ఎస్సై శిక్షణలో ప్రశాంతి
పశ్చిమగోదావరి:‘ పేదరికంలో పుడితే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే.. ఉద్యోగాలు రావనే అపోహ విడనాడండి. కష్టపడే తత్వం, పట్టుదల, నిరంతరం లక్ష్యం కోసం శ్రమించడం వంటి లక్షణాలు అలవరచుకొంటే సాధించలేనిది ఏదీ లేదు. అందుకే నేనే ఉదాహరణ.’ అంటున్నారు పెంటపాడు గ్రామానికి చెందిన మరపట్ల ప్రశాంతి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
మాది పెంటపాడు గ్రామం.
మా తండ్రి నిరక్ష్యరాస్యుడు. వృత్తిపరంగా వ్యాన్ డ్రైవర్. తల్లి జయలక్ష్మి. ఇంటర్ చదివారు. మేము ఇద్దరం ఆడపిల్లలం. నా అక్క పేరు సింధు. ఆమె ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ చేసింది. విశాఖపట్నంలోని రెడ్డిల్యాబ్‌లో పనిచేస్తోంది. నేను పెంటపాడు ప్రభుత్వ పాఠశాలలో వి«ధ్యాభ్యాసం చేశాను. 2009–12లో స్థానిక డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తిచేసి కళాశాల టాపర్‌గా నిలిచాను. ఇంట్లో తండ్రి పడుతున్న కష్టాలు చూశాను. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొన్నాను. అప్పుడే పేదలకు సేవా చేయాలనే తలంపుతో ఎన్‌సీసీలో చేరాను. అప్పటి ఎన్‌సీసీ అధికారి నతానియేలు సూచన మేరకు ఎస్సై కావాలనే లక్ష్యం ఉండేది. ఎస్సై ఉద్యోగానికి దేహదారుఢ్యం అవసరమని గుర్తించాను. కళాశాలలోనే ఉదయం రన్నింగ్, లాంగ్‌జంప్, లాంటి వ్యాయామాలు చేశాను.
ఎప్పటికైనాసివిల్ సర్వీస్ సాధించాలని..
ఎస్సై కావాలనే లక్ష్యం అలా ఉండగానే, 2012–13లో పెదతాడేపల్లి వాసవి జీఎంఆర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాను. గూడెం ఏయూ క్యాంపస్‌లో ఎంఏ పూర్తి చేశాను. కరెంట్ ఎఫైర్స్ కోసం వార్తా పత్రికలు నిత్యం చదివేదాన్ని. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో మెంబర్‌గా ఉండి పలుసార్లు రక్తదానం చేశాను. తిరుపతిలో జరిగిన జాతీయ సమైక్యతా శిబిరంలో పాల్గొని నృత్యంలో రెండో బహుమతి సాధించాను. కాగా ఎన్‌సీసీలో తీసుకొన్న నిర్ణయం మేరకు పోలీస్‌శాఖలో నోటిఫికేషన్ ఆధారంగా పరీక్షలు రాశాను. ఎస్సైగా ఎంపికయ్యాను. ప్రస్తుతం అనంతపురంలో ఎస్సై శిక్షణ పొందుతున్నాను. మరో మూడు నెలల్లో ఈ శిక్షణ పూర్తవుతుంది. మేనమామ ఏలూరి జగదీష్, పెద్దమ్మ మరపట్ల బాలకృష్ణ ప్రోత్సాహం, సహకారం కారణంగా పోలీస్ శాఖలో ఎస్సై అయ్యాను. అయినా ఈ లక్ష్యం కాక మరో టార్గెట్ ఉంది. ఎప్పటికైనా సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించి సమాజ శ్రేయస్సుకు, పేద ప్రజలకు సహాయం చేయాలనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివితేనేమి?
పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉద్యోగాలు రావనే అపోహ విడనాడాలి. కష్టపడే తత్వం, పట్టుదల, నిరంతరం లక్ష్యం కోసం శ్రమించడం వంటి లక్షణాలు అలవరచుకొంటే సాధించలేనిది లేదు. నాతోటి యువతులు కూడా ఈ విధంగా ఆలోచించాలి. చదువు మధ్యలోనే ఆపకుండా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. పేదరికంలో ఉన్నా, ఉన్నతస్థితిలో ఉన్నా సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment