అంతర్జాతీయ వేదికలపైన ప్రసిద్ధిగాంచిన బ్యాలె డ్యాన్స్‌లో హైదరాబాద్ వాసి13 ఏళ్ల ఇష్నా చౌదరి రాణించడమే కాదు ప్రతిష్ఠాత్మక కెనడా నేషనల్ బ్యాలె స్కూల్ (ఎబీఎస్)లో ప్రవేశానికి ఎంపికైంది. ప్రపంచంలోని టాప్ 10 బ్యాలే స్కూల్స్‌లో ఒకటైన ఎన్‌బీఎస్ అకడమిక్ కరిక్యులమ్‌లో ప్రవేశం పొందిన మొదటి భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది ఇష్నా. ‘వివిధ దేశాలలో ఉన్న నా ఫ్రెండ్స్ ఇండియన్ బ్యాలెరినా’ అని పిలుస్తున్నారు బ్యాలె ఈజ్ బ్యూటిఫుల్ అంటూ తన ఆనందాన్ని తెలియజేస్తోంది.
మూడేళ్ల వయసు నుంచే బ్యాలెపై మక్కువ పెంచుకున్న ఇష్నా ప్రముఖ టెలివిజన్ సిరీస్ ‘‘ఏంజెలీనా బ్యాలేరినా’ చూస్తూ తన ఆసక్తిని మరింత పెంచుకుంది. ఐదేళ్ల వయస్సులో ముంబైలో క్లాసికల్ బ్యాలెలో శిక్షణ ప్రారంభించింది. ఏడేళ్ల వయసులో ఇష్నా తల్లిదండ్రులు పూణేకు మారడంతో అక్కడే మూడేళ్లపాటు బ్యాలె ప్రాథమిక దశల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుంది. ఇందులో భాగంగానే లండన్‌ని రాయల్ అకాడమీ ఆఫ్ డ్యాన్స్ గ్రేడెడ్ పరీక్షల్లో విజేతగా నిలిచి, ప్రత్యేకతను సంపాదించుకుంది.
వదలని పట్టుదల
కరోనా మహమ్మారి విజృంభించడంతో బ్యాలె స్టూడియోలు భౌతికంగా మూసేశారు. ‘‘ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ శిక్షణ సంస్థలు అందించే ఆన్‌లైన్ క్లాస్‌లపైన దృష్టి పెట్టాను. ఇందులో భాగంగా వాగనోవా బ్యాలె అకాడమీ ఆఫ్ రష్యా వంటి ప్రముఖ వేదికలు సమ్మర్ ఇంటెన్సివ్ శిక్షణ కోసం ఇష్నాను ఆడిషన్ చేశాయి. ఈ ఆడిషన్స్‌లో అంతర్జాతీయ విద్యార్థులతో కలిసి శిక్షణ పొందాను.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన వాగనోవాలోని బ్యాలేరినాలతో శిక్షణ పొంది, ప్రీ ప్రొఫెషనల్ బ్యాలె ప్రోగ్రామ్ కోసం ఆసియాలోని టాప్ బ్యాలె స్కూల్ అయిన మార్లుపి డ్యాన్స్ అకాడమీ(ఇండోనేషియా)కి ఎంపికయ్యాను. కానీ ఇండోనేషియాకు మకాం మార్చడం కష్టం కాబట్టి మళ్లీ ఆన్ లైన్ తరగతుల ద్వారానే ట్రైనింగ్ తీసుకున్నాను’ అని వివరిస్తుంది ఇష్నా.
అవార్డులు.. స్కాలర్‌షిప్‌లు
బ్యాలెలో ఆసియాలోనే అత్యుత్తమ స్కూల్ అయినటువంటి మార్లుపి డ్యాన్స్ అకాడమీ (ఎమ్‌డీఏ) క్లాసికల్ బ్యాలెలో ప్రీ ప్రొఫెషనల్ శిక్షణను అందిస్తుంది. ఈ వేదికగా అంతర్జాతీయ స్థాయి డ్యాన్సర్లును తయారు చేసిన ప్రముఖ బ్యాలె శిక్షకురాలు మిస్ జోనాథ ఆధ్వర్యంలో ఇష్నా పదేళ్ల వయసున్నప్పటి నుంచే ఇంటర్నేషనల్ కాంపిటీషన్‌లో ఎన్నో అవార్డులను గెలుచుకుంది. సింగపూర్ యూత్ ఆర్ట్ ఫెస్టివల్లో క్లాసికల్ బ్యాలెలో వెండి, కాంస్య అవార్డులు, సింగపూర్ ఐబీజీపీఎస్‌లో పొటెన్షియల్ అవార్డు, జకార్తాలోని ఏషియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో మెరిట్ అవార్డు, గ్రేట్ ఇండియా బ్యాలె పోటీలో గోల్డ్‌మెడల్ తదితర అవార్డులను ఇష్నా చౌదరి అందుకుంది. అంతేకాకుండా యూత్ అమెరికన్ గ్రాండ్ ప్రిక్స్ (వైఏజీపీ)లో సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.
కెనాన్ డ్యాన్స్ ఫెస్టివల్ సింగపూర్ ఫర్ సమ్మర్ ఇంటెన్సివ్ టు ఆసియా బ్యాలెట్ అకాడమీ (మలేషియా), నేషనల్ బ్యాలె అకాడమీ ఆఫ్ న్యూయార్క్ సమ్మర్ ఇంటెన్సివ్, జువాన్ పాయింట్ ప్రోగ్రామ్ న్యూజిలాండ్ వంటి వేదికల్లో స్కాలర్‌షిప్‌లను సైతం పొందింది. జువాన్ పాయింట్‌లో తన నైపుణ్యాల ఆధారంగా ఆమె స్కాలర్‌షిప్‌ను అడ్వాన్స్‌డ్ పాయింట్ ప్రోగ్రామ్‌కు పొడిగించడం విశేషం. ఎంబీఎస్ కెనడా, ఏఆండ్‌ఏ బ్యాలె(చికాగో)లో శిక్షణ పొందేందుకు స్కాలర్‌షిప్ సాధించింది. అంతర్జాతీయ బ్యాలె వేర్ బ్రాండ్ ‘బ్యాలె లైఫ్’కు ఇష్నా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహారిస్తుంది.
నిరంతర కృషి
ఈ ఏడాది ప్రపంచంలోని టాప్ బ్యాలె అకాడమీలతో వ్యక్తిగతంగా శిక్షణ పొందాలనుకుంది ఇష్నా. ఇందులో భాగంగా బోస్టన్ బ్యాలె (బోస్టన్, ఎమ్‌ఏ), రష్యన్ మాస్టర్స్ బ్యాలె (అలికాంటే, స్పెయిన్), ప్రతిష్టాత్మక స్కూల్ ఆఫ్ అమెరికన్ బ్యాలె (ఎస్‌ఏబీ, న్యూయార్క్)లో 8 శాతంతో సమ్మర్ ఇంటెన్సివ్‌ల ఆడిషన్‌లో ఎంపికైంది. నిరంతర కృషితో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఇష్నా., సమ్మర్ ఆఫ్ 2023ని కెనడా నేషనల్ బ్యాలెలో శిక్షణ పొందాలని నిర్ణయించుకుంది.
ఇంటెన్సివ్‌లో తన ప్రదర్శన ఫలితంగా కెనడా ఎన్‌బీఎస్‌లో ప్రొఫెషనల్ బ్యాలె ప్రోగ్రామ్ కోసం ఆఫర్ అందుకుంది. 1959లో స్థాపించబడిన ఎన్‌బీఎస్ ., ఔత్సాహిక యువ నృత్యకారులు, ఉపాధ్యాయుల కోసం ప్రపంచంలోని అగ్రగామి శిక్షణా సంస్థలలో ఒకటి. ఈ వేదికగా శిక్షణ పొందుతున్న మొట్టమొదటి భారతీయ బాలేరినాగా ఇష్నా చౌదరి చరిత్ర సృష్టించింది.
– హనుమాద్రి శ్రీకాంత్
(చదవండి: మీకు తెలుసా! ఆ చారిత్రాత్మక భారత రెస్టారెంట్ హఠాత్తుగా మూతపడుతోంది!)
Comments
Please login to add a commentAdd a comment