శిల్పారామంలో ఈ నెల 21 నుంచి 24 వరకు..
దేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘లోక్ మంథన్’ వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారతీయ జానపద సాంస్కృతిక ఉత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, సుమారు 2 వేల మందికి పైగా జానపద కళాకారులు తరలి రానున్నారు. ఇప్పటికే ప్రీ లోక్ మంథన్ పేరిట అవగాహన సదస్సులను, ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. దేశంలో విశిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేదని, విదేశీయుల దండయాత్రల కారణంగా గ్రామీణ ప్రజలకంటే పట్టణవాసులు ఉన్నతులుగా భావించే వివక్ష ఏర్పడిందని, ఈ నేపథ్యంలో గ్రామీణ విజ్ఞానం నిర్లక్ష్యానికి గురైందని లోక్ మంథన్ నిర్వాహకులు భావిస్తారు.
అందుకే ప్రకృతి జానపదుల గొప్పతనాన్ని లోకానికి చాటిచెప్పే లక్ష్యంతోనే ‘లోక్ మంథన్’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జానపదుల విశ్వాసాలు, జీవన విధానం, దృక్పథం, వేల ఏళ్లుగా సమాజాన్ని ఏలిన వ్యవస్థల వివరాలను వెలికి తీసుకురావాలనేదే లోక్‌మంథన్ ఉద్దేశం. ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో ఈ లోక్‌మంథన్ వేడుకలు ఇప్పటి వరకు రాంచీ, భోపాల్, గువాహటి, తదితర నగరాల్లో ఘనంగా జరిగాయి.
భాగ్యనగరం వేదికగా..
ఈ బృహత్తర కార్యక్రమానికి హైదరాబాద్ నగరం వేదిక కానుంది. సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత తదితర అంశాలపై సమాలోచనల సమాహారమే లోక్‌మంథన్. అర్మేనియా, లూథియానా వంటి దేశాల మూల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పలు కళా ప్రదర్శనలు, సమాలోచనలు చేసేందుకు వేలాది మంది తరలిరానున్నారు. బాలి నుంచి పద్మశ్రీ గ్రహీత వాయన్ దిబియా తన బృందంతో కలిసి రామాయణ ఇతిహాసం ప్రదర్శించనున్నారు.
చదవండి: ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టు
నగరీకరణ కారణంగా అస్తిత్వాన్ని మరిచిపోతున్న నేటి తరానికి భారతీయ సామాజిక జీవిత మూలాలను తెలియజేసే ప్రయత్నమే లోక్ మంథన్. మన వ్యవస్థలో మొదటి నుంచి అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రముఖ స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా ఆ సంస్కృతి మరుగునపడింది. దీంతో అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియజేసేందుకు దేశంలోని వివిధ నగరాల్లో లోక్ మంథన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఈ లోక్‌మంథన్‌కు దేశ విదేశాలకు చెందిన వందలాది మంది కళాకారులు, మేధావులు, పరిశోధకులు హాజరుకానున్నారు.
మనది అడవి బిడ్డల సంస్కృతి
నగర ప్రజలు కెరీర్ వైపు, ఆధునికత వైపు విస్తారంగా పరుగులు తీస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమూహానికి.. మన సమాజం మూలాలను గుర్తు చేసే ప్రయత్నమే లోకమంథన్. మన భారతీయల వ్యవస్థలో మొదటి నుంచీ అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ముఖ్యమైన స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. అందుచేత అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియచెప్పేందుకు దేశంలోని వివిధ నగరాలలో లోక మంథన్ నిర్వహిస్తున్నాం.
– నందకుమార్, ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment