భర్త శ్రీనివాసులనాయుడుతో లగుడు శ్రీలక్ష్మి
విద్య, ఉద్యోగం, రాజకీయం, వ్యాపారం, క్రీడలు ఇలా ఏ రంగమైనా తామున్నామంటూ ముందుకు సాగిపోతున్నారు నారీమణులు. ఒకప్పుడు వంట గదికే పరిమితమైన అబల నేడు అంతరిక్షయానం చేస్తూ సత్తా చాటుతోంది. తమకు కాస్త ప్రోత్సాహం అందిస్తే చాలు ఎంతటి లక్ష్యమైనా చేరుకుంటామని చెబుతోంది మహిళాలోకం. ప్రముఖ కంపెనీల్లో సీఈఓలుగా ఉంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవారు కొందరైతే.. క్రీడల్లో రాణిస్తూ భారతదేశ ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నవారు మరికొందరు.. ఉద్యోగాల సాధనలో కూడా తామేమీ పురుషులకు తక్కువ కాదని నిరూపిస్తున్నారు యువతులు. అలాంటి కొంతమంది మహిళల సక్సెస్‌పై ప్రత్యేక కథనం మీకోసం..
విజయనగరం, శృంగవరపుకోట రూరల్: నా పేరు లగుడు శ్రీలక్ష్మి, మాది ఎస్.కోట మండలంలోని ధర్మవరం స్వగ్రామం. భర్త అల్లు శ్రీనివాసులనాయుడు, తల్లిదండ్రులు లగుడు రమణమ్మ, సత్యనారాయణమూర్తిల ప్రోత్సాహంతో పట్టుదలగా చదివి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2010లో ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం విశాఖ జిల్లా ఏటికొప్పాకలో ఎస్‌బీఐ బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. తల్లిదండ్రులు ఇద్దరు కూడా శృంగవరపుకోట మండల పరిషత్ అధ్యక్షులుగా (ఎంపీపీ) పదవులు అలంకరించారు. భర్త శ్రీనివాసులనాయుడు బీఎస్‌ఎన్‌ఎల్‌లో (విశాఖ) సహాయ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా కుమార్తె అఖిల ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది.
మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరన్నది నా ప్రగాఢ విశ్వాసం. ప్రస్తుత కాలంలో మగవారికి దీటుగా ఇటు ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించడంతో పాటు రాజకీయం, వ్యాపార రంగాల్లో కూడా రాణిస్తున్నారు. మహిళలు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ రావాలంటే ప్రతి మహిళా విద్యావంతురాలు కావాలి. మారిన ఆధునిక జీవనశైలికి అనుగుణంగా కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాలంటే భార్యభర్తలిద్దరూ పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మహిళలను వంటింటికే పరిమితం చేయాలనే ఆలోచనను నుంచి ప్రతి ఒక్కరూ బయటకు రావాలి. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉద్యోగం చేయాల్సిన సత్తా మహిళలకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment