విశాఖలో జరిగిన పోటీల్లో విజేతలతో సంధ్య (ఫైల్)
కరాటే.. శారీరక, మానసిక సామర్థ్యాలను పెంచడంతో పాటు ఆత్మరక్షణకు దోహదపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం, మనోధైరాన్ని పెంచుతుంది. అటువంటి క్రీడలో ఆసక్తితో ఆర్థిక ఇబ్బందులున్నా మొక్కవోని దీక్షతో పతకాలు సాధిస్తోంది. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రోత్సాహంతో పతకాల పంట పండిస్తోంది. ఎంబీఏ చదువును పూర్తిచేసి ఉన్నత చదువులతో పాటు కరాటేలో మరింత స్థాయికి ఎదిగేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది భీమవరం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన కొడమంచిలి సంధ్య. విజయగాథ ఆమె మాటల్లోనే..
భీమవరం: మాది భీమవరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ. తల్లిదండ్రులు అక్కమ్మ, దేవుడు, అక్క, అన్న ఇది మా కుటుంబం. అక్క, అన్న చదువుపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోయినా, నన్ను మాత్రం ఉన్నత స్థాయిలో చూడాలన్న కోరిక అమ్మా, నాన్నతో పాటు తోబుట్టువులకూ ఉంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పాఠశాల విద్య పస్తుల సాగరం మున్సిపల్ హైస్కూల్‌లో సాగింది. ఇంటర్ నుంచి ఎంబీఏ వరకూ డాక్టర్ చీడే సత్యనారాయణ కళాశాలలో చదువుకున్నా. మంచి మార్కులతోనే ఉత్తీర్ణత సాధించా. ఇదే సమయంలో రైస్ మిల్లు కార్మికుడిగా పనిచేసే నాన్న దేవుడు ప్రమాదవశాత్తు కాలువిరిగి మంచానపడ్డారు. కుటుంబ పోషణ కష్టం కావడంతో అమ్మ అక్కమ్మ మిల్లులో పనికి వెళ్లేది. అక్క టైలరింగ్, అన్న తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. నాకు చిన్నతనం నుంచి కరాటేలో మక్కువ ఉండటంతో కుటుంబసభ్యులు ప్రోత్సహించారు. స్థానికంగా ఉన్న కరాటే మాస్టార్ జోశ్యుల విజయభాస్కర్ వద్ద శిక్షణ ఇప్పించారు.
పతకాల పంట
విశాఖ, గుంటూరు, కరీంనగర్, తాడేపల్లిగూడెం, జొన్నాడ, తాళ్లరేవు, రాజమండ్రి, మల్కిపురం తదితర ప్రాంతాల్లో జరిగిన జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఎనిమిది స్వర్ణ, ఆరు రజత, రెండు కాంస్య పతకాలు సాధించాను. మరెన్నో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందుకున్నా ను. ప్రముఖుల ప్రశంసలు పొందాను. అయితే దూరప్రాంతాల్లో జరిగే టోర్నమెంట్లకు హాజరయ్యేందుకు ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారింది. చదువుతో పాటు కరాటేలో శిక్షణ తలకు మించిన భారమైంది. ప్రస్తుతం అన్న, అక్క సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది. కరాటేలో మరింత రాణించి పోలీసు ఉద్యోగం సంపాదించడమే నా లక్ష్యం. ఇందుకు ఆర్థిక ఇబ్బందులు ప్రతి బంధకంగా మారాయి. ఇప్పటికే ఎన్నో కష్టాలకోర్చి కుటుంబసభ్యులు ఇక్క డి వరకూ తీసుకువచ్చారు. దాతలు సహకరిస్తే కరాటేలో మరింత రాణిస్తానన్న నమ్మకం.. ఆత్మవిశ్వాసం నాకుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నా లక్ష్యాన్ని తప్పక సాధిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment