శిల్పకళా వేదికలో వైభవంగా నాట్యతోరణం
ఒకే వేదికపై భరతనాట్యం, కూచిపూడి, మోహినీ అట్టం, కథక్, ఒడిస్సీ, ఆంధ్రనాట్యం
88 మంది నృత్య కళాకారిణుల ప్రదర్శనలు
కిక్కిరిసిన శిల్పకళావేదిక ప్రాంగణం
అమ్రిత కల్చరల్ ట్రస్టుకు అతిథుల అభినందనలు
ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి ఒకే వేదికపై ఆరు రకాల నృత్యరీతులను అత్యంత అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేసింది.. అమ్రిత కల్చరల్ ట్రస్టు వారి నాట్యతోరణం కార్యక్రమం. నగరంలోని శిల్పకళావేదికలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమానికి ప్రాంగణం సామర్థ్యాన్ని మించి ప్రేక్షకులు రావడంతో మొత్తం కిక్కిరిసిపోయింది. భరతనాట్యం, కూచిపూడి, మోహినీ అట్టం, కథక్, ఒడిస్సీ, ఆంధ్రనాట్యం లాంటి నృత్యరీతులకు చెందిన కళాకారిణులు ఒక్కో విభాగంలో 6 నుంచి 10 మంది చొప్పున తమ తమ నాట్యాలను ప్రదర్శించారు. అనంతరం మొత్తం కళాకారిణులు అందరూ కలిసి ఒకేసారి చేసిన జుగల్‌బందీ ప్రేక్షకులను కట్టిపడేసింది.
ప్రముఖ నాట్యగురువులు కళాకృష్ణ (ఆంధ్రనాట్యం), అనితా గుహ (భరతనాట్యం), చావలి బాల త్రిపురసుందరి (కూచిపూడి), నీనా ప్రసాద్ (మోహినీ అట్టం), శామా భాటే (కథక్), బిచిత్రానంద స్వైన్ (ఒడిస్సీ), పేరిణి కుమార్ (పేరిణి నాట్యం-ఆంధ్రనాట్యం) తదితరుల సారథ్యంలో ఈ కళాకారులంతా తమ తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. అమ్రిత కల్చరల్ ట్రస్టును పగడాల రాజేష్, భార్గవి దంపతులు ప్రారంభించారు. దీని యాజమాన్య కమిటీలో సీతా ఆనంద్ వైద్యం, రేవతి పుప్పాల, సురేంద్రనాధ్ తదితర దిగ్గజాలు ఉన్నారు.
భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ... అన్ని ప్రాంతాలకు చెందిన నృత్య కళారీతులను ప్రోత్సహించేలా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు అమ్రిత కల్చరల్ ట్రస్టును అభినందించకుండా ఉండలేకపోతున్నామని కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఆదాయపన్ను శాఖ మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పి.వి. రావు అన్నారు. నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న కళాకారిణులందరికీ ఈ రంగంలో అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి టీవీ నరసింహారావు, పద్మశ్రీ పద్మజారెడ్డి, కోటి సూర్య ప్రభ, శిల్పారెడ్డి, టీవీ9 రజనీకాంత్, పద్మశ్రీ ఉమామహేశ్వరి, మాదాల రవి, ఆశ్రిత వేముగంటి తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: Mouni Roy:కథక్‌తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మెస్మరైజ్ చేసిన నటి)
Comments
Please login to add a commentAdd a comment