కొందరు వ్యక్తులు వ్యక్తిగత ఒత్తిడి, చికాకులు, కోపం, నిరాశ ... వంటి భావోద్వేగాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటూ జనాల మద్దతు కోరుకుంటూ ఉంటారు. ఈ విధానం వల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. మానసిక సమస్యలను మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. దీనివల్ల కొత్త ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది.
యువత, మహిళల్లో ఎక్కువగా ఉండే ఈ సమస్య గురించి, జాగ్రత్తల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే! సోషల్ మీడియాలో తమ భావోద్వేగాలు, ఆశనిరాశలు, ఆలోచనలు, ఆవేదనలు, వ్యక్తిగత అనుభవాలు, సమస్యలను విస్తృతంగా పంచుకునే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. ఇతరుల సానుభూతిని కోరుకోవడానికి ఇలా చేస్తుంటారు. దీనికి కొందరు వ్యక్తులు తీర్పులు ఇస్తుంటారు లేదా తప్పుగా అర్థం చేసుకుంటారు.
కలిగే నష్టాలు
- సంఘర్షణ తీవ్రత పెరుగుతుంది
- అనవసరమైన వాటిపైన శ్రద్ధ
- నిరంతర సానుభూతి వచనాలను కోరుకుంటారు.
- మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
దీనికన్నా భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి నమ్మదగిన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల నుండి మద్దతు పొందడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే, మీ భావోద్వేగాల పరిస్థితిని మోసగాళ్లు ఓ కంట గమనిస్తుంటారు. వాటిని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు ఫ్రెండ్స్ జాబితాలో చేరి, అనుకూలంగా మాట్లాడుతూ చివరకు ఆర్థికపరమైన నేరాలకు పాల్పడవచ్చు.
సానుభూతి కోరుకునేవారు..
⇔ప్రజల దృష్టిని ఆకర్షించడానికి భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంటారు. లైక్‌లు, కామెంట్స్, ఫాలోవర్స్ ద్వారా మనకున్న ప్రాముఖ్యతను చూసుకుంటారు కాబట్టి చాలామంది ⇔వ్యక్తులు తమ ఫాలోవర్ బేస్‌ను పెంచుకోవడానికి దృష్టిని ఆకర్షించడానికి సోషల్ మీడియాలోకి వస్తారు.
⇔తమ భావోద్వేగాలను సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఎవ్వరికీ కనిపించకుండా వ్యక్తీకరించడానికి సోషల్ మీడియా మాత్రమే అనుకూలంగా భావిస్తారు.
⇔మంచి, చెడు ఏదైనా సోషల్ మీడియాలో ముందుగా విషయాలను పంచుకోవాలనే ఆత్రుత, మనల్ని ఇతరులు గమనిస్తున్నారా లేదా అనే నిరీక్షణ ఉంటుంది.
⇔సోషల్ మీడియాలో ఆలోచనలు, భావాలను పంచుకోవడం వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా అపరిచితుల నుండి కూడా మద్దతు పొందవచ్చు.
⇔కొందరు వ్యక్తులు ఎవ్వరికీ తెలియకుండా అజ్ఞాతంగా ఉంటూ సోషల్ మీడియాలో చురుకుదనాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎందుకంటే వారు తమ వ్యక్తీకరణను అనామకంగా చేస్తారు. ఇది భద్రతా భావాన్ని అందిస్తుంది, తక్షణ పరిణామాల భయం లేకుండా ఉండటమే దీనికి గల కారణం.
⇔మార్పు కోసం వాదించడానికి లేదా ప్రభుత్వాలు, కార్పొరేట్లు, రాజకీయ పార్టీలు తీసుకున్న ముఖ్యమైన విషయాలపై (అంటే విధానాలు లేదా నిర్ణయాలు) దృష్టిని ఆకర్షించడానికి ఇదొక మార్గం.
⇔ఒంటరితనం, సన్నిహిత సంబంధాలు లేకపోవటం లేదా ఎవరితోనైనా మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటే, సోషల్ మీడియా మాత్రమే వారి వ్యక్తీకరణ సాధనంగా పనిచేస్తుంది.
⇔సోషల్ మీడియాలో తమను తాము వ్యక్తీకరించడం, వారి భావాలను పంచుకోవడంలో ఉపశమనం పొందుతుంటారు.
⇔కష్టాలు, సవాళ్లను పంచుకోవడం ద్వారా వ్యక్తులు తమలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వవచ్చు.
⇔కొందరితో వ్యక్తిగతంగా చెప్పలేని విషయాలు ఆన్‌లైన్‌లో పంచుకోవడం సుఖంగా ఉంటుంది.
ఎలా ఉండాలి..
- వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విభిన్న రకాల వ్యూవర్స్ మీకు ఉండే అనుకూలమైన సోషల్ మీడియా సైట్‌ను ఎంచుకోవాలి. (ఉదాహరణకు.. వ్యక్తిగత వ్యక్తీకరణల కోసం Facebook, ప్రజల కోసం Twitter ఎంచుకోవచ్చు.
- సహాయం కోరుతున్నారా, నైపుణ్యాన్ని పంచుకుంటున్నారా లేదా మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకుంటున్నారా అనే దానిపైన స్పష్టత ఉండాలి.
- మీ ఉద్వేగాల పరిస్థితిని కంప్లైంట్‌గా కాకుండా మీరు ఎలా, ఎందుకు దేనిగురించి భావిస్తున్నారో వివరించడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఇతరులు అర్థం చేసుకునే వీలుంటుంది.
- మీ భావాలను వ్యక్తపరిచేటప్పుడు, సున్నితమైన లేదా విభజన సమస్యలను తెచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. లేదంటే సంఘర్షణకు దారితీయవచ్చు.
- సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్దిష్ట స్నేహితులు లేదా అనుచరులతో పోస్ట్‌లను పూర్తిగా పబ్లిక్ షేర్ చేయడానికి అనుమతిస్తాయి కాబట్టి గోప్యతా సెట్టింగ్‌లపై నియంత్రణ ఉండాలి.
- మీ గోప్యతకు భంగం కలిగించే మీ వివరాలను బహిర్గతం చేయకుండా ఉండాలి. (అనగా.. పేరు, చిరునామా, ప్లేస్, టెలిఫోన్ నంబర్, ఇ–మెయిల్, చిరునామా మొదలైన వ్యక్తిగత సమాచారం)
- ఫీడ్‌బ్యాక్ విషయంలో ఓపెన్‌గా ఉండాలి. గౌరవప్రదంగా ప్రవర్తించాలి. లేకపోతే ప్రతికూల చర్యలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది.
- మీ విజయాలు, జీవిత అనుభవాలు లేదా సంతోషకరమైన క్షణాలను పంచుకోవడం ద్వారా ప్రోత్సాహకరమైన ఉనికిని పొందవచ్చు.
- మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకోవడం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుందో లేదో, మీరు పోస్ట్ చేసిన దానితో సంతృప్తి చెందుతున్నారో లేదో ఒకటికి రెండుసార్లు సమీక్షించుకోవాలి.
- సోషల్ మీడియాలో మీ వ్యక్తీకరణను ఎలా తెలియజేస్తున్నారో స్నేహితుడితో, కుటుంబ సభ్యునితో, థెరపిస్ట్‌తో మాట్లాడటం మేలు చేస్తుంది. వాటిలోని మంచి చెడులను బేరీజు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
మీ వ్యక్తిగత ప్రతిష్టకు సమస్యలు ఎదురైతే రిపోర్ట్ చేయడానికి...
https://www.facebook.com/help/ 1753719584844061/?helpref=uf_share
Instagram:https://help.instagram.com/ contact/ 383679321740945
Twitter: https://help.twitter.com/en/forms/ safety-and-sensitive-content
LinkedIn: https://www.linkedin.com/help/ linkedin/answer/a1378278/report-inappropriate-content-messages-or-safety-concerns?lang=en
(చదవండి: ఇండియన్ బ్యాలెరినా! బ్యాలె డ్యాన్స్‌లో రాణిస్తున్న హైదరాబాదీ!)
Comments
Please login to add a commentAdd a comment