వివక్షే అతి పెద్ద నేరం | munsif court judge guda anusha special interview with sakshi | Sakshi
Sakshi News home page

వివక్షే అతి పెద్ద నేరం

Published Tue, Feb 20 2018 3:39 PM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

munsif court judge guda anusha special interview with sakshi - Sakshi

శైలజ, ప్రముఖ న్యాయవాది

సాక్షి, సిద్దిపేట: ‘పిల్లలకు ఎంత ఆస్తి ఇవ్వాలి.. వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి.. అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కానీ, మా అమ్మానాన్నలు అందుకు విరుద్ధం. తమ వారసులను ఎలా తయారుచేయాలో ఆలోచించారు. స్థిరచరాస్తులకే కాదు.. ఇంట్లోని గది నిండా ఉండే పుస్తకాలకూ వారసులు ఉండాలని భావించారు. ఈక్రమంలో అమ్మానాన్నల నుంచి అందిపుచ్చుకున్న న్యాయశాస్త్ర పరిజ్ఞానం, భర్త ప్రోత్సాహం.. నన్ను న్యాయమూర్తిగా నిలబెట్టింది. అమ్మే నాకు ఆదర్శం.. నాన్న పుస్తకాలకు వారసురాలిగా నా న్యాయవాద వృత్తిని ప్రారంభించా..’ అని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి గూడ అనూష తెలిపారు. అమ్మానాన్నల కలలను సాధించడం నుంచి మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తిగా సక్సెస్‌ అయిన వైనం.. తల్లిదండ్రుల పెంపకం.. మహిళా సాధికారత.. బాధ్యతలు మొదలైన అంశాలపై ఆమె సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు.. ఆమె మాటల్లోనే వివరాలు..

గది నిండా పుస్తకాలే..
మాది వరంగల్‌ పట్టణం. అమ్మ అమృతమ్మ, నాన్న యాదగిరిశర్మ న్యాయవాదులే. చిన్నప్పటి నుంచి ఇంటి వద్ద చట్టాలు, న్యాయాలు, కేసులు పరిష్కారాలు మాకు వినిపించేవి. కొత్త పుస్తకాలు వస్తే చాలు అమ్మానాన్నలు పోటీ పడి కొని మరీ ఇంటికి తెచ్చేవారు. ఇలా ఇంటి నిండా పుస్తకాలు చేరాయి. అయితే, వాటికి వారసులు ఎవరు? అనేది వారి ప్రశ్న. నేను, తమ్ముడు రవిశర్మ.. ఇద్దరం ఇతర చదువులతో పాటు న్యాయవాద కోర్సు పూర్తి చేశాం. అమ్మానాన్నలు మమ్మల్ని జడ్జీలుగా చూడాలని అనుకునేవారు. ఈ విషయం అమ్మ నాకు చెబుతూ ఉండేది. వారి కోరిక తీర్చడంతో పాటు పుస్తకాలకు వారసురాలిగా ఉంటానని ఏదో సరదాగే చెప్పేదాన్ని. కానీ, అవే మాటలు ఇప్పుడు నిజమయ్యాయి.

నా ఆలోచనకు భర్త ప్రోత్సాహం
నా భర్త అనికుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. సమాజాన్ని చదివిన మనిషి. నేను బీటెక్‌ చదివి లా కోర్సు చేసిన వెంటనే వివాహమైంది. ఆయనది బెంగుళూర్‌లో ఉద్యోగం. మా కుటుంబ పరిస్థితి.. వాతావరణం చూసిన ఆయన న్యాయమూర్తి కావాలనే నా ఆలోచనకు ఏనాడు అడ్డు చెప్పలేదు. నన్ను మరింత ప్రోత్సహించారు. నా పెద్ద కుమారుడు సాయిసిద్దార్థ 18 నెలల వయస్సునప్పుడు ఆయాతో కలిసి హైదరాబాద్‌కు కోచింగ్‌కు వచ్చా. నేనెలా చదువుతున్నానో? ఆయన ప్రతిరోజు ఆరా తీసేవారు. నాకు ధైర్యం చెప్పేవారు. ఆయన ఇచ్చిన సపోర్ట్‌ వల్లే నేను న్యాయమూర్తి పోటీ పరీక్షలో రాష్ట్రంలో ఐదో ర్యాంక్‌ సాధించగలిగాను. 

సంస్కృతి, సంప్రదాయాలతో ఆత్మవిశ్వాసం
సంస్కృతి, సంప్రదాయాలు మనలోని ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పెంచుతాయి. పూజలు, ఉపవాసాలు, పండుగలు ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతాయి. వాటిని ఏనాడు విస్మరించవద్దు. అయితే, అందులో ఉన్న మంచిని మాత్రమే మనం స్వీకరించాలి. సర్వమానవాళి అభివృద్ధికి దోహదపడేందుకు ఎందరో మహానుభావులు చెప్పిన మాటలు, సూక్తులు స్వీకరించాలి. వాటిని మన జీవన మనుగడకు, తోటివారికి సహాయం చేసేందుకు వినియోగించాలి. అలాగే కట్టుబాట్లు, సామాజిక ఆచారాల ద్వారా ఇతరులను నొప్పించడం, ఇబ్బంది పెట్టకూడదు.

అమ్మే నా రోల్‌ మోడల్‌
అమ్మే నా రోల్‌ మోడల్‌. పేరెంట్స్‌ ఇద్దరు న్యాయవాదులే. వారి కుటుంబ పరిస్థితి.. పడిన కష్టాలు.. సమాజంలో గుర్తింపులు.. మొదలైన విషయాలు మాకు ఎప్పుడు చెబుతుండేది. వారి న్యాయమూర్తుల గురించి చెబుతూ.. వారిచ్చిన తీర్పులు చర్చించే సమయంలో మేము కూడా న్యాయమూర్తులు అయితే బాగుంటుందని నాన్న పదేపదే చెప్పేవారు. ఆయన మాటలే నన్ను న్యాయమూర్తి పరీక్ష రాసేందుకు సిద్ధం చేశాయి. దీనికి తోడు స్వామి వివేకానంద ‘హన్మంతుడు’ పుస్తకం, పాల్కో రచించిన ‘ది ఆల్కమిస్ట్‌’ పుస్తకాలు నన్ను ప్రభావితం చేశాయి. సమయం దొరికనప్పుడు పుస్తకాలు చదవడం నా హాబీ. అందులో మనకు కావాల్సిన అంశాలుంటే రాసుకుంటాను.

వివక్ష ఎక్కడ ఉన్నా నేరమే.. 
వివక్ష ఎక్కడ ఉన్నా నేరమే. నేను, తమ్ముడు ఇద్దరం పోటీ పడి చదివేవాళ్లం. మా పెంపకంలో ఎక్కడా తల్లిదండ్రులు వివక్ష చూపలేదు. తల్లిదండ్రులు తమ బిడ్డలను సమానంగా చూడాలి. ప్రస్తుతం మగవారి కన్నా ఆడపిల్లలే బాధ్యతగా చదువుతున్నారు. వారు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇంకెందుకు ఈ వివక్ష. పిల్లలు తమ తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేసిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వీరి రక్షణ కోసం ప్రభుత్వం చట్టాలు చేసింది. అంతేకాదు తల్లిదండ్రుల బాధ్యతలు విస్మరించిన వారిపైనా చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది.

పట్టుదల ఉంటే విజయం
ఆడపిల్లలు.. మహిళలు ఎక్కడా తక్కువ కాదు. మేం తక్కువ అనే భావన తీసేయాలి. ఆడవాళ్లను భూమాతతో పోల్చుతారు. అంటే అంత సహనం ఉంటుందని అర్థం. అందుకే ఓపికతో పెంచుకోవాలి. లక్ష్యం ఎన్నుకొని.. దానిని సాధించే వరకు శ్రమించాలి. అంతేకానీ, నిరాశతో ఉంటే విజయం సాధించలేవు. కుటుంబసభ్యుల సహకారం తీసుకోవాలి. తల్లిదండ్రులు, పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలి. అంతేకాదు ఎన్నుకున్న రంగంలో రాణించాలి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement