్టిన భర్త దూరం కావడం, కన్న కూతురికి పెళ్లి చేసినా అల్లుడు అకాల మరణంతో కుటుంబంలో బోలెడు కష్టాలు వచ్చాయి. పిల్లలకు భవిష్యత్తు కోసం కూలినాలి పనిచేస్తూ కష్టపడుతున్నా. వారి ఆలనాపాలనా చూసుకుంటున్నా.  


40 ఏళ్లుగా వ్యవసాయం

బీర్కూర్‌: మండల కేంద్రానికి చెందిన మేత్రి కుర్మసాయవ్వ గత 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏమాత్రం అక్షర జ్ఞానం లేని సాయవ్వ పొలం చూసి పంటకు ఏ రోగం వచ్చిందో.. ఏ మందు వేయాలో ఇట్టే చెప్పేస్తుంది. సాయవ్వ భర్త సాయిగొండ ఆరోగ్యం సహకరించకపోవడంతో అన్నీ తానై 10 ఎకరాల్లో వరిపంట సాగు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. నాట్లేయడం మొ దలుకుని పంటకోతకు వచ్చే వరకు అన్నీ తానై పంట సాగు చేస్తుంది. తన భర్తతో కలిసి వ్యవ సాయం చేస్తూ రెండు ఎకరాల నుంచి ఈరోజు 10 ఎకరాలకు ఆసామి అయ్యానంటూ సగర్వంగా చెప్పుకుంటుంది. భూతల్లి నమ్ముకున్న వారు ఎప్పుడు నష్టపోరని, రెక్కల కష్టం ఎన్నటికీ వృథా కాదంటోంది సాయవ్వ. చదువు లేని మాలాంటి వారు ఇంటిపట్టున కూర్చునే బదులు ఇలా వ్యవసాయం చేయడంతో తప్పులేదని అంటోంది. నా వయస్సు 50 ఏళ్లకు చేరుకున్నా  పొలం గట్టుపై నిల్చుని సూచనలు ఇవ్వనని, కూలీలతో కలిసి అన్ని పనులు చేస్తానంటుంది. 

9 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు 
– సాయవ్వ, బీర్కూర్‌ 

మా అమ్మగారు చిన్న దేవాడ. నాకు 9 ఏళ్ల వయస్సులోనే బీర్కూర్‌ చెందిన సాయిగొండతో పెళ్లి జరిగింది. అప్పుడు నా పెనిమిటి వయస్సు 15 ఏళ్లే. నేను చదువు కోలేదు. 12 ఏళ్ల వయస్సు నుంచే వ్యవసాయ పనులు చేయడం ప్రారంభించా. మా అత్తమామలు ఉన్నప్పుడు మాకు 2 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉంది. నేను నా పెనిమిటి బాగా కష్టపడి వ్యవసాయం చేశాం. ఐదారు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పనిచేసే వాళ్లం. తర్వాత 8 ఎకరాల వరకు పొలం కొన్నాం. డాబా ఇల్లు కట్టుకున్నాం. మా ఆయనకు నాలుగేళ్లుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో మొత్తం 10 ఎకరాల వ్యవసాయం నేనే చూసుకుంటున్నా. మొదట్నుంచి కూడా నాట్లేయడం, కలుపుతీత, పంటకోత వరకు అన్ని పనులకు కైకిలోళ్లను నేనే పిలుస్తా. బిడ్డ పెళ్లి చేశాం. కొడుకు బీరప్ప ప్రయివేట్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. 


భర్తకు అండగా పశుపోషణ

బోధన్‌రూరల్‌(బోధన్‌): ఈ మహిళ పేరు లోకిరెడ్డి ధనలక్ష్మి. బోధన్‌ మండలంలోని ఆచన్‌పల్లి గ్రామం. ఈమెది పేద, మధ్య తరగతి కుటుంబం. వీరికి సొంత పొలం లేదు. భర్త వ్యవసాయం మీద మక్కువతో ప్రతియేటా రెండు, మూడు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటాడు. తన భర్తకు అండగా నిలవాలనుకుంది. ఇంటి వద్ద మూడు పాడి గేదెలు, ఒక ఆవును పోషిస్తోంది. భర్త తీసుకునే కౌలు పొలంలో ఎకరం వరకు పచ్చి గడ్డిని సాగు చేస్తూ పాడి గేదెల పోషణపై దృష్టి సారించింది. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు పాడి గేదెల సంరక్షణను చూసుకుంటుంది. ప్రతిరోజు గేదెలను వభ్రం చేయడం, వాటికి కావాల్సిన దాణ, గడ్డి టైంకు అందిచడం, ఉదయం, సాయంత్రం పాలు తీసి దగ్గరలోని పాల కేంద్రంలో అమ్ముతుంటారు. ప్రతి రోజు గేదెల నుంచి సుమారు 15 నుంచి 18 లీటర్ల పాలు వస్తాయని ధనలక్ష్మి చెబుతోంది. పాలన కేంద్రం రూ. 45 నుంచి రూ. 50లకు అమ్ముతున్నామని, పాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకు ఉపయోగిస్తూ కుటుంబ పోషణలో పాలు పంచుకుంటూ భర్తకు బాసటగా నిలుస్తోంది.


మొక్కవోని ధైర్యంతో..

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): సదాశివనగర్‌ మండలం మర్కల్‌ గ్రామానికి చెందిన డోకూరి శోభ, రవీందర్‌ రెడ్డి దంపతులు. వీరిది మధ్య తరగతి కుటుంబం. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రవీందర్‌ రెడ్డి తన భార్య శోభతో కలిసి వారికున్న నాలుగున్నర ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలను పండిస్తూ జీవనాన్ని సాగించారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా రవీందర్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చాలా రోజుల పాటు మంచం పట్టిన భర్తకు అన్ని సేవలు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. తొమ్మిదేళ్ల క్రితం భర్త మరణించాడు. అప్పుడు కుమారుడు నితిన్‌ పదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె నిఖిత 8వ తరగతి చదువుతుంది. మగ దిక్కులేకపోవడంతో ఇద్దరు పిల్లలను పెంచి పోషించడం ఎలా అని తరచూ మదనపడుతుండేది. ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగింది. ఈ క్రమంలో దు:ఖాన్ని దిగమింగి మొక్కవోని ధైర్యంతో పిల్లల చదువుకు ఆటంకం కలగనీయకుండా చదివించింది. భర్త కొనసాగించిన వృత్తి అయినా వ్యవసాయం పనులు చేస్తూ పిల్లలను చదివించింది. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్రమేల్కొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి నీళ్ల పారకం చూసుకుంటూ మంచి దిగుబడి సాధిస్తుంది. భర్త లేని లోటును తీరుస్తుంది. ఇద్దరు పిల్లలను చూసుకుంటోంది. కుమారుడు నితిన్‌ ఇంటర్‌ చదువుతుండగానే ఆర్మీలో ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం కుమార్తె నిఖిత ఎంబీఏ చదువుతుంది. పిల్లలను గొప్ప ప్రయోజకులను చేయడమే నా లక్ష్యమంటుంది శోభ.  


భర్త ఆశయాన్ని బతికిస్తూ..

మోర్తాడ్‌(బాల్కొండ): వ్యవసాయంతో పది మందికి పట్టెడు అన్నం పెట్టవచ్చనే భావనతో నష్టమైనా, కష్టమైనా వ్యవసాయాన్ని వదలకుండా తన తుది శ్వాస వరకు వ్యవసాయమే ఊపిరిగా బతికిన తన భర్త ఆశయానికి ప్రతి రూపం ఇచ్చింది మోర్తాడ్‌ మండలం దొన్కల్‌ కు చెందిన మహిళా రైతు కౌసల్య. దొన్కల్‌కు చెందిన రైతు కుకునూర్‌ చిన్నయ్య వ్యవసాయాన్ని నమ్ముకుని రైతు నాయకుడిగా పేరు సంపాదించారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వ్యవసాయ వృత్తినే నమ్ముకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఏడేళ్ల కింద చిన్నయ్య మరణించాడు. తన భర్త మరణంతో కౌసల్యకు తీరని లోటు ఏర్పడింది. అయితే తన భర్త తనతో వ్యవసాయం గురించి చెప్పిన ప్రతిమాటను తన మదిలో నిలుపుకుంది. తన భర్త మరణం వల్ల వ్యవసాయం కుంటు పడకూడదని భా వించి తమకు ఉన్న 12 ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న, ఎర్రజొ న్న, సోయా, సజ్జ, వరి పంటలను సాగు చేస్తోంది. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించింది. ఈ మహిళా రైతు పెద్దకొడుకు రాజశేఖర్‌రెడ్డి ఐర్లాండ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తుండగా, చిన్న కొడుకు చంద్రకాంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తన భర్త ఆశయాన్ని బతికిస్తూ కొడుకులను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో కౌసల్య కృషి ఎంతో మందికి ఆదర్శం.  

పంట సాగుచేస్తూ..

మోర్తాడ్‌(బాల్కొండ): ఒక వైపు తన భర్త తమతో లేడనే వేదన.. మరో వైపు ఏమి తెలియని వయస్సులో ఉన్న ఇద్దరు కొడుకులు.. భర్త మరణంతో తాను కుంగిపోతే తన కొడుకులు ఏమైతారోననే ఆందోళనతో ఉన్న ఆ మహిళ గుండెను రాయి చేసుకుంది. తన భర్త తమ నుంచి భౌతికంగా దూరమైనా ఆయన మిగిల్చిన జ్ఞాపకాలతో ముందుకు సాగాలని నిశ్చయించుకుని ముందడుగు వేసింది. ఆమెనే మోర్తాడ్‌ మండలం దొన్కల్‌కు చెందిన మహిళా రైతు లక్ష్మి. తన భర్త రాజేందర్, తనకు చదువు రాకపోయినా తమ కొడుకులు మాత్రం తమలా ఉండిపోకూడదనే ఉద్దేశంతో వారిని ఉన్నత చదువులు చదివించింది. సమాజంలో తమ కొడుకులకు ఒక మంచి స్థానాన్ని సంపాదించి పెట్టింది. లక్ష్మి తమకు ఉన్న 15 ఎకరాల భూమిలో కూలీల సహాయంతో వ్యవసాయం చేస్తూ నెట్టుకు వస్తుంది. పసుపు పంటతో పాటు, ఎర్రజొన్నలు, వరి, మొక్కజొన్న, సజ్జ, కూరగాయలను సాగిస్తూ వ్యవసాయంలో మగవారితో తాము ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తోంది. లక్ష్మి పెద్ద కొడుకు క్రాంతి కుమార్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు రఘుదీష్‌ ఆస్ట్రేలియాలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. 20 ఏళ్ల నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని కొడుకులను ఎంతో ప్రయోజకులను చేసిన లక్ష్మి ఎంతో మంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తోంది.  

భర్తకు బాసటగా..

నస్రుల్లాబాద్‌: ఈ ఫొటో ఉన్న మహిళా రైతు పేరు కంది సావిత్రి.. ఈమెది నస్రుల్లాబాద్‌. భర్త మల్లేశ్‌. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి కోసం భర్త ఎనిమిదేళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లాడు. భర్త ఒక్కడే సంపాదించిన డబ్బులు సరిపోకపోవడంతో భర్తకు అండగా నిలవాలనుకుంది. తమకు రెండెకరాల భూమిలో వ్యవసాయం చేయడం ప్రారంభించింది. పొలానికి నీరు పెట్టడం, ఎరువులు చల్లడం ఇలా అన్ని పనులు చేస్తుంటుంది. ఇతరులతో సమానంగా ఎకరాకు 40 బస్తాల ధాన్యం పండిస్తుంది. భర్త పంపించే డబ్బుతో పాటు తాను వ్యవసాయం చేయగా వచ్చే ఆదాయంతో బిడ్డలను చదివిస్తూ పెంచిపోషిస్తోంది. 

భర్త అన్న బిడ్డలను సైతం.. 
భర్త తోడబుట్టిన అన్నయ్య కంది సాయిలు దంపతులు మరణించడంతో వారి ఇద్దరు అమ్మాయిలను ఒంటరి చేయకుండా తన వద్ద ఉంచుకొని తన పిల్లలతో సమానంగా చూసుకుంటోంది సావిత్రి. నాలుగేళ్ల క్రితం బావ దుబాయ్‌లో కష్టపడి పెద్ద బిడ్డ పెళ్లి చేయడం కోసం అని స్వదేశానికి వచ్చి, ఆరోగ్యం క్షీణించి మూలన పడ్డాడు. ఆ సమయంలో తోడికోడలుకు ఆసరా ఉంటూ దగ్గరుండి పెళ్లి చేయించింది. కూతురు పెళ్లి జరిగిన మూణ్నెళ్లలో తోడి కోడలు రాధ ఆత్మహత్య చేసుకొని మరణించగా మిగతా ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా కాకుండా తన సొంత పిల్లలతో సమానంగా చదివిస్తూ, పెంచి పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.   

బాధలను దిగమింగుకుంటూ.. 

మోర్తాడ్‌(బాల్కొండ): ఎంతో సంతోషంగా సాఫీగా సాగుతున్న తమ జీవితానికి విద్యుత్‌ షాక్‌ తీరని బాధను మిగిల్చినా, ఆ బాధను దిగమింగుకుంటూ ముందుకు సాగింది మోర్తాడ్‌కు చెందిన మహిళా రైతు తీగెల లక్ష్మి. దాదాపు 20 ఏళ్ల కింద తమ వ్యవసాయ క్షేత్రంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మత్తు చేసే సమయంలో షాక్‌కు గురైన లక్ష్మి భర్త లింబాద్రి తమ కళ్ల ముందే మరణించాడు. ఆ సమయంలో చిన్న వయస్సులో ఉన్న కొడుకు, కూతురు, వృద్ధులైన అత్తామామలు ఇలా కుటుంబ భారం అంతా లక్ష్మిపైనే పడింది. దుఖాన్ని దిగమింగుకుంటూ లక్ష్మి కుటుంబ భారాన్ని మీదవేసుకుని వ్యవసాయాన్ని నమ్ముకుంది. తమ వ్యవసాయక్షేత్రం లో వరి, పసుపు, ఎర్రజొన్న, మొక్కజొన్న, సజ్జ, సో యా పంటలతో పాటు కూరగాయలను సాగు చేస్తూ మగవారికి తానేమీ తీసిపోనని నిరూపించింది. కొ డుకు లింబాద్రిని ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదివిస్తుండగా, కూతురు లక్ష్మిని ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదివిస్తోంది. కుటుంబ భారాన్ని మోస్తూనే వ్యవసాయాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్న మహిళా రైతు తీగెల లక్ష్మి ఎంతో మందికి స్పూర్థిగా నిలుస్తున్నారు. కష్టాలను అధిగమిస్తేనే జీవితం ముందుకు సాగుతుందని నిరూపిస్తోంది.

కష్టాలకు ఎదురొడ్డి

సాక్షి, కామారెడ్డి: భర్త మరణం ఆమెను కుంగదీసినా, కన్నీళ్లను అదిమిపట్టుకుని పిల్లల కోసం బతుకుపోరాటం మొదలుపెట్టింది. తనకిష్టమైన వ్యవసాయాన్నే నమ్ముకుంది. వ్యవసాయంలో మగవాళ్లకు దీటుగా ఆమె పనులు చేస్తోంది. తాను ఒడ్లు చెక్కుకోవడం, పంటలకు ఎరువులు చల్లం, నాట్లు, కలుపు తీయడం.. ఇలా అన్ని పనులు ఒంటి చేత్తో చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఏ ఆస్తిపాస్తులు లేని రాజమణి రెక్కల కష్టం మీదనే పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేసింది. ఓ కూతురి పెళ్లి చేసిన రాజమణి, చిన్న కూతురి పెళ్లి కోసం ఆరాటపడుతోంది. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోశించుకుంటూ గ్రామస్తుల అభినందనలు పొందుతోంది కామారెడ్డి మండలం అడ్లూర్‌కు చెందిన రాజమణి.

‘నా పేరు కోమటిపల్లి రాజమణి. మా అవ్వగారు ఊరు కామారెడ్డి మండలం గూడెం. నాకు అడ్లూర్‌కు చెందిన లింగంతో ఇరువై రెండేండ్ల కిందట పెండ్లి అయ్యింది. ఇద్దరు బిడ్డెలు. చిన్న బిడ్డె పద్మ పదిహేను నెలల పిల్ల. పెద్దది పుష్పకు మూడేండ్లు అనుకుంట. మా ఆయనకు గుండెనొప్పి అచ్చి సచ్చిపోయిండు. అప్పటిదాకా ఇద్దరాలుమొగళ్లం కైకిలుగంబలి చేసుకుని బతికెటోళ్లం. ఇద్దరం కష్టపడితే ఇల్లు నడుస్తుండే. ఆయన పోయినంక నాకు కష్టాలు పెరిగినయి. చంటి పిల్లలతో ఎట్ల బతకాలె అని ఎంతో మదనపడ్డ. నాకు ఎవుసం పని అంటే ఎంతో ఇష్టం. ఎవుసం పనికి          కైకిలుకు పోయేదాన్ని. కొంతకాలం అట్లనే బతికిన. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవల భూమి అన్న పాలుకు తీసుకుని సొంతంగా పంట పండించాలనుకున్న. పట్నంల ఉంటున్న మా ఊరి పటేండ్ల భూమిని అడిగితే వాళ్లు ఇచ్చిండ్రు. నాలుగెకరాలు ఉంటది. ఒక పాలు వాళ్లకు, రెండు పాళ్లు నాకు. రాత్రింబవళ్లు కష్టపడుకుంట వానకాలం, యాసంగి పంటలు తీస్తున్న. ఒక పంట దెబ్బతిన్నా, రెండో పంట మంచిగ పండేది. పిల్లలను నాతోటి అయిన కాడికి సదిపిచ్చి న. పెద్దమ్మాయి పుష్ప ఇంటర్‌దాకా సదివింది. సంబంధం చూసి పెండ్లి జేసిన. ఆమెకు ఇద్దరు పిల్లలు. చిన్నబిడ్డె పద్మ ఇప్పుడు డిగ్రీ సదువుతుంది. బిడ్డె పెళ్లి చేయాలంటే ఐదారు లక్షలు రూపాలు ఖర్చయితున్నయి. ఒక్కదాన్నే అన్ని పనులు జేయాలె. నా బిడ్డె గూడ సెలవు దినాలల్ల నాకు సాయంగా నాతోని పొలం కాడికి అస్తున్నది. ఆమెకు లగ్గం చేసి ఓ అయ్య చేతిల పెడితే నాకు ఎంతన్న తిరం అయితది. మొగోని కష్టమంతా జేస్కుంట అస్తున్న. నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు. ఒక చిన్న రూము ఉన్నది. అండ్లనే ఉంట. సొంతంగా గంటెడు భూమి గూడ లేదు. సర్కారోళ్లు ఎవుసం జేసుకునేందుకు ఇంత భూమి ఇస్తే మంచిగుండని మస్తు సార్ల దరకాస్తు బెట్టిన. కాని మా ఊళ్లె భూమి దొరకలేదని ఇస్తలేరు. యాడ భూమి దొర్కలేదు. ఇగ లాభం లేదని, పాలుకు వట్టుకుని జేస్కుంటున్న’అని తన జీవన గమనాన్ని వెలిబుచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement