అర్ధరాత్రి 18 కిలోమీటర్లు నడిచా .. | meenakshi special story on women empowerment | Sakshi
Sakshi News home page

విధిపై విజయం

Published Mon, Feb 19 2018 1:42 PM | Last Updated on Mon, Feb 19 2018 1:45 PM

meenakshi special story on women empowerment - Sakshi

విద్యార్థులకు మెకానిజమ్‌ నేర్పుతున్న మీనాక్షి

ఊహ తెలియని స్థితిలో వివాహం... ఆపై పిల్లలు.. జీవితంలో ఆటుపోట్లు తట్టుకోలేక వదిలేసిన భర్త..  పట్టుమని 16 ఏళ్లు కూడా నిండకుండానే కష్టాలు.. కన్నీళ్లే జీవితం. కన్న బిడ్డలతో కలిసి రైలుకిందపడి ప్రాణాలు  తీసుకోవాలని.. అదే రైలు ఎక్కి పరాయి రాష్ట్రంలో మూడేళ్ల అజ్ఞాతం. తర్వాత అత్తింటికి చేరుకుంటే అయినవాళ్ల సూటిపోటి మాటలు. తండ్రిలా ఆదరించాల్సిన బావ  దారుణ ప్రవర్తన! ఇమడలేక అత్తింటిని వదులుకుని పట్నం చేరుకుంది. ఆత్మస్థైర్యంతో అడుగేసింది. చదువులు నేర్చింది. విధినెదిరించి విజయకేతనం ఎగురవేసింది.  

అర్ధరాత్రి 18 కిలోమీటర్లు నడిచా
ఒకసారి బాబుకు ‘పెద్ద అమ్మవారు’ పోసింది. ఒళ్లంతా చీము కారుతోంది. ఇతర ఇళ్లలో దుస్తులు ఉతికి రాత్రి ఇంటికి చేరుకున్న నేను బాబును చూసి తట్టుకోలేకపోయాను. 18 కి.మీ. దూరంలోని అనంతపురం ఆస్పత్రికి బాబును, పాపను ఎత్తుకుని ఒక్కదాన్నే చీకట్లో నడుచుకుంటూ   వెళ్లా. నా పరిస్థితి తలుచుకుని బాగా ఏడుపొచ్చింది. పిల్లలకు అన్నం పెట్టేలేక.. కష్టాలు భరిస్తూ బతకడం ఇక సాధ్యం కాదని అనుకున్నా. పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నా.. కానీ బతికి సాధించాలని నిర్ణయం తీసుకున్నా.. జీవితంలో నిలదొక్కుకున్నా.. నా బిడ్డలకు మంచి జీవితం ఇచ్చా.  – మీనాక్షి  

మూడేళ్ల అజ్ఞాతంలో ఆదర్శ జీవితం..
పిల్లలతో కలిసి నేను ఎక్కిన రైలు ఎక్కిడికి పోతోందో కూడా నాకు తెలియదు. అటుఇటు చూసే లోపు ఓ పెద్ద ఊళ్లో రైలు ఆగింది. నేను ప్లాట్‌ఫాంపై దిగాను. చూస్తుంటే అంతా కన్నడలో రాసి ఉంది. అక్కడి వారి మాటలను బట్టి హుబ్లీ అని తెలుసుకున్నాను. నాకు భాష రాదు. ఎక్కడికెళ్లాలో తెలియక స్టేషన్‌లోనే ఓ బెంచిపై కూర్చొని ఉండిపోయాను. ఇంతలో ఒకావిడ నా దగ్గరకు వచ్చి వివరాలు అడిగింది. తెలుగులో చెప్పాను. ఆమెకు అర్థమైనట్లు ఉంది. తన పేరు రాధారాణి అని పరిచయం చేసుకుని తనతో పాటు మమ్మల్ని పిలుచుకెళ్లి, తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చారు. మూడు నెలల తర్వాత నేను బెల్గాంలో ఉన్నట్లు తెలుసుకున్నాను. మూడేళ్లలో ఎక్కడా ఎలాంటి పొరబాటు లేకుండా ఆదర్శంగా జీవనం సాగించాను. అప్పటికి భాష నేర్చుకున్నా. ఓ ప్రమాదంలో రాధారాణి చనిపోయారు. దీంతో మళ్లీ ఒంటరిదానయ్యా. ఇక అక్కడ ఉండిబుద్ధి కాలేదు. 2003లో అనంతపురానికి తిరిగి వచ్చాను.

12వ ఏటనే పెళ్లి చేశారు
మాది నిరుపేద కుటుంబం. అనంతపురం పాతూరు సమీపంలోని రాణి నగర్‌లో ఉండేవాళ్లం. అమ్మనాన్న దుస్తులు ఉతికితే వచ్చే సంపాదనతోనే కుటుంబం గడుస్తుంది. 1996లో నేను ఏడో తరగతి చదువుకుంటుండగా (12వ ఏట) మా మేనమామ లక్ష్మీనారాయణతో నాకు పెళ్లి చేశారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలోని అత్తారింటిలో అడుగుపెట్టాను. పెళ్‌లైనా రెండేళ్లకు పాప పుట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు చెప్పాపెట్టకుండా మా ఆయన ఎక్కడికో వెళ్లిపోయాడు. కొన్ని నెలల తరువాత తిరిగొచ్చాడు. 2000 సంవత్సరంలో మాకు బాబు పుట్టాడు. ఆ తర్వాత నా భర్త మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు.

బతుకుపై చిరు ఆశ
జీవితంపై విరక్తితో పిల్లలను తీసుకుని రైలు కిందపడి చనిపోవాలని అనుకున్నాను. ఇద్దరు పిల్లలను తీసుకుని అనంతపురం రైల్వే స్టేషన్‌ని చేరుకున్నాను. దూరంగా రైలు కూత వినిపిస్తోంది. నా కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చిన్నోడు ఒడిలో నిద్రపోతున్నాడు. పాప బుడిబుడి అడుగులతో ఆడుకుంటోంది. వారి మొహం చూస్తే బాధేసింది. ఇంతలో రైలు కూత దగ్గర కావడంతో చిన్నోడు ఉలిక్కిపడి లేచాడు. వాడి ఏడుపు నన్ను బతుకుపై ఆశలు రగిలింది. ఆత్మహత్య చేసుకునే ఆలోచనను విడిచి ఆగిన రైలు ఎక్కేసాను.  

ఆదుకున్న ఆర్డీటీ
2009 ఆగస్టులో ఆర్డీటీ సంస్థ డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ సార్‌ని కలిసి నా పరిస్థితి మొత్తం వివరించాను. డ్రైవర్‌గా ఉద్యోగం కల్పిస్తే పిల్లలను చదివించుకుంటానని ప్రాధేయపడ్డాను. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. నాకు డ్రైవింగ్‌ సరిగా రాకపోయినా జాబ్‌ ఇచ్చారు... నేను సరిగ్గా నడపలేనని చెప్పాను. అందుకు ఆయన...  ‘నీలాంటి వాళ్లను ఎంకేరేజ్‌ చేయాలి. అందుకే అవకాశం ఇచ్చాను... ట్రైనింగ్‌ అవ్వు’ అంటూ గ్యారేజి డ్యూటీ వేశారు. అక్కడ పనిచేయిస్తూ ఆరు నెలల్లో డ్రైవింగ్‌ బాగా నేర్పారు. గ్యారేజీలో రెండున్నర ఏళ్లు పనిచేశా. అక్కడ వాహన మరమ్మతులు పూర్తిగా నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏటీఎల్‌ వాహనానికి డ్రైవర్‌గా పంపారు.  మూడేళ్లు పనిచేశాను. అటు తరువాత అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అక్కడ మూడేళ్లు పనిచేశాను.  పనిచేస్తూనే టెన్త్,  ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. అక్కడే నా జీవితం మారిపోయింది. హెవీ లైసెన్స్‌ తీసుకుంటానని మాంఛో సార్‌కి చెప్పాను. టెస్ట్‌లో ఫెయల్‌ అయితే లైసెన్స్‌ ఫీజు జీతం నుంచి కట్‌ చేస్తా, పాస్‌ అయితే తానే కడతానని అన్నారు. నేను టెస్ట్‌లో పాస్‌ అయ్యాను.

బతుకే కష్టమైంది
ఇద్దరు చిన్న పిల్లలు. అత్తింటి వారు మమ్మల్ని పట్టించుకోలేదు. ఏమీ చేయాలో...  పిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కాలేదు. కులవృత్తిని నమ్ముకుని దుస్తులు ఉతుకుతూ జీవించాలని అనుకుని ప్రతి రోజూ మదిగుబ్బ నుంచి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆత్మకూరుకు వచ్చి అక్కడి నుంచి బస్సులో అనంతపురం చేరుకునేదాన్ని ఐదారు ఇళ్లు ఒప్పుదల చేసుకుని దుస్తులు ఉతికి తిరిగి ఇంటికి వెళ్లిపోయేదాన్ని.

అయినవాళ్లూ ఇబ్బంది పెట్టారు
మూడేళ్ల తర్వాత అనంతపురానికి వచ్చిన నేను నేరుగా మదిగుబ్బకు పోయాను. నా భర్త చనిపోయినట్లు తెలిసింది. ఆ సమయంలో నా భర్త అన్నవాళ్లూ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. చాలా దారుణంగా వ్యవహరిస్తూ వచ్చారు. వారి ప్రవర్తనతో అక్కడ ఇమడలేక పిల్లలను తీసుకుని అనంతపురానికి చేరుకున్నాను. బాబానగర్‌లో చిన్న గది అద్దెకు తీసుకున్నాను. అక్కడికి దగ్గరలోని గుల్జార్‌ పేటలో ఐదారిళ్లలో దుస్తులు ఉతికేందుకు ఒప్పందం చేసుకున్నాను. నెలకు రూ. 1,500 వచ్చేది. దాంట్లోనే బాడుగ కట్టి, పిల్లలను పోషించుకునేదాన్ని. అలా నాలుగేళ్ల పాటు గడిచింది.

మలుపు తిప్పిన డ్రైవింగ్‌
గుల్జార్‌పేటకు గవర్నమెంట్‌ ఐటీఐ మీదుగా రోజూ వెళ్లేదానిని. పొదుపు సంఘం సభ్యులకు కుట్టు, డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు డీఆర్‌డీఏ బోర్డు కనిపించింది. ఐటీఐలోకి వెళ్లి డ్రైవింగ్‌ నేర్చుకుంటానని అడిగాను. 8వ తరగతి పాస్‌ అయ్యి ఉండాలని చెప్పారు. నేను ఏడవ తరగతి వరకే చదువుకున్నాను. రాత్రి బడికి వెళ్లి 8వ తరగతి చదవాలని నిర్ణయించుకున్నాను. రాత్రి బడికెళితే పిల్లలను చూసుకోవడం కష్టంగా ఉంటుందని, బాబుని విజయవాడలోని క్రిష్టియన్‌ స్కూల్‌లో చేర్పించాను. పాపను గుమ్మఘట్ట హాస్టల్‌లో చేర్పించాను.  వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపన నన్ను వారిని దూరం చేసింది. రాత్రి బడికి వెళ్లి చదువుకుని 2008లో పరీక్ష రాసి 8వ తరగతి పాస్‌ అయ్యాను. తర్వాత ఐటీఐలోకి వెళ్లి డ్రైవింగ్‌ నేర్చకుంటానని చెప్పాను. 2008 డిసెంబరులో డ్రైవింగ్‌ శిక్షణ పూర్తి చేశాను. 2009లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ వచ్చింది.

డ్రైవింగ్‌లో మెళుకువలు, నిబంధనల గురించి విద్యార్థులకు క్లాస్‌ నిర్వహిస్తున్న మీనాక్షి

డ్రైవింగ్‌ స్కూల్‌ పెడితే..
చాలా మంది మహిళా అధికారులు, తెలిసిన వారు డ్రైవింగ్‌ నేర్పించు అని అడిగేవారు. ఒక మహిళ డ్రైవర్‌ అవసరం ఇంత ఉందా అని అప్పుడు నాకు అనిపించి, సొంతంగా ఒక డ్రైవింగ్‌ స్కూల్‌ పెట్టాలనే ఆలోచన వచ్చింది. 2016లో మాంఛోసార్‌ని కలిసి విషయం చెప్పాను. ఆలో చన మంచిదేనని అయన ప్రోత్సహించారు. ఆర్డీటీలో జాబ్‌కు రాజీనామా చేసి, బ్యాంక్‌ ద్వారా లోన్‌ తీసుకుని డ్రైవింగ్‌ స్కూల్‌ పెట్టాను.  

స్పందన పేరుతో  సేవ
నేను ఎన్నో కష్టాలు అనుభవించి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. నాలాంటి వారికి ఏదైనా చేయాలనే ఉద్ధేశంతో స్పందన సంస్థ స్థాపించి రైతు బజార్‌లో కార్యాలయం ఏర్పాటు చేశాను. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడే గడుపుతాను. ఎవరైనా వారి వద్ద ఉన్న పాత దుస్తులు తెచ్చి కార్యాలయంలో ఉంచి వెళ్లవచ్చు. వాటిని పేదలు వచ్చి తమకు నచ్చినవి ఉచితంగా తీసుకెళతారు. నాలా ఎవరూ ఇబ్బంది పడకూడదనేది నా కోరిక. అందుకే పేదవారికి ఉచితంగా డ్రైవింగ్‌ నేర్పించి నాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలతో ఫీజు కట్టించి లైసెన్స్‌ ఇప్పిస్తుంటాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement