భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. ‘లోక్ మంథన్’ పేరుతో నవంబర్ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన ‘జానపద జాతర‘ హైదరాబాద్ శిల్పారామంలో కనుల విందు చేయనున్నది. ‘ప్రజ్ఞా ప్రవాహ్’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని ఒక్కో రాష్ట్రంలో లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాల నుంచి సైతం ఒక్కో తెగ, ఒక్కో జాతికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకారులు దాదాపు 1500 మంది ఈ ‘జానపద జాతర’లో తమ కళలను ప్రదర్శిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం చాటే ఈ మేళా ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అగ్ర నేత మోహన్ భాగవత్‌తో పాటూ అనేకమంది కేంద్రమంత్రులూ వస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
భారతీయ జానపద కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఈ దేశమంతా ఒకటేననే ఏకత్వాన్ని నిరూపించడమే లోక్ మంథన్ ప్రధాన లక్ష్యం. ‘జాతీయ గిరిజన గౌరవ దివస్’ పేరుతో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని నిర్వహించే ఈ వేడుక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సులు, సమావేశాల ఆధారంగా ప్రపంచంలోని వనవాసి, గిరివాసి సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాన్ని కూడా అన్వేషిస్తారు. సంప్రదాయ సాంస్కృతిక వాయిద్యాలు, పనిముట్లు ప్రదర్శిస్తారు. ఈ జాతరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చెందినవారు కూడా వచ్చి ప్రదర్శనలిస్తారు.
ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే ‘కేచక్’ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌కు హాజరవుతున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సూర్యపుత్రులు), లిథువేనియా వాసులు సైతం ఉన్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆయా దేశాలలో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, యజ్ఞం (అగ్నిని పూజించడం) నిర్వహణ విధానాలను వీరు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో చేసి చూపిస్తారు.
చదవండి: మణిపుర్ ఘర్షణలకు ముగింపెప్పుడు?
ఈ సందర్భంగా జరిగే ఎగ్జిబిషన్‌లో తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళలు, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ గ్రామీణ క్రీడలు, సాహిత్యం, ఇతర సాంస్కృతిక అంశాలౖపై చర్చలు ఉంటాయి. భారతీయ ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా... వారి అందరి సాంస్కృతిక పునాదులు జానపదంలోనే ఉన్నాయి. మన మూలాలను ఒకసారి అందరికీ చాటిచెప్పే లక్ష్యంతో జరుగుతున్న ఈ జాతరకు అందరూ ఆహ్వానితులే. ఉత్సవాలు జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది.
– పగుడాకుల బాలస్వామి; ప్రచార ప్రసార ప్రముఖ్, వీహెచ్‌పీ, తెలంగాణ రాష్ట్రం
(నేటి నుంచి ‘లోక్ మంథన్’ ప్రారంభం)
Comments
Please login to add a commentAdd a comment