అవార్డులు, రివార్డులతో ఉమాజయశ్రీ
భవిష్యత్ ప్రణాళికల గురించి ఆమె ఏమంటున్నారంటే...
మా ఏకైక సంతానం లక్ష్మీదీపికకు కూడా నాట్యంలో చక్కని అభినివేశం ఉంది. ఆమె కూడా ఈ రంగంలో ఎన్నో పురస్కారాలను, సత్కారాలను అందుకొంటోంది. భారతీయ నృత్యకళలు అనే అంశంపై పరిశోధన చేయడానికి మెటీరియల్ సేకరించి అధ్యయనం ప్రారంభించాను. మన రాష్ట్రప్రభుత్వం కళలను ప్రోత్సహించడానికి ఆశించిన స్థాయిలో ముందుకు రాకపోవడం బాధాకరమైన వాస్తవం.
రాజమహేంద్రవరం కల్చరల్: ఐదో ఏట నుంచి ఆమెకు నాట్యమంటే మక్కువ ఏర్పడింది. డ్యాన్స్ నేర్పించకపోతే అన్నం తిననని మారాం చేసేంత స్థాయికి ఎదిగింది. మరోవైపు తల్లిదండ్రులు ‘‘మా తల్లివి కాదూ.. సంగీతం నేర్చుకోవమ్మా, రేపు పెళ్లయితే, ఎలాంటివాడు వస్తాడో, సంగీతం నేర్చుకుంటే ఇబ్బంది ఉండదు’’ అని ఆమెకు నచ్చజెప్పేందుకు విఫలయత్నం చేశారు. ఆ అమ్మాయి మారాం మానలేదు. పంతం నెగ్గించుకుంది. ఆ శిక్షణ అంతర్జాతీయ వేదికలపై పురస్కారాలు అందుకోవడం వరకు వెళ్లింది. అంతే కాదు, నాట్య శాస్త్రానికే అంకితమైన వ్యక్తితోనే ఆమెకు ‘పెద్దలు కుదిర్చిన’ వివాహం జరిగింది. ఆమే గొల్లపూడి ఉమాజయశ్రీ. 1978లో విశాఖలో జన్మించిన ఈమె పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (నృత్యం) పట్టా తీసుకున్నారు. ఎంబీఏ చేశారు. వివాహానంతరం జిల్లాలోని ధవళేశ్వరంలో భర్త స్థాపించిన రాధాకృష్ణ కళాక్షేత్రకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు.
ఎన్నో ప్రదర్శనలు–అరుదైన పురస్కారాలు
ఎనిమిదో ఏటే వరల్డ్ టీచర్స్ ట్రస్టు నిర్వహించిన పోటీల్లో తొలి ప్రదర్శన ఇచ్చిన ఉమా జయశ్రీ ఇప్పటి వరకు వందలాది ప్రదర్శనలలో పాల్గొన్నారు. కళాభారతి, విశాఖలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సంప్రదాయ, జానపద, నృత్యరీతుల్లో మొదటి బహుమతిని గెలుచుకున్నారు. 2015లో ఉత్తరాఖండ్‌లో అంతర్జాతీయ ఉత్తమ కొరియోగ్రఫీ పురస్కారాన్ని, 2017లో కర్నూలులో అభినయగురుశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి, కళాభిమానుల జేజేలు అందుకున్నారు.
2017 జూన్ నాలుగో తేదీన రాజమహేంద్రి ఆనం కళాకేంద్రంలో రాధాకృష్ణ కళాక్షేత్ర 12.23 నిమిషాల, ఒక సెకనులో సప్తనృత్యరూపకాల ప్రదర్శనకు నృత్య దర్శకత్వం వహించారు. ఈ ప్రదర్శన ప్రపంచ రికార్డులు, జీనియస్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికారŠుడ్సలో నమోదైంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికారŠుడ్సలో కూడా నమోదు కానుంది. ఉత్తరాఖండ్, డెహ్రాడూన్‌లోని యూనివర్సల్ సాంస్కృతిక్ శోధ్ నాట్య అకాడమీలో, యునెస్కోవారి ఫ్రాన్స్‌పారిస్ సంస్థలలో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారు.
మనసున మనసై..అడుగులో అడుగై..
ప్రతి పురుషుడి విజయం వెనుక, ఒక స్త్రీ ఉంటుందంటారు. అయితే ఇక్కడ ప్రతి స్త్రీ వెనుకా ఓ పురుషుడు ఉంటాడని చెప్పుకోవచ్చు. ఉమాజయశ్రీ, ఆమె భర్త గోరుగంతు బదరీనారాయణలు ఇద్దరి వృత్తీ, ప్రవృత్తి నాట్యం కావడం విశేషం. భర్త ప్రోత్సాహంతో ఉమాజయశ్రీ హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాట్యవిభాగాధిపతి డాక్టర్ ఉమారామారావు వద్ద ఐదేళ్లు నాట్యంలో శిక్షణ పొందారు. భర్త గోరుగంతు బదరీనారాయణ స్థాపించిన రాధాకృష్ణ కళాక్షేత్రంలో ప్రిన్సిపాల్‌గా చిన్నారులకు కూచి పూడి, గాత్రం, వీణ, లలితసంగీతాలలో శిక్షణ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment