సాక్షి, సిటీబ్యూరో : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు నగర మహిళలు అడుగుపెట్టని రంగం అనేది లేనేలేదు.. కొన్ని వృత్తుల్లో మగవాళ్లను తోసిరాజంటూ దూసుకుపోతున్నారు. ఏ ప్రొఫెషన్ అయినా మేము సైతం.. అంటూ మహిళా గొప్పతనాన్ని చాటుతున్నారు. ఒకటా.. రెండా అనేక రంగాల్లో రాణిస్తూ శహబాష్ అనిపించుకుంటున్నారు.
ఈవెంట్స్...ఆమె వెంటే...
15 యేళ్ల నుంచి ఊపందుకున్న ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో మహిళాధిపత్యం సుస్పష్టం. రాష్ట్ర స్థాయిలో పెద్ద ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన రచనోత్సవ్‌ను నిర్వహిస్తున్న రాఖీకంకారియా ప్రస్తుతం ఈ రంగంలో రాణించాలనుకునే వారి కోసం ఒక అకాడమీని కూడా నెలకొల్పారు. ‘‘ఇరవై ఏళ్ల క్రితం ఈ రంగంలోకి వచ్చాను. అప్పట్లో ఉన్న ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలే ఒకటీ అరా. అప్పుడు విభిన్న రకాల రంగాల సమ్మేళనం లాంటి ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో మహిళలా అంటూ అవహేళన చేశారు. అలాంటి పరిస్థితుల్లో స్థిరంగా నిలబడి... ఈవెంట్ మేనేజ్‌మెంట్ అనే రంగం ఒక పూర్తి స్థాయి పరిశ్రమగా మారే క్రమంలో నేను సైతం పాలు పంచుకున్నాను. ఇప్పుడు ఈ రంగంలో మహిళలే దూసుకుపోతున్నారనేది ఆనందం కలిగించే విషయం’’అంటారు రాఖీ కంకారియా.
‘ఎక్స్‌పో’జర్...ఫర్ హర్
సిటీలోని స్టార్ హోటల్స్, క్లబ్స్... వంటి చోట్ల దుస్తులు సహా విభిన్న రకాల ఉత్పత్తులు విక్రయించే ఎక్స్‌పోల నిర్వహణలో మహిళలదే పైచేయి. ఈ తరహా ఎక్స్‌పోలకు కామిని షరాఫ్ ‘ఫ్యాషన్ యాత్ర’తో శ్రీకారం చుడితే... ఆ ట్రెండ్‌ను మరెందరో సిటీ మహిళలు అందిపుచ్చుకున్నారు. శశినెహతా, శిల్పాచౌదరి, నిఖితారెడ్డి... ఇలా పలువురు ఎక్స్‌పోల నిర్వహణలో దూసుకుపోతున్నారు. ‘‘సిటీలో ఎక్స్‌పోలు నిర్వహించాలంటే విభిన్న రంగాలకు చెందిన వ్యాపారాలను, కొనుగోలుదారులను మేళవించాలి. అంటే అటు వ్యాపారుల అవసరాలపై, ఇటు కొనుగోలు దారుల అభిరుచులపై అవగాహన ఉండాలి. షాపింగ్‌లో మగవారి కన్నా చురుకుగా ఉండే ఆడవారే ఈ ఎక్స్‌పోల నిర్వహణకు సరైనవారు’’ అంటారు కామినిష్రాఫ్.
ప్రమోటర్... సూపర్
పలు ఈవెంట్లలో, పెద్ద పెద్ద సమావేశాల్లో అతి«థులను పలకరిస్తూ, వారికి అవసరమైన సరంజామాను అందిస్తూ చిరునవ్వుతో సందడి చేస్తారు ప్రమోటర్స్. నగరంలో వేల సంఖ్యలో ప్రమోటర్స్ ఉన్నారు. అయితే ఈ రంగంలో కూడా అమ్మాయిలకే డిమాండ్ ఎక్కువ అని ఈవెంట్ మేనేజర్ రాజ్‌కిషోర్ చెప్పారు. ఒక ఈవెం ట్‌లో పాల్గొన్నందుకు మగవాళ్లకి ఇచ్చే మొత్తానికి రెట్టింపు.. అంతకన్నా ఎక్కువే యువతులకి చెల్లిస్తున్నారు. ‘‘ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రమోటర్ డ్యూటీ చేశాను. కేవలం నాలుగు రోజుల్లోనే నాకు నెల ఖర్చులకు సరిపడా పాకెట్ మనీ వచ్చే సింది’’అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది కళాశాల విద్యార్ధిని ప్రేక్ష. అదే విధంగా ప్రోగ్రామ్స్‌లో ప్రేక్షకులకు, కార్యక్రమాలకు మధ్య సమన్వయం నెరపే మాస్టర్ ఆఫ్ సెర్మనీ (ఎం.సి) ప్రొఫెషన్‌లోనూ మహిళదే హవా. ‘‘చక్కని ప్రవర్తన, ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్, సమయస్ఫూర్తి, సంభాషణా చాతుర్యం, ప్రేమగా స్పందించే తీరు... యాంకర్‌గా, ఎంసీగా అమ్మాయిలను అందలాలకు ఎక్కిస్తున్నాయి.
మేగ్‌జైన్...మేల్‌కు నో ప్లేస్...
కొంతకాలం క్రితం దాకా హైదరాబాద్‌లో సిటీ మేగ్‌జైన్ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. దశాబ్దమున్నర క్రితం వావ్ హైదరాబాద్ పేరుతో నగర మహిళ దీప్తిరెడ్డి ప్రారంభించిన మేగ్‌జైన్ విజయం సాధించంతో... అక్కడి నుంచి సిటీ విశేషాలను అందించే మేగ్‌జైన్ల పరంపర మొదలైంది. ప్రస్తుతం సిటీ విశేషాలతో ప్రచురితమవుతున్న మేగ్‌జైన్ల సంఖ్య షుమారు 20కిపైనే..‘‘సామాజిక అవగాహన పెంచుకుంటూ పరిశీలన చేయడంలో ఇప్పుడు మహిళలు ముందున్నారు. అందుకే మేగ్‌జైన్స్ నిర్వహణలో విజయం సాధించగలుగుతున్నారు’’అని అంటున్నారు హైదరాబాద్ పాస్ మేగ్‌జైన్‌ను నిర్వహిస్తున్న శర్వాణీ చౌదరి.
ఆర్జే.. జేజే
‘‘గుడ్‌మార్నింగ్ హైదరాబాద్’’ అంటూ పలకరింపులు మొదలుపెట్టి ‘‘ఇది చాలా హాట్ గురూ’’ వంటి చమత్కారాలతో శ్రోతలను అలరించే రేడియో జాకీల హవా మొదలై... దాదాపు దశాబ్దం కావస్తోంది. ఈ రంగంలో మగవాళ్లు సైతం ఉన్నప్పటికీ సిటీలో అత్యధిక ఆదాయం ఆర్జించే ఆర్జేల్లో అమ్మాయిలే ఎక్కువ అని చెప్పాలి. అమ్మాయిల కంఠస్వరం ఆకట్టుకునేలా ఉండడం ఈ విషయంలో వారికి వరంగా మారుతోంది. అందుకే పురుష ఆర్జేలతో పోలిస్తే అనతి కాలంలోనే మహిళా ఆర్జేలు సెలబ్రిటీలుగా మారిపోతూన్నారు.
వారధి...ఆమెది...
మీడియాకు, ప్రజలకు మధ్య వారధిగా, చెరగని చిరునవ్వుతో ఆకట్టుకునే సంభాషణా చాతుర్యంతో విధులు నిర్వర్తించే పిఆర్వో రంగంలో మహిళల హవా నడుస్తోంది. నగరంలో ఉన్న పీఆర్ ఏజెన్సీలలో అమ్మాయిలే అధిక సంఖ్యలో కనిపిస్తారు. ‘‘సహజంగానే అమ్మాయిల మాట తీరు సున్నితంగా ఉంటుంది. మీడియాతో వ్యవహరించే విధానంలో అత్యంత అవసరమైన మర్యాద, మన్ననలు అందించడంలో యువతులు మరింత ముందుండడమే ఈ రంగంలో మహిళాధిపత్యానికి కారణం’’ అని సిటీకి చెందిన ఎన్‌రైట్ ఏజెన్సీలో పనిచేసే షీలా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment