ఉత్తరాలు బట్వాడా చేస్తున్న జమీల
గార్ల: భర్త చనిపోయినా మొక్కవోని ధైర్యంతో పోస్ట్ ఉమన్‌గా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండల కేంద్రానికి చెందిన జమీల. జమీల భర్త ఖాజామియా పోస్ట్ ఉమన్‌గా పనిచేస్తూ పది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పుడు జమీల పిల్లలు మూడవ తరగతి, ఐదో తరగతి చదువుతున్నారు. భర్త మృతితో కుటుంబ పోషణ జమీలకు భారమైంది. ఈ క్రమంలో తపాలా శాఖ అధికారులు భర్త ఉద్యోగాన్ని జమీలకు ఇచ్చారు. మొదట్లో సైకిల్ తొక్కరాకపోవడంతో కొన్ని రోజులు కాలినడకన ఉత్తరాలు బట్వాడా చేసింది.
రోజుకు 4 గంటలు నడుస్తూ అనేక ఇబ్బందులు పడేది. సైకిల్ తొక్కడం నేర్చుకుని ఉత్తరాలు బట్వాడా చేయడం ప్రారంభించింది. పిల్లల చదువుల ఫీజులు పెరిగాయి. నెల జీతం రూ.6 వేలు సరిపోకపోవడంతో పోస్ట్ ఉమన్ ఉద్యోగం చేస్తూ చీరల వ్యాపారం మొదలుపెట్టింది. భర్త చనిపోయిన మహిళను సమాజం చిన్నచూపు చూస్తుంది..ఎవరేమనుకున్నా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పెద్ద కూతురు జరీనా ఇంజనీరింగ్, చిన్న కూతురును డిప్లొమా చదివిస్తోంది జమీల. ప్రస్తుతం ఆమె వేతనం రూ.పది వేలు. పోస్ట్‌మన్‌గా, చీరల వ్యాపారంతో కుటుంబాన్ని పోషిస్తూ శభాష్ అనిపించుకుంటోంది జమీల. వేతనం రూ.20 వేలకు పెంచాలని ఆమె తపాలా శాఖను కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment