![Rmana sree talent in Mythical field - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/1/ramana.jpg.webp?itok=ZWEhUeFl)
కాలకౌశికుడు, కేశవ పాత్రదారులతో కలహకంటి పాత్రలో..
వనపర్తి రమణమ్మ. అలియాస్ రమణశ్రీ.. పుట్టింది పేద కుటుంబం. పొట్టకూటికి కూడా లేని పరిస్థితి. తెలిసీతెలియని వయస్సు నుంచే అన్నతో కలిసి పాటలు పాడుకుంటూ భిక్షమెత్తుకుని పొట్టపోసుకోవాల్సి వచ్చింది. పౌరాణిక రంగంలో రాష్ట్రంలోనే దిగ్గజ కళాకారుడైన రేబాల రమణ చేరదీశాడు. దీంతో ఆమె అనేక జిల్లాల్లో ప్రదర్శనలు ఇచ్చింది.
ఆత్మకూరు రూరల్: తోలుబొమ్మలాట కుటుంబాలు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోని డీసీపల్లి, బోయలచిరివెళ్ల, నబ్బీనగరం, శంకర్‌నగరం, లింగంగుంట, వ్వూరుపాడులలో ఉన్నాయి. వీరిలో డీసీపల్లి కళాకారులు దశాబ్దాల క్రితమే విదేశాల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. అటువంటి కుటుంబానికి చెందిన వనపర్తి రమణమ్మ, తన అన్న ఆంజనేయులతో కలిసి ఏడేళ్ల పసిప్రాయం నుంచే పొట్టకూటి కోసం ఆత్మకూరు బస్టాండ్‌తో పాటు రోజుకోచోట వీధుల్లో తిరుగుతూ పాటలు పాడుతూ భిక్షమెత్తుకుని పొట్టనింపుకునే వారు. ఈ క్రమంలో ప్రఖ్యాత కళాకారుడు రేబాల రమణ ఓ సారి ఆత్మకూరు విచ్చేసి వీరి గురించి తెలుసుకున్నారు. తన వద్దకు పిలిపించుకుని ఇక నుంచి రోడ్ల వెంబడి తిరగవద్దని, కళాకారులుగా తీర్చిదిద్దుతానని ఆదాయ మార్గం చూపుతానని వెన్నుతట్టి ప్రోత్సహించారు.
అనేకప్రదర్శనలిచ్చి..
రమణ ఇచ్చిన ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. విజయవాడ, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో సుమారు వెయ్యి పౌరాణిక నాటకాల్లో నటించింది. చిత్ర, కలహకంటి, మాతంగి, బాలనాగమ్మ, లచ్చి, మంజరి, సంగు, ముత్తి, తదితర పాత్రల్లో నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఓ దశలో ఆమెకు గుండెపోటు రావడంతో పౌరాణిక రంగ కళాకారులు ఆర్థికసాయం చేసి ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత నుంచి నాటకాలు వేస్తూ రంగస్థల ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
పౌరాణికాలకు ఆదరణ తగ్గింది
చిన్నతనం నుంచి కళాభిమానంతో ఈ రంగంపైనే ఆధారపడ్డాం. పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తూ దిగ్గజ కళాకారుల సరసన నటించే అవకాశం దక్కింది. పౌరాణికాలకు గతంలో ఉన్న ఆదరణ నేడు లేదు. సహచర కళాకారిణులైన శిరీషా, పద్మ, అపర్ణ, తదితరులం కలిసి తరచూ పౌరాణికాల్లో నటిస్తూ పొట్టకూటికి సరిపడా సంపాదించుకుంటున్నాం. ప్రభుత్వ సహకారం అందించి పౌరాణికాలను కాపాడితే మాలాంటి కళాకారులతో పాటు ఈ కళ కూడా సజీవంగా నిలుస్తుంది. – రమణశ్రీ
Comments
Please login to add a commentAdd a comment